కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

44వ అధ్యాయం

యేసు తుఫానును నిమ్మళింపజేశాడు

యేసు తుఫానును నిమ్మళింపజేశాడు

మత్తయి 8:18, 23-27 మార్కు 4:35-41 లూకా 8:22-25

  • యేసు గలిలయ సముద్రంలో తుఫానును నిమ్మళింపజేశాడు

యేసు రోజంతా తీరికలేకుండా గడిపి అలసిపోయాడు. సాయంత్రమైనప్పుడు కపెర్నహూము ప్రాంతంలో ఉన్న యేసు తన శిష్యులతో, “మనం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అన్నాడు.—మార్కు 4:35.

గలిలయ సముద్రం తూర్పు తీరాన గెరసవాళ్ల ప్రాంతం ఉంది. దాన్ని దెకపొలి అని కూడా అంటారు. దెకపొలి ప్రాంతంలోని నగరాలు గ్రీకు సంస్కృతికి కేంద్రంగా ఉండేవి, అయితే అక్కడ కూడా చాలామంది యూదులు ఉండేవాళ్లు.

యేసు కపెర్నహూము నుండి బయల్దేరడం కొంతమంది గమనించారు. దాంతో వాళ్లు కూడా వేరే పడవల్లో అవతలి ఒడ్డుకు బయల్దేరారు. (మార్కు 4:36) నిజానికి, అదంత దూరం ఏమీ కాదు. గలిలయ సముద్రం ఒక పెద్ద మంచినీటి సరస్సు. దాని పొడవు దాదాపు 21 కిలోమీటర్లు, గరిష్ఠ వెడల్పు దాదాపు 12 కిలోమీటర్లు. కానీ లోతు మాత్రం ఎక్కువే ఉంటుంది.

యేసు పరిపూర్ణుడైనప్పటికీ, తీరికలేకుండా పరిచర్య చేయడం వల్ల అలసిపోయాడు. కాబట్టి పడవ బయల్దేరగానే, పడవ వెనక భాగంలో దిండు మీద తలవాల్చి నిద్రపోయాడు.

అపొస్తలుల్లో చాలామంది పడవను బాగా నడపగలరు, కానీ ఈ ప్రయాణం వాళ్లకు కూడా కష్టంగానే ఉండబోతుంది. గలిలయ సముద్రం చుట్టూ కొండలున్నాయి, పైగా దాని ఉపరితలం తరచూ వేడిగా ఉంటుంది. కొన్నిసార్లు, కొండల నుండి వేగంగా వీచే చల్లని గాలి, వేడిగా ఉన్న ఆ నీటి ఉపరితలాన్ని తాకినప్పుడు ఉన్నట్టుండి భయంకరమైన తుఫానులు చెలరేగేవి. ఇప్పుడు అదే జరిగింది. అలలు పడవను బలంగా ఢీ కొడుతున్నాయి. ఆ పడవ “నీళ్లతో నిండి, మునిగిపోయే పరిస్థితి వచ్చింది.” (లూకా 8:23) అయినా, యేసు ఇంకా నిద్రలోనే ఉన్నాడు.

శిష్యులు ఇంతకుముందు తుఫానుల్లో పడవ నడిపిన తమ అనుభవాన్నంతా ఉపయోగిస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉంది. వాళ్లు ప్రాణభయంతో, యేసును నిద్రలేపి “ప్రభువా, చనిపోయేలా ఉన్నాం! రక్షించు!” అన్నారు. (మత్తయి 8:25) తాము మునిగిపోతామని శిష్యులు భయపడ్డారు!

యేసు నిద్రలేచి అపొస్తలులతో ఇలా అన్నాడు: “అల్పవిశ్వాసులారా, మీరెందుకు ఇంత భయపడుతున్నారు?” (మత్తయి 8:26) ఆ తర్వాత యేసు గాలిని, సముద్రాన్ని, “ష్‌! నిశ్శబ్దంగా ఉండు!” అని ఆజ్ఞాపించాడు. (మార్కు 4:39) భయంకరంగా వీస్తున్న గాలి, సముద్రం ఒక్కసారిగా నిమ్మళించాయి. (మార్కు, లూకా ఈ అసాధారణ సన్నివేశాన్ని వివరిస్తున్నప్పుడు, ముందు యేసు అద్భుతరీతిలో తుఫానును నిమ్మళింపజేయడం గురించి రాసి, శిష్యుల అల్పవిశ్వాసం గురించి తర్వాత ప్రస్తావించారు.)

ఆ దృశ్యాన్ని చూసిన శిష్యులకు ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి! ఉగ్రరూపం దాల్చిన సముద్రం పూర్తిగా నిమ్మళించడం వాళ్లు చూశారు. వాళ్లలో తెలియని భయం మొదలైంది. వాళ్లు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు: “అసలు ఈయన ఎవరు? చివరికి గాలి, సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి.” వాళ్లు క్షేమంగా సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. (మార్కు 4:41–5:1) బహుశా, వేరే పడవల్లో బయల్దేరినవాళ్లు పశ్చిమ తీరానికి క్షేమంగా చేరుకొనివుంటారు.

ప్రకృతి శక్తుల మీద దేవుని కుమారునికి అధికారం ఉందని తెలుసుకోవడం ఎంత ఊరటనిస్తుందో కదా! యేసు తన రాజ్య పాలనలో భూమిపై పూర్తి అవధానం నిలిపినప్పుడు, అందరూ క్షేమంగా ఉంటారు. ఎందుకంటే ప్రజల్ని భయపెట్టే ప్రకృతి విపత్తులేవీ అప్పుడు ఉండవు!