కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

15వ అధ్యాయం

యేసు చేసిన మొదటి అద్భుతం

యేసు చేసిన మొదటి అద్భుతం

యోహాను 2:1-12

  • కానాలో పెళ్లి

  • యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు

నతనయేలు యేసుకు శిష్యుడై ఇప్పటికి మూడు రోజులైంది. యేసు, ఆయన మొదటి శిష్యులు కలిసి ఉత్తరం వైపుగా తమ సొంత ప్రాంతమైన గలిలయ జిల్లాకు బయల్దేరారు. వాళ్లు గలిలయలోని నతనయేలు సొంతూరు అయిన కానాకు వెళ్తున్నారు. అది, యేసు పెరిగిన నజరేతుకు ఉత్తరాన ఉన్న కొండల్లో ఉంది. వాళ్లను కానాలో ఒక పెళ్లి విందుకు ఆహ్వానించారు.

యేసువాళ్ల అమ్మ మరియ కూడా ఆ పెళ్లికి వచ్చింది. పెళ్లి చేసుకుంటున్నవాళ్ల కుటుంబానికి ఆమె స్నేహితురాలు. బహుశా విందుకు వచ్చిన చాలామంది అతిథులకు ఏం కావాలో ఆమె చూసుకుంటుండవచ్చు. కాబట్టి ఆమె ద్రాక్షారసం అయిపోతుందని వెంటనే గమనించి, “వాళ్ల దగ్గర ద్రాక్షారసం లేదు” అని యేసుకు చెప్పింది.—యోహాను 2:3.

మరో మాటలో చెప్పాలంటే, ద్రాక్షారసం అయిపోతుంది కాబట్టి ఏదోకటి చేయమని మరియ యేసుతో అంది. అయితే యేసు ఆమెతో, “అమ్మా, దానికి మనమేం చేస్తాం?” అన్నాడు. (యోహాను 2:4) దేవుడు నియమించిన రాజుగా యేసు ఏం చేయాలో చెప్పాల్సింది పరలోక తండ్రే కానీ కుటుంబ సభ్యులో, స్నేహితులో కాదు. అప్పుడు మరియ తెలివిగా ఆ విషయాన్ని తన కుమారుడికే వదిలేస్తూ అక్కడి పనివాళ్లతో, “ఆయన మీకు ఏంచెప్తే అది చేయండి” అంది.—యోహాను 2:5.

అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. ఒక్కో బానలో 40 లీటర్ల కన్నా ఎక్కువ నీళ్లు పడతాయి. యేసు పనివాళ్లతో, “ఆ బానల్ని నీళ్లతో నింపండి” అన్నాడు. తర్వాత ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు వాటిలో కొంచెం విందు నిర్వాహకుడి దగ్గరికి తీసుకెళ్లండి.”—యోహాను 2:7, 8.

విందు నిర్వాహకుడు ఆ మంచి ద్రాక్షారసం చూసి ముగ్ధుడయ్యాడు. కానీ అది అద్భుతరీతిలో తయారైందని అతనికి తెలీదు. అతను పెళ్లికుమారుణ్ణి పిలిచి, “అందరూ మొదట మంచి ద్రాక్షారసం పోసి, ప్రజలు మత్తులో ఉన్నప్పుడు తక్కువ రకం ద్రాక్షారసం పోస్తారు. నువ్వు మాత్రం ఇప్పుడు మంచి ద్రాక్షారసాన్ని ఇస్తున్నావు” అన్నాడు.—యోహాను 2:10.

ఇది యేసు చేసిన మొదటి అద్భుతం. ఈ అద్భుతం చూసినప్పుడు, కొత్తగా శిష్యులైనవాళ్లకు ఆయన మీదున్న విశ్వాసం బలపడింది. ఆ తర్వాత యేసు, వాళ్ల అమ్మ, తమ్ముళ్లు గలిలయ సముద్రానికి వాయవ్య తీరాన ఉన్న కపెర్నహూము నగరానికి బయల్దేరారు.