కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

60వ అధ్యాయం

రూపాంతరం​—⁠శిష్యులు క్రీస్తు మహిమను చూశారు

రూపాంతరం​—⁠శిష్యులు క్రీస్తు మహిమను చూశారు

మత్తయి 16:28–17:13 మార్కు 9:1-13 లూకా 9:27-36

  • యేసు రూపం మారిపోవడం గురించిన దర్శనం

  • అపొస్తలులు దేవుని స్వరం విన్నారు

హెర్మోను పర్వతానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరాన, ఫిలిప్పీ కైసరయ ప్రాంతంలో బోధిస్తున్నప్పుడు, యేసు తన అపొస్తలులకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలియజేశాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది మానవ కుమారుడు తన రాజ్యంలో రావడం చూసేవరకు చనిపోరు.”—మత్తయి 16:28.

యేసు చెప్పింది అర్థంకాక శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు. దాదాపు ఒక వారం తర్వాత, యేసు తన అపొస్తలుల్లో ముగ్గురిని అంటే పేతురును, యాకోబును, యోహానును తీసుకుని ఎత్తైన ఒక కొండ మీదికి వెళ్లాడు. అది రాత్రి సమయం అయ్యుంటుంది, ఎందుకంటే శిష్యులు నిద్రమత్తులో ఉన్నారు. అక్కడ యేసు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ల ముందు ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించడం, ఆయన వస్త్రాలు వెలుగులా తెల్లగా మెరవడం వాళ్లు చూశారు.

అప్పుడు “మోషే, ఏలీయా” లాంటి ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వాళ్లు “యేసు ఈ లోకం నుండి వెళ్లిపోవడం గురించి,” అంటే యెరూషలేములో ఆయన నెరవేర్చబోతున్న దాని గురించి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టారు. (లూకా 9:30, 31) “వెళ్లిపోవడం” అనే మాట, యేసు ఇంతకుముందు చెప్పినట్లుగా ఆయన చనిపోయి, తిరిగి బ్రతకడాన్ని సూచిస్తుంది. (మత్తయి 16:21) పేతురు అన్నదానికి భిన్నంగా, యేసు అవమానాలపాలై చనిపోవడం తప్పనిసరి అని వాళ్ల మాటలు నిరూపిస్తున్నాయి.

ముగ్గురు అపొస్తలులు ఇప్పుడు పూర్తిగా మేల్కొని, ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నారు. అది దర్శనమే అయినా అది నిజంగా జరుగుతున్నట్లు వాళ్లకు అనిపించింది. పేతురు అందులో లీనమైపోయి, “రబ్బీ, మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది. కాబట్టి మమ్మల్ని మూడు డేరాలు వేయనివ్వు. ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు” అన్నాడు. (మార్కు 9:5) ఆ దర్శనం ఇంకా కొనసాగాలనే ఉద్దేశంతో పేతురు అలా అన్నాడా?

పేతురు ఇంకా మాట్లాడుతుండగా, ప్రకాశవంతమైన ఒక మేఘం వాళ్లను కమ్మేసింది. ఆ మేఘంలో నుండి ఒక స్వరం ఇలా అంది: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈయన మాట వినండి.” దేవుని స్వరం వినగానే ముగ్గురు అపొస్తలులు భయంతో నేలమీద సాష్టాంగపడ్డారు. అప్పుడు యేసు వాళ్లతో, “లేవండి, భయపడకండి” అన్నాడు. (మత్తయి 17:5-7) వాళ్లు లేచినప్పుడు, అక్కడ యేసు తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. ఆ దర్శనం అయిపోయింది. తెల్లవారాక వాళ్లు కొండ మీద నుండి కిందికి వస్తున్నప్పుడు, యేసు వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “మానవ కుమారుడు మృతుల్లో నుండి బ్రతికించబడేంత వరకు ఈ దర్శనం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు.”—మత్తయి 17:9.

దర్శనంలో ఏలీయాను చూశాక అపొస్తలులకు ఒక ప్రశ్న తలెత్తింది. వాళ్లు యేసును ఇలా అడిగారు: “ముందు ఏలీయా రావాలని శాస్త్రులు ఎందుకు అంటున్నారు?” అప్పుడు యేసు ఇలా చెప్పాడు: ‘ఏలీయా ఇదివరకే వచ్చాడు; కానీ వాళ్లు అతన్ని గుర్తించలేదు.’ (మత్తయి 17:10-12) ఏలీయాలా పని చేసిన బాప్తిస్మమిచ్చే యోహాను గురించే యేసు మాట్లాడుతున్నాడు. ఏలీయా ఎలీషాకు మార్గం సిద్ధం చేసినట్లే, బాప్తిస్మమిచ్చే యోహాను క్రీస్తుకు మార్గం సిద్ధం చేశాడు.

యేసును, అపొస్తలుల్ని ఆ దర్శనం ఎంతగా బలపర్చి ఉంటుందో కదా! అది క్రీస్తు రాజ్య మహిమను వాళ్లకు ముందుగానే చూపించింది. అలా, యేసు వాగ్దానం చేసినట్లే “మానవ కుమారుడు తన రాజ్యంలో రావడం” శిష్యులు చూశారు. (మత్తయి 16:28) వాళ్లు కొండ మీద ఉన్నప్పుడు ‘ఆయన గొప్ప మహిమను కళ్లారా చూశారు.’ పరిసయ్యులు ఆయన్ని ఒక సూచన ఇవ్వమని, తాను దేవుడు ఎంచుకున్న రాజని నిరూపించుకోమని అడిగారు. కానీ ఆయన ఒక్క సూచన కూడా ఇవ్వలేదు. యేసు సన్నిహిత శిష్యులు మాత్రం ఆయన రూపం మారిపోవడాన్ని చూశారు, రాజ్యం గురించిన ప్రవచనాలు నమ్మదగినవని అది రుజువుచేసింది. అందుకే, “ప్రవచన వాక్యం మీద మనకున్న నమ్మకం మరింత బలపర్చబడింది” అని పేతురు ఆ తర్వాత రాశాడు.—2 పేతురు 1:16-19.