కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

118వ అధ్యాయం

తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకున్నారు

తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకున్నారు

మత్తయి 26:31-35 మార్కు 14:27-31 లూకా 22:24-38 యోహాను 13:31-38

  • గొప్ప స్థానాలు కోరుకోవద్దని యేసు సలహా ఇచ్చాడు

  • తానెవరో తెలీదని పేతురు అంటాడని యేసు ముందే చెప్పాడు

  • ప్రేమే యేసు అనుచరులకు గుర్తింపు

యేసు తన అపొస్తలులతో గడిపిన చివరి రాత్రి, వాళ్ల కాళ్లు కడగడం ద్వారా, వినయంగా సేవచేసే విషయంలో చక్కని పాఠం నేర్పించాడు. ఆ పాఠం నేర్పించడం ఎందుకు సరైనది? ఎందుకంటే, వాళ్లలో ఒక బలహీనత ఉంది. వాళ్లు దేవుణ్ణి సేవిస్తున్నప్పటికీ, తమలో ఎవరు గొప్ప అనే ఆలోచనను మాత్రం విడిచిపెట్టట్లేదు. (మార్కు 9:33, 34; 10:35-37) వాళ్ల బలహీనత ఆ రాత్రి మళ్లీ బయటపడింది.

“తమలో ఎవరు అందరికన్నా గొప్ప అనే విషయం గురించి” అపొస్తలుల్లో పెద్ద గొడవ మొదలైంది. (లూకా 22:24) వాళ్లు మళ్లీ గొడవపడడం చూసి యేసుకు ఎంత బాధేసివుంటుందో కదా! మరి ఆయన ఏం చేశాడు?

వాళ్ల స్వభావాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్లను తిట్టే బదులు యేసు ఓపిగ్గా ఇలా తర్కించాడు: “దేశాల్ని పాలించే రాజులు ప్రజల మీద అధికారం చెలాయిస్తారు, అధికారం ఉన్నవాళ్లు ప్రజా సేవకులు అని పిలవబడతారు. అయితే మీరు అలా ఉండకూడదు. . . . ఎవరు గొప్పవాడు? భోజనానికి కూర్చున్న వ్యక్తా, సేవలు చేసే వ్యక్తా?” తాను రోజూ వాళ్ల మధ్య ఉంచిన ఆదర్శాన్ని గుర్తుచేస్తూ ఆయన ఇలా అన్నాడు: “కానీ నేను మీ మధ్య ఒక సేవకుడిలా ఉన్నాను.”—లూకా 22:25-27.

అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ అపొస్తలులు ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో యేసును అంటిపెట్టుకుని ఉన్నారు. అందుకే యేసు ఇలా అన్నాడు: “నా తండ్రి నాతో ఒప్పందం చేసినట్టే నేను కూడా రాజ్యం గురించి మీతో ఒప్పందం చేస్తున్నాను.” (లూకా 22:29) వాళ్లు యేసుకు విశ్వసనీయంగా ఉన్నారు. ఆయన వాళ్లతో ఒక ఒప్పందం చేయడం ద్వారా, వాళ్లు తన రాజ్యంలో తనతోపాటు రాజులుగా పరిపాలిస్తారనే హామీ ఇచ్చాడు.

అపొస్తలులకు అంత అద్భుతమైన నిరీక్షణ ఉన్నప్పటికీ, వాళ్లు ఇంకా అపరిపూర్ణ మనుషులే. అందుకే యేసు ఇలా హెచ్చరించాడు: “సాతాను మిమ్మల్ని గోధుమల్లా తూర్పారబట్టి జల్లించడానికి మీ అందర్నీ కోరుకున్నాడు.” (లూకా 22:31) ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఈ రాత్రి మీరంతా నన్ను వదిలేసి వెళ్లిపోతారు. ఎందుకంటే ‘నేను కాపరిని కొడతాను, మందలోని గొర్రెలు చెదిరిపోతాయి’ అని లేఖనాల్లో రాసివుంది.”—మత్తయి 26:31; జెకర్యా 13:7.

అప్పుడు పేతురు స్థిరంగా ఇలా చెప్పాడు: “అందరూ నిన్ను వదిలి వెళ్లిపోయినా నేను మాత్రం నిన్ను ఎన్నడూ వదిలి వెళ్లను.” (మత్తయి 26:33) కానీ ఆ రాత్రి, కోడి రెండుసార్లు కూయకముందే తానెవరో తెలీదని పేతురు అంటాడని యేసు చెప్పాడు. అయితే, యేసు ఇంకో మాట కూడా అన్నాడు: “నీ విశ్వాసం బలహీనపడకుండా ఉండాలని నేను నీ కోసం పట్టుదలగా ప్రార్థించాను; నువ్వు పశ్చాత్తాపపడి తిరిగొచ్చిన తర్వాత నీ సహోదరుల్ని బలపర్చు.” (లూకా 22:32) అయినా, పేతురు ధైర్యంగా ఇలా అన్నాడు: “నేను నీతోపాటు చనిపోవాల్సి వచ్చినా సరే, నువ్వెవరో తెలీదని అననే అనను.” (మత్తయి 26:35) మిగతా అపొస్తలులు కూడా అదే మాట అన్నారు.

తర్వాత యేసు ఇలా అన్నాడు: “నేను ఇంక కొంతకాలమే మీతోపాటు ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు; అయితే, ‘నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని యూదులతో చెప్పిన మాటే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”—యోహాను 13:33-35.

యేసు ఇంక కొంతకాలమే వాళ్లతో ఉంటానని చెప్పినప్పుడు, పేతురు ఇలా అడిగాడు: “ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అందుకు యేసు, “నేను వెళ్తున్న చోటికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు కానీ తర్వాత వస్తావు” అన్నాడు. పేతురుకు అర్థంకాక ఇలా అన్నాడు: “ప్రభువా, నేను ఇప్పుడు నీ వెంట ఎందుకు రాలేను? నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను.”—యోహాను 13:36, 37.

యేసు అంతకుముందు గలిలయలో తన అపొస్తలుల్ని ప్రకటనా పనికి పంపించినప్పుడు, డబ్బు సంచి గానీ ఆహారం మూట గానీ తీసుకెళ్లవద్దని చెప్పాడు. (మత్తయి 10:5, 9, 10) ఆ సందర్భాన్ని మనసులో ఉంచుకుని యేసు ఇలా అడిగాడు: “అప్పుడు మీకేమైనా తక్కువైందా?” దానికి వాళ్లు, “లేదు!” అన్నారు. కానీ రాబోయే రోజుల్లో వాళ్లు ఏం చేయాలో చెప్తూ, యేసు ఇలా అన్నాడు: “ఇప్పుడైతే, డబ్బు సంచి గానీ ఆహారం మూట గానీ ఉన్న వ్యక్తి దాన్ని తీసుకెళ్లాలి; ఎవరి దగ్గరైనా కత్తి లేకపోతే అతను తన పైవస్త్రం అమ్మి ఒక కత్తి కొనుక్కోవాలి. ఎందుకంటే, నేను మీతో చెప్తున్నాను, ‘ఆయన అపరాధుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు’ అని రాయబడిన మాటలు నా విషయంలో నెరవేరాలి. ఇప్పుడు అవి నా విషయంలో నెరవేరుతున్నాయి.”—లూకా 22:35-37.

తాను నేరస్తులతో లేదా అపరాధులతో కొయ్య మీద వేలాడదీయబడే సమయం గురించి యేసు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన అనుచరులు తీవ్రమైన హింసను ఎదుర్కొంటారు. దానికి తాము సిద్ధమే అని భావించి అపొస్తలులు ఇలా అన్నారు: “ప్రభువా, ఇదిగో! ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయి.” అప్పుడు ఆయన, “అవి సరిపోతాయి” అన్నాడు. (లూకా 22:38) తర్వాత, ఒక అపొస్తలుడు ఆ రెండు కత్తుల్లో ఒకదాన్ని ఉపయోగించినప్పుడు, యేసు వాళ్లకు మరో ముఖ్యమైన పాఠం నేర్పించాల్సి వచ్చింది.