కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

107వ అధ్యాయం

ఒక రాజు తన కుమారుడి పెళ్లి విందుకు ఆహ్వానించాడు

ఒక రాజు తన కుమారుడి పెళ్లి విందుకు ఆహ్వానించాడు

మత్తయి 22:1-14

  • పెళ్లి విందు గురించిన ఉదాహరణ

తన పరిచర్య ముగుస్తుండగా శాస్త్రుల, ముఖ్య యాజకుల నిజస్వరూపం బయటపెట్టడానికి యేసు ఉదాహరణలు చెప్తున్నాడు. అందుకే వాళ్లు ఆయన్ని చంపాలనుకున్నారు. (లూకా 20:19) అయినా, వాళ్ల నిజస్వరూపం బయటపెడుతూ ఆయన ఇంకో ఉదాహరణ చెప్పాడు:

“పరలోక రాజ్యాన్ని, తన కుమారుడి పెళ్లి విందు ఏర్పాటు చేసిన రాజుతో పోల్చవచ్చు. పెళ్లి విందుకు ఆహ్వానించబడిన వాళ్లను పిలవడానికి రాజు తన దాసుల్ని పంపించాడు, కానీ వాళ్లు రావడానికి ఇష్టపడలేదు.” (మత్తయి 22:2, 3) యేసు ఆ ఉదాహరణను ‘పరలోక రాజ్యం’ అనే మాటతో మొదలుపెట్టాడు. కాబట్టి ఆ ఉదాహరణలోని “రాజు” ఖచ్చితంగా యెహోవానే అయ్యుండాలి. మరి రాజు కుమారుడు, పెళ్లి విందుకు ఆహ్వానించబడిన వాళ్లు ఎవరు? రాజు కుమారుడు మరెవరో కాదు, యెహోవా కుమారుడే, అంటే ఆ ఉదాహరణ చెప్తున్న యేసే. పెళ్లి విందుకు ఆహ్వానించబడిన వాళ్లు ఎవరంటే, పరలోక రాజ్యంలో యేసుతోపాటు ఉండేవాళ్లు.

ఆ విందుకు మొదట ఆహ్వానించబడిన వాళ్లు ఎవరు? యూదులు. ఎందుకంటే యేసు, ఆయన అపొస్తలులు రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నది వాళ్లకే. (మత్తయి 10:6, 7; 15:24) వాళ్లు సా.శ.పూ. 1513 లో ధర్మశాస్త్ర ఒప్పందాన్ని అంగీకరించడం ద్వారా “యాజకులతో రూపొందిన రాజ్యంగా” ఏర్పడేవాళ్లలో మొదటివాళ్లు అయ్యారు. (నిర్గమకాండం 19:5-8) మరి వాళ్లు “పెళ్లి విందుకు” ఎప్పుడు ఆహ్వానించబడ్డారు? సా.శ. 29 లో యేసు పరలోక రాజ్యం గురించి ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు వాళ్లు ఆహ్వానించబడ్డారు.

ఇశ్రాయేలీయుల్లో చాలామంది ఆ ఆహ్వానానికి ఎలా స్పందించారు? యేసు చెప్పినట్లు, “వాళ్లు రావడానికి ఇష్టపడలేదు.” చాలామంది మతనాయకులు అలాగే ప్రజలు యేసును మెస్సీయగా, దేవుడు నియమించిన రాజుగా అంగీకరించలేదు.

అయితే, యూదులకు మరో అవకాశం ఇవ్వబడుతుందని యేసు చెప్పాడు: “అతను [రాజు] మళ్లీ వేరే దాసుల్ని పంపిస్తూ ఇలా అన్నాడు: ‘“ఇదిగో! నేను విందు సిద్ధం చేశాను. ఎద్దులు, కొవ్విన జంతువులు వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెళ్లి విందుకు రండి” అని వాళ్లకు చెప్పండి.’ కానీ ఆహ్వానించబడిన వాళ్లు దాన్ని లెక్కచేయకుండా ఒకతను తన పొలానికి, ఇంకొకతను తన వ్యాపారం చూసుకోవడానికి వెళ్లిపోయారు; మిగతావాళ్లు ఆ దాసుల్ని పట్టుకొని కొట్టి, చంపేశారు.” (మత్తయి 22:4-6) క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత జరిగే సంఘటనల్ని ఆ మాటలు సూచిస్తున్నాయి. ఆ సమయంలో, రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం యూదులకు ఇంకా తెరిచే ఉంది. అయితే వాళ్లలో చాలామంది ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి, ‘రాజు పంపించిన దాసుల్ని’ కొట్టారు.—అపొస్తలుల కార్యాలు 4:13-18; 7:54, 58.

అలా చేసినందుకు వాళ్లకు ఏమైంది? యేసు ఇలా చెప్పాడు: “రాజుకు చాలా కోపమొచ్చి, తన సైన్యాల్ని పంపి ఆ హంతకుల్ని చంపించి, వాళ్ల నగరాన్ని తగలబెట్టించాడు.” (మత్తయి 22:7) సా.శ. 70 లో రోమన్లు “వాళ్ల నగరాన్ని” అంటే యెరూషలేమును నాశనం చేసినప్పుడు ఆ మాటలు నెరవేరాయి.

రాజు ఇచ్చిన ఆహ్వానాన్ని వాళ్లు తిరస్కరించినంత మాత్రాన, ఇంకెవరూ ఆ విందుకు ఆహ్వానించబడరా? ఆహ్వానించబడతారు. ఎందుకంటే, యేసు ఆ ఉదాహరణను ఇలా కొనసాగించాడు: “తర్వాత రాజు తన దాసులకు ఇలా చెప్పాడు: ‘పెళ్లి విందు సిద్ధంగా ఉంది, కానీ ఆహ్వానించబడిన వాళ్లు అందుకు అర్హులుకారు. కాబట్టి, మీరు నగరం బయట దారుల్లోకి వెళ్లి, ఎవరు కనిపిస్తే వాళ్లను ఈ విందుకు పిలవండి.’ ఆ దాసులు రాజు చెప్పినట్టే వెళ్లి, మంచివాళ్లు చెడ్డవాళ్లు అనే తేడా లేకుండా కనిపించిన వాళ్లందర్నీ ఆహ్వానించారు; దాంతో పెళ్లి జరుగుతున్న ఇల్లంతా భోజనం చేసేవాళ్లతో నిండిపోయింది.”—మత్తయి 22:8-10.

అపొస్తలుడైన పేతురు కొంతకాలం తర్వాత, అన్యులు (పుట్టుకతో యూదులు కానివాళ్లు, యూదుల్లా మారనివాళ్లు) నిజ క్రైస్తవులయ్యేలా సహాయం చేయడం మొదలుపెట్టాడు. సా.శ. 36 లో రోమా సైనికాధికారి అయిన కొర్నేలి, అతని కుటుంబ సభ్యులు పవిత్రశక్తిని పొందారు. ఆ విధంగా, యేసు చెప్పిన పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం వాళ్లకు దొరికింది.—అపొస్తలుల కార్యాలు 10:1, 34-48.

అయితే, విందుకు వచ్చినవాళ్లందరూ “రాజు” ఆమోదాన్ని పొందరని యేసు చెప్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “రాజు తన అతిథుల్ని చూడడానికి వచ్చినప్పుడు, పెళ్లి వస్త్రం వేసుకోకుండా వచ్చిన ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతన్ని, ‘నువ్వు పెళ్లి వస్త్రం వేసుకోకుండా లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతని దగ్గర జవాబు లేదు. అప్పుడు రాజు తన సేవకులకు ఇలా చెప్పాడు: ‘ఇతని కాళ్లూచేతులు కట్టేసి బయట చీకట్లో పారేయండి. అక్కడే అతను ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటాడు.’ ఆహ్వానించబడిన వాళ్లు చాలామంది, కానీ ఎంచుకోబడినవాళ్లు కొందరే.”—మత్తయి 22:11-14.

యేసు మాటలు వింటున్న మతనాయకులకు ఆ ఉదాహరణ అర్థమైవుండకపోవచ్చు. అయినప్పటికీ వాళ్లు కోపంతో రగిలిపోయి, తమను ఇబ్బందిపెడుతున్న యేసును చంపాలని ఇంకా ఎక్కువగా కోరుకున్నారు.