కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

71వ అధ్యాయం

పరిసయ్యులు చూపువచ్చిన వ్యక్తిని ప్రశ్నించారు

పరిసయ్యులు చూపువచ్చిన వ్యక్తిని ప్రశ్నించారు

యోహాను 9:19-41

  • పరిసయ్యులు చూపువచ్చిన భిక్షగాడిని ప్రశ్నించారు

  • మతనాయకులే “గుడ్డివాళ్లు”

పుట్టు గుడ్డివాడైన వ్యక్తికి యేసు చూపు తెప్పించాడంటే పరిసయ్యులు నమ్మలేకపోయారు. అందుకే వాళ్లు అతని తల్లిదండ్రుల్ని పిలిపించారు. పరిసయ్యులు తమను ‘సమాజమందిరం నుండి వెలివేస్తారేమో’ అని ఆ తల్లిదండ్రులు భయపడ్డారు. (యోహాను 9:22) యూదులతో కలవకుండా అలా వెలివేస్తే ఆ కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

పరిసయ్యులు అతని తల్లిదండ్రుల్ని ఈ మూడు ప్రశ్నలు అడిగారు: “ఇతను మీ అబ్బాయేనా? ఇతను పుట్టుకతోనే గుడ్డివాడా? మరి ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు?” వాళ్లు ఇలా జవాబిచ్చారు: “ఇతను మా అబ్బాయే, ఇతను పుట్టుకతోనే గుడ్డివాడు. అయితే ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడో మాకు తెలీదు, ఇతనికి ఎవరు చూపు తెప్పించారో కూడా తెలీదు.” జరిగినదాన్ని అతను తన తల్లిదండ్రులకు చెప్పేవుంటాడు. అయినా అతని తల్లిదండ్రులు, “ఇతన్నే అడగండి. ఇతను పెద్దవాడయ్యాడు, ఇతనే సమాధానం చెప్పుకుంటాడు” అని ఆచితూచి జవాబిచ్చారు.—యోహాను 9:19-21.

దాంతో, పరిసయ్యులు అతన్ని మళ్లీ పిలిపించి, యేసుకు వ్యతిరేకంగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ బెదిరించారు. “దేవుణ్ణి మహిమపర్చు; ఆ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు. అతను వాళ్ల ఆరోపణను తిప్పికొడుతూ, “ఆయన పాపాత్ముడో కాదో నాకు తెలీదు. కానీ ఒక విషయం తెలుసు. ఒకప్పుడు నేను గుడ్డివాణ్ణి, ఇప్పుడు చూడగలుగుతున్నాను” అన్నాడు.—యోహాను 9:24, 25.

పరిసయ్యులు ఆ విషయాన్ని అంతటితో వదిలేయకుండా, “ఆయన నీకు ఏంచేశాడు? ఎలా చూపు తెప్పించాడు?” అని మళ్లీ అడిగారు. అతను కొంచెం ధైర్యంగా, “నేను ఇంతకుముందే చెప్పాను, అయినా మీరు వినలేదు. మీరు మళ్లీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా ఏంటి?” అన్నాడు. అప్పుడు పరిసయ్యులు కోపంతో, “నువ్వు ఆయన శిష్యుడివి. మేము మోషే శిష్యులం. దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. అయితే ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో మాకు తెలీదు” అన్నారు.—యోహాను 9:26-29.

వాళ్ల మాటలకు ఆశ్చర్యపోయి ఆ భిక్షగాడు ఇలా అన్నాడు: “ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన్ని ఎవరు పంపించారో మీకు తెలీదు, అయినా ఆయన నాకు చూపు తెప్పించాడు.” దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో, ఎవర్ని ఆమోదిస్తాడో తెలియజేస్తూ అతను ఇలా తర్కించాడు: “దేవుడు పాపుల ప్రార్థన వినడని మనకు తెలుసు. ఎవరైనా దేవునికి భయపడుతూ ఆయన ఇష్టాన్ని చేస్తే, అతని ప్రార్థన దేవుడు వింటాడు. పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి ఎవరైనా చూపు తెప్పించినట్టు ప్రాచీనకాలం నుండి ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు.” చివరిగా అతను ఇలా అన్నాడు: “ఆయన దేవుని దగ్గర నుండి రాకపోయుంటే ఏమీ చేయలేడు.”—యోహాను 9:30-33.

పరిసయ్యులు ఆ భిక్షగాడి తర్కాన్ని తిప్పికొట్టలేక, “నువ్వు పుట్టుకతోనే పాపివి, నువ్వు మాకు బోధిస్తున్నావా?” అని తిట్టి అతన్ని గెంటేశారు.—యోహాను 9:34.

జరిగినదంతా యేసుకు తెలిసింది. ఆయనకు ఆ భిక్షగాడు కనిపించినప్పుడు, “నువ్వు మానవ కుమారుడి మీద విశ్వాసం ఉంచుతున్నావా?” అని అడిగాడు. అప్పుడతను, “అయ్యా, నేను ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరో నాకు చెప్పు” అన్నాడు. దానికి యేసు, “నువ్వు ఆయన్ని చూశావు, నిజానికి నీతో మాట్లాడుతున్నది ఆయనే” అన్నాడు.—యోహాను 9:35-37.

అప్పుడతను, “ప్రభువా, నేను ఆయనమీద విశ్వాసం ఉంచుతున్నాను” అన్నాడు. అతను యేసు మీద విశ్వాసం, గౌరవం చూపిస్తూ ఆయనకు వంగి నమస్కారం చేశాడు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఈ తీర్పు కోసమే, అంటే చూడలేనివాళ్లు చూడగలిగేలా, చూడగలిగేవాళ్లు గుడ్డివాళ్లయ్యేలా నేను ఈ లోకంలోకి వచ్చాను.”—యోహాను 9:38, 39.

పరిసయ్యులు నిజంగా గుడ్డివాళ్లు కాదు, ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అయితే వాళ్లు ప్రజల్ని సరైన దారిలో నడిపించట్లేదు కాబట్టి, వాళ్లను ఉద్దేశించే యేసు ఆ మాట అన్నాడని పరిసయ్యులకు అనిపించింది. దాంతో వాళ్లు తమను తాము సమర్థించుకుంటూ, “మేము కూడా గుడ్డివాళ్లమా?” అని యేసును అడిగారు. అందుకు ఆయన, “మీరు గుడ్డివాళ్లు అయ్యుంటే, మీరు దోషులు కాకపోయేవాళ్లు. కానీ మీరు, ‘మేము చూస్తున్నాం’ అని చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం మీమీదే ఉంటుంది” అన్నాడు. (యోహాను 9:40, 41) వాళ్లు ఇశ్రాయేలీయుల బోధకులు కాకపోయుంటే, సరైన జ్ఞానం లేక యేసును తిరస్కరిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రం బాగా తెలిసి కూడా వాళ్లు యేసును తిరస్కరించడం ఘోరమైన పాపం.