కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

87వ అధ్యాయం

ముందుచూపుతో ఉండండి, తెలివిగా నడుచుకోండి

ముందుచూపుతో ఉండండి, తెలివిగా నడుచుకోండి

లూకా 16:1-13

  • అన్యాయస్థుడైన గృహనిర్వాహకుని ఉదాహరణ

  • మీ సంపదలతో “స్నేహితుల్ని” సంపాదించుకోండి

యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుడి ఉదాహరణను పన్ను వసూలుచేసే వాళ్లు, శాస్త్రులు, పరిసయ్యులు విన్నారు. అది విన్న తర్వాత, పశ్చాత్తాపపడిన పాపుల్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని వాళ్లకు అర్థమవ్వాలి. (లూకా 15:1-7, 11) ఇప్పుడు యేసు తన శిష్యుల్ని ఉద్దేశించి మరో ఉదాహరణ చెప్పాడు. ఈసారి, అన్యాయంగా నడుచుకున్న ఒక గృహనిర్వాహకుడి గురించి, ధనవంతుడైన అతని యజమాని గురించి చెప్పాడు.

ఆ గృహనిర్వాహకుడు తన యజమాని ఆస్తిని దుబారా చేస్తున్నాడని ఎవరో ఫిర్యాదు చేశారు. దాంతో యజమాని అతన్ని పనిలో నుండి తీసేస్తానని అన్నాడు. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు: “నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి? పొలంలో పనిచేసేంత బలం నాకు లేదు. భిక్షమెత్తుకోవాలంటే సిగ్గు.” కాబట్టి అతను ఇలా ఆలోచించాడు: “ఆ! ఏం చేయాలో నాకు తెలుసు! అలాచేస్తే, యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేసినా ప్రజలు నన్ను తమ ఇళ్లలో చేర్చుకుంటారు.” వెంటనే, అతను తన యజమానికి అప్పున్నవాళ్లను పిలిచి ఇలా అడిగాడు: “నువ్వు నా యజమానికి ఎంత అప్పు ఉన్నావు?”—లూకా 16:3-5.

మొదటి వ్యక్తి, “నేను 2,200 లీటర్ల ఒలీవ నూనె అప్పు ఉన్నాను” అన్నాడు. ఆ వ్యక్తికి పెద్ద ఒలీవ తోట ఉండి ఉంటుంది, లేదా అతను ఒలీవ నూనె అమ్మే వ్యాపారి అయ్యుంటాడు. గృహనిర్వాహకుడు అతనితో, “నీ ఒప్పంద పత్రం వెనక్కి తీసుకొని, కూర్చొని త్వరగా 1,100 లీటర్లు అని రాయి” అన్నాడు.—లూకా 16:6.

గృహనిర్వాహకుడు రెండో వ్యక్తిని, “నువ్వు ఎంత అప్పు ఉన్నావు?” అని అడిగాడు. అందుకు అతను, “170 క్వింటాళ్ల గోధుమలు” అన్నాడు. గృహనిర్వాహకుడు అతనితో, “నీ ఒప్పంద పత్రం వెనక్కి తీసుకొని, 136 క్వింటాళ్లు అని రాయి” అన్నాడు. అలా గృహనిర్వాహకుడు అతని అప్పును 20 శాతం తగ్గించాడు.—లూకా 16:7.

గృహనిర్వాహకుడు ఇంకా తన యజమానికి సంబంధించిన లావాదేవీల్ని చూసుకుంటున్నాడు. కాబట్టి, యజమానికి అప్పున్నవాళ్ల అప్పును తగ్గించే అధికారం అతనికి ఇంకా ఉంది. అలా తగ్గించడం ద్వారా అతను వాళ్లను స్నేహితులుగా చేసుకుంటున్నాడు. ఎందుకంటే, ఉద్యోగం పోయిన తర్వాత వాళ్లు అతనికి సహాయం చేసే అవకాశం ఉంది.

ఒక రోజు, జరిగిన విషయం యజమానికి తెలిసింది. గృహనిర్వాహకుడు చేసిన పనివల్ల తనకు నష్టం వచ్చినా, అతని తెలివికి ముగ్ధుడై యజమాని అతన్ని మెచ్చుకున్నాడు. ఎందుకంటే అతను “అన్యాయస్థుడే అయినా తెలివిగా నడుచుకున్నాడు.” యేసు ఇలా అన్నాడు: “తమ తరంవాళ్లతో వ్యవహరించే విషయంలో ఈ వ్యవస్థకు చెందినవాళ్లు వెలుగు పుత్రుల కన్నా తెలివిగా నడుచుకుంటారు.”—లూకా 16:8.

యేసు ఆ గృహనిర్వాహకుడు చేసినదాన్ని సమర్థించడం లేదు, అలాంటి మోసాన్ని ప్రోత్సహించడం లేదు. మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఈ అవినీతి లోకంలోని సంపదలతో మీ కోసం స్నేహితుల్ని సంపాదించుకోండి. ఆ సంపదలు అయిపోయినప్పుడు వాళ్లు మిమ్మల్ని శాశ్వత నివాస స్థలాల్లో చేర్చుకుంటారు.” (లూకా 16:9) అవును, ముందుచూపుతో ఉంటూ తెలివిగా నడుచుకోమని యేసు చెప్తున్నాడు. ‘వెలుగు పుత్రులైన’ దేవుని సేవకులు, భవిష్యత్తులో పొందబోయే శాశ్వత జీవితాన్ని మనసులో ఉంచుకుని తమ ఆస్తిపాస్తుల్ని తెలివిగా ఉపయోగించాలి.

ఒక వ్యక్తిని యెహోవా దేవుడు, ఆయన కుమారుడు మాత్రమే పరలోక రాజ్యంలోకి, లేదా ఆ రాజ్యం కింద ఉండే భూపరదైసులోకి చేర్చుకోగలరు. కాబట్టి మన ఆస్తిపాస్తుల్ని రాజ్య సంబంధ విషయాల కోసం ఉపయోగించడం ద్వారా యెహోవాను, యేసును స్నేహితులుగా చేసుకోవాలి. అలా చేస్తేనే మన బంగారం, వెండి, ఇతర ఆస్తిపాస్తులు తరిగిపోయినా లేదా నాశనమైనా మనం శాశ్వత జీవితం పొందుతాం.

తమ ఆస్తిపాస్తుల్ని లేదా సంపదల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో, ఉపయోగించడంలో నమ్మకంగా ఉన్నవాళ్లు, అంతకన్నా ముఖ్యమైన విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటారని యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు అవినీతి లోకంలోని సంపదల విషయంలోనే నమ్మకంగా లేకపోతే, నిజమైన సంపదల్ని [రాజ్య సంబంధ విషయాల వంటివాటిని] ఎవరు మీకు అప్పగిస్తారు?”—లూకా 16:11.

శిష్యులు “శాశ్వత నివాస స్థలాల్లో” చేర్చుకోబడాలంటే, వాళ్ల నుండి ఎక్కువ ఆశించబడుతుందని యేసు చెప్తున్నాడు. ఒక వ్యక్తి అవినీతి లోకంలోని సంపదలకు దాసునిగా ఉంటూనే, దేవునికి దాసునిగా ఉండలేడు. యేసు ఇలా ముగించాడు: “ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు; లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ సంపదలకూ దాసులుగా ఉండలేరు.”—లూకా 16:9, 13.