కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

54వ అధ్యాయం

యేసు ‘జీవాన్నిచ్చే ఆహారం’

యేసు ‘జీవాన్నిచ్చే ఆహారం’

యోహాను 6:25-48

  • యేసు “పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం”

గలిలయ సముద్రానికి తూర్పున యేసు అద్భుతరీతిలో వేలమందికి ఆహారం పెట్టాడు. తర్వాత వాళ్లు తనను రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన తప్పించుకున్నాడు. ఆయన ఆ రాత్రి అలలు ఎగసిపడుతున్న సముద్రం మీద నడిచాడు, నీళ్లమీద నడవడానికి ప్రయత్నించి అల్పవిశ్వాసం వల్ల మునిగిపోబోయిన పేతురును రక్షించాడు. అలాగే గాలిని నిమ్మళింపజేసి, బహుశా శిష్యుల పడవ బద్దలవ్వకుండా కాపాడాడు.

ఇప్పుడు యేసు మళ్లీ గలిలయ సముద్రానికి పశ్చిమాన ఉన్న కపెర్నహూము ప్రాంతంలో ఉన్నాడు. ఆయన అద్భుతరీతిలో పెట్టిన ఆహారాన్ని తిన్నవాళ్లు ఆయన్ని చూసి, “ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?” అని అడిగారు. వాళ్లు మళ్లీ ఆహారం కోసమే తనను వెతుక్కుంటూ వచ్చారని యేసు అన్నాడు. అందుకే “పాడైపోయే ఆహారం కోసం కాకుండా, శాశ్వత జీవితాన్ని ఇచ్చే పాడవ్వని ఆహారం కోసం కష్టపడండి” అని వాళ్లను గద్దించాడు. అప్పుడు వాళ్లు, “దేవుని ఆమోదం పొందాలంటే మేము ఏంచేయాలి?” అని అడిగారు.—యోహాను 6:25-28.

వాళ్లు ధర్మశాస్త్రం చెప్తున్నవాటి గురించి ఆలోచిస్తుండవచ్చు. కానీ యేసు అంతకన్నా ముఖ్యమైనదాని గురించి చెప్తూ ఇలా అన్నాడు: “మీరు దేవుని ఆమోదం పొందాలంటే, ఆయన పంపించిన వ్యక్తి మీద విశ్వాసం చూపించాలి.” యేసు ఎన్ని గొప్ప పనులు చేసినా వాళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. వాళ్లు ఆయన్ని నమ్మేలా ఏదైనా ఒక అద్భుతం చేయమని యేసును అడిగారు. వాళ్లు ఇలా అన్నారు: “ఏ శక్తివంతమైన పని చేస్తావు? మన పూర్వీకులు ఎడారిలో మన్నా తిన్నారు. ఎందుకంటే, ‘ఆయన పరలోకం నుండి వాళ్లకు ఆహారం ఇచ్చాడు’ అని లేఖనాల్లో రాయబడివుంది.”—యోహాను 6:29-31; కీర్తన 78:24.

వాళ్లు అద్భుతం చేయమని అడిగినప్పుడు, ఆ అద్భుతాలకు నిజమైన మూలం ఎవరో తెలియజేస్తూ యేసు ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. మోషే మీకు పరలోకం నుండి ఆహారం ఇవ్వలేదు, అయితే నా తండ్రి మీకు పరలోకం నుండి నిజమైన ఆహారం ఇస్తున్నాడు. దేవుడిచ్చే ఆహారం పరలోకం నుండి వస్తుంది, లోకానికి జీవాన్నిస్తుంది.” ఆయన చెప్పింది అర్థంకాక వాళ్లు ఇలా అన్నారు: “అయ్యా, మాకు ఎప్పుడూ ఆ ఆహారం ఇస్తూ ఉండు.” (యోహాను 6:32-34) ఇంతకీ యేసు మాట్లాడుతున్నది ఏ “ఆహారం” గురించి?

ఆయన ఇలా వివరించాడు: “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాళ్లెవ్వరికీ అస్సలు ఆకలి వేయదు, నా మీద విశ్వాసం ఉంచే వాళ్లెవ్వరికీ అస్సలు దాహం వేయదు. కానీ నేను మీతో చెప్పినట్టు, మీరు నన్ను చూసినా నా మీద నమ్మకం ఉంచట్లేదు. . . . నేను నా సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదుగానీ నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చడానికే పరలోకం నుండి దిగివచ్చాను. ఆయన నాకు ఇచ్చిన వాళ్లలో ఏ ఒక్కర్నీ నేను పోగొట్టుకోకూడదు అనేదే నా తండ్రి ఇష్టం. చివరి రోజున నేను వాళ్లందర్నీ తిరిగి బ్రతికించాలన్నదే ఆయన ఇష్టం. కుమారుణ్ణి అంగీకరించి, ఆయనమీద విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం.”—యోహాను 6:35-40.

ఆ మాట చాలా గందరగోళాన్ని సృష్టించింది, యూదులు ఆయన మీద సణగడం మొదలుపెట్టారు. “పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం నేనే” అని ఆయన ఎలా అనగలడు? (యోహాను 6:41) వాళ్ల దృష్టిలో ఆయన కేవలం గలిలయలో ఉన్న నజరేతు నగరంలోని యోసేపు, మరియల కుమారుడు. అందుకే వాళ్లు ఇలా అన్నారు: “ఈయన యోసేపు కుమారుడైన యేసే కదా? ఈయన తల్లిదండ్రులు మనకు తెలిసినవాళ్లే కదా?”—యోహాను 6:42.

అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీలో మీరు సణుక్కోకండి. నన్ను పంపించిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేరు. చివరి రోజున నేను అతన్ని తిరిగి బ్రతికిస్తాను. ‘వాళ్లందరూ యెహోవా చేత బోధించబడతారు’ అని ప్రవక్తలు రాశారు. తండ్రి చెప్పేది విని, ఆయన బోధను అంగీకరించిన ప్రతీ ఒక్కరు నా దగ్గరికి వస్తారు. దేవుని దగ్గర నుండి వచ్చిన నేను తప్ప ఏ మనిషీ తండ్రిని చూడలేదు. నేను మాత్రమే ఆయన్ని చూశాను. నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, నమ్మేవాళ్లు శాశ్వత జీవితం పొందుతారు.”—యోహాను 6:43-47; యెషయా 54:13.

యేసు అంతకుముందు నీకొదేముతో మాట్లాడినప్పుడు శాశ్వత జీవితాన్ని, మానవ కుమారుని మీద విశ్వాసం ఉంచడంతో ముడిపెడుతూ ఇలా అన్నాడు: ‘దేవుని ఒక్కగానొక్క కుమారుడి మీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందుతారు.’ (యోహాను 3:15, 16) కానీ ఇప్పుడు ఆయన ఎక్కువమంది ప్రజలతో మాట్లాడుతూ, శాశ్వత జీవితం పొందాలంటే తన మీద విశ్వాసం ఉంచాలని చెప్తున్నాడు. ఆ శాశ్వత జీవితాన్ని మన్నా గానీ గలిలయలో దొరికే రొట్టెలు గానీ ఇవ్వలేవు. మరి దాన్ని ఎలా పొందవచ్చు? యేసు మళ్లీ ఇలా చెప్పాడు: “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే.”—యోహాను 6:48.

పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం గురించిన ఆ చర్చ ఇంకా పూర్తవలేదు. కపెర్నహూములోని సమాజమందిరంలో యేసు బోధిస్తున్నప్పుడు ఆ చర్చ ముగింపుకు వస్తుంది.