కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

43వ అధ్యాయం

రాజ్యం గురించిన ఉదాహరణలు

రాజ్యం గురించిన ఉదాహరణలు

మత్తయి 13:1-53 మార్కు 4:1-34 లూకా 8:4-18

  • రాజ్యం గురించి యేసు చెప్పిన ఉదాహరణలు

యేసు పరిసయ్యుల్ని గద్దించినప్పుడు బహుశా కపెర్నహూములో ఉండివుంటాడు. తర్వాత అదే రోజు, ఆయన తాను ఉంటున్న ఇంటి నుండి, దగ్గర్లో ఉన్న గలిలయ సముద్రానికి నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ చాలామంది ప్రజలు గుమికూడారు. ఆయన ఒక పడవ ఎక్కి ఒడ్డు నుండి కాస్త దూరం వెళ్లి, పరలోక రాజ్యం గురించి ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు. ఆయన ఎన్నో ఉదాహరణలు లేదా చిన్నకథలు ఉపయోగించి బోధించాడు. ఆయన ఉదాహరణలుగా తీసుకున్న విషయాలు అక్కడున్న చాలామందికి పరిచయం ఉన్నవే. దానివల్ల రాజ్యానికి సంబంధించిన వేర్వేరు అంశాల్ని అర్థంచేసుకోవడం వాళ్లకు తేలికౌతుంది.

యేసు ముందుగా, విత్తనాలు చల్లేవాడి ఉదాహరణ చెప్పాడు. కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి, పక్షులు వాటిని తినేశాయి. ఇంకొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. వాటి వేర్లు లోతుకి వెళ్లలేదు కాబట్టి ఆ మొక్కలు ఎండకు ఎండి, వాడిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముళ్లపొదల్లో పడ్డాయి, అవి మొలకెత్తినప్పుడు ముళ్లపొదలు వాటిని ఎదగకుండా చేశాయి. చివరికి కొన్ని విత్తనాలు మంచినేల మీద పడి చక్కగా ఫలించాయి. వాటిలో “కొన్ని విత్తనాలు 100 రెట్లు, ఇంకొన్ని 60 రెట్లు, మరికొన్ని 30 రెట్లు ఎక్కువగా ఫలించడం మొదలుపెట్టాయి.”—మత్తయి 13:8.

దేవుని రాజ్యాన్ని, ఒక వ్యక్తి విత్తనాలు చల్లడంతో పోలుస్తూ యేసు రెండో ఉదాహరణ చెప్పాడు. ఆ వ్యక్తి నిద్రపోతున్నాడు, మేల్కొంటున్నాడు, ఈలోపు విత్తనాలు మొలకెత్తి పెరుగుతున్నాయి. అదంతా ఎలా జరుగుతుందో “అతనికి తెలీదు.” (మార్కు 4:27) అవి వాటంతటవే పెరిగి పంటనిస్తాయి, అప్పుడు అతను ఆ పంటను కోస్తాడు.

తర్వాత యేసు, విత్తనాలు విత్తడం గురించి మూడో ఉదాహరణ చెప్పాడు. ఒక వ్యక్తి మంచి విత్తనాలు విత్తాడు. కానీ “అందరూ నిద్రపోతున్నప్పుడు” శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగుల్ని నాటాడు. అప్పుడు దాసులు, ‘గురుగుల్ని పీకేయమంటావా’ అని అతన్ని అడిగారు. దానికి అతను ఇలా జవాబిచ్చాడు: “వద్దు, మీరు గురుగుల్ని పీకేసేటప్పుడు పొరపాటున గోధుమల్ని కూడా పీకేస్తారేమో. కోతకాలం వరకు రెండిటినీ కలిసి పెరగనివ్వండి; కోతకాలంలో కోత కోసేవాళ్లతో, ‘ముందు గురుగుల్ని పీకేసి, వాటిని కాల్చడానికి కట్టగట్టండి, తర్వాత గోధుమల్ని నా గోదాములోకి సమకూర్చండి’ అని చెప్తాను.”—మత్తయి 13:24-30.

యేసు చెప్తున్నవి వింటున్న చాలామందికి వ్యవసాయం గురించి తెలుసు. యేసు ఆ తర్వాత, అందరికీ తెలిసిన ఆవగింజ గురించి కూడా చెప్పాడు. ఆ చిన్న గింజ పెద్ద చెట్టు అవుతుంది, పక్షులు దాని కొమ్మల్లో ఆశ్రయం పొందుతాయి. యేసు ఇలా అన్నాడు: “పరలోక రాజ్యం, ఒక మనిషి తన పొలంలో విత్తిన ఆవగింజ లాంటిది.” (మత్తయి 13:31) యేసు వాళ్లకు వృక్షశాస్త్రం గురించి పాఠాలు చెప్పట్లేదు కానీ అద్భుతమైన ఎదుగుదల గురించి చెప్తున్నాడు. చాలా చిన్నగా ఉన్నది ఎంత పెద్దగా పెరగగలదో లేదా విస్తరించగలదో ఆయన ఉదాహరణతో చెప్తున్నాడు.

తర్వాత యేసు, పిండి పులిసే ప్రక్రియ గురించి చెప్పాడు, వినేవాళ్లలో చాలామందికి దానిగురించి తెలుసు. పరలోక రాజ్యం, “ఒక స్త్రీ పది కిలోల పిండిలో కలిపిన పులిసిన పిండి” లాంటిదని ఆయన చెప్పాడు. (మత్తయి 13:33) పులిసిన పిండి బయటికి కనిపించకుండా ముద్ద అంతటిలో వ్యాపిస్తుంది, దాంతో ముద్ద మొత్తం పులిసి పొంగుతుంది. పులిసిన పిండి విశేషమైన పెరుగుదలను, మార్పుల్ని కలిగిస్తుంది. కాకపోతే వాటిని వెంటనే గుర్తించలేం.

ఈ ఉదాహరణలు చెప్పిన తర్వాత, యేసు ప్రజల్ని పంపించేసి తాను ఉంటున్న ఇంటికి తిరిగొచ్చాడు. కాసేపటికి, ఆ ఉదాహరణల అర్థం తెలుసుకోవడానికి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.

యేసు చెప్పిన ఉదాహరణల నుండి ప్రయోజనం పొందడం

యేసు ఉదాహరణలతో బోధించడం శిష్యులు అంతకుముందు విన్నారు కానీ ఒకేసారి ఇన్ని ఉదాహరణలు చెప్పడం ఎప్పుడూ వినలేదు. అందుకే వాళ్లు ఆయన్ని ఇలా అడిగారు: “నువ్వు వాళ్లకు ఉదాహరణలతో ఎందుకు బోధిస్తున్నావు?”—మత్తయి 13:10.

ఆయన అలా చేయడానికి ఒక కారణం, బైబిలు ప్రవచనాన్ని నెరవేర్చడం. మత్తయి సువార్తలో ఇలా ఉంది: “ఉదాహరణలు ఉపయోగించకుండా ఆయన వాళ్లతో ఏమీ మాట్లాడలేదు. అలా, దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరాయి: ‘నేను నా నోరు తెరిచి ఉదాహరణలతో బోధిస్తాను; ప్రారంభం నుండి దాచబడిన విషయాల్ని ప్రకటిస్తాను.’”—మత్తయి 13:34, 35; కీర్తన 78:2.

యేసు ఉదాహరణలు ఉపయోగించి బోధించడానికి మరో కారణం, ప్రజల ఆలోచనా తీరును బయటపెట్టడం. కేవలం యేసు చక్కని కథలు చెప్తాడని, అద్భుతాలు చేస్తాడని మాత్రమే చాలామంది ఆయన దగ్గరికి వస్తున్నారు. అంతేగానీ ఆయన్ని ప్రభువుగా అంగీకరించి లోబడాలని, నిస్వార్థంగా ఆయన్ని అనుసరించాలని కాదు. (లూకా 6:46, 47) తమ అభిప్రాయాల్ని లేదా పద్ధతుల్ని మార్చుకోవడం, యేసు చెప్పే సందేశాన్ని తమ హృదయాల్లోకి తీసుకోవడం వాళ్లకు ఇష్టంలేదు.

శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ఇలా జవాబిచ్చాడు: “నేను వాళ్లకు ఉదాహరణలతో బోధిస్తున్నాను; ఎందుకంటే వాళ్లు చూస్తారు గానీ వాళ్లకేమీ కనిపించదు, వింటారు గానీ ఏమీ వినిపించదు, విన్న విషయాన్ని అర్థం చేసుకోరు. యెషయా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ల విషయంలో నెరవేరుతోంది: ‘. . . ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి.’”—మత్తయి 13:13-15; యెషయా 6:9, 10.

అయితే, యేసు మాటలు వింటున్న వాళ్లందరూ అలా లేరు. యేసు ఇలా వివరించాడు: “మీరు ఈ విషయాల్ని చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి మీరు ధన్యులు. ఎందుకంటే చాలామంది ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూస్తున్నవాటిని చూడాలని కోరుకున్నారు కానీ చూడలేకపోయారు; మీరు వింటున్నవాటిని వినాలని కోరుకున్నారు కానీ వినలేకపోయారు అని నేను నిజంగా మీతో చెప్తున్నాను.”—మత్తయి 13:16, 17.

అవును, 12 మంది అపొస్తలులు, నమ్మకమైన ఇతర శిష్యులు యేసు చెప్పేవాటిని హృదయంలోకి తీసుకుంటున్నారు. అందుకే యేసు ఇలా అన్నాడు: “పరలోక రాజ్యం గురించిన పవిత్ర రహస్యాల్ని అర్థం చేసుకునే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కానీ వాళ్లకు ఇవ్వలేదు.” (మత్తయి 13:11) ఉదాహరణల అర్థాన్ని తెలుసుకోవాలని శిష్యులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టి యేసు విత్తనాలు చల్లేవాడి ఉదాహరణ అర్థాన్ని వాళ్లకు వివరించాడు.

విత్తనం దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. (లూకా 8:11) నేల హృదయాన్ని సూచిస్తుంది. ఆ రెండు విషయాలు తెలిస్తేనే యేసు చెప్పిన ఉదాహరణను అర్థం చేసుకోగలం.

కొందరి హృదయం దారిపక్కన ఉన్న నేల లాంటిది. అలాంటివాళ్ల గురించి యేసు ఇలా వివరించాడు: “వాళ్లు దాన్ని నమ్మి రక్షించబడకుండా ఉండేలా అపవాది వచ్చి వాళ్ల హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్లిపోతాడు.” (లూకా 8:12) కొన్ని విత్తనాలు రాతినేల మీద పడ్డాయని యేసు చెప్పాడు. అంటే కొంతమంది వాక్యాన్ని ఆనందంగా స్వీకరించినా, అది వాళ్ల హృదయ లోతుల్లోకి వెళ్లదని ఆయన భావం. “వాక్యం కారణంగా శ్రమలు గానీ హింసలు గానీ వస్తే” వాళ్లు విశ్వాసాన్ని వదిలేస్తారు. అవును, “పరీక్షా కాలం” వచ్చినప్పుడు, అంటే బహుశా కుటుంబ సభ్యుల నుండి లేదా ఇతరుల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్లు పడిపోతారు.—మత్తయి 13:21; లూకా 8:13.

ముళ్లపొదలు ఉన్న నేల సంగతేంటి? అలాంటివాళ్లు వాక్యాన్ని వింటారు కానీ “ఈ వ్యవస్థలో ఉన్న ఆందోళనలు, సిరిసంపదలకున్న మోసకరమైన శక్తి” వల్ల వాళ్ల ఆసక్తి తగ్గిపోతుందని యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్తయి 13:22) వాళ్ల హృదయంలో వాక్యం ఉన్నప్పటికీ అది ఎదగదు, ఫలించదు.

యేసు చివరిగా మంచి నేల గురించి చెప్పాడు. అలాంటివాళ్లు వాక్యాన్ని విని, దాన్ని తమ హృదయంలోకి తీసుకుని, దాని అసలు అర్థాన్ని గ్రహిస్తారు. దానివల్ల వాళ్లు “ఫలిస్తారు.” అయితే వయసు, ఆరోగ్యం వంటి పరిస్థితుల కారణంగా అందరూ ఒకేలా ఫలించలేరు; ఒకరు 100 రెట్లు, మరొకరు 60 రెట్లు, ఇంకొకరు 30 రెట్లు ఎక్కువగా ఫలిస్తారు. అవును, “వాక్యాన్ని విన్న తర్వాత ఎంతో మంచి మనసుతో దాన్ని అంగీకరించి, ఓర్పుతో” ఫలించేవాళ్లు దేవుణ్ణి సేవించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు పొందుతారు.—లూకా 8:15.

ఉదాహరణల అర్థం తెలుసుకోవాలని యేసు దగ్గరికి వచ్చిన శిష్యుల్ని ఆ మాటలు ఎంతో ఆకట్టుకొని ఉంటాయి! వాళ్లకు ఇప్పుడు ఆ ఉదాహరణల అర్థం పూర్తిగా తెలుసు. వాళ్లు ఆ ఉదాహరణల అర్థం తెలుసుకొని, ఆ సత్యాల్ని ఇతరులకు బోధించాలని యేసు కోరుకున్నాడు. ఆయన వాళ్లతో, “ఎవ్వరూ దీపాన్ని తెచ్చి గంప కిందో మంచం కిందో పెట్టరు కదా, దాన్ని దీపస్తంభం మీదే పెడతారు” అన్నాడు. తర్వాత వాళ్లకు ఈ సలహా ఇచ్చాడు: “చెవులు ఉన్నవాళ్లు వినాలి.”—మార్కు 4:21-23.

మరింత ఉపదేశం పొందారు

విత్తనాలు చల్లేవాడి ఉదాహరణ అర్థాన్ని విన్న తర్వాత, శిష్యులు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకున్నారు. “పొలంలోని గురుగుల ఉదాహరణ గురించి మాకు వివరంగా చెప్పు” అని వాళ్లు అడిగారు.—మత్తయి 13:36.

అలా అడగడం, తీరం దగ్గర ఉన్న ప్రజలకు వాళ్లు భిన్నంగా ఉన్నారని చూపిస్తుంది. ఆ ప్రజలు యేసు చెప్పిన ఉదాహరణలు విన్నారు కానీ వాటి అర్థాన్ని, వాటిలో ఉన్న పాఠాన్ని తెలుసుకోవాలని కోరుకోలేదు. వాళ్లు ఆ ఉదాహరణల్లోని పైపై విషయాలతోనే సరిపెట్టుకున్నారు. తీరం దగ్గరే ఉండిపోయిన ఆ ప్రజలకు, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తితో తన దగ్గరికి వచ్చిన శిష్యులకు మధ్య తేడాను యేసు ఇలా వివరించాడు:

“మీరు వింటున్నదాని మీద మనసుపెట్టండి. మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత అవగాహన పొందుతారు, నిజానికి ఇంకా ఎక్కువే పొందుతారు.” (మార్కు 4:24) శిష్యులు తాము వింటున్నవాటి మీద మనసుపెట్టారు. వాళ్లు యేసు చెప్తున్న విషయాల్ని ఎంతో ఆసక్తిగా, శ్రద్ధగా విన్నారు కాబట్టి వాళ్లు మరింత ఉపదేశాన్ని, అవగాహనను పొందారు. అందుకే, గోధుమలు గురుగుల ఉదాహరణ అర్థాన్ని యేసు వాళ్లకు ఇలా వివరించాడు:

“మంచి విత్తనాలు విత్తిన వ్యక్తి మానవ కుమారుడు; పొలం ఈ లోకం. మంచి విత్తనాలు రాజ్య కుమారులు; గురుగులు దుష్టుని కుమారులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత ఈ వ్యవస్థ ముగింపు; కోత కోసేవాళ్లు దేవదూతలు.”—మత్తయి 13:37-39.

ఉదాహరణలోని ఒక్కొక్క విషయాన్ని వివరించిన తర్వాత, చివరికి ఏం జరుగుతుందో యేసు చెప్పాడు. వ్యవస్థ ముగింపులో కోత కోసేవాళ్లు గోధుమల నుండి గురుగుల్ని వేరుచేస్తారు. అంటే దేవదూతలు నిజమైన ‘రాజ్య కుమారుల’ నుండి నకిలీ క్రైస్తవుల్ని వేరుచేస్తారు. “నీతిమంతులు” సమకూర్చబడతారు, ఆ తర్వాత వాళ్లు “తమ తండ్రి రాజ్యంలో” తేజోవంతంగా ప్రకాశిస్తారు. మరి ‘దుష్టుని కుమారులకు’ ఏమౌతుంది? వాళ్లు నాశనం చేయబడతారు, అందుకే “వాళ్లు ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు.”—మత్తయి 13:41-43.

తర్వాత యేసు తన శిష్యులకు మరో మూడు ఉదాహరణలు చెప్పాడు. ముందుగా ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యం, పొలంలో దాచబడిన నిధి లాంటిది; ఒకతను­ దాన్ని కనుగొని, మళ్లీ దాచిపెట్టి, సంతోషంగా­ వెళ్లి తనకున్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని­ కొన్నాడు.”—మత్తయి 13:44.

యేసు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యం, మంచి­ ముత్యాల కోసం వెదుకుతున్న ఒక వ్యాపారి లాంటిది.­ అతను ఎంతో విలువైన ఒక ముత్యాన్ని చూసినప్పుడు, వెళ్లి వెంటనే తన దగ్గర­ ఉన్నవన్నీ అమ్మేసి దాన్ని కొన్నాడు.”—మత్తయి 13:45, 46.

ఈ రెండు ఉదాహరణల్లోని వ్యక్తులు నిజంగా విలువైనవాటి­ కోసం త్యాగాలు చేశారని యేసు నొక్కిచెప్పాడు.­ ఆ వ్యాపారి ఎంతో విలువైన ఒక ముత్యాన్ని కొనుక్కోవడానికి­ “తన దగ్గర ఉన్నవన్నీ” వెంటనే అమ్మేశాడు. విలువైన ముత్యం­ గురించిన ఉదాహరణ శిష్యులకు వెంటనే అర్థమైవుంటుంది.­ పొలంలో దాచబడిన నిధి దొరికిన వ్యక్తి కూడా, దాన్ని సొంతం­ చేసుకోవడానికి ‘తనకు ఉన్నదంతా అమ్మేశాడు.’ ఆ ఇద్దరు­ వ్యక్తులు విలువైనవాటిని సొంతం చేసుకోవడానికి చాలా పెద్ద­ త్యాగాలు చేశారు. దేవునికి దగ్గరవ్వడానికి ఒక వ్యక్తి అలాంటి త్యాగాలే చేయాల్సి రావచ్చు. (మత్తయి 5:3) యేసు మాటలు వింటున్న కొంతమంది దేవునికి దగ్గరవ్వడానికి, యేసుకు నిజమైన అనుచరులు అవ్వడానికి అప్పటికే గొప్ప త్యాగాలు చేశారు.—మత్తయి 4:19, 20; 19:27.

చివరిగా, యేసు పరలోక రాజ్యాన్ని అన్నిరకాల చేపల్ని పట్టే పెద్ద వలతో పోల్చాడు. (మత్తయి 13:47) చేపల్ని వేరు చేసేటప్పుడు మంచివాటిని గంపల్లో వేశారు, పనికిరాని వాటిని పడేశారు. వ్యవస్థ ముగింపులో కూడా అదే జరుగుతుందని యేసు చెప్పాడు. అప్పుడు దేవదూతలు నీతిమంతుల నుండి దుష్టుల్ని వేరుచేస్తారు.

“మనుషుల్ని పట్టే జాలరులుగా” ఉండమని యేసు తన మొదటి శిష్యులకు చెప్పినప్పుడు, ఒక విధంగా ఆయనే ఆ పనిని మొదలుపెట్టాడు. (మార్కు 1:17) అయితే పెద్ద వల గురించిన ఉదాహరణ, భవిష్యత్తులో అంటే “వ్యవస్థ ముగింపులో” నెరవేరుతుందని ఆయన చెప్పాడు. (మత్తయి 13:49) కాబట్టి, యేసు మాటలు వింటున్న అపొస్తలులకు, ఇతర శిష్యులకు ముందుముందు ఎంతో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయని అర్థమైవుంటుంది.

యేసు చెప్పిన ఉదాహరణల్ని విన్న శిష్యులు మరింత అవగాహన పొందారు. యేసు ‘విడిగా తన శిష్యులకు అన్నీ వివరించాడు.’ (మార్కు 4:34) ఆయన ‘తన ఖజానాలో నుండి కొత్తవాటినీ, పాతవాటినీ బయటికి తీసే ఇంటి యజమానిలా’ ఉన్నాడు. (మత్తయి 13:52) యేసు తన బోధనా సామర్థ్యాన్ని చూపించుకోవడానికి కాదుగానీ, వెలకట్టలేని ఖజానాలాంటి సత్యాల్ని తన శిష్యులతో పంచుకోవడానికే ఆ ఉదాహరణలు చెప్పాడు. ఆయన నిజంగా సాటిలేని “ఉపదేశకుడు.”