106వ అధ్యాయం
ద్రాక్షతోట గురించిన రెండు ఉదాహరణలు
మత్తయి 21:28-46 మార్కు 12:1-12 లూకా 20:9-19
-
ఇద్దరు కుమారుల ఉదాహరణ
-
ద్రాక్షతోట రైతుల ఉదాహరణ
ఆలయంలో ఉన్నప్పుడు, ఏ అధికారంతో వీటిని చేస్తున్నావు అని ప్రశ్నించిన ముఖ్య యాజకుల్ని, ప్రజల పెద్దల్ని యేసు అయోమయంలో పడేశాడు. ఆయన ఇచ్చిన జవాబుతో వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. తర్వాత, వాళ్లు ఎలాంటివాళ్లో తెలియజేయడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు.
ఆయన ఇలా అన్నాడు: “ఒకతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్లి, ‘బాబూ, ఈ రోజు ద్రాక్షతోటలోకి వెళ్లి పనిచేయి’ అని చెప్పాడు. అందుకు ఆ పెద్ద కుమారుడు, ‘నేను వెళ్లను’ అన్నాడు, కానీ తర్వాత మనసు మార్చుకుని వెళ్లాడు. తండ్రి చిన్న కుమారుడి దగ్గరికి వెళ్లి అదే మాట చెప్పాడు. అతను, ‘వెళ్తాను నాన్నా’ అన్నాడు కానీ వెళ్లలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టాన్ని చేశారు?” (మత్తయి 21:28-31) పెద్ద కుమారుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాబట్టి వ్యతిరేకులతో యేసు ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, పన్ను వసూలుచేసే వాళ్లు, వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలోకి వెళ్తారు.” పన్ను వసూలుచేసే వాళ్లు, వేశ్యలు మొదట్లో దేవుణ్ణి సేవించలేదు. కానీ ఉదాహరణలోని పెద్ద కుమారుడిలా, వాళ్లు ఆ తర్వాత పశ్చాత్తాపపడి దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారు. మతనాయకులేమో ఉదాహరణలోని చిన్న కుమారుడిలా దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ, నిజానికి అలా చేయట్లేదు. యేసు ఇలా అన్నాడు: “[బాప్తిస్మమిచ్చే] యోహాను, నీతి మార్గాన్ని బోధిస్తూ మీ దగ్గరికి వచ్చాడు, కానీ మీరు అతన్ని నమ్మలేదు. అయితే పన్ను వసూలుచేసే వాళ్లు, వేశ్యలు అతన్ని నమ్మారు; మీరు అది చూసి కూడా పశ్చాత్తాపపడలేదు, అతన్ని నమ్మలేదు.”—మత్తయి 21:31, 32.
తర్వాత యేసు మరో ఉదాహరణ చెప్పాడు. మతనాయకులు దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తున్నారనే కాదు, వాళ్లు చాలా చెడ్డవాళ్లని కూడా యేసు ఈ ఉదాహరణలో వివరించాడు. ఆయన ఇలా చెప్పాడు: “ఒకతను ద్రాక్షతోట నాటించి, చుట్టూ కంచె వేయించాడు. ద్రాక్షపండ్లు తొక్కించడానికి ఒక తొట్టి తొలిపించాడు, కాపలా కోసం ఒక బురుజు కట్టించాడు; తర్వాత దాన్ని కౌలుకిచ్చి వేరే దేశానికి వెళ్లిపోయాడు. సమయం వచ్చినప్పుడు, అతను పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తీసుకురావడానికి ఆ రైతుల దగ్గరికి ఒక దాసుణ్ణి పంపించాడు. కానీ వాళ్లు అతన్ని పట్టుకొని కొట్టి, వట్టి చేతులతో పంపించేశారు. తర్వాత అతను ఇంకో దాసుణ్ణి పంపించాడు. వాళ్లు ఆ దాసుణ్ణి తల మీద కొట్టి అవమానించారు. యజమాని మళ్లీ ఇంకో దాసుణ్ణి పంపించాడు, వాళ్లు అతన్ని చంపేశారు. అలా ఆ యజమాని చాలామంది దాసుల్ని పంపించాడు. వాళ్లు కొంతమందిని కొట్టారు, కొంతమందిని చంపేశారు.”—మార్కు 12:1-5.
యేసు చెప్పిన ఉదాహరణ అక్కడ ఉన్నవాళ్లకు అర్థమైందా? అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజల్ని విమర్శిస్తూ యెషయా చెప్పిన ఈ మాటలు వాళ్లకు గుర్తుండివుంటాయి: “ఇశ్రాయేలు ఇంటివాళ్లే సైన్యాలకు అధిపతైన యెహోవా ద్రాక్షతోట; యూదా ప్రజలు ఆయనకు బాగా నచ్చిన మొక్కలు. ఆయన న్యాయం కోసం చూస్తూ వచ్చాడు, కానీ అన్యాయమే కనిపించింది!” (యెషయా 5:7) యేసు చెప్పిన ఉదాహరణ కూడా అలాంటిదే. ఈ ఉదాహరణలో ఉన్న యజమాని యెహోవా, ద్రాక్షతోట ఇశ్రాయేలు జనాంగం, వాళ్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచె దేవుని ధర్మశాస్త్రం. తన ప్రజల్ని నిర్దేశించడానికి, వాళ్లు మంచి ఫలాలు ఫలించేలా సహాయం చేయడానికి యెహోవా ప్రవక్తల్ని పంపాడు.
కానీ “రైతులు” అతని “దాసుల్ని” కొట్టి చంపారు. యేసు ఇలా చెప్పాడు: ‘ఆ యజమానికి ఎంతో ఇష్టమైన ఒక కుమారుడు ఉన్నాడు. కాబట్టి అతను, “వాళ్లు నా కుమారుణ్ణి గౌరవిస్తారు” అని అనుకొని చివరికి ఆ కుమారుణ్ణి వాళ్ల దగ్గరికి పంపించాడు. కానీ ఆ రైతులు, “ఇతను వారసుడు. రండి, ఇతన్ని చంపేద్దాం, అప్పుడు ఆస్తి మనదైపోతుంది” అని తమలోతాము అనుకున్నారు. దాంతో వాళ్లు అతన్ని పట్టుకొని చంపేశారు.’—మార్కు 12:6-8.
తర్వాత యేసు ఇలా అడిగాడు: “అప్పుడు ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు?” (మార్కు 12:9) దానికి మతనాయకులు ఇలా జవాబిచ్చారు: “వాళ్లు చెడ్డవాళ్లు కాబట్టి అతను వాళ్లను దారుణంగా చంపేసి, కోతకాలం వచ్చినప్పుడు పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తనకు ఇచ్చే వేరే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు.”—మత్తయి 21:41.
ఆ విధంగా, తెలియకుండానే మతనాయకులు తమకు తాము తీర్పు తీర్చుకున్నారు. ఇశ్రాయేలు జనాంగం అనే మార్కు 12:10, 11) తర్వాత, యేసు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు: “అందుకే నేను మీతో చెప్తున్నాను, దేవుడు తన రాజ్యాన్ని మీ దగ్గర నుండి తీసేసి, రాజ్యానికి తగిన ఫలాలు ఫలించే జనానికి ఇస్తాడు.”—మత్తయి 21:43.
దేవుని “ద్రాక్షతోటను” చూసుకుంటున్న ‘రైతుల్లో’ వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఫలించాలని, తన కుమారుడైన మెస్సీయ మీద విశ్వాసం చూపించాలని యెహోవా కోరుకోవడం సరైనదే. యేసు ఆ మతనాయకుల వైపు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు, “మీరు ఈ లేఖనాన్ని ఎప్పుడూ చదవలేదా: ‘కట్టేవాళ్లు వద్దనుకున్న రాయి ముఖ్యమైన మూలరాయి అయింది. ఇది యెహోవా వల్ల జరిగింది, ఇది మన కళ్లకు ఆశ్చర్యం.’” (యేసు “తమను మనసులో పెట్టుకునే ఆ ఉదాహరణ చెప్పాడని” శాస్త్రులు, ముఖ్య యాజకులు గ్రహించారు. (లూకా 20:19) అందుకే, ‘వారసుణ్ణి’ చంపాలని వాళ్లు అంతకుముందు కన్నా ఎక్కువగా కోరుకున్నారు. కానీ యేసు ప్రవక్త అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, వాళ్లకు భయపడి ఆ సమయంలో ఆయన్ని చంపడానికి ప్రయత్నించలేదు.