కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6వ అధ్యాయం

దేవుడు వాగ్దానం చేసిన శిశువు

దేవుడు వాగ్దానం చేసిన శిశువు

లూకా 2:21-39

  • యేసుకు సున్నతి చేయించారు, కొన్ని రోజులకు ఆలయానికి తీసుకెళ్లారు

యోసేపు మరియలు నజరేతుకు తిరిగి వెళ్లకుండా బేత్లెహేములోనే ఉండిపోయారు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, వాళ్లు యేసుకు ఎనిమిదో రోజున సున్నతి చేయించారు. (లేవీయకాండం 12:2, 3) అదే రోజున పిల్లవాడికి పేరు పెట్టడం ఆనవాయితీ. కాబట్టి, వాళ్లు గబ్రియేలు దూత చెప్పినట్టే తమ పిల్లవాడికి యేసు అని పేరు పెట్టారు.

దాదాపు నెల రోజులు గడిచాయి, యేసు పుట్టి ఇప్పటికి 40 రోజులు. ఇప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన్ని యెరూషలేము ఆలయానికి తీసుకెళ్లారు. వాళ్లు ఉంటున్న చోటుకు అది కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం, మగబిడ్డ పుట్టిన 40 రోజుల తర్వాత, తల్లి తనను శుద్ధి చేసుకోవడానికి ఆలయంలో అర్పణ అర్పించాలి.—లేవీయకాండం 12:4-8.

కాబట్టి, మరియ రెండు చిన్న పక్షుల్ని అర్పణగా తీసుకెళ్లింది. దీన్నిబట్టి యోసేపు మరియల ఆర్థిక పరిస్థితి కొంతవరకు అర్థమౌతుంది. ధర్మశాస్త్రం ప్రకారం ఒక మగ గొర్రెపిల్లను, ఒక పక్షిని అర్పించాలి. గొర్రెపిల్లను అర్పించేంత స్తోమత లేకపోతే రెండు గువ్వల్ని గానీ, రెండు పావురాల్ని గానీ అర్పించవచ్చు. కాబట్టి, మరియ తన స్తోమతకు తగ్గ అర్పణ అర్పించింది.

ఆలయంలో, ఒక వృద్ధుడు యోసేపు మరియల దగ్గరికి వచ్చాడు. అతని పేరు సుమెయోను. అతను చనిపోయే లోపు, వాగ్దానం చేయబడిన క్రీస్తును అంటే మెస్సీయను చూస్తాడని యెహోవా అతనికి తెలియజేశాడు. ఆ రోజు అతను పవిత్రశక్తి నడిపింపుతో ఆలయంలోకి వచ్చాడు. అక్కడ పసిబిడ్డతో ఉన్న యోసేపు మరియలు అతనికి కనిపించారు. సుమెయోను ఆ పిల్లవాణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు.

సుమెయోను యేసును పట్టుకుని దేవునికి ఇలా కృతజ్ఞతలు చెప్పాడు: “సర్వోన్నత ప్రభువా, ఇప్పుడు నువ్వు నీ మాట ప్రకారం నీ దాసుణ్ణి మనశ్శాంతితో వెళ్లిపోనిస్తున్నావు. ఎందుకంటే నా కళ్లు నీ రక్షణ మార్గాన్ని చూశాయి. ఆ మార్గాన్ని అన్నిదేశాల ప్రజల కళ్లముందు నువ్వు సిద్ధం చేశావు. ఆయన, దేశాల మీదున్న ముసుగును తీసేసే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్నాడు.”—లూకా 2:29-32.

ఈ మాటలు విన్న యోసేపు మరియలు చాలా ఆశ్చర్యపోయారు. సుమెయోను వాళ్లను దీవించి, మరియతో ఇలా అన్నాడు: “ఈయన వల్ల కొంతమంది ఇశ్రాయేలీయులు పడిపోతారు, ఇంకొంతమంది లేస్తారు.” దుఃఖం పదునైన ఖడ్గంలా ఆమెలో నుండి దూసుకుపోతుందని కూడా అతను చెప్పాడు.—లూకా 2:34.

ఆ రోజు ఆలయంలో అన్న అనే ప్రవక్త్రి కూడా ఉంది. ఆమెకు 84 ఏళ్లు. ఆమె మానకుండా రోజూ ఆలయానికి వస్తుంది. సుమెయోను మాట్లాడుతున్న సమయంలోనే, ఆమె కూడా యోసేపు మరియల దగ్గరికి వచ్చింది. అన్న దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వినే వాళ్లందరికి యేసు గురించి చెప్పడం మొదలుపెట్టింది.

ఆలయంలో జరిగిన ఆ సంఘటనలు చూసి, యోసేపు మరియలు ఎంత సంతోషించివుంటారో మీరు ఊహించవచ్చు! ఇవన్నీ, తమ పిల్లవాడు దేవుడు వాగ్దానం చేసిన వ్యక్తి అనే నమ్మకాన్ని వాళ్లలో కలిగించాయి.