కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

86వ అధ్యాయం

తప్పిపోయిన కుమారుడు తిరిగొచ్చాడు

తప్పిపోయిన కుమారుడు తిరిగొచ్చాడు

లూకా 15:11-32

  • తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ

తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం ఉదాహరణల్ని చెప్పినప్పుడు యేసు బహుశా యొర్దాను నది అవతల ఉన్న పెరయలోనే ఉండివుంటాడు. ఒక పాపి పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి తిరిగొచ్చినప్పుడు మనం సంతోషించాలని ఆ రెండు ఉదాహరణలు చూపిస్తున్నాయి. పరిసయ్యులు, శాస్త్రులు మాత్రం యేసు పాపులతో కలుస్తున్నాడని విమర్శించారు. మరి యేసును విమర్శిస్తున్నవాళ్లు ఆయన చెప్పిన రెండు ఉదాహరణల నుండి ఏమైనా నేర్చుకుంటారా? పాపులు పశ్చాత్తాపపడినప్పుడు పరలోకంలో ఉన్న మన తండ్రికి ఎలా అనిపిస్తుందో వాళ్లు అర్థం చేసుకుంటారా? ఆ ప్రాముఖ్యమైన పాఠాన్ని నొక్కిచెప్పడానికి, హృదయాన్ని కదిలించే మరో ఉదాహరణను యేసు చెప్పాడు.

ఈ ఉదాహరణలో ఒక తండ్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో చిన్న కుమారుడిదే ముఖ్యమైన పాత్ర. అతని గురించి యేసు చెప్పే విషయాల నుండి పరిసయ్యులు, శాస్త్రులు, మిగతావాళ్లు పాఠం నేర్చుకోవాలి. అయితే, తండ్రి అలాగే పెద్ద కుమారుడు చూపించిన వైఖరుల నుండి కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. కాబట్టి యేసు ఈ ఉదాహరణ చెప్తుండగా ఆ ముగ్గురి గురించి ఆలోచించండి.

యేసు ఇలా మొదలుపెట్టాడు: “ఒకతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వు’ అన్నాడు. దాంతో ఆ తండ్రి వాళ్లిద్దరికీ ఆస్తిని పంచి ఇచ్చాడు.” (లూకా 15:11, 12) ఒక విషయం గమనించండి, ఆ చిన్న కుమారుడు తన వాటా అడుగుతున్నది తండ్రి చనిపోయినందుకు కాదు. తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. అయినా ఆ చిన్న కుమారుడు ఇప్పుడే ఆస్తి పంచి ఇవ్వమని అడుగుతున్నాడు. సొంతగా, తనకు నచ్చినట్లు జీవించాలన్నది అతని ఆలోచన. మరి అతను ఏం చేశాడు?

యేసు ఇలా వివరించాడు: “కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న కుమారుడు తనకున్నదంతా పోగుచేసుకొని దూర దేశానికి వెళ్లాడు. అక్కడ విచ్చలవిడిగా జీవిస్తూ తన ఆస్తంతా దుబారా చేశాడు.” (లూకా 15:13) పిల్లల అవసరాలు, బాగోగులు చూసుకునే తన తండ్రి ఇంట్లో హాయిగా జీవించే బదులు, అతను వేరే దేశానికి వెళ్లిపోయాడు. అతను తన శరీర కోరికలు తీర్చుకోవడం కోసం ఆస్తంతా దుబారా చేశాడు. తర్వాత అతనికి కష్టాలు మొదలయ్యాయని చెప్తూ యేసు ఇలా అన్నాడు:

“అతను మొత్తం ఖర్చు చేసిన తర్వాత, ఆ దేశమంతటా పెద్ద కరువు వచ్చింది. దాంతో అతని దగ్గర ఏమీ లేకుండా పోయింది. చివరికి అతను ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనిలో చేరాడు. ఆ వ్యక్తి అతన్ని పందుల్ని కాయడానికి తన పొలాల్లోకి పంపించాడు. అతను పందుల మేతతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ ఎవ్వరూ అతనికి ఏమీ ఇవ్వలేదు.”—లూకా 15:14-16.

దేవుని ధర్మశాస్త్రం ప్రకారం పందులు అపవిత్రమైన జంతువులు. అయినా అతను వాటిని కాయాల్సి వచ్చింది. అతను ఆకలికి అలమటిస్తూ, పందుల మేతతో కడుపు నింపుకోవాలనుకునే స్థితికి దిగజారాడు. అంతటి హీనమైన పరిస్థితి వచ్చేసరికి ‘అతనికి బుద్ధి వచ్చింది.’ అప్పుడతను ఏం చేశాడు? అతను ఇలా అనుకున్నాడు: “మా నాన్న దగ్గర ఎంతోమంది పనివాళ్లకు బోలెడంత ఆహారం ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను! నేను లేచి, మా నాన్న దగ్గరికి వెళ్లి ఇలా అంటాను: ‘నాన్నా, నేను దేవునికీ నీకూ విరుద్ధంగా పాపం చేశాను. ఇక నీ కుమారుణ్ణని అనిపించుకునే అర్హత నాకు లేదు. నన్ను నీ పనివాళ్లలో ఒకడిగా పెట్టుకో.’” తర్వాత అతను లేచి తన తండ్రి దగ్గరికి వెళ్లాడు.—లూకా 15:17-20.

అతని తండ్రి ఎలా స్పందిస్తాడు? కుమారుడి మీద కోప్పడి, అసలు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్లావంటూ తిడతాడా? కుమారుణ్ణి పట్టించుకోకుండా, ఎందుకొచ్చావు అన్నట్లు చూస్తాడా? మీరే ఆ తండ్రి స్థానంలో ఉంటే ఏం చేసేవాళ్లు? మీ కుమారుడో కూతురో ఆ పరిస్థితిలో ఉంటే మీరు ఏం చేసేవాళ్లు?

తప్పిపోయిన కుమారుడు దొరికాడు

ఆ తండ్రికి ఎలా అనిపించిందో, ఏం చేశాడో యేసు వివరించాడు: “అతను [చిన్న కుమారుడు] ఇంకా దూరంగా ఉన్నప్పుడే, వాళ్ల నాన్న అతన్ని చూసి, జాలిపడి, పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని, ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు.” (లూకా 15:20) తన కుమారుడు విచ్చలవిడిగా జీవించాడని తెలిసినా ఆ తండ్రి అతన్ని ఆహ్వానించాడు. తమకు యెహోవా తెలుసని, ఆయన్ని ఆరాధిస్తున్నామని చెప్పుకునే యూదా నాయకులు, పశ్చాత్తాపపడే పాపుల విషయంలో మన పరలోక తండ్రి ఎలా భావిస్తాడో ఆ ఉదాహరణ ద్వారా గ్రహించి ఉంటారా? యేసు కూడా తన తండ్రిలాగే పాపుల్ని ఆహ్వానిస్తున్నాడని వాళ్లు గ్రహించి ఉంటారా?

కుమారుడి ముఖంలో బాధను చూసిన ఆ తండ్రికి అతను పశ్చాత్తాపపడుతున్నాడని అర్థమై ఉంటుంది. తండ్రే స్వయంగా వచ్చి ప్రేమగా దగ్గరికి తీసుకోవడంతో, అతను తన తప్పుల్ని ఒప్పుకోవడం తేలికైంది. యేసు ఇలా చెప్పాడు: “అప్పుడు ఆ చిన్న కుమారుడు వాళ్ల నాన్నతో, ‘నాన్నా, నేను దేవునికీ నీకూ విరుద్ధంగా పాపం చేశాను. ఇక నీ కుమారుణ్ణని అనిపించుకునే అర్హత నాకు లేదు’ అన్నాడు.”—లూకా 15:21.

అప్పుడు తండ్రి తన దాసులకు ఇలా ఆజ్ఞాపించాడు: “వెంటనే మీరు శ్రేష్ఠమైన వస్త్రం తెచ్చి ఇతనికి వేయండి, ఇతని చేతికి ఉంగరం పెట్టండి, కాళ్లకు చెప్పులు తొడగండి! అలాగే, కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుందాం, సంబరాలు జరుపుకుందాం. ఎందుకంటే, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు; తప్పిపోయి దొరికాడు.” దాంతో వాళ్లు “సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.”—లూకా 15:22-24.

ఇదంతా జరుగుతున్నప్పుడు పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. యేసు అతని గురించి ఇలా చెప్పాడు: “అతను తిరిగొస్తూ ఇంటికి దగ్గర్లో ఉన్నప్పుడు సంగీతం, నాట్యం చేస్తున్న శబ్దం వినిపించాయి. కాబట్టి అతను ఒక సేవకుణ్ణి పిలిచి, ఏం జరుగుతోందని అడిగాడు. ఆ సేవకుడు అతనితో, ‘మీ తమ్ముడు వచ్చాడు. అతను క్షేమంగా తిరిగొచ్చినందుకు మీ నాన్న కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు. దాంతో పెద్ద కుమారుడికి కోపమొచ్చి లోపలికి రానన్నాడు. అప్పుడు వాళ్ల నాన్న బయటికి వచ్చి అతన్ని లోపలికి రమ్మని బ్రతిమాలాడు. కానీ అతను వాళ్ల నాన్నతో ఇలా అన్నాడు: ‘ఇదిగో! ఇన్ని సంవత్సరాలు నేను నీకు సేవ చేశాను. ఇప్పటివరకు ఒక్కసారి కూడా నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించమని నువ్వెప్పుడూ నాకు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు. కానీ వేశ్యలతో తిరిగి నీ ఆస్తంతా దుబారా చేసిన నీ చిన్న కుమారుడు రాగానే అతని కోసం కొవ్విన దూడను వధించావు.’”—లూకా 15:25-30.

యేసు సామాన్య ప్రజల మీద, పాపుల మీద కరుణ, శ్రద్ధ చూపిస్తున్నందుకు ఆ పెద్ద కుమారుడిలా ఎవరు ఆయన్ని విమర్శిస్తున్నారు? శాస్త్రులు, పరిసయ్యులే. పాపుల్ని ఆహ్వానిస్తున్నందుకు వాళ్లు యేసును విమర్శించారు, అందుకే ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు. వాళ్లేకాదు, కరుణ చూపించే విషయంలో దేవుణ్ణి తప్పుపట్టే ప్రతీఒక్కరు దీని నుండి పాఠం నేర్చుకోవాలి.

ఆ తండ్రి తన పెద్ద కుమారునికి నచ్చజెప్పడాన్ని వివరిస్తూ యేసు ఆ ఉదాహరణను ముగించాడు: “బాబూ, నువ్వెప్పుడూ నాతోనే ఉన్నావు. నావన్నీ నీవే కదా. అయితే మనం ఇప్పుడు సంతోషించాలి, సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే, నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు; తప్పిపోయి దొరికాడు.”—లూకా 15:31, 32.

తర్వాత ఆ పెద్ద కుమారుడు ఏం చేశాడో యేసు చెప్పలేదు. కానీ యేసు చెప్తున్నవాటిని వింటున్నవాళ్లలో కొంతమంది, ఆయన చెప్పిన ఈ శక్తివంతమైన ఉదాహరణలోని పాఠాన్ని అర్థంచేసుకుని ఉంటారు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, యేసు చనిపోయి పునరుత్థానమైన తర్వాత, “యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులయ్యారు.” (అపొస్తలుల కార్యాలు 6:7) అవును, వాళ్లు కూడా బుద్ధి తెచ్చుకుని, పశ్చాత్తాపపడి, దేవుని దగ్గరికి తిరిగి రాగలిగారు.

ఆ రోజు నుండి, యేసు ఈ ఉదాహరణలో చెప్పిన విలువైన పాఠాల్ని శిష్యులు మనసులో ఉంచుకున్నారు. వాళ్లు వాటిని జాగ్రత్తగా పాటించడం కూడా ప్రాముఖ్యం. మొదటి పాఠం ఏంటంటే, మనల్ని ప్రేమించి మన బాగోగులు చూసుకునే మన తండ్రి కాపుదల కింద, ఆయన ప్రజల మధ్య సురక్షితంగా ఉండాలి. అదే తెలివైన పని. అంతేగానీ, ఆకర్షణీయంగా కనిపించే సుఖాల కోసం, విలాసాల కోసం “దూర దేశానికి” వెళ్లకూడదు.

మరో పాఠం ఏంటంటే, మనలో ఎవరమైనా దేవుని మార్గం నుండి పక్కకు వెళ్లివుంటే, వినయంగా మన తండ్రి దగ్గరికి తిరిగి రావాలి. అప్పుడు మనం మళ్లీ ఆయన అనుగ్రహం పొందుతాం.

మనం ఇంకో పాఠం కూడా నేర్చుకోవచ్చు. తండ్రి తన చిన్న కుమారుణ్ణి క్షమించి, ప్రేమగా ఆహ్వానించాడు. అయితే పెద్ద కుమారునికి తన తమ్ముడు తిరిగి రావడం ఇష్టం లేదు, అతన్ని ఆహ్వానించలేదు. కానీ, దారితప్పిన ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడి ‘తండ్రి ఇంటికి’ తిరిగొస్తే, దేవుని సేవకులు అతన్ని క్షమించాలి, ఆహ్వానించాలి. మన సహోదరుడు “చనిపోయి బ్రతికాడు; తప్పిపోయి దొరికాడు” కాబట్టి మనం సంతోషిద్దాం.