కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

124వ అధ్యాయం

యూదా యేసును అప్పగించాడు

యూదా యేసును అప్పగించాడు

మత్తయి 26:47-56 మార్కు 14:43-52 లూకా 22:47-53 యోహాను 18:2-12

  • గెత్సేమనే తోటలో యూదా యేసును అప్పగించాడు

  • పేతురు ఒక వ్యక్తి చెవి నరికాడు

  • యేసును బంధించారు

అర్ధరాత్రి దాటి చాలాసేపు అయింది. యేసును అప్పగిస్తే 30 వెండి నాణేలు ఇస్తామని యాజకులు యూదాకు చెప్పారు. కాబట్టి అతను ముఖ్య యాజకుల, పరిసయ్యుల పెద్ద గుంపును తీసుకుని యేసును వెతుక్కుంటూ బయల్దేరాడు. వాళ్లతోపాటు, ఆయుధాలు ధరించిన కొంతమంది రోమా సైనికులు, ఒక సహస్రాధిపతి కూడా వెళ్లారు.

పస్కా భోజనం తర్వాత యేసు యూదాను పంపించేసినప్పుడు, అతను ఆ ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్లాడు. (యోహాను 13:27) ఆ ముఖ్య యాజకులు కొంతమంది అధికారుల్ని, సైనికుల్ని పిలిపించుకున్నారు. మొదట యూదా వాళ్లను యేసు, అపొస్తలులు పస్కాను ఆచరించిన మేడగది దగ్గరికి తీసుకెళ్లివుంటాడు. యేసు అక్కడ లేకపోవడంతో వాళ్లు కిద్రోను లోయ దాటి గెత్సేమనే తోటకు బయల్దేరారు. వాళ్లు ఆయుధాలు, దీపాలు, దివిటీలు తీసుకుని యేసును వెదకడానికి బయల్దేరారు.

యేసు ఖచ్చితంగా ఒలీవల కొండ మీదే ఉంటాడని ఊహించి, యూదా వాళ్లందర్నీ తీసుకుని అక్కడికి వెళ్లాడు. ఎందుకంటే గత వారం యేసు, అపొస్తలులు బేతనియ నుండి యెరూషలేముకు, యెరూషలేము నుండి బేతనియకు ప్రయాణిస్తున్నప్పుడు తరచూ గెత్సేమనే తోటలో ఆగడం యూదాకు గుర్తుంది. అయితే అప్పటికే రాత్రి అయిపోయింది. పైగా యేసు ఆ తోటలో ఉన్న ఒలీవ చెట్ల నీడలో ఎక్కడో ఉండివుంటాడు. బహుశా యేసును ఎప్పుడూ చూడని సైనికులు ఆయన్ని ఎలా గుర్తుపడతారు? యూదా వాళ్లకు ఒక గుర్తు చెప్పాడు. అతను ఇలా అన్నాడు: “నేను ఎవర్ని ముద్దుపెట్టుకుంటానో, ఆయనే యేసు. మీరు ఆయన్ని బంధించి, భద్రంగా తీసుకెళ్లండి.”—మార్కు 14:44.

యూదా ఆ గుంపును తీసుకుని గెత్సేమనే తోటలోకి వెళ్లాడు. అక్కడ అతనికి యేసు, అపొస్తలులు కనిపించారు. యూదా నేరుగా యేసు దగ్గరికి వెళ్లి, “రబ్బీ, నమస్కారం!” అంటూ ఆయనకు చాలా ఆప్యాయంగా ముద్దుపెట్టాడు. కానీ యేసు అతనితో, “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అన్నాడు. (మత్తయి 26:49, 50) ఆ ప్రశ్నకు తానే జవాబిస్తూ యేసు ఇలా అన్నాడు: “యూదా, ఒక ముద్దుతో మానవ కుమారుడిని అప్పగిస్తున్నావా?” (లూకా 22:48) యేసు ఆ నమ్మకద్రోహితో అంతకుమించి ఇంకేమీ మాట్లాడలేదు!

యేసు ఆ దీపాల, దివిటీల వెలుగులోకి వచ్చి “మీరు ఎవరి కోసం వెదుకుతున్నారు?” అని ఆ గుంపును అడిగాడు. వాళ్లు, “నజరేయుడైన యేసు కోసం” అన్నారు. యేసు ధైర్యంగా, “నేనే ఆయన్ని” అని చెప్పాడు. (యోహాను 18:4, 5) ఆయన అలా అనగానే, వాళ్లు భయంతో నేలమీద పడుకున్నారు.

అది రాత్రివేళ కాబట్టి యేసు సులభంగా అక్కడినుండి తప్పించుకుని పారిపోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన, “మీరు ఎవరి కోసం వెదుకుతున్నారు?” అని మళ్లీ అడిగాడు. వాళ్లు మళ్లీ, “నజరేయుడైన యేసు కోసం” అని చెప్పారు. అప్పుడు ఆయన ప్రశాంతంగా ఇలా అన్నాడు: “నేనే ఆయన్ని అని మీతో చెప్పాను కదా. మీరు వెదుకుతున్నది నా కోసమే అయితే వీళ్లను వెళ్లనివ్వండి.” ఆ క్లిష్ట పరిస్థితిలో కూడా, ఆయన తనవాళ్లలో ఒక్కర్ని కూడా పోగొట్టుకోనని అంతకుముందు చెప్పిన మాట గుర్తుతెచ్చుకున్నాడు. (యోహాను 6:39; 17:12) ఒక్క ‘నాశనపుత్రుణ్ణి’ అంటే యూదాను తప్ప, యేసు తన అపొస్తలుల్లో ఎవ్వర్నీ పోగొట్టుకోలేదు. (యోహాను 18:7-9) తన నమ్మకమైన అనుచరుల్ని వెళ్లనివ్వమని ఆయన అడిగాడు.

సైనికులు లేచి నిలబడి యేసు దగ్గరికి రాబోతుండగా, అపొస్తలులు పరిస్థితిని అర్థం చేసుకుని “ప్రభువా, కత్తితో వాళ్లను నరకమంటావా?” అని అడిగారు. (లూకా 22:49) యేసు జవాబివ్వకముందే, పేతురు అపొస్తలుల దగ్గరున్న రెండు కత్తుల్లో ఒకదాన్ని తీసుకుని, ప్రధానయాజకుని దాసుడైన మల్కు కుడి చెవిని నరికాడు.

యేసు మల్కు చెవిని ముట్టుకుని బాగుచేశాడు. తర్వాత యేసు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తూ పేతురును ఇలా ఆజ్ఞాపించాడు: “నీ కత్తిని తిరిగి ఒరలో పెట్టు. కత్తి పట్టుకున్న వాళ్లందరూ కత్తితోనే నాశనమౌతారు.” తాను బంధించబడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ యేసు ఇలా అన్నాడు: “ఈ విధంగా జరగాలని చెప్తున్న లేఖనాలు ఎలా నెరవేరతాయి?” (మత్తయి 26:52, 54) ఆయన ఇంకా ఇలా అన్నాడు: “తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగవద్దా?” (యోహాను 18:11) తన విషయంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆఖరికి చనిపోవడానికి కూడా యేసు సిద్ధంగా ఉన్నాడు.

యేసు ఆ గుంపుతో ఇలా అన్నాడు: “మీరు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు కత్తులతో, కర్రలతో నన్ను పట్టుకోవడానికి వచ్చారా? నేను రోజూ ఆలయంలోనే కూర్చొని బోధిస్తున్నా మీరు నన్ను పట్టుకోలేదు. అయితే, ప్రవక్తలు రాసిన లేఖనాలు నెరవేరడానికే ఇదంతా జరిగింది.”—మత్తయి 26:55, 56.

అప్పుడు ఆ సైనికులు, సహస్రాధిపతి, యూదుల అధికారులు యేసును పట్టుకుని బంధించారు. అది చూసి అపొస్తలులు పారిపోయారు. కానీ “ఒక యువకుడు” మాత్రం యేసుకు ఏం జరుగుతుందో చూడడానికి ఆ గుంపు వెనకాలే వెళ్లాడు. ఆ యువకుడు బహుశా శిష్యుడైన మార్కు అయ్యుండవచ్చు. (మార్కు 14:51) అయితే వాళ్లు ఆ యువకుణ్ణి గుర్తుపట్టి, పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను తన నారవస్త్రాన్ని విడిచి పారిపోయాడు.