కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

51వ అధ్యాయం

పుట్టినరోజు వేడుకలో హత్య

పుట్టినరోజు వేడుకలో హత్య

మత్తయి 14:1-12 మార్కు 6:14-29 లూకా 9:7-9

  • హేరోదు బాప్తిస్మమిచ్చే యోహాను తల నరికించాడు

అపొస్తలులు గలిలయలో పరిచర్య చేస్తున్నారు. కానీ యేసును పరిచయం చేసిన బాప్తిస్మమిచ్చే యోహానుకు అలా ప్రకటించే స్వేచ్ఛ లేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా అతను చెరసాలలోనే ఉన్నాడు.

రాజైన హేరోదు అంతిప చేస్తున్నది తప్పని యోహాను అందరిముందు చెప్పాడు. హేరోదు తన అన్న అయిన ఫిలిప్పు భార్యను అంటే హేరోదియను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తాను మోషే ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తినని హేరోదు చెప్పుకునేవాడు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం అలా పెళ్లి చేసుకోవడం తప్పు, పైగా వ్యభిచారంతో సమానం. తన తప్పును వేలెత్తి చూపించినందుకు హేరోదు యోహానును చెరసాలలో పెట్టించాడు. బహుశా హేరోదియ ఉసిగొల్పడం వల్ల అలా చేసివుంటాడు.

ప్రజలు యోహానును “ప్రవక్తగా చూస్తున్నందువల్ల” అతన్ని ఏం చేయాలో హేరోదుకు అర్థంకాలేదు. (మత్తయి 14:5) హేరోదియకు మాత్రం ఏం చేయాలో బాగా తెలుసు. ఆమె యోహాను మీద ‘పగబట్టింది,’ నిజానికి అతన్ని చంపే అవకాశం కోసం చూస్తూ ఉంది. (మార్కు 6:19) చివరికి, ఆ అవకాశం రానేవచ్చింది.

సా.శ. 32 పస్కా పండుగకు కొన్ని రోజుల ముందు, హేరోదు తన పుట్టినరోజు వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. హేరోదు దగ్గర పనిచేసే పెద్దపెద్ద అధికారులు, సైనికాధికారులు, గలిలయలోని ప్రముఖులు అందరూ ఆ వేడుకకు వచ్చారు. హేరోదియకు, ఆమె మొదటి భర్త ఫిలిప్పుకు పుట్టిన సలోమే, ఆ వేడుకలో అతిథుల ముందుకు వచ్చి నాట్యం చేసింది. ఆమె నాట్యానికి అతిథులు మైమరచిపోయారు.

హేరోదు కూడా చాలా సంతోషించి, “నీకేం కావాలన్నా అడుగు, ఇచ్చేస్తాను” అన్నాడు. “నా రాజ్యంలో సగభాగం వరకు ఏది అడిగినా ఇచ్చేస్తాను” అని మాటిచ్చాడు. ఆమె జవాబు చెప్పేముందు వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి, “నేను ఏం కోరుకోవాలి?” అని అడిగింది.—మార్కు 6:22-24.

ఆ అవకాశం కోసమే హేరోదియ ఎదురుచూస్తోంది! ఆమె ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా, “బాప్తిస్మమిచ్చే యోహాను తల” అడగమని చెప్పింది. వెంటనే సలోమే హేరోదు దగ్గరికి వెళ్లి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను ఒక పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇవ్వు” అని అడిగింది.—మార్కు 6:24, 25.

అది విని హేరోదు చాలా బాధపడ్డాడు. కానీ అతను అతిథులందరి ముందు సలోమేకు మాట ఇచ్చాడు. మాట తప్పితే తన పరువు పోతుందని భయపడి, అమాయకుణ్ణి హత్య చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అతను బాప్తిస్మమిచ్చే యోహాను తల తెమ్మని ఒక అంగరక్షకుణ్ణి చెరసాలకు పంపించాడు. కాసేపటికి ఆ అంగరక్షకుడు యోహాను తలను పళ్లెంలో తీసుకొచ్చి సలోమేకు ఇచ్చాడు. ఆమె దాన్ని తీసుకెళ్లి వాళ్ల అమ్మకు ఇచ్చింది.

జరిగిన ఘోరం గురించి విన్న యోహాను శిష్యులు అతని శరీరాన్ని తీసుకెళ్లి పాతిపెట్టారు. తర్వాత వాళ్లు యేసుకు ఆ విషయం చెప్పారు.

ఆ తర్వాత, యేసు ప్రజల్ని బాగు చేస్తున్నాడని, చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడని హేరోదుకు తెలిసింది. ఈ పనులు చేస్తున్న యేసు, ‘మృతుల్లో నుండి బ్రతికించబడిన’ యోహాను అయ్యుంటాడా అని హేరోదు కంగారుపడ్డాడు. (లూకా 9:7) అందుకే యేసును చూడాలని హేరోదు అంతిప ఎంతగానో కోరుకున్నాడు. యేసు బోధల్ని వినాలని కాదుగానీ, తన భయాలు నిజమో కాదో తేల్చుకోవాలనే అతను యేసును చూడాలనుకున్నాడు.