కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

33వ అధ్యాయం

యెషయా ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు

యెషయా ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు

మత్తయి 12:15-21 మార్కు 3:7-12

  • జనం తోసుకుంటూ యేసు మీద పడుతున్నారు

  • యెషయా ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు

పరిసయ్యులు హేరోదు అనుచరులతో కలిసి తనను చంపడానికి కుట్ర పన్నారని తెలిసినప్పుడు, యేసు తన శిష్యుల్ని తీసుకుని గలిలయ సముద్రం దగ్గరికి వెళ్లాడు. అప్పుడు గలిలయ నుండి, కోస్తా నగరాలైన తూరు, సీదోనుల నుండి, యొర్దాను నదికి తూర్పున ఉన్న ప్రాంతం నుండి, దక్షిణాన ఉన్న యెరూషలేము నుండి, ఇదూమయ నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యేసు చాలామందిని బాగుచేశాడు. దాంతో, పెద్దపెద్ద రోగాలు ఉన్నవాళ్లంతా యేసు చుట్టూ గుమికూడి, ఆయన ముట్టుకునే వరకు ఆగకుండా ఆత్రంగా వాళ్లే ఆయన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించారు.—మార్కు 3:9, 10.

ప్రజలు తనమీద పడకుండా ఉండేలా, తనకోసం ఒక చిన్న పడవను సిద్ధం చేయమని యేసు శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు ఆయన పడవలోనే ఉండి బోధించవచ్చు, లేదా ఇంకా ఎక్కువమందికి సహాయం చేసేలా తీరాన ఉన్న వేరే ప్రాంతానికి వెళ్లవచ్చు.

యేసు చేసిన పని ‘యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటల్ని’ నెరవేర్చిందని శిష్యుడైన మత్తయి రాశాడు. (మత్తయి 12:17) యేసు ఏ ప్రవచనాన్ని నెరవేర్చాడు?

“ఇదిగో! నేను ఎంచుకున్న నా ప్రియమైన సేవకుడు; ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను! ఈయన మీద నా పవిత్రశక్తిని ఉంచుతాను, ఈయన న్యాయమంటే ఏమిటో దేశాలకు స్పష్టం చేస్తాడు. ఈయన గొడవపడడు, గట్టిగా అరవడు, ఈయన స్వరం ముఖ్య వీధుల్లో వినిపించదు. న్యాయాన్ని గెలిపించేవరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, ఆరిపోబోతున్న వత్తిని ఆర్పడు. నిజానికి దేశాలు ఈయన పేరుమీద నమ్మకం పెట్టుకుంటాయి.”—మత్తయి 12:18-21; యెషయా 42:1-4.

అవును, యేసు యెహోవాకు ప్రియమైన సేవకుడు; ఆయన్ని చూసి దేవుడు సంతోషించాడు. అబద్ధమత ఆచారాల వల్ల మరుగున పడిపోయిన అసలైన న్యాయాన్ని యేసు స్పష్టం చేశాడు. పరిసయ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తూ ధర్మశాస్త్రాన్ని తమకు ఇష్టమొచ్చినట్టు అన్వయించేవాళ్లు; విశ్రాంతి రోజున అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి కనీసం సహాయం కూడా చేసేవాళ్లు కాదు. కానీ యేసు మాత్రం దేవుని న్యాయం ఏంటో స్పష్టం చేస్తూ, తనమీద దేవుని పవిత్రశక్తి ఉందని చూపిస్తూ, భారంగా తయారైన అన్యాయమైన ఆచారాల నుండి ప్రజల్ని విడిపించాడు. అలా చేసినందుకు మతనాయకులు యేసును చంపాలనుకున్నారు. ఎంత దారుణం!

మరైతే, “ఈయన గొడవపడడు, గట్టిగా అరవడు, ఈయన స్వరం ముఖ్య వీధుల్లో వినిపించదు” అనే మాటకు అర్థమేంటి? యేసు రోగుల్ని బాగుచేస్తున్నప్పుడు తన గురించి ఎవరికీ చెప్పొద్దని వాళ్లకు ఆజ్ఞాపించేవాడు. చెడ్డదూతలకు కూడా అలానే ఆజ్ఞాపించేవాడు. (మార్కు 3:12) వీధుల్లో పెద్దపెద్దగా చేసే ప్రకటనల ద్వారానో, ఉన్నవి లేనివి కలిపి చెప్పే మాటల ద్వారానో ప్రజలు తన గురించి తెలుసుకోవాలని యేసు కోరుకోలేదు.

అంతేకాదు నలిగిపోయి, వంగిపోయి, పడిపోయిన రెల్లులా ఉన్న ప్రజలకు ఊరటనిచ్చే సందేశాన్ని యేసు ప్రకటించాడు. వాళ్లు ఆరిపోబోతున్న వత్తిలా కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. యేసు నలిగిన రెల్లును విరవడు లేదా ఆరిపోబోతున్న, పొగ వస్తున్న వత్తిని ఆర్పడు. ఆయన మృదువుగా, ప్రేమగా, నేర్పుగా సాత్వికుల్ని పైకి లేపుతాడు. నిజంగా, అన్ని దేశాల ప్రజలు యేసుమీద నమ్మకం పెట్టుకోవచ్చు!