కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

55వ అధ్యాయం

యేసు మాటలకు చాలామంది అభ్యంతరపడ్డారు

యేసు మాటలకు చాలామంది అభ్యంతరపడ్డారు

యోహాను 6:48-71

  • యేసు శరీరాన్ని తినడం, రక్తాన్ని తాగడం

  • చాలామంది అభ్యంతరపడి ఆయన్ని అనుసరించడం మానేశారు

యేసు కపెర్నహూములోని ఒక సమాజమందిరంలో, తాను పరలోకం నుండి దిగివచ్చిన నిజమైన ఆహారం అని బోధిస్తున్నాడు. గలిలయ సముద్రానికి తూర్పున తానిచ్చిన రొట్టెలు, చేపలు తిని తన కోసం వెతుక్కుంటూ వచ్చినవాళ్లతో అన్న మాటలకు కొనసాగింపుగా యేసు ఇప్పుడు బోధిస్తున్నాడు.

యేసు తన చర్చను కొనసాగిస్తూ ఇలా అన్నాడు: “మీ పూర్వీకులు ఎడారిలో మన్నా తిన్నా చనిపోయారు. అయితే . . . పరలోకం నుండి దిగివచ్చిన సజీవమైన ఆహారం నేనే. ఈ ఆహారాన్ని తినేవాళ్లు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు; నిజానికి లోకం జీవించేలా నేనిచ్చే ఆహారం నా శరీరమే.”—యోహాను 6:48-51.

సా.శ. 30 వసంత కాలంలో యేసు నీకొదేముతో మాట్లాడుతూ, దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడని, అందుకే వాళ్లను రక్షించడానికి తన కుమారుణ్ణి పంపించాడని చెప్పాడు. అయితే తాను అర్పించబోయే బలిమీద విశ్వాసం ఉంచడం ద్వారా తన శరీరాన్ని తినాలని ఇప్పుడు ఆయన నొక్కి చెప్తున్నాడు. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందగలుగుతాడు.

అయితే ప్రజలు యేసు మాటలకు అభ్యంతరం చెప్తూ ఇలా అన్నారు: “ఈ మనిషి మనం తినడానికి తన శరీరాన్ని ఎలా ఇవ్వగలడు?” (యోహాను 6:52) ప్రజలు తన మాటల్ని అక్షరార్థంగా కాదుగానీ సూచనార్థకంగా అర్థం చేసుకోవాలని యేసు కోరుకున్నాడు. ఆయన తర్వాత అన్న మాటల్ని బట్టి ఆ విషయం స్పష్టమౌతుంది.

“మీరు మానవ కుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని తాగితే తప్ప జీవం పొందరు. నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందుతారు . . . ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయం. నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగే వ్యక్తి నాతో ఐక్యంగా ఉంటాడు.”—యోహాను 6:53-56.

ఆ మాటలకు యూదులు ఎంత అభ్యంతరపడి ఉంటారో ఊహించండి! మనిషి మాంసాన్ని తినమనో, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరుతూ రక్తాన్ని తాగమనో యేసు చెప్తున్నాడని వాళ్లు అనుకొనివుంటారు. (ఆదికాండం 9:4; లేవీయకాండం 17:10, 11) కానీ యేసు ఉద్దేశం అది కాదు. త్వరలో ఆయన తన పరిపూర్ణ మానవ శరీరాన్ని, రక్తాన్ని అర్పించబోతున్నాడు; శాశ్వత జీవితం పొందాలని కోరుకునేవాళ్లందరూ ఆ బలి మీద విశ్వాసం ఉంచాలని ఆయన చెప్తున్నాడు. శిష్యుల్లో కూడా చాలామందికి ఆ మాటలు అర్థంకాలేదు. కొంతమందైతే, “ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాటలు ఎవరైనా వినగలరా?” అన్నారు.—యోహాను 6:60.

తన శిష్యుల్లో కొందరు సణుక్కుంటున్నారని గ్రహించి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ మాటలు మీకు కష్టంగా ఉన్నాయా? మరి, మానవ కుమారుడు అంతకుముందున్న చోటికి ఎక్కివెళ్లడం చూస్తే మీరు ఏమంటారు? . . . నేను మీకు చెప్పిన మాటలు పవిత్రశక్తి వల్ల చెప్పాను, అవి జీవాన్ని ఇస్తాయి. అయితే మీలో నమ్మనివాళ్లు కొంతమంది ఉన్నారు.” దాంతో చాలామంది శిష్యులు ఆయన్ని విడిచి వెళ్లిపోయారు, ఆయన్ని అనుసరించడం మానేశారు.—యోహాను 6:61-64.

యేసు తన 12 మంది అపొస్తలుల్ని, “మీరు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నారా?” అని అడిగాడు. అప్పుడు పేతురు, “ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి? శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు దేవుని పవిత్రుడివని మేము నమ్మాం, తెలుసుకున్నాం” అని జవాబిచ్చాడు. (యోహాను 6:67-69) నిజానికి ఈ సందర్భంలో పేతురుకు గానీ, మిగతా అపొస్తలులకు గానీ యేసు చెప్తున్నది పూర్తిగా అర్థంకాలేదు. అయినా, వాళ్లకున్న విశ్వసనీయత ఆ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది!

యేసు పేతురు మాటలకు సంతోషిస్తూనే ఇలా అన్నాడు: “మీ పన్నెండుమందిని ఎంచుకున్నది నేనే కదా, అయితే మీలో ఒకడు అపవాది లాంటివాడు.” (యోహాను 6:70) యేసు ఇస్కరియోతు యూదా గురించే ఆ మాట అన్నాడు. యూదా తప్పుదారి పట్టడం మొదలుపెట్టాడని యేసు బహుశా ఆ సమయంలో పసిగట్టి ఉంటాడు.

అయినా పేతురు, మిగతా అపొస్తలులు తనను నమ్మకంగా అనుసరిస్తూ, ప్రాణాల్ని కాపాడే పనిలో తనతోపాటు కొనసాగుతున్నందుకు యేసు ఎంతో సంతోషించి ఉంటాడు.