కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

137వ అధ్యాయం

పునరుత్థానమైన యేసును పెంతెకొస్తుకు ముందు వందలమంది చూశారు

పునరుత్థానమైన యేసును పెంతెకొస్తుకు ముందు వందలమంది చూశారు

మత్తయి 28:16-20 లూకా 24:50-52 అపొస్తలుల కార్యాలు 1:1-12; 2:1-4

  • యేసు చాలామందికి కనిపించాడు

  • ఆయన పరలోకానికి వెళ్లాడు

  • 120 మంది శిష్యులపై పవిత్రశక్తిని కుమ్మరించాడు

యేసు పునరుత్థానమైన తర్వాత, తాను చెప్పినట్టే తన 11 మంది అపొస్తలుల్ని గలిలయలో ఒక కొండ దగ్గర కలిశాడు. వాళ్లతోపాటు దాదాపు 500 మంది ఇతర శిష్యులు కూడా ఉన్నారు. వాళ్లలో కొంతమందికి యేసు నిజంగా లేచాడా అనే సందేహం ఉంది. (మత్తయి 28:17; 1 కొరింథీయులు 15:6) కానీ యేసు ఇప్పుడు చెప్పబోయే మాటల్ని బట్టి, ఆయన నిజంగానే తిరిగి లేచాడని వాళ్లలో ప్రతీఒక్కరికి నమ్మకం కుదురుతుంది.

దేవుడు తనకు పరలోకంలో, భూమ్మీద పూర్తి అధికారం ఇచ్చాడని యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.” (మత్తయి 28:18-20) అవును, యేసు తిరిగి బ్రతకడమే కాదు, ప్రకటనా పని విషయంలో ఇంకా ఆసక్తి చూపిస్తూనే ఉన్నాడు.

యేసు అనుచరులకు అంటే పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు, అందరికీ ఒకే పని అప్పగించబడింది. అదే శిష్యుల్ని చేయడం. వాళ్ల ప్రకటనా పనిని, బోధనా పనిని ఆపాలని వ్యతిరేకులు ప్రయత్నించవచ్చు. అయినా యేసు ఈ అభయం ఇచ్చాడు: “పరలోకంలో, భూమ్మీద నాకు పూర్తి అధికారం ఇవ్వబడింది.” యేసు అనుచరులు ఆ మాటల నుండి ఎలా ప్రోత్సాహం పొందవచ్చు? ఆయన ఇలా చెప్పాడు: “ఇదిగో! ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.” అయితే, మంచివార్త ప్రకటించే వాళ్లందరూ అద్భుతాలు చేసే శక్తిని పొందుతారని యేసు చెప్పలేదు. కానీ, వాళ్లకు పవిత్రశక్తి సహాయం ఉంటుందని ఆయన చెప్పాడు.

మొత్తం మీద, యేసు పునరుత్థానం అయ్యాక తన శిష్యులకు “40 రోజులపాటు” కనిపించాడు. వాళ్లు ఆయన్ని గుర్తుపట్టకపోయినా, ‘తాను బ్రతికి ఉన్నానని ఒప్పింపజేసే ఎన్నో రుజువుల్ని’ వాళ్లకు చూపించాడు. అంతేకాదు వాళ్లకు “దేవుని రాజ్యం గురించి” బోధించాడు.—అపొస్తలుల కార్యాలు 1:3; 1 కొరింథీయులు 15:7.

అపొస్తలులు ఇంకా గలిలయలో ఉండగానే, యేసు వాళ్లను తిరిగి యెరూషలేముకు వెళ్లమన్నాడు. ఆయన వాళ్లను యెరూషలేములో కలుసుకుని ఇలా చెప్పాడు: “మీరు యెరూషలేమును విడిచి వెళ్లకండి. తండ్రి వాగ్దానం నెరవేరేవరకు ఎదురుచూస్తూ ఉండండి. ఆ వాగ్దానం గురించి మీరు నా దగ్గర విన్నారు. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు. అయితే, కొన్ని రోజుల్లో మీరు పవిత్రశక్తితో బాప్తిస్మం పొందుతారు.”—అపొస్తలుల కార్యాలు 1:4, 5.

తర్వాత యేసు మళ్లీ తన అపొస్తలుల్ని కలిశాడు. ఆయన వాళ్లను ఒలీవల కొండ మీద తూర్పున ఉన్న “బేతనియ వరకు” తీసుకెళ్లాడు. (లూకా 24:50) తాను వెళ్లిపోవాల్సి ఉందని యేసు ఎన్నిసార్లు చెప్పినా, ఆయన రాజ్యం భూమ్మీదే ఉంటుందని వాళ్లు ఇంకా అనుకుంటున్నారు.—లూకా 22:16, 18, 30; యోహాను 14:2, 3.

అపొస్తలులు యేసును ఇలా అడిగారు: “ప్రభువా, ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ ఇస్తావా?” దానికి ఆయన, “సమయాల్ని, కాలాల్ని తండ్రి తన అధికారం కింద ఉంచుకున్నాడు. వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు” అన్నాడు. వాళ్లు చేయాల్సిన పనిని మళ్లీ నొక్కిచెప్తూ యేసు ఇలా అన్నాడు: “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.”—అపొస్తలుల కార్యాలు 1:6-8.

అపొస్తలులు, పునరుత్థానమైన యేసుతో ఒలీవల కొండ మీద ఉన్నారు. అప్పుడు యేసు పరలోకానికి వెళ్తుండడం వాళ్లు చూశారు. తర్వాత, ఒక మేఘం ఆయన్ని కమ్ముకోవడంతో వాళ్లు ఇక చూడలేకపోయారు. యేసు పునరుత్థానం అయ్యాక, తన శిష్యులకు కనిపించడం కోసం మానవ శరీరాలు ధరించాడు. కానీ ఇప్పుడు తాను ధరించిన మానవ శరీరాన్ని విడిచి, ఆత్మప్రాణిగా పరలోకానికి వెళ్తున్నాడు. (1 కొరింథీయులు 15:44, 50; 1 పేతురు 3:18) నమ్మకమైన అపొస్తలులు ఆకాశంలోకి అలాగే చూస్తూ ఉండగా, “తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు మనుషులు” వాళ్ల పక్కన నిలబడ్డారు. వాళ్లు దేవదూతలు. వాళ్లు ఇలా అన్నారు: “గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు? మీ దగ్గర నుండి ఆకాశంలోకి ఎత్తబడిన ఈ యేసు ఏ విధంగా ఆకాశంలోకి వెళ్లడం మీరు చూశారో అదేవిధంగా వస్తాడు.”—అపొస్తలుల కార్యాలు 1:10, 11.

యేసు పరలోకానికి వెళ్తున్నప్పుడు, ఆర్భాటంతో అందరికీ కనిపించేలా వెళ్లలేదు. ఆయన వెళ్లడాన్ని కేవలం ఆయన నమ్మకమైన అనుచరులు మాత్రమే చూశారు. “అదేవిధంగా” ఆయన రాజ్యాధికారంతో వచ్చినప్పుడు, ఆయన నమ్మకమైన అనుచరులు మాత్రమే ఆ విషయాన్ని గ్రహిస్తారు.

అపొస్తలులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు. తర్వాతి రోజుల్లో వాళ్లు, మిగతా శిష్యులు కలిసి సమకూడుతూ ఉన్నారు. ఆ శిష్యుల్లో “యేసు తమ్ముళ్లు, ఆయన తల్లి మరియ” కూడా ఉన్నారు. (అపొస్తలుల కార్యాలు 1:14) వాళ్లంతా పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్లు ప్రార్థించిన ఒక అంశం, ఇస్కరియోతు యూదాకు బదులు 12వ అపొస్తలునిగా ఏ శిష్యుణ్ణి ఎంపిక చేయాలన్నదే. (మత్తయి 19:28) యేసు చేసినవాటిని, ఆయన పునరుత్థానాన్ని కళ్లారా చూసిన వ్యక్తినే ఎంపిక చేయాలని వాళ్లు కోరుకున్నారు. ఆ విషయంలో దేవుని నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి వాళ్లు చీట్లు వేశారు. చీట్లు వేసినట్లుగా బైబిల్లో నమోదైన చివరి సంఘటన ఇదే. (కీర్తన 109:8; సామెతలు 16:33) వాళ్లు మత్తీయను ఎంపిక చేసి, అతన్ని “11 మంది అపొస్తలులతో పాటు” లెక్కించారు. అతను బహుశా యేసు పంపిన 70 మంది శిష్యుల్లో ఒకడై ఉండవచ్చు.—అపొస్తలుల కార్యాలు 1:26.

యేసు పరలోకానికి వెళ్లిపోయిన పది రోజుల తర్వాత, సా.శ. 33 పెంతెకొస్తు పండుగ వచ్చింది. అప్పుడు దాదాపు 120 మంది శిష్యులు యెరూషలేములో ఒక మేడగదిలో సమావేశమయ్యారు. ఉన్నట్టుండి, గాలి వేగంగా వీస్తున్న లాంటి శబ్దం ఆ ఇల్లంతా నిండిపోయింది. అగ్నిలాంటి నాలుకలు కనిపించి, అక్కడున్న ఒక్కొక్కరి మీద వాలాయి. అప్పుడు శిష్యులందరూ వేర్వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. పవిత్రశక్తిని కుమ్మరిస్తానని యేసు చెప్పిన మాట నిజమైంది!—యోహాను 14:26.