కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్గం, సత్యం, జీవం

మార్గం, సత్యం, జీవం

ఏదైనా మంచివార్త తెలిసినప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది కదా. అయితే మీ కోసం, మీకు ఇష్టమైనవాళ్ల కోసం చాలా మంచివార్త ఉంది.

ఆ మంచివార్త బైబిల్లో ఉంది. విశ్వాన్ని సృష్టించిన యెహోవా దేవుడు చాలా సంవత్సరాల క్రితం బైబిల్ని రాయించాడు. బైబిల్లోని నాలుగు పుస్తకాల్ని, అందులో ఉన్న మంచివార్తను ఈ ప్రచురణలో పరిశీలిస్తాం. ఆ పుస్తకాల్ని రాయడానికి మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే నలుగుర్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆ పుస్తకాలకు వాళ్ల పేర్లే పెట్టబడ్డాయి.

చాలామంది ఆ నాలుగు పుస్తకాల్ని సువార్తలు అని పిలుస్తారు. అవన్నీ యేసు గురించిన సువార్తను లేదా మంచివార్తను తెలియజేస్తాయి. ఆ మంచివార్త ఏంటంటే, రక్షణ కోసం దేవుడు ఏర్పాటు చేసిన మార్గం యేసే; పరలోక రాజ్యానికి రాజుగా యేసు తనమీద విశ్వాసం ఉంచే వాళ్లందరికీ శాశ్వత ఆశీర్వాదాలు తీసుకొస్తాడు.—మార్కు 10:17, 30; 13:13.

నాలుగు సువార్తలు ఎందుకు?

యేసు జీవితం గురించి, బోధల గురించి చెప్పడానికి దేవుడు నాలుగు పుస్తకాల్ని ఎందుకు రాయించాడు?

యేసు చెప్పినవాటి గురించి, చేసినవాటి గురించి వివరించే వేర్వేరు పుస్తకాలు ఉండడం మంచిదే. ఈ ఉదాహరణ పరిశీలించండి: ఒక ప్రముఖ బోధకుని దగ్గర నలుగురు నిలబడి ఉన్నారు. ఆ బోధకుని ముందు ఉన్న వ్యక్తి, పన్ను వసూలుచేసే కార్యాలయంలో పనిచేస్తాడు. కుడివైపు ఉన్న అతను వైద్యుడు. ఎడమవైపు ఉన్న అతను జాలరి, అతను బోధకునికి చాలా దగ్గరి స్నేహితుడు. వెనక ఉన్న అతను మిగతావాళ్ల కన్నా చిన్నవాడు, అతను అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఆ నలుగురూ నిజాయితీగల వాళ్లు. వాళ్ల ఇష్టాలు, ఆలోచనాతీరులు వేరు. ఆ బోధకుడు చెప్పినవాటి గురించి, చేసినవాటి గురించి పుస్తకం రాయమంటే, ఆ నలుగురూ బహుశా వేర్వేరు వివరాల్ని లేదా సంఘటనల్ని రాస్తారు. ఆ నలుగురి అభిప్రాయాల్ని, ఉద్దేశాల్ని మనసులో ఉంచుకొని ఆ పుస్తకాలు పరిశీలించినప్పుడు, బోధకుడు చెప్పిన, చేసిన వాటిగురించి పూర్తి అవగాహనకు రాగలుగుతాం. ఈ ఉదాహరణను బట్టి, గొప్ప బోధకుడైన యేసు జీవితం గురించి నాలుగు వేర్వేరు పుస్తకాలు ఉండడం ఎందుకు మంచిదో అర్థమౌతుంది.

ఆ ఉదాహరణలోని పన్ను వసూలుచేసే వ్యక్తి ముఖ్యంగా యూదులకు నచ్చేలా రాయాలనుకుంటాడు. కాబట్టి అతను బోధకుడు చెప్పినవాటిని, ఇతర సంఘటనల్ని యూదుల్ని మనసులో ఉంచుకొని రాస్తాడు. వైద్యుడు ముఖ్యంగా రోగుల్ని, వికలాంగుల్ని బోధకుడు ఎలా బాగుచేశాడో రాయాలనుకుంటాడు. కాబట్టి అతను పన్ను వసూలుచేసే వ్యక్తి రాసిన కొన్ని వివరాల్ని వదిలేయవచ్చు లేదా వేరే క్రమంలో రాయవచ్చు. బోధకుని దగ్గరి స్నేహితుడు ముఖ్యంగా బోధకుని భావాల గురించి, లక్షణాల గురించి రాస్తాడు. చిన్నవాడు, విషయాల్ని మిగతావాళ్ల కన్నా క్లుప్తంగా రాస్తాడు. అయినప్పటికీ, ఆ నలుగురు రాసిన వివరాలు ఖచ్చితమైనవే. అదేవిధంగా, యేసు జీవితం గురించి వివరించే నాలుగు పుస్తకాల వల్ల ఆయన పనులు, బోధలు, వ్యక్తిత్వం గురించి ఎక్కువగా తెలుసుకుంటాం.

ప్రజలు సాధారణంగా ఆ పుస్తకాల్ని ‘మత్తయి సువార్త,’ ‘యోహాను సువార్త’ అంటుంటారు. అది తప్పేమీ కాదు, ఎందుకంటే “యేసుక్రీస్తు గురించిన మంచివార్త” ఆ నాలుగు పుస్తకాల్లోనూ ఉంది. (మార్కు 1:1) అయితే, అవన్నీ కలిపి యేసు గురించిన ఒకే సువార్తను లేదా మంచివార్తను చెప్తున్నాయి.

దేవుని వాక్యాన్ని పరిశోధించిన చాలామంది మత్తయి, మార్కు, లూకా, యోహాను పుస్తకాల్లో ఉన్న సంఘటనల్ని, వాస్తవాల్ని పోల్చి, వాటిని ఒక వరుసలో పొందుపర్చారు. దాదాపు సా.శ. 170 లో టాషెన్‌ అనే సిరియా రచయిత అలాంటి ప్రయత్నమే చేశాడు. అతను ఆ నాలుగు పుస్తకాలు ఖచ్చితమైనవని, దేవుడు ప్రేరేపించినవని గుర్తించాడు. యేసు జీవితం, పరిచర్య గురించి వాటిలో ఉన్న వివరాల్ని అతను థియాటెస్సరోన్‌ అనే పుస్తకంలో ఒక వరుసలో పొందుపర్చాడు.

యేసే మార్గం, సత్యం, జీవం అనే ఈ పుస్తకాన్ని కూడా అలాగే పొందుపర్చారు. దీనిలో ఇంకా ఖచ్చితమైన, పూర్తి వివరాలు ఉన్నాయి. ఎందుకంటే, యేసు చెప్పిన చాలా ప్రవచనాల నెరవేర్పును, ఉదాహరణల్ని ఇప్పుడు మెరుగ్గా అర్థం చేసుకున్నాం. దానివల్ల ఆయన చెప్పినవాటిని, చేసినవాటిని, సంఘటనల క్రమాన్ని బాగా అర్థం చేసుకున్నాం. అంతేకాదు, పురావస్తు శాఖ చేసిన పరిశోధనల వల్ల కొన్ని విషయాల్ని, రచయితల అభిప్రాయాల్ని ఇంకా బాగా అర్థం చేసుకున్నాం. నిజమే, సంఘటనలు ఏ క్రమంలో జరిగాయో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే, యేసే మార్గం, సత్యం, జీవం అనే ఈ పుస్తకంలోని సంఘటనల క్రమం సమంజసంగా ఉంటుంది, వివరాలు సాధ్యమైనంత ఖచ్చితంగా ఉంటాయి.

మార్గం, సత్యం, జీవం

మీరు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, మీ కోసం, మీకు ఇష్టమైనవాళ్ల కోసం ఇందులో ఉన్న ముఖ్యమైన సందేశాన్ని మనసులో ఉంచుకోండి. యేసుక్రీస్తు స్వయంగా ఇలా అన్నాడు: “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.”—యోహాను 14:6.

యేసే మార్గం, సత్యం, జీవం అనే ఈ పుస్తకం, యేసే “మార్గం” అని గుర్తించడానికి సహాయం చేస్తుంది. మనం ప్రార్థనలో యెహోవా దేవుణ్ణి సమీపించాలన్నా, ఆయనతో శాంతియుత సంబంధం కలిగివుండాలన్నా యేసే మార్గం. (యోహాను 16:23; రోమీయులు 5:8) అవును, యేసు ద్వారా మాత్రమే మనం దేవునితో మంచి సంబంధం కలిగి ఉండగలం.

యేసే “సత్యం.” ఆయన సత్యమే మాట్లాడాడు, సత్యం ప్రకారమే జీవించాడు. ఆయన ఎన్నో ప్రవచనాలు నెరవేర్చాడు, అవన్నీ “యేసుక్రీస్తు ద్వారా ‘అవును’ అన్నట్టుగానే ఉన్నాయి.” (2 కొరింథీయులు 1:20; యోహాను 1:14) ఆ ప్రవచనాలు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో యేసు పాత్ర ఎంత ముఖ్యమైనదో చూపిస్తాయి.—ప్రకటన 19:10.

యేసుక్రీస్తే “జీవం.” ఆయన విమోచన క్రయధనంగా తన పరిపూర్ణ జీవాన్ని, రక్తాన్ని అర్పించాడు. దానివల్లే మనకు “వాస్తవమైన జీవితం” అంటే “శాశ్వత జీవితం” సాధ్యమైంది. (1 తిమోతి 6:12, 19; ఎఫెసీయులు 1:7; 1 యోహాను 1:7) అంతేకాదు, పరదైసులో నిరంతరం జీవించేలా లక్షలమందిని ఆయన తిరిగి బ్రతికిస్తాడు, అలా వాళ్లకు కూడా ఆయన ‘జీవంగా’ ఉంటాడు.—యోహాను 5:28, 29.

దేవుని సంకల్పంలో యేసు పాత్ర ఎంత ముఖ్యమైనదో మనందరం అర్థం చేసుకోవాలి. “మార్గం, సత్యం, జీవం” అయిన యేసు గురించి ఎక్కువగా తెలుసుకోవడంలో మీరు ఆనందిస్తారని నమ్ముతున్నాం.