కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

62వ అధ్యాయం

వినయం గురించి ఒక ముఖ్యమైన పాఠం

వినయం గురించి ఒక ముఖ్యమైన పాఠం

మత్తయి 17:22–18:5 మార్కు 9:30-37 లూకా 9:43-48

  • తన మరణం గురించి యేసు మళ్లీ చెప్పాడు

  • చేప నోట్లో దొరికిన నాణెంతో పన్ను కట్టాడు

  • రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు?

ఫిలిప్పీ కైసరయ ప్రాంతంలో యేసు రూపాంతరం చెందాడు, చెడ్డదూత పట్టిన అబ్బాయిని బాగుచేశాడు. తర్వాత ఆయన తన శిష్యులతో కలిసి కపెర్నహూముకు బయల్దేరాడు. “ఆ విషయం గురించి ఎవ్వరికీ తెలియకూడదని” ఆయన అనుకున్నాడు. (మార్కు 9:30) యేసు తన శిష్యుల్ని సిద్ధం చేయడానికి ఈ ప్రయాణం సహాయపడుతుంది, ఎందుకంటే త్వరలోనే ఆయన చనిపోబోతున్నాడు, ఆ తర్వాత వాళ్లు చేయాల్సిన పని చాలా ఉంది. ఆయన ఇలా చెప్పాడు: “మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వాళ్లు ఆయన్ని చంపుతారు, కానీ మూడో రోజున ఆయన బ్రతికించబడతాడు.”—మత్తయి 17:22, 23.

ఆ మాట విన్న శిష్యులు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, తాను చనిపోబోతున్నానని యేసు ఇంతకుముందు కూడా వాళ్లకు చెప్పాడు, అప్పుడు పేతురు అలా జరగకూడదని యేసుతో అన్నాడు. (మత్తయి 16:21, 22) అంతేకాదు, ముగ్గురు అపొస్తలులు యేసు రూపం మారిపోవడం చూశారు, యేసు “ఈ లోకం నుండి వెళ్లిపోవడం” గురించి విన్నారు. (లూకా 9:31) ఈసారి యేసు చెప్పిన మాటలకు అపొస్తలులు “చాలా దుఃఖపడ్డారు.” అయితే నిజానికి ఆయన చెప్పిన మాటలు వాళ్లకు పూర్తిగా అర్థంకాలేదు. (మత్తయి 17:23) అయినా ఎవ్వరూ దాని గురించి ఆయన్ని అడిగే ధైర్యం చేయలేదు.

చివరికి వాళ్లు కపెర్నహూముకు చేరుకున్నారు. అది యేసు పరిచర్య కేంద్రం, అంతేకాదు చాలామంది అపొస్తలుల సొంతూరు కూడా. అక్కడ, ఆలయ పన్ను వసూలుచేసే కొందరు పేతురు దగ్గరికి వచ్చారు. బహుశా యేసు ఆలయ పన్ను కట్టడంలేదని ఆరోపించడానికి వాళ్లు ఇలా అడిగారు: “మీ బోధకుడు ఆలయ పన్ను కట్టడా?”—మత్తయి 17:24.

దానికి పేతురు, “కడతాడు” అని జవాబిచ్చాడు. ఇంట్లో ఉన్న యేసుకు బయట ఏం జరిగిందో తెలుసు. కాబట్టి ఆ విషయం గురించి పేతురు చెప్పేంతవరకు ఎదురుచూడకుండా, యేసే ఇలా అడిగాడు: “సీమోనూ, నీకేమనిపిస్తుంది? భూరాజులు సుంకాలు, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ పిల్లల దగ్గరా? బయటివాళ్ల దగ్గరా?” అందుకు పేతురు, “బయటివాళ్ల దగ్గరే” అన్నాడు. అప్పుడు యేసు అతనితో, “అలాగైతే పిల్లలు పన్ను కట్టాల్సిన అవసరం లేదు” అన్నాడు.—మత్తయి 17:25, 26.

యేసు తండ్రి విశ్వానికే రాజు, ఆలయంలో ప్రజలంతా ఆరాధించేది ఆయన్నే. కాబట్టి న్యాయంగా చూస్తే దేవుని కుమారుడు ఆలయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే యేసు ఇలా అన్నాడు: “మనం వాళ్లకు అభ్యంతరం కలిగించకుండా ఉండేలా, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్లి గాలం వేసి మొదట చిక్కే చేపను తీసుకో, దాని నోరు తెరిస్తే ఒక వెండి నాణెం [ఒక స్టేటర్‌ లేదా టెట్రాడ్రక్మా] కనిపిస్తుంది, దాన్ని తీసుకెళ్లి మనిద్దరి కోసం పన్ను కట్టు.”—మత్తయి 17:27.

కాసేపటికి శిష్యులంతా ఒకచోట చేరారు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడిగా ఉంటాడని వాళ్లు యేసును అడిగారు. ఇంతకుముందు యేసు తాను చనిపోతానని చెప్పినప్పుడు వాళ్లు ఆయన్ని ఏ ప్రశ్నా అడిగే ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు తమ భవిష్యత్తు గురించి అడగడానికి మాత్రం వాళ్లు భయపడట్లేదు. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో యేసుకు తెలుసు. కపెర్నహూముకు తిరిగి వస్తున్నప్పుడే వాళ్లు యేసు వెనక నడుస్తూ దాని గురించి వాదించుకున్నారు. కాబట్టి ఆయన వాళ్లను, “దారిలో మీరు దేని గురించి వాదించుకుంటున్నారు?” అని అడిగాడు. (మార్కు 9:33) అప్పుడు శిష్యులు సిగ్గుతో మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే తమలో ఎవరు గొప్ప అని వాళ్లు వాదించుకున్నారు. చివరికి, వాళ్లు ఏ ప్రశ్న గురించి చర్చించుకుంటున్నారో యేసుకు తెలియజేశారు: “పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు?”—మత్తయి 18:1.

దాదాపు మూడు సంవత్సరాలుగా యేసును గమనిస్తూ, ఆయన చెప్పేవి వింటూ కూడా వాళ్లు అలా వాదించుకోవడం వింతగానే అనిపిస్తుంది. అయితే వాళ్లు కూడా అపరిపూర్ణులే. పదవిని, హోదాను చాలా ముఖ్యమైనవిగా ఎంచే మతనాయకుల మధ్య వాళ్లు పుట్టి పెరిగారు. అంతేకాదు, పేతురుకు రాజ్యపు తాళంచెవులు ఇస్తానని యేసు ఈ మధ్యే చెప్పాడు. కాబట్టి తాను అందరికన్నా గొప్పవాడినని పేతురు అనుకొని ఉంటాడా? యేసు రూపం మారిపోవడాన్ని కళ్లారా చూసిన యాకోబు, యోహానులు కూడా తాము గొప్పవాళ్లమని అనుకొని ఉంటారా?

ఏదేమైనా యేసు వాళ్ల ఆలోచనా తీరును సరిచేయాలనుకున్నాడు. ఆయన ఒక పిల్లవాడిని దగ్గరికి పిలిచి, వాళ్ల మధ్య నిలబెట్టి ఇలా అన్నాడు: “మీరు పరలోక రాజ్యంలోకి వెళ్లాలంటే మీ మనస్తత్వాన్ని పూర్తిగా మార్చుకొని చిన్నపిల్లల్లా మారాలి. కాబట్టి ఈ చిన్న బాబులా తనను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు. నా పేరున ఈ చిన్నపిల్లల్లో ఒకర్ని చేర్చుకునే వ్యక్తి నన్ను కూడా చేర్చుకుంటున్నాడు.”—మత్తయి 18:3-5.

యేసు ఎంత చక్కగా బోధించాడో కదా! ఆయన తన శిష్యుల మీద కోప్పడలేదు, వాళ్లకు అత్యాశ, అధికార దాహం ఉన్నాయని నిందించలేదు. బదులుగా ఒక చిన్న బాబును చూపిస్తూ వాళ్లకు చక్కని పాఠం నేర్పించాడు. చిన్నపిల్లల మనసులో హోదా, స్థాయి లాంటివి అస్సలు ఉండవు. తన శిష్యులు కూడా అలాంటి ఆలోచనా తీరును పెంపొందించుకోవాలని యేసు చెప్పాడు. తన అనుచరులకు నేర్పిస్తున్న పాఠాన్ని ఆయన ఇలా ముగించాడు: “మీ అందరిలో ఎవరు తక్కువవాడిలా నడుచుకుంటాడో అతనే గొప్పవాడు.”—లూకా 9:48.