కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

139వ అధ్యాయం

యేసు భూమిని పరదైసుగా మార్చి, తన పని పూర్తిచేస్తాడు

యేసు భూమిని పరదైసుగా మార్చి, తన పని పూర్తిచేస్తాడు

1 కొరింథీయులు 15:24-28

  • గొర్రెలకు, మేకలకు ఏం జరుగుతుంది?

  • చాలామంది భూపరదైసులో జీవిస్తారు

  • యేసు తానే మార్గం, సత్యం, జీవం అని రుజువు చేసుకుంటాడు

యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆయన ఇంకా పరిచర్య మొదలుపెట్టకముందే, ఒక శత్రువు దాన్ని ఆపాలనుకున్నాడు. అవును, సాతాను పదేపదే యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. ఆ దుష్టుడి గురించి యేసు ఇలా చెప్పాడు: “ఈ లోక పరిపాలకుడు వస్తున్నాడు, అతనికి నా మీద ఎలాంటి పట్టూ లేదు.”—యోహాను 14:30.

‘ఆ మహాసర్పానికి, మొదటి సర్పానికి’ అంటే అపవాది అయిన సాతానుకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అపొస్తలుడైన యోహాను ముందే దర్శనంలో చూశాడు. మనుషుల్ని హింసిస్తున్న ఆ శత్రువు పరలోకం నుండి పడవేయబడడం, “తనకు కొంచెం సమయమే ఉందని తెలిసి చాలా కోపంతో” ఉండడం యోహాను చూశాడు. (ప్రకటన 12:9, 12) సాతానుకు మిగిలివున్న ఆ ‘కొంచెం సమయంలో’ మనం జీవిస్తున్నామని; త్వరలోనే ‘ఆ మహాసర్పం, మొదటి సర్పం’ అగాధంలో బంధించబడతాడని; యేసు పరిపాలించే 1,000 సంవత్సరాలు సాతాను ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడని మనం నమ్మవచ్చు.—ప్రకటన 20:1, 2.

ఆ వెయ్యి సంవత్సరాల్లో భూమ్మీద ఎలాంటి మార్పులు జరుగుతాయి? భూమ్మీద ఎవరుంటారు? ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఆ ప్రశ్నలకు స్వయంగా యేసే జవాబిచ్చాడు. తన సహోదరులకు మంచి చేస్తూ మద్దతిచ్చే గొర్రెల్లాంటి నీతిమంతులకు ఏం జరుగుతుందో యేసు గొర్రెలు-మేకల ఉదాహరణలో చెప్పాడు. అలా చేయని మేకల్లాంటి ప్రజలకు ఏం జరుగుతుందో కూడా యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “వీళ్లు [మేకలు] శాశ్వతంగా నాశనమౌతారు, కానీ నీతిమంతులు [గొర్రెలు] శాశ్వత జీవితాన్ని పొందుతారు.”—మత్తయి 25:46.

యేసు తనతోపాటు వేలాడదీయబడిన నేరస్తునితో అన్న మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. యేసు తన నమ్మకమైన అపొస్తలులకు మాటిచ్చినట్లు, ఆ నేరస్తునికి పరలోక రాజ్యంలో ఉంటావని మాటివ్వలేదు. బదులుగా పశ్చాత్తాపం చూపించిన ఆ నేరస్తునితో యేసు ఇలా అన్నాడు: “ఈ రోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు.” (లూకా 23:43) కాబట్టి పరదైసులో, అంటే అందమైన తోటలో జీవించే నిరీక్షణను యేసు అతనికి ఇచ్చాడు. భవిష్యత్తులో గొర్రెలుగా తీర్పు తీర్చబడి, “శాశ్వత జీవితాన్ని” పొందేవాళ్లు కూడా ఆ పరదైసులో ఉంటారు.

అప్పుడు భూమ్మీద ఉండే పరిస్థితుల గురించి అపొస్తలుడైన యోహాను కూడా వర్ణించాడు. ఆయన ఇలా రాశాడు: “దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వాళ్లతో పాటు నివసిస్తాడు. వాళ్లు ఆయన ప్రజలుగా ఉంటారు. దేవుడే స్వయంగా వాళ్లతోపాటు ఉంటాడు. వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”—ప్రకటన 21:3, 4.

ఆ నేరస్తుడు పరదైసులో జీవించాలంటే, అతను పునరుత్థానం అవ్వాలి. అయితే, పునరుత్థానం అయ్యేది అతనొక్కడే కాదు. ఎందుకంటే యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు; మంచిపనులు చేసినవాళ్లు జీవించడానికి బ్రతికించబడతారు, అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు తీర్పు పొందడానికి బ్రతికించబడతారు.”—యోహాను 5:28, 29.

నమ్మకమైన అపొస్తలులు, ఇంకొందరు యేసుతోపాటు పరలోకంలో ఉంటారు. వాళ్ల గురించి బైబిలు ఇలా చెప్తుంది: “వీళ్లు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా ఉంటారు, క్రీస్తుతో కలిసి 1,000 సంవత్సరాలు రాజులుగా పరిపాలిస్తారు.” (ప్రకటన 20:6) క్రీస్తుతో కలిసి పరిపాలించే స్త్రీపురుషులు ఈ భూమ్మీద జీవించినవాళ్లే. కాబట్టి, వాళ్లు భూమ్మీదున్న వాళ్లను అర్థం చేసుకుని కనికరంతో పరిపాలిస్తారు.—ప్రకటన 5:10.

యేసు తన విమోచన క్రయధన బలి విలువను భూమ్మీదున్న వాళ్లకు అన్వయిస్తాడు, వాళ్లకు వారసత్వంగా వచ్చిన పాపాన్ని తీసేస్తాడు. ఆయన, సహరాజులు కలిసి విశ్వాసంగల మనుషుల్ని పరిపూర్ణులుగా చేస్తారు. ఆదాముహవ్వలు పిల్లల్ని కని భూమిని నిండించాలని దేవుడు కోరుకున్నాడు. వాళ్లు ఎలాంటి జీవితాన్ని అనుభవించాలని దేవుడు కోరుకున్నాడో, అలాంటి జీవితాన్ని భూమ్మీదున్న వాళ్లు అనుభవిస్తారు. ఆదాము పాపం వల్ల వచ్చిన మరణం కూడా ఇక ఉండదు!

ఆ విధంగా, యెహోవా చెప్పిన పనంతటినీ యేసు పూర్తిచేస్తాడు. వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో యేసు రాజ్యాన్ని, పరిపూర్ణ మానవ కుటుంబాన్ని తన తండ్రికి అప్పగిస్తాడు. యేసు ఎంతో వినయంతో చేసే ఆ పనిని వివరిస్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “అన్నీ తనకు లోబర్చబడిన తర్వాత, కుమారుడు కూడా తనకు అన్నిటినీ లోబర్చిన దేవునికి తానే లోబడతాడు. దేవుడే అందరికీ అన్నీ అవ్వాలని ఆయన అలా చేస్తాడు.”—1 కొరింథీయులు 15:28.

దేవుని ఉన్నతమైన సంకల్పాల్ని నెరవేర్చడంలో యేసు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని స్పష్టమౌతోంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో దేవుడు ఏం సంకల్పించినా యేసు తన పాత్రను ఖచ్చితంగా నెరవేరుస్తాడు, తానే “మార్గం, సత్యం, జీవం” అని రుజువు చేసుకుంటాడు.—యోహాను 14:6.