కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

117వ అధ్యాయం

ప్రభువు రాత్రి భోజనం

ప్రభువు రాత్రి భోజనం

మత్తయి 26:21-29 మార్కు 14:18-25 లూకా 22:19-23 యోహాను 13:18-30

  • నమ్మకద్రోహి యూదానే

  • ప్రభువు రాత్రి భోజనాన్ని యేసు ప్రారంభించాడు

యేసు కాసేపటి క్రితమే తన అపొస్తలుల కాళ్లు కడిగి, వాళ్లకు వినయం గురించి పాఠం నేర్పించాడు. ఇప్పుడు, అంటే బహుశా పస్కా భోజనం అయిపోయిన తర్వాత, ఆయన దావీదు రాసిన ఈ ప్రవచన మాటల్ని ఎత్తిచెప్పాడు: “నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నాతోపాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు.” తర్వాత యేసు ఇలా వివరించాడు: “మీలో ఒకతను నన్ను అప్పగిస్తాడు.”—కీర్తన 41:9; యోహాను 13:18, 21.

అపొస్తలులందరూ ఒకరినొకరు చూసుకుంటూ, “ప్రభువా, నేను కాదు కదా?” అని యేసును అడిగారు. ఆఖరికి ఇస్కరియోతు యూదా కూడా అడిగాడు. పేతురు యోహానుకు సైగ చేసి, ఆయన్ని అప్పగించేది ఎవరో అడగమన్నాడు. కాబట్టి, యేసు పక్కనే కూర్చున్న యోహాను కాస్త వెనక్కి వాలి, “ప్రభువా ఎవరతను?” అని అడిగాడు.—మత్తయి 26:22; యోహాను 13:25.

అప్పుడు యేసు, “నేను రొట్టె ముక్కను ముంచి ఎవరికి ఇస్తానో అతనే” అన్నాడు. యేసు రొట్టె ముక్క తీసుకుని బల్లమీద ఉన్న పాత్రలో ముంచి, యూదాకు ఇస్తూ ఇలా అన్నాడు: “నిజంగా, మానవ కుమారుడు తన గురించి లేఖనాల్లో రాసివున్నట్టుగానే వెళ్లిపోతున్నాడు. కానీ ఎవరు మానవ కుమారుణ్ణి అప్పగిస్తారో అతనికి శ్రమ! అంతకన్నా అతను పుట్టకపోయుంటేనే అతని పరిస్థితి బావుండేది.” (యోహాను 13:26; మత్తయి 26:24) అప్పుడు సాతాను యూదాలో ప్రవేశించాడు. యూదా అప్పటికే అవినీతిపరుడు, దానికితోడు ఇప్పుడు సాతాను ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు. ఆ విధంగా అతను “నాశనపుత్రుడు” అయ్యాడు.—యోహాను 6:64, 70; 12:4; 17:12.

యేసు యూదాతో, “నువ్వు చేస్తున్నది ఇంకా త్వరగా చేయి” అన్నాడు. యూదా దగ్గర డబ్బుల పెట్టె ఉంది కాబట్టి, “పండుగ కోసం తమకు అవసరమైనవి కొనమనో, పేదవాళ్లకు ఏమైనా ఇవ్వమనో” యేసు అతనికి చెప్తున్నాడని మిగతా అపొస్తలులు అనుకున్నారు. (యోహాను 13:27-30) కానీ యూదా వెళ్లింది యేసును అప్పగించడానికి.

పస్కా భోజనం చేసిన అదే రోజు రాత్రి, యేసు ఒక కొత్త ఆచరణను ప్రారంభించాడు. ఆయన ఒక రొట్టె తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, దాన్ని విరిచి, తినమని అపొస్తలులకు ఇచ్చాడు. ఆయన ఇలా అన్నాడు: “ఇది మీ కోసం నేను అర్పించబోతున్న నా శరీరాన్ని సూచిస్తోంది. నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.” (లూకా 22:19) అపొస్తలులు ఆ రొట్టె ముక్కను ఒకరి తర్వాత ఒకరికి అందించుకుని తిన్నారు.

తర్వాత యేసు ద్రాక్షారసం ఉన్న ఒక గిన్నె తీసుకుని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, అపొస్తలులకు ఇచ్చాడు. వాళ్లందరూ ఆ గిన్నెలోది తాగారు. ఆయన ఇలా అన్నాడు: “ఈ గిన్నె, మీ కోసం నేను చిందించబోతున్న నా రక్తం ఆధారంగా ఏర్పడే కొత్త ఒప్పందాన్ని సూచిస్తోంది.”—లూకా 22:20.

తన అనుచరులు ప్రతీ సంవత్సరం నీసాను 14న తన మరణాన్ని గుర్తుచేసుకోవడం కోసం యేసు అలా ఒక ఆచరణ ప్రారంభించాడు. విశ్వాసంగల మనుషుల్ని పాపమరణాల నుండి విడిపించడానికి యేసు, ఆయన తండ్రి చేసినదాన్ని ఆ ఆచరణ గుర్తుచేస్తుంది. అది యూదులు ఆచరించే పస్కా కన్నా గొప్పది. ఎందుకంటే, నమ్మకమైన మనుషులు పొందే నిజమైన విడుదలను అది గుర్తుచేస్తుంది.

“పాపక్షమాపణ కోసం అనేకమంది తరఫున” తన రక్తం చిందించబోతున్నానని యేసు చెప్పాడు. ‘పాపక్షమాపణ పొందే అనేకమందిలో’ నమ్మకమైన అపొస్తలులు, ఇతర నమ్మకమైన శిష్యులు ఉంటారు. వాళ్లు యేసుతోపాటు తండ్రి రాజ్యంలో ఉంటారు.—మత్తయి 26:28, 29.