కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

77వ అధ్యాయం

సిరిసంపదల గురించి సలహా ఇచ్చాడు

సిరిసంపదల గురించి సలహా ఇచ్చాడు

లూకా 12:1-34

  • యేసు ధనవంతుని ఉదాహరణ చెప్పాడు

  • కాకులు, లిల్లీ పూల గురించి చెప్పాడు

  • “చిన్నమంద” రాజ్యంలో ఉంటుంది

యేసు పరిసయ్యుని ఇంట్లో భోజనం చేస్తుండగా, బయట ఆయన కోసం వేలమంది ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు గలిలయలో కూడా ఆయన కోసం ప్రజలు గుంపులుగుంపులుగా వచ్చారు. (మార్కు 1:33; 2:2; 3:9) ఇప్పుడు యూదయలో చాలామంది ఆయన్ని చూడాలని, ఆయన చెప్పేది వినాలని ఇష్టపడుతున్నారు. వీళ్లకు, యేసుతో కలిసి భోజనం చేస్తున్న ఆ పరిసయ్యులకు ఎంత తేడా ఉందో కదా!

శిష్యులు జాగ్రత్తగా ఉండాల్సిన ఒక విషయం గురించి చెప్తూ యేసు ఇలా అన్నాడు: “పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో, అంటే వాళ్ల మోసం విషయంలో అప్రమత్తంగా ఉండండి.” ఆయన ఇదివరకు కూడా అలా హెచ్చరించాడు. అయితే ఇప్పుడు భోజన సమయంలో తాను చూసినదాన్ని బట్టి, ఆ హెచ్చరికను తన శిష్యులు పాటించడం అత్యవసరమని యేసు గుర్తించాడు. (లూకా 12:1; మార్కు 8:15) పరిసయ్యులు దైవభక్తి ఉన్నట్లు నటిస్తూ తమ దుష్టత్వాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ల నిజ స్వరూపం ఏంటో ప్రజలకు తెలియాలి. యేసు ఇలా అన్నాడు: “జాగ్రత్తగా దాచివుంచిన ప్రతీది బయటికి వస్తుంది; రహస్యంగా ఉన్న ప్రతీది తెలిసిపోతుంది.”—లూకా 12:2.

యేసు చుట్టూ చేరిన ప్రజల్లో చాలామంది యూదయవాళ్లే. ఆయన గలిలయలో బోధించినవాటిని వాళ్లు విని ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన అంతకుముందు చెప్పిన ముఖ్యమైన విషయాల్ని మళ్లీ చెప్పాడు. అక్కడున్న వాళ్లందరికీ ఆయన ఇలా చెప్పాడు: “శరీరాన్ని చంపి ఆ తర్వాత ఏమీ చేయలేనివాళ్లకు భయపడకండి.” (లూకా 12:4) తర్వాత, దేవుడు తమ అవసరాల్ని తీరుస్తాడనే నమ్మకంతో ఉండాలని యేసు తన అనుచరులకు మళ్లీ గుర్తుచేశాడు. అంతేకాదు వాళ్లు మానవ కుమారుణ్ణి గుర్తించాలి, దేవుడు తమకు సహాయం చేయగలడని నమ్మాలి.—మత్తయి 10:19, 20, 26-33; 12:31, 32.

అప్పుడు ఆ గుంపులో ఒకతను, తాను చింతిస్తున్న ఒక విషయం గురించి యేసును అడిగాడు: “బోధకుడా, మా నాన్న ఆస్తిలో నాకు వాటా ఇవ్వమని నా సహోదరునికి చెప్పు.” (లూకా 12:13) పెద్ద కుమారునికి ఆస్తిలో రెండు వాటాలు వస్తాయని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి, అసలు గొడవపడడానికి కారణమే లేదు. (ద్వితీయోపదేశకాండం 21:17) కానీ, అతను న్యాయంగా తనకు రావాల్సిన దానికన్నా ఎక్కువ అడుగుతుండవచ్చు. అందుకే యేసు తెలివిగా ఎవరి తరఫునా మాట్లాడకుండా, “మీ మీద న్యాయమూర్తిగా గానీ మీకు మధ్యవర్తిగా గానీ నన్ను ఎవరు నియమించారు?” అన్నాడు.—లూకా 12:14.

తర్వాత యేసు అందరికీ ఈ సలహా ఇచ్చాడు: “ఏ రకమైన అత్యాశకూ చోటివ్వకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే, ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.” (లూకా 12:15) ఒక వ్యక్తికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా అతను ఏదోక రోజు చనిపోతాడు, వాటిని తనతోపాటు తీసుకెళ్లలేడు. యేసు ఆ విషయాన్ని నొక్కి చెప్పడానికి, గుర్తుండిపోయే ఒక ఉదాహరణ చెప్పాడు. దేవుని దగ్గర మంచిపేరు సంపాదించుకోవడం చాలా ముఖ్యమని కూడా ఆ ఉదాహరణ తెలియజేస్తుంది.

యేసు ఇలా చెప్పాడు: “ఒక ధనవంతుడి పొలం బాగా పండింది. కాబట్టి అతను ఇలా ఆలోచించుకున్నాడు: ‘నా ధాన్యాన్ని నిల్వచేయడానికి ఎక్కడా చోటు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి?’ తర్వాత అతను ఇలా అనుకున్నాడు: ‘నేను నా గోదాముల్ని పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను, వాటిలో నా ధాన్యం అంతటినీ నా వస్తువులన్నిటినీ నిల్వచేస్తాను. తర్వాత నా ప్రాణంతో నేను ఇలా అంటాను: “నా ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే మంచి వస్తువులు నీకు ఉన్నాయి. కాబట్టి హాయిగా ఉండు, తిను, తాగు, సంతోషించు.”’ అయితే దేవుడు అతనితో ఇలా అన్నాడు: ‘తెలివితక్కువవాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసేయబడుతుంది. నువ్వు నిల్వచేసుకున్న వాటిని ఎవరు అనుభవిస్తారు?’ దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండడానికి కృషి చేయకుండా, తన కోసమే సంపదలు కూడబెట్టుకునే వాళ్ల పరిస్థితి అలా ఉంటుంది.”—లూకా 12:16-21.

యేసు శిష్యులు, అక్కడున్న ప్రజలు సిరిసంపదల మోజులో పడే ప్రమాదం ఉంది. లేదా జీవన చింతల వల్ల వాళ్ల దృష్టి యెహోవా సేవ నుండి పక్కకు మళ్లే అవకాశం ఉంది. కాబట్టి, ఒకటిన్నర సంవత్సరాల క్రితం తాను కొండమీది ప్రసంగంలో ఇచ్చిన సలహాల్నే యేసు మళ్లీ ఇచ్చాడు:

‘ఏం తినాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏం వేసుకోవాలా అని మీ శరీరం గురించి గానీ ఆందోళన పడడం మానేయండి. కాకుల్ని గమనించండి: అవి విత్తవు, కోయవు; వాటికి గోదాములు ఉండవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కన్నా ఎంతో విలువైనవాళ్లు కారా? లిల్లీ పూలు ఎలా ఎదుగుతాయో గమనించండి. అవి కష్టపడవు, వడకవు; కానీ తన పూర్తి వైభవంతో ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. కాబట్టి ఏం తినాలి? ఏం తాగాలి? అని ఆందోళన పడడం మానేయండి. అతిగా చింతించడం ఆపండి. ఇవి మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు. రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వాటిని మీకు ఇస్తాడు.’—లూకా 12:22-31; మత్తయి 6:25-33.

దేవుని రాజ్యానికి ఎవరు మొదటిస్థానం ఇస్తూ ఉంటారు? చాలా కొద్దిమంది, అంటే దేవునికి నమ్మకంగా ఉన్న ఒక “చిన్నమంద” అలా చేస్తుందని యేసు చెప్పాడు. వాళ్ల సంఖ్య కేవలం 1,44,000 మంది అని ఆ తర్వాత తెలియజేయబడింది. మరి దేవుడు వాళ్లకు ఏ బహుమతి ఇస్తాడు? యేసు ఇలా హామీ ఇచ్చాడు: “మీకు రాజ్యాన్ని ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం.” వాళ్లు ఈ భూమ్మీద ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం మీద మనసుపెట్టరు, దొంగలు వాటిని దోచుకునే అవకాశం ఉంది. వాళ్లు, ‘పరలోకంలో ఎప్పటికీ ఉండే సంపదను కూడబెట్టుకోవడం’ మీద మనసుపెడతారు. అక్కడ వాళ్లు క్రీస్తుతోపాటు పరిపాలిస్తారు.—లూకా 12:32-34.