123వ అధ్యాయం
యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన
మత్తయి 26:30, 36-46 మార్కు 14:26, 32-42 లూకా 22:39-46 యోహాను 18:1
-
యేసు గెత్సేమనే తోటకు వెళ్లాడు
-
ఆయన చెమట రక్తపు చుక్కల్లా కారింది
యేసు తన నమ్మకమైన అపొస్తలులతో కలిసి ప్రార్థన చేశాడు. తర్వాత వాళ్లంతా “స్తుతిగీతాలు పాడి, ఒలీవల కొండకు” బయల్దేరారు. (మార్కు 14:26) వాళ్లు తూర్పు వైపుగా గెత్సేమనే తోటకు వెళ్లారు. యేసు తరచూ ఆ తోటకు వెళ్లేవాడు.
ఒలీవ చెట్లు ఉన్న ఆ ప్రశాంతమైన ప్రదేశానికి రాగానే, ఎనిమిదిమంది అపొస్తలుల్ని విడిచి యేసు కాస్త ముందుకు వెళ్లాడు. బహుశా వాళ్లు ఆ తోట ద్వారం దగ్గరే ఉండివుండవచ్చు. ఎందుకంటే ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసుకుంటాను, అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి.” తర్వాత ముగ్గురు అపొస్తలుల్ని అంటే పేతురును, యాకోబును, యోహానును తనతోపాటు తోట లోపలికి తీసుకెళ్లాడు. ఆయన తీవ్రంగా ఆందోళనపడుతూ ఆ ముగ్గురికి ఇలా చెప్పాడు: “నా ప్రాణం పోయేంత తీవ్రమైన దుఃఖం కలుగుతోంది. మీరు ఇక్కడే ఉండి, నాతో పాటు మెలకువగా ఉండండి.”—మత్తయి 26:36-38.
ఆయన కాస్త ముందుకు వెళ్లి ‘మోకాళ్లూని, ప్రార్థించడం మొదలుపెట్టాడు.’ అంత తీవ్రమైన వేదనలో యేసు దేని గురించి ప్రార్థించాడు? “తండ్రీ, నీకు అన్నీ సాధ్యమే; ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి. అయినా, నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి” అని ప్రార్థించాడు. (మార్కు 14:35, 36) విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు వెనకాడుతున్నాడని ఆ మాటలు సూచిస్తున్నాయా? ఎంతమాత్రం కాదు!
రోమన్లు మరణశిక్ష విధించేటప్పుడు ఎంత చిత్రవధ చేస్తారో యేసు పరలోకం నుండి చూశాడు. అయితే, ఇప్పుడు ఆయన ఒక మనిషిగా భూమ్మీద ఉన్నాడు కాబట్టి ఆయనకు నొప్పి, బాధ, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు ఉన్నాయి. అయినప్పటికీ, తనను ఎలా చంపుతారోనని ఆయన భయపడట్లేదు గానీ, తాను ఒక నేరస్తునిలా చనిపోవడం వల్ల తన తండ్రి పేరుకు ఎక్కడ అపకీర్తి వస్తుందోనని భయపడుతున్నాడు. దైవదూషణ చేసినవాళ్లను కొయ్య మీద వేలాడదీసి చంపినట్లు, ఇంకొన్ని గంటల్లో ఈయన్ని కూడా చంపేస్తారు.
యేసు చాలాసేపు ప్రార్థించి తిరిగొచ్చేసరికి ముగ్గురు అపొస్తలులు నిద్రపోతున్నారు. అప్పుడు ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “మీరు నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయారా? మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా మెలకువగా ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉండండి.” అయితే అపొస్తలులు కూడా బాగా అలసిపోయారని, అప్పటికే చాలా ఆలస్యమైందని గుర్తించి యేసు ఇలా అన్నాడు: “మనసు సిద్ధమే కానీ శరీరమే బలహీనం.”—మత్తయి 26:40, 41.
యేసు మళ్లీ వెళ్లి, తన దగ్గర నుండి ‘ఈ గిన్నెను’ తీసేయమని దేవుణ్ణి వేడుకున్నాడు. ఆయన తిరిగొచ్చి చూసేసరికి, ఆ ముగ్గురు అపొస్తలులు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా ప్రార్థన చేయాల్సిందిపోయి, మళ్లీ నిద్రపోతున్నారు. యేసు అడిగినప్పుడు, “ఏం చెప్పాలో వాళ్లకు తోచలేదు.” (మార్కు 14:40) యేసు మూడోసారి వెళ్లి, మళ్లీ మోకాళ్లూని ప్రార్థించాడు.
తాను ఒక నేరస్తునిలా చనిపోతే, తండ్రి పేరుకు అపకీర్తి వస్తుందేమో అని ఆయన తీవ్రంగా ఆందోళన పడుతున్నాడు. యెహోవా తన కుమారుడు చేసిన ప్రార్థనలు వింటున్నాడు, అందుకే ఆ సమయంలో ఆయన్ని బలపర్చడానికి ఒక దేవదూతను పంపించాడు. అయినప్పటికీ, యేసు తండ్రిని వేడుకుంటూనే ఉన్నాడు, ‘తీవ్రంగా ప్రార్థిస్తూనే ఉన్నాడు.’ ఆయన భావోద్వేగపరంగా ఎంతో ఒత్తిడికి లోనయ్యాడు. యేసు భుజాలపై ఎంత బరువైన బాధ్యత ఉందో కదా! ఆయన, అలాగే విశ్వాసంగల మనుషులు శాశ్వత జీవితం లూకా 22:44.
పొందుతారా లేదా అనేది ఆయన మీదే ఆధారపడి ఉంది. ఆ సమయంలో, “ఆయన చెమట రక్తపు చుక్కల్లా నేల మీద పడుతోంది.”—యేసు మూడోసారి అపొస్తలుల దగ్గరికి వచ్చేసరికి, వాళ్లు మళ్లీ నిద్రపోతున్నారు. ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఇలాంటి సమయంలో మీరు నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా! ఇదిగో! మానవ కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. లేవండి, వెళ్దాం. ఇదిగో! నన్ను అప్పగించేవాడు దగ్గరికి వచ్చేశాడు.”—మత్తయి 26:45, 46.