120వ అధ్యాయం
శిష్యులు ఫలించాలి, యేసుకు స్నేహితులుగా ఉండాలి
-
నిజమైన ద్రాక్షచెట్టు, దాని తీగలు
-
యేసు ప్రేమలో నిలిచివుండాలంటే ఏం చేయాలి?
యేసు తన నమ్మకమైన అపొస్తలులతో మనసువిప్పి మాట్లాడుతూ వాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. అప్పటికే చాలా ఆలస్యమైంది, బహుశా అర్ధరాత్రి దాటింది. ఇప్పుడు యేసు వాళ్లను పురికొల్పే ఒక ఉదాహరణ చెప్పాడు.
ఆయన ఇలా అన్నాడు: “నేను నిజమైన ద్రాక్షచెట్టును, నా తండ్రి వ్యవసాయదారుడు.” (యోహాను 15:1) కొన్ని వందల సంవత్సరాల క్రితం అలాంటి పోలికే ఉపయోగించబడింది. ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా దేవుని ద్రాక్షతోటతో పోల్చారు. (యిర్మీయా 2:21; హోషేయ 10:1, 2) కానీ యెహోవా ఆ జనాంగాన్ని విడిచిపెట్టబోతున్నాడు. (మత్తయి 23:37, 38) యేసు ఇక్కడ ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తున్నాడు. అదేంటంటే, తండ్రి సాగుచేస్తున్న ద్రాక్షచెట్టు యేసే. సా.శ. 29 లో యేసును పవిత్రశక్తితో అభిషేకించినప్పటి నుండి యెహోవా దాన్ని సాగుచేస్తున్నాడు. అయితే ఆ ద్రాక్షచెట్టు కేవలం తనొక్కడినే సూచించట్లేదని చెప్తూ యేసు ఇలా వివరించాడు:
“నాలోని ఫలించని ప్రతీ తీగను ఆయన [నా తండ్రి] తెంచి పారేస్తాడు; అంతేకాదు ఫలించే ప్రతీ తీగ ఇంకా ఎక్కువగా ఫలించేలా దాన్ని శుభ్రం చేస్తాడు. . . . ద్రాక్షచెట్టుకు అంటుకొని ఉంటే తప్ప తీగ దానంతటదే ఫలించలేదు. అలాగే మీరు కూడా నాతో ఐక్యంగా ఉంటే తప్ప ఫలించలేరు. నేను ద్రాక్షచెట్టును, మీరు తీగలు.”—యోహాను 15:2-5.
తాను వెళ్లిపోయిన తర్వాత, సహాయకుణ్ణి అంటే పవిత్రశక్తిని పంపిస్తానని యేసు తన నమ్మకమైన శిష్యులకు మాటిచ్చాడు. ఆ మాట అన్న 51 రోజులకు అపొస్తలులు, మరితరులు పవిత్రశక్తిని పొందారు. అప్పుడు వాళ్లు ద్రాక్షచెట్టు తీగలు అయ్యారు. ఆ తీగలన్నీ యేసుతో ఐక్యంగా ఉండాలి. ఎందుకు?
ఆయన ఇలా చెప్పాడు: “ఎవరైతే నాతో ఎప్పుడూ ఐక్యంగా ఉంటారో, ఎవరితోనైతే నేను ఎప్పుడూ ఐక్యంగా ఉంటానో అతను ఎక్కువగా ఫలిస్తాడు; నా నుండి వేరైపోయి మీరు అసలు ఏమీ చేయలేరు.” ఆ “తీగలు,” లేదా యేసు నమ్మకమైన అనుచరులు ఎక్కువగా ఫలించాలి. అంటే వాళ్లు యేసు లక్షణాల్ని అనుకరిస్తూ, దేవుని రాజ్యం గురించి ఇతరులకు ఉత్సాహంగా ప్రకటిస్తూ, ఎక్కువమందిని శిష్యులుగా చేయాలి. ఒకవేళ ఎవరైనా యేసు నుండి వేరైపోయి ఫలించకపోతే, అప్పుడేంటి? ఆయన ఇలా చెప్పాడు: “ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉండని వ్యక్తి, బయట పారేయబడి ఎండిపోయిన తీగలా ఉంటాడు.” మరోవైపు, తనను అంటిపెట్టుకుని ఫలిస్తూ ఉండేవాళ్ల గురించి యేసు ఇలా చెప్పాడు: “మీరు ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉంటే, అలాగే నా మాటలు ఎప్పుడూ మీలో ఉంటే మీకు ఇష్టమైనది ఏది అడిగినా దాన్ని పొందుతారు.”—యోహాను 15:5-7.
ఇప్పుడు యేసు తన ఆజ్ఞల్ని పాటించడం గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు రెండుసార్లు కూడా దాని గురించి చెప్పాడు. (యోహాను 14:15, 21) వాటిని పాటిస్తున్నామని ఎలా చూపించవచ్చో యేసు చెప్పాడు: “నేను తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్టే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలిచి ఉంటారు.” అంటే కేవలం యెహోవా దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి ప్రేమించడం మాత్రమే సరిపోదు. ఇంకా ఏం చేయాలో చెప్తూ యేసు ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇదే నా ఆజ్ఞ. స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు. నేను మీకు ఆజ్ఞాపిస్తున్న వాటిని చేస్తే మీరు నా స్నేహితులుగా ఉంటారు.”—యోహాను 15:10-14.
ఇంకొన్ని గంటల్లో, యేసు తనమీద విశ్వాసం ఉంచే వాళ్లందరి కోసం ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమ చూపించబోతున్నాడు. ఆయన అనుచరులు కూడా ఒకరిపట్ల ఒకరు అలాంటి త్యాగపూరిత ప్రేమనే చూపించాలి. ఆ ప్రేమే వాళ్లకు గుర్తింపు. యేసు అంతకుముందు ఇలా చెప్పాడు: “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”—యోహాను 13:35.
యేసు తమను “స్నేహితులు” అని పిలిచాడని అపొస్తలులు గుర్తించాలి. వాళ్లను ఎందుకు అలా పిలిచాడో యేసు వివరించాడు: “నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను, ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటన్నిటినీ నేను మీకు తెలియజేశాను.” యేసుకు దగ్గరి స్నేహితులుగా ఉంటూ, తండ్రి ఆయనకు బోధించిన విషయాల్ని ఆయన దగ్గర నేర్చుకోవడం ఎంత గొప్ప అవకాశమో కదా! ఆ స్నేహాన్ని కాపాడుకోవాలంటే వాళ్లు ఎప్పుడూ ‘ఫలిస్తూ ఉండాలి.’ అలా ఫలిస్తే వచ్చే ప్రయోజనం ఏంటో యేసు చెప్పాడు: “మీరు నా పేరున తండ్రిని ఏది అడిగినా ఆయన దాన్ని మీకు ఇస్తాడు.”—యోహాను 15:15, 16.
ఆ “తీగల” మధ్య, అంటే శిష్యుల మధ్య ప్రేమ ఉంటే వాళ్లు ఎన్ని కష్టాలొచ్చినా సహించగలరు. లోకం వాళ్లను ద్వేషిస్తుందని హెచ్చరిస్తూ, యేసు ఈ ఓదార్పును కూడా ఇచ్చాడు: “లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, అది మీకన్నా ముందు నన్ను ద్వేషించిందని గుర్తుంచుకోండి. మీరు లోకానికి చెందినవాళ్లయితే, మీరు తనవాళ్లు కాబట్టి లోకం మిమ్మల్ని ఇష్టపడుతుంది. కానీ మీరు లోకానికి చెందినవాళ్లు కాదు, . . . కాబట్టే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.”—లోకం వాళ్లను ఎందుకు ద్వేషిస్తుందో యేసు ఇంకా ఇలా వివరించాడు: “మీరు నా శిష్యులు కాబట్టి వాళ్లు ఇవన్నీ మీకు చేస్తారు; ఎందుకంటే నన్ను పంపించిన వ్యక్తి వాళ్లకు తెలీదు.” తాను చేసిన అద్భుతాలే తనను ద్వేషించేవాళ్లను దోషులుగా నిలబెడతాయని చెప్తూ యేసు ఇలా అన్నాడు: “ఎవరూ చేయని అద్భుతాల్ని నేను వాళ్ల మధ్య చేసుండకపోతే వాళ్లమీద ఏ పాపం ఉండేది కాదు; కానీ ఇప్పుడు వాళ్లు నన్ను చూశారు, నన్నూ నా తండ్రినీ ద్వేషించారు.” నిజానికి, అలా ద్వేషించడం ప్రవచనాన్ని నెరవేర్చింది.—యోహాను 15:21, 24, 25; కీర్తన 35:19; 69:4.
యేసు ఒక సహాయకుణ్ణి అంటే పవిత్రశక్తిని పంపిస్తానని మళ్లీ మాటిచ్చాడు. ఆ బలమైన శక్తి యేసు అనుచరులందరికీ అందుబాటులో ఉంటూ వాళ్లు ఫలించడానికి, ‘సాక్ష్యమివ్వడానికి’ సహాయం చేస్తుంది.—యోహాను 15:27.