కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

96వ అధ్యాయం

ధనవంతుడైన నాయకుడికి యేసు జవాబిచ్చాడు

ధనవంతుడైన నాయకుడికి యేసు జవాబిచ్చాడు

మత్తయి 19:16-30 మార్కు 10:17-31 లూకా 18:18-30

  • ఒక ధనవంతుడు శాశ్వత జీవితం గురించి అడిగాడు

యేసు ఇంకా పెరయ గుండా యెరూషలేముకు వెళ్లే దారిలోనే ఉన్నాడు. ధనవంతుడైన ఒక యువకుడు యేసు దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. అతను యూదుల నాయకుల్లో ఒకడు. అతను బహుశా సమాజమందిర అధికారిగా, లేదా మహాసభ సభ్యుడిగా సేవ చేస్తుండవచ్చు. అతను యేసును ఇలా అడిగాడు: “మంచి బోధకుడా, శాశ్వత జీవితం పొందాలంటే నేను ఏంచేయాలి?”—లూకా 8:41; 18:18; 24:20.

అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాళ్లెవరూ లేరు” అని జవాబిచ్చాడు. (లూకా 18:19) బహుశా, ఆ యువకుడు ఇతర రబ్బీల్లాగే, “మంచి” అనే పదాన్ని ఒక బిరుదుగా ఉపయోగించివుంటాడు. యేసు మంచి బోధకుడే అయినప్పటికీ, “మంచి” అనే బిరుదును దేవునికి మాత్రమే ఉపయోగించాలని అతనికి చెప్పాడు.

“నువ్వు శాశ్వత జీవితం పొందాలనుకుంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉండు” అని యేసు ఆ యువకుడికి సలహా ఇచ్చాడు. అప్పుడు అతను “ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు. అందుకు యేసు, పది ఆజ్ఞల్లో ఐదు ఆజ్ఞల్ని చెప్పాడు. అవేంటంటే, హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, అమ్మానాన్నల్ని గౌరవించాలి. తర్వాత, యేసు అంతకన్నా ముఖ్యమైన ఈ ఆజ్ఞ కూడా చెప్పాడు: “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.”—మత్తయి 19:17-19.

అప్పుడు ఆ యువకుడు, “ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను, ఇంకా ఏమి చేయాలి?” అని అడిగాడు. (మత్తయి 19:20) శాశ్వత జీవితం పొందడానికి ఇంకా ఏవో మంచి పనులు, గొప్ప పనులు చేయాలని ఆ యువకుడు అనుకొని ఉండవచ్చు. అతని ఆరాటాన్ని గమనించి యేసు అతనిమీద ‘ప్రేమ’ చూపించాడు. (మార్కు 10:21) అయితే, అతన్ని ఏది అడ్డుకుంటుంది?

అతను తన వస్తుసంపదల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి యేసు, “నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. వెళ్లి, నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి, ఆ డబ్బును పేదవాళ్లకు ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు ఐశ్వర్యం కలుగుతుంది; నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అని చెప్పాడు. పేదవాళ్లు డబ్బును తిరిగి ఇవ్వలేరు కాబట్టి అలాంటివాళ్లకు తన డబ్బును ఇచ్చేసి, అతను యేసు శిష్యుడు అవ్వవచ్చు. కానీ అతను లేచి బాధపడుతూ వెళ్లిపోయాడు. అతన్ని చూసి యేసుకు జాలేసి ఉంటుంది. డబ్బు మీద, విస్తారమైన ‘ఆస్తిపాస్తుల’ మీద ప్రేమ వల్ల అతను నిజమైన సంపదను గుర్తించలేకపోతున్నాడు. (మార్కు 10:21, 22) యేసు ఇలా అన్నాడు: “డబ్బున్న వాళ్లు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం ఎంత కష్టం!”—లూకా 18:24.

ఆ మాటలు విని శిష్యులు ఆశ్చర్యపోయారు. యేసు ఇలా చెప్పాడు: “నిజానికి, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.” అందుకు శిష్యులు ఆశ్చర్యంతో, “అసలు రక్షణ పొందడం ఎవరికైనా సాధ్యమేనా?” అని అడిగారు. నిజంగా, రక్షణ పొందడం అంత కష్టమా? యేసు తన శిష్యుల వైపు సూటిగా చూసి, “మనుషులకు సాధ్యంకానివి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు.—లూకా 18:25-27.

అప్పుడు పేతురు తాము ఆ ధనవంతునిలా కాదని చెప్తూ, ఇలా అన్నాడు: “ఇదిగో! మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం. మరి మాకు ఏం దొరుకుతుంది?” వాళ్లు సరైనదాన్ని ఎంచుకున్నందుకు భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనం పొందుతారో యేసు చెప్పాడు: “అన్నీ కొత్తగా చేయబడినప్పుడు, మానవ కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు 12 సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు.”—మత్తయి 19:27, 28.

భవిష్యత్తులో అన్నీ కొత్తగా చేయబడి, భూమి ఏదెను తోటలా మారే సమయం గురించి యేసు చెప్తున్నాడు. అప్పుడు పేతురు, ఇతర శిష్యులు యేసుతో కలిసి భూపరదైసును పరిపాలించే గొప్ప అవకాశం పొందుతారు. ఆ బహుమానం కోసం వాళ్లు ఎన్ని త్యాగాలైనా చేయవచ్చు!

అయితే వాళ్లు భవిష్యత్తులోనే కాదు, ఇప్పుడు కూడా కొన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తారు. యేసు ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యం కోసం ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, అమ్మానాన్నలనైనా, పిల్లలనైనా విడిచిపెట్టే ప్రతీ వ్యక్తి ఇప్పటి కాలంలో ఎన్నోరెట్లు ఎక్కువ పొందుతాడు, అలాగే రానున్న వ్యవస్థలో శాశ్వత జీవితం పొందుతాడు.”—లూకా 18:29, 30.

అవును, శిష్యులు ఎక్కడికి వెళ్లినా, తోటి ఆరాధకులతో కలిసి చక్కని సహోదరత్వాన్ని ఆనందించవచ్చు. అది కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధం కన్నా బలమైనది, విలువైనది. విచారకరంగా, ధనవంతుడైన యువ నాయకుడు ఈ ఆశీర్వాదాన్ని, అలాగే పరలోకంలో యేసుతోపాటు పరిపాలించే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడు.

యేసు ఇంకా ఇలా అన్నాడు: “అయితే ముందున్న చాలామంది వెనక్కి వెళ్తారు, వెనక ఉన్న చాలామంది ముందుకు వస్తారు.” (మత్తయి 19:30) దాని అర్థం ఏంటి?

ఆ ధనవంతుడైన యువకుడు యూదుల నాయకుల్లో ఒకడు, అలా అతను ‘ముందున్నాడు.’ అతను అప్పటికే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు కాబట్టి యేసుకు శిష్యుడయ్యే అవకాశం, మెస్సీయను అనుసరిస్తూ మరిన్ని మంచి పనులు చేసే అవకాశం అతనికి ఉంది. కానీ అతను అన్నిటికంటే ఎక్కువగా డబ్బుకు, ఆస్తిపాస్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అయితే సామాన్య ప్రజలు మాత్రం యేసు బోధలు సత్యమని, అవి జీవానికి నడిపిస్తాయని గ్రహించారు. వాళ్లు అందరికంటే “వెనక” ఉన్నట్లు కనిపించినా, ఇప్పుడు “ముందుకు” వస్తున్నారు. భవిష్యత్తులో వాళ్లు యేసుతో కలిసి పరలోకంలో సింహాసనాలపై కూర్చుని, పరదైసు భూమిని పరిపాలించే సమయం కోసం ఎదురుచూడవచ్చు.