కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

40వ అధ్యాయం

క్షమించే విషయంలో ఒక పాఠం

క్షమించే విషయంలో ఒక పాఠం

లూకా 7:36-50

  • పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పాదాల మీద తైలం పోసింది

  • అప్పు తీసుకున్నవాళ్ల ఉదాహరణ ద్వారా క్షమించడం గురించి చెప్పాడు

యేసు మాటలకు, పనులకు ప్రజలు తమ హృదయ స్థితిని బట్టి వేర్వేరుగా స్పందించారు. గలిలయలోని ఒక ఇంట్లో ఆ విషయం స్పష్టమైంది. సీమోను అనే పరిసయ్యుడు యేసును తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అద్భుతాలు చేస్తున్న యేసు గురించి ఎక్కువ తెలుసుకోవాలని అతను అలా పిలిచివుంటాడు. అక్కడికి వచ్చేవాళ్లకు బోధించే అవకాశం దొరుకుతుందని యేసు ఆ ఆహ్వానాన్ని స్వీకరించివుంటాడు. ఆ కారణంతోనే ఆయన వేరే సందర్భాల్లో కూడా పన్ను వసూలుచేసే వాళ్లతో, పాపులతో భోజనం చేయడానికి వెళ్లాడు.

అయితే సీమోను, యేసుకు అతిథిమర్యాదలు సరిగ్గా చేయలేదు. దుమ్ముతో నిండిన పాలస్తీనా రోడ్లమీద చెప్పులతో నడిచినప్పుడు పాదాలు మురికి అవుతాయి, వేడెక్కుతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిథి కాళ్లను చల్లటి నీళ్లతో కడగడం అక్కడి మర్యాద. కానీ ఎవ్వరూ యేసు కాళ్లు కడగలేదు. అక్కడి అలవాటు ప్రకారం ఆయన్ని ఆహ్వానిస్తూ ముద్దు పెట్టుకోలేదు. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాదలు చేసేటప్పుడు తలమీద దయగా నూనె కూడా పోసేవాళ్లు. యేసుకు అది కూడా చేయలేదు. చెప్పాలంటే, యేసుకు అసలు ఎలాంటి అతిథిమర్యాదలూ జరగలేదు.

భోజనం మొదలైంది, భోజన బల్ల దగ్గర అతిథులు కూర్చొని ఉన్నారు. వాళ్లు తింటున్నప్పుడు, ఆహ్వానం లేని ఒక స్త్రీ చడీచప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చింది. ఆమె ఆ నగరంలో “పాపాత్మురాలైన ఒక స్త్రీ.” (లూకా 7:37) అపరిపూర్ణ మనుషులందరూ పాపులే, అయితే ఆ స్త్రీ ఒక వేశ్య అయ్యుండవచ్చు. ఆమె యేసు బోధల్ని, అలాగే ‘భారం మోస్తున్న మీరంతా నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను’ అని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని వినివుంటుంది. (మత్తయి 11:28, 29) యేసు మాటలు, పనులు ఆమెపై ప్రభావం చూపించి ఉంటాయి, అందుకే ఇప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది.

ఆమె యేసుకు వెనకగా వచ్చి ఆయన పాదాల దగ్గర మోకాళ్లూనింది. ఆమె కన్నీళ్లతో ఆయన పాదాల్ని తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది. తర్వాత ఆయన పాదాల్ని ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని, తనతోపాటు తెచ్చిన పరిమళ తైలాన్ని వాటిమీద పోసింది. ఇదంతా గమనిస్తున్న సీమోనుకు అది నచ్చలేదు, అతను ఇలా అనుకున్నాడు: “ఈయన నిజంగా ప్రవక్త అయితే, తనను ముట్టుకుంటున్న ఆ స్త్రీ ఎవరో, ఆమె ఎలాంటిదో ఈయనకు తెలిసుండాలి. ఆమె పాపాత్మురాలు.”—లూకా 7:39.

యేసు అతని ఆలోచనను గ్రహించి, “సీమోనూ, నీకు ఒక విషయం చెప్పాలి” అన్నాడు. అతను, “బోధకుడా, చెప్పు!” అన్నాడు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు: “అప్పు ఇచ్చే ఒక వ్యక్తి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు. ఒకతను 500 దేనారాలు, ఇంకొకతను 50 దేనారాలు అప్పు తీసుకున్నారు. తిరిగివ్వడానికి వాళ్ల దగ్గర ఏమీ లేనప్పుడు అతను వాళ్లిద్దర్నీ మనస్ఫూర్తిగా క్షమించాడు. కాబట్టి, వాళ్లలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు?” అప్పుడు సీమోను అంతగా ఆసక్తి లేనట్లు, “ఎక్కువ మొత్తంలో అప్పుపడిన వ్యక్తే అనుకుంటున్నాను” అన్నాడు.—లూకా 7:40-43.

యేసు సరిగ్గా చెప్పావన్నాడు. తర్వాత ఆయన ఆ స్త్రీ వైపు చూస్తూ సీమోనుతో ఇలా అన్నాడు: “నువ్వు ఈమెను చూస్తున్నావు కదా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు, నా పాదాలు కడుక్కోవడానికి నువ్వు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె నేను వచ్చినప్పటినుండి నా పాదాల్ని ఆప్యాయంగా ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. నువ్వు నా తల మీద నూనె పోయలేదు, కానీ ఈమె నా పాదాల మీద పరిమళ తైలం పోసింది.” ఆమె తన అనైతిక జీవితం విషయంలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడుతోందని యేసు గ్రహించాడు. అందుకే చివర్లో ఆయన ఇలా అన్నాడు: “నేను నీతో చెప్తున్నాను, ఈమె చాలా పాపాలు చేసినా అవి క్షమించబడ్డాయి. అందుకే ఈమె ఎక్కువ ప్రేమ చూపిస్తోంది. అయితే కొన్ని పాపాలే క్షమించబడినవాళ్లు తక్కువ ప్రేమ చూపిస్తారు.”—లూకా 7:44-47.

అనైతికంగా జీవించడం తప్పుకాదని యేసు చెప్పట్లేదు. బదులుగా, ఘోరమైన పాపాలు చేసినా పశ్చాత్తాపపడి, ఉపశమనం కోసం తన వైపు తిరిగిన వాళ్లను ఆయన అర్థం చేసుకొని వాళ్లమీద కనికరం చూపిస్తున్నాడు. “నీ పాపాలు క్షమించబడ్డాయి. . . . నీ విశ్వాసం నిన్ను రక్షించింది; మనశ్శాంతితో వెళ్లు” అని యేసు అన్నప్పుడు ఆ స్త్రీకి ఎంత ఊరట కలిగివుంటుందో ఊహించండి!—లూకా 7:48, 50.