కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

109వ అధ్యాయం

యేసు తన వ్యతిరేకుల్ని నిందించాడు

యేసు తన వ్యతిరేకుల్ని నిందించాడు

మత్తయి 22:41–23:24 మార్కు 12:35-40 లూకా 20:41-47

  • క్రీస్తు ఎవరి కుమారుడు?

  • వ్యతిరేకుల వేషధారణను యేసు బయటపెట్టాడు

యేసు పేరు పాడు చేయాలని, ఆయన్ని చిక్కుల్లో పెట్టి రోమన్లకు అప్పగించాలని మతనాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. (లూకా 20:20) ఆ రోజు అంటే నీసాను 11 ఇంకా అయిపోలేదు, యేసు ఆలయంలోనే ఉన్నాడు. ఆయన మతనాయకుల్ని చిక్కుల్లో పెట్టడంతో పాటు తానెవరో కూడా స్పష్టం చేశాడు. యేసే చొరవ తీసుకుని వాళ్లను ఇలా అడిగాడు: “క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” (మత్తయి 22:42) క్రీస్తు లేదా మెస్సీయ దావీదు వంశం నుండి వస్తాడని అందరికీ తెలుసు. మతనాయకులు కూడా అదే చెప్పారు.—మత్తయి 9:27; 12:23; యోహాను 7:42.

అప్పుడు యేసు ఇలా అడిగాడు: “మరైతే పవిత్రశక్తి ప్రేరణతో ఈ మాటలు రాస్తున్నప్పుడు దావీదు ఆయన్ని ప్రభువు అని ఎందుకు అన్నాడు: ‘యెహోవా నా ప్రభువుతో ఇలా చెప్పాడు: “నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద ఉంచేవరకు నువ్వు నా కుడిపక్కన కూర్చో.”’ దావీదు క్రీస్తును ప్రభువు అని అంటున్నాడు కదా, అలాంటప్పుడు క్రీస్తు దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు?”—మత్తయి 22:43-45.

పరిసయ్యులు జవాబు చెప్పలేకపోయారు. ఎందుకంటే మెస్సీయ దావీదు వంశం నుండి వచ్చే ఒక మానవ పరిపాలకుడని, ఆయన రోమా పరిపాలన నుండి తమను విడిపిస్తాడేమోనని వాళ్లు ఎదురుచూస్తున్నారు. కానీ కీర్తన 110:1, 2 లో ఉన్న దావీదు మాటల్ని ఉపయోగించి, మెస్సీయ మానవ పరిపాలకుని కన్నా గొప్పవాడని యేసు చెప్పాడు. మెస్సీయ దావీదుకు ప్రభువు. అంతేకాదు మెస్సీయ దేవుని కుడిపక్కన కూర్చున్న తర్వాత రాజుగా పరిపాలిస్తాడు. యేసు ఇచ్చిన జవాబుతో వ్యతిరేకుల నోళ్లు మూతపడ్డాయి.

యేసు చెప్తున్నవాటిని శిష్యులు, చాలామంది ప్రజలు వింటున్నారు. పరిసయ్యుల, శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండమని యేసు హెచ్చరించాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడానికి “శాస్త్రులు, పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చున్నారు.” వినేవాళ్లకు యేసు ఈ సలహా ఇచ్చాడు: “వాళ్లు మీకు చెప్పేవన్నీ చేయండి, కానీ వాళ్లు చేసినట్టు చేయకండి. ఎందుకంటే వాళ్లు చెప్తారు కానీ చెప్పేవాటిని పాటించరు.”—మత్తయి 23:2, 3.

వాళ్ల వేషధారణను బయటపెడుతూ యేసు ఇలా చెప్పాడు: “వాళ్లు రక్షరేకుల్లా ధరించే లేఖనాల పెట్టెల్ని పెద్దవి చేసుకుంటారు.” కొంతమంది యూదులు, ధర్మశాస్త్రంలోని లేఖనాలు ఉన్న చిన్నపెట్టెల్ని నుదుటికి గానీ చేతికి గానీ కట్టుకునేవాళ్లు. కానీ పరిసయ్యులు మాత్రం, తమకు ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం అని చూపించుకోవడానికి లేఖనాల పెట్టెల్ని పెద్దవి చేసుకునేవాళ్లు. అంతేకాదు, వాళ్లు “తమ వస్త్రాల అంచుల్ని పొడుగ్గా చేస్తారు.” ఇశ్రాయేలీయులు తమ వస్త్రాల అంచులకు కుచ్చులు పెట్టుకోవాలి. అయితే పరిసయ్యులు తమ వస్త్రాలకు పొడవైన కుచ్చులు చేయించుకునేవాళ్లు. (సంఖ్యాకాండం 15:38-40) వాటన్నిటినీ ‘మనుషులకు కనిపించాలనే చేసేవాళ్లు.’—మత్తయి 23:5.

అయితే, గొప్పగా కనిపించాలనే కోరిక యేసు శిష్యుల్లో కూడా మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వాళ్లకు ఈ సలహా ఇచ్చాడు: “మీరు మాత్రం బోధకులు అని పిలిపించుకోకూడదు, ఎందుకంటే ఒక్కడే మీ బోధకుడు, మీరంతా సహోదరులు. అంతేకాదు భూమ్మీద ఎవర్నీ మీరు తండ్రీ అని పిలవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. అలాగే, మీరు నాయకులు అని కూడా పిలిపించుకోవద్దు. ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు. మీలో గొప్పవాడు మీకు సేవకుడిగా ఉండాలి. తనను తాను గొప్ప చేసుకునే వ్యక్తి తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకునే వ్యక్తి గొప్ప చేయబడతాడు.”—మత్తయి 23:8-12.

తర్వాత యేసు వేషధారులైన శాస్త్రులకు, పరిసయ్యులకు వ్యతిరేకంగా అనేక శ్రమల్ని ప్రకటించాడు: “వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! ఎందుకంటే మనుషులు ప్రవేశించకుండా మీరు పరలోక రాజ్యం తలుపులు మూసేస్తారు; మీరు లోపలికి వెళ్లరు, వెళ్లేవాళ్లను కూడా వెళ్లనివ్వరు.”—మత్తయి 23:13.

పరిసయ్యులు ఆధ్యాత్మిక విషయాలకు కాకుండా తమ సొంత ప్రమాణాలకు విలువ ఇస్తున్నందుకు యేసు వాళ్లను ఖండించాడు. ఉదాహరణకు వాళ్లు ఇలా చెప్పేవాళ్లు: “ఎవరైనా ఆలయం మీద ఒట్టు పెట్టుకుంటే ఫర్లేదు కానీ, ఆలయంలోని బంగారం మీద ఒట్టు పెట్టుకుంటే మాత్రం దాన్ని నిలబెట్టుకోవాలి.” పరిసయ్యుల కళ్లు ఎంతగా మూసుకుపోయాయో కదా! వాళ్లు యెహోవా ఆరాధన స్థలానికి కాకుండా దానిలోని బంగారానికే ఎక్కువ విలువ ఇచ్చారు. అంతేకాదు, “ధర్మశాస్త్రంలోని మరింత ప్రాముఖ్యమైన విషయాల్ని అంటే న్యాయాన్ని, కరుణను, నమ్మకత్వాన్ని” నిర్లక్ష్యం చేశారు.—మత్తయి 23:16, 23; లూకా 11:42.

యేసు ఆ పరిసయ్యుల్ని ఇలా పిలిచాడు: “గుడ్డి మార్గదర్శకులారా! మీరు దోమను వడగడతారు, కానీ ఒంటెను మింగేస్తారు.” (మత్తయి 23:24) ధర్మశాస్త్రం ప్రకారం దోమ, ఒంటె రెండూ అపవిత్రమైనవే. పరిసయ్యులు చిన్నచిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ద్రాక్షారసంలో దోమను వడగడుతున్నారు. కానీ ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన విషయాల్ని నిర్లక్ష్యం చేస్తూ, దోమ కంటే చాలా పెద్దదైన ఒంటెను మింగేస్తున్నారు.—లేవీయకాండం 11:4, 21-24.