కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

68వ అధ్యాయం

దేవుని కుమారుడు “లోకానికి వెలుగు”

దేవుని కుమారుడు “లోకానికి వెలుగు”

యోహాను 8:12-36

  • కుమారుడు ఎవరో యేసు వివరించాడు

  • యూదులు ఎలా దాసులుగా ఉన్నారు?

గుడారాల పండుగ చివరి రోజైన ఏడవ రోజు, ఆలయంలో “కానుకలు వేసే చోట” యేసు బోధిస్తున్నాడు. (యోహాను 8:20; లూకా 21:1) బహుశా అది స్త్రీల ఆవరణ అయ్యుంటుంది, అక్కడ ప్రజలు కానుకలు వేస్తారు.

పండుగ సమయంలో, ఆలయంలోని ఆ స్థలం రాత్రివేళ దీపాల వెలుగుతో ధగధగలాడుతూ ఉంటుంది. అక్కడ నాలుగు పెద్ద దీపస్తంభాలు ఉండేవి, ప్రతీ దీపస్తంభానికి నూనెతో నిండిన నాలుగు పెద్ద గిన్నెలు ఉండేవి. ఈ దీపాల కాంతి చాలా దూరం వరకు వ్యాపిస్తూ పరిసరాల్లో వెలుగు నింపేవి. దాన్ని గుర్తుచేస్తూ యేసు ప్రజలతో ఇలా అన్నాడు: “నేను లోకానికి వెలుగును. నన్ను అనుసరించేవాళ్లు చీకట్లో నడవనే నడవరు, కానీ జీవాన్నిచ్చే వెలుగు వాళ్ల దగ్గర ఉంటుంది.”—యోహాను 8:12.

పరిసయ్యులు యేసు మాటకు అడ్డుచెప్తూ, “నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం చెల్లదు” అన్నారు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకున్నా, నా సాక్ష్యం చెల్లుతుంది. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. మీకు మాత్రం నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “‘ఇద్దరు మనుషుల సాక్ష్యం చెల్లుతుంది’ అని మీ ధర్మశాస్త్రంలో కూడా రాయబడివుంది కదా. నా గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యమిస్తున్నాడు.”—యోహాను 8:13-18.

పరిసయ్యులు దానికి ఒప్పుకోకుండా, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. యేసు, “మీకు నేను తెలీదు, నా తండ్రి తెలీదు. మీకు నేనెవరో తెలిసి ఉంటే, నా తండ్రి ఎవరో కూడా తెలిసుండేది” అని సూటిగా జవాబిచ్చాడు. (యోహాను 8:19) పరిసయ్యులు ఇంకా ఆయన్ని బంధించాలని చూస్తున్నారు, కానీ ఒక్కరు కూడా ఆయన మీద చెయ్యి వేయలేకపోయారు.

యేసు ఇంతకుముందు చెప్పిన మాటనే మళ్లీ చెప్పాడు: “నేను వెళ్లిపోతున్నాను, మీరు నాకోసం వెదుకుతారు; అయినా మీరు మీ పాపంలోనే చనిపోతారు. నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.” అప్పుడు యూదులు యేసు మాటల్ని తప్పుగా అర్థంచేసుకుని, “‘నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటాడా ఏంటి?” అని చెప్పుకున్నారు. యేసు ఎక్కడి నుండి వచ్చాడో వాళ్లకు తెలీదు కాబట్టి వాళ్లు ఆయన మాటల్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఇలా వివరించాడు: “మీరు కింద నుండి వచ్చారు, నేను పై నుండి వచ్చాను. మీరు ఈ లోకం వాళ్లు, నేను ఈ లోకం వాణ్ణి కాదు.”—యోహాను 8:21-23.

యేసు తాను భూమ్మీదికి రాకముందు పరలోకంలో ఉన్నానని, మతనాయకులు ఎదురుచూస్తున్న మెస్సీయ లేదా క్రీస్తు తానేనని చెప్తున్నాడు. అయినా వాళ్లు యేసును చిన్నచూపు చూస్తూ, “నువ్వు ఎవరు?” అన్నారు.—యోహాను 8:25.

వాళ్లు తనను తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తున్నప్పుడు యేసు ఇలా అన్నాడు: “అసలు నేను ఇప్పటిదాకా మీతో ఎందుకు మాట్లాడుతున్నాను?” అయినా, యేసు తన పరలోక తండ్రి గురించి చెప్తూ, కుమారుడి మాటను యూదులు ఎందుకు వినాలో వివరించాడు: “నన్ను పంపించిన వ్యక్తి సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలే లోకంలో మాట్లాడుతున్నాను.”—యోహాను 8:25, 26.

తర్వాత యేసు తన తండ్రి మీద తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు: “మీరు మానవ కుమారుణ్ణి కొయ్యకు వేలాడదీసిన తర్వాత నేనే ఆయన్ని అని, నా అంతట నేనే ఏమీ చేయనని మీరు తెలుసుకుంటారు. తండ్రి నాకు నేర్పించిన వాటినే నేను మాట్లాడుతున్నాను. నన్ను పంపించిన వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను, కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.” కానీ యూదులకు మాత్రం అలాంటి నమ్మకం లేదు.—యోహాను 8:28, 29.

అయితే కొంతమంది యూదులు యేసు మీద విశ్వాసం ఉంచారు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు. అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది.”—యోహాను 8:31, 32.

స్వతంత్రులు అవ్వడం అనే మాట కొంతమందికి వింతగా అనిపించి ఉంటుంది. వాళ్లు ఇలా అభ్యంతరం చెప్పారు: “మేము అబ్రాహాము పిల్లలం, మేము ఎప్పుడూ ఎవ్వరికీ దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు నువ్వు, ‘మీరు స్వతంత్రులౌతారు’ అని ఎలా అంటున్నావు?” యూదులు కొన్నిసార్లు వేరే దేశాల పరిపాలన కింద ఉన్నారని వాళ్లకు తెలుసు. అయినా వాళ్లు దాసులు అని పిలిపించుకోవడానికి ఇష్టపడట్లేదు. అయితే వాళ్లు ఇంకా దాసులే అని చెప్తూ యేసు ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, పాపం చేసే ప్రతీ వ్యక్తి పాపానికి దాసుడు.”—యోహాను 8:33, 34.

తాము పాపానికి దాసులమని యూదులు గ్రహించలేదు. వాళ్లకు ఏమౌతుందో యేసు ఇలా చెప్పాడు: “దాసుడు తన యజమాని ఇంట్లో శాశ్వతంగా ఉండిపోడు; కుమారుడు మాత్రం ఉంటాడు.” (యోహాను 8:35) దాసునికి వారసత్వ హక్కులు ఉండవు, యజమాని అతన్ని ఎప్పుడైనా పంపించేయవచ్చు. సొంత కుమారుడు లేదా దత్తత తీసుకున్న కుమారుడు మాత్రమే “శాశ్వతంగా” ఉంటాడు, అంటే జీవించినంత కాలం ఇంట్లో ఉంటాడు.

కుమారుని గురించిన సత్యమే, ప్రజల్ని పాపం వల్ల వచ్చిన మరణం నుండి శాశ్వతంగా విడుదల చేస్తుంది. అందుకే యేసు ఇలా అన్నాడు: “కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులౌతారు.”—యోహాను 8:36.