కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

82వ అధ్యాయం

యేసు పెరయలో ప్రకటించాడు

యేసు పెరయలో ప్రకటించాడు

లూకా 13:22–14:6

  • ఇరుకు ద్వారం గుండా వెళ్లడానికి తీవ్రంగా కృషిచేయాలి

  • యేసు యెరూషలేములోనే చనిపోవాలి

యేసు యూదయలో, యెరూషలేములో బోధిస్తూ ప్రజల్ని బాగుచేస్తున్నాడు. తర్వాత ఆయన యొర్దాను నది దాటి, పెరయ జిల్లాలోని ఒక్కో నగరంలో ప్రకటించడం మొదలుపెట్టాడు. త్వరలోనే ఆయన మళ్లీ యెరూషలేముకు వస్తాడు.

యేసు పెరయలో ఉన్నప్పుడు ఒకతను, “ప్రభువా, రక్షించబడేవాళ్లు కొంతమందేనా?” అని అడిగాడు. రక్షించబడేవాళ్లు ఎక్కువమందా, తక్కువమందా అని మతనాయకులు చర్చించుకోవడం అతనికి తెలిసే ఉంటుంది. అయితే యేసు ఎంతమంది రక్షించబడతారో చెప్పే బదులు, రక్షించబడాలంటే ఏం చేయాలో చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ఇరుకు ద్వారం గుండా వెళ్లడానికి తీవ్రంగా కృషిచేయండి.” అవును, అందుకోసం చాలా కృషి లేదా పోరాటం అవసరం. ఎందుకు? యేసు ఇలా వివరించాడు: “చాలామంది లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు కానీ అది వాళ్ల వల్ల కాదని మీతో చెప్తున్నాను.”—లూకా 13:23, 24.

తీవ్రమైన కృషి ఎందుకు అవసరమో వివరించడానికి యేసు ఈ ఉదాహరణ చెప్పాడు: “ఇంటి యజమాని లేచి తలుపుకు తాళం వేసినప్పుడు మీరు బయట నిలబడి తలుపు తడుతూ, ‘ప్రభువా, మా కోసం తలుపు తెరువు’ అని అంటారు. . . . కానీ ఆయన, ‘మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలీదు. అక్రమంగా నడుచుకునే వాళ్లారా, మీరంతా నా దగ్గర నుండి వెళ్లిపోండి!’ అని మీతో అంటాడు.”—లూకా 13:25-27.

ఆలస్యంగా వచ్చేవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో యేసు ఆ ఉదాహరణలో వివరించాడు. వాళ్లు ఆలస్యంగా, బహుశా తమకు వీలు కుదిరినప్పుడు వచ్చారు. కానీ అప్పటికే తలుపులు మూసేసి, తాళం వేసి ఉంది. కష్టమైనా సరే వాళ్లు ముందే వచ్చి ఉండాల్సింది. యేసు బోధిస్తున్నవాటి నుండి ప్రయోజనం పొందలేకపోయిన వాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్లు తమ జీవితంలో దేవుని ఆరాధనకు ముఖ్యమైన స్థానం ఇవ్వలేదు. ఎవరి కోసం యేసు పంపబడ్డాడో వాళ్లలో చాలామంది, రక్షణ కోసం దేవుడు చేసిన ఏర్పాటును అంగీకరించలేదు. దేవుడు వాళ్లను బయటికి తోసేసినప్పుడు వాళ్లు “ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ” ఉంటారని యేసు చెప్పాడు. అయితే, అన్నిదేశాల ప్రజలు “తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యంలో బల్ల దగ్గర కూర్చుంటారు.”—లూకా 13:28, 29.

యేసు ఇలా వివరించాడు: “ముందున్న కొంతమంది [తాము అబ్రాహాము సంతానమని గర్వించే యూదా మతనాయకులు] వెనక్కి వెళ్తారు, వెనకున్న కొంతమంది [ఉదాహరణకు, యూదులు కానివాళ్లు, దీనస్థితిలో ఉన్న యూదులు] ముందుకు వస్తారు.” (లూకా 13:30) కృతజ్ఞతలేని ఆ యూదా మతనాయకులు “వెనక్కి వెళ్తారు,” అంటే దేవుని రాజ్యంలో అస్సలు ఉండరు.

తర్వాత కొంతమంది పరిసయ్యులు యేసు దగ్గరికి వచ్చి ఈ సలహా ఇచ్చారు: “ఇక్కడి నుండి వెళ్లిపో, హేరోదు [అంతిప] నిన్ను చంపాలని అనుకుంటున్నాడు.” యేసును ఆ ప్రాంతం నుండి పంపించేయాలని స్వయంగా హేరోదు రాజే ఈ పుకారు పుట్టించి ఉంటాడు. బాప్తిస్మమిచ్చే యోహానును చంపించినట్టే, ఇంకో ప్రవక్తను చంపించే పరిస్థితి వస్తుందని అతను భయపడి ఉంటాడు. అయితే యేసు ఆ పరిసయ్యులతో ఇలా అన్నాడు: “మీరు వెళ్లి ఆ నక్కతో ఇలా చెప్పండి: ‘ఇదిగో! ఇవాళ, రేపు నేను చెడ్డదూతల్ని వెళ్లగొడతాను, మూడో రోజున నా పని అయిపోతుంది.’” (లూకా 13:31, 32) నక్కలాగే హేరోదు కూడా జిత్తులమారి అని చెప్పడానికి యేసు అలా అనివుంటాడు. అయితే హేరోదు గానీ, వేరేవాళ్లు గానీ యేసును మోసం చేయలేరు లేదా తొందరపెట్టలేరు. యేసు తన తండ్రి ఇచ్చిన పనిని తండ్రి ప్రణాళిక ప్రకారమే చేస్తాడు కానీ, మనుషుల ప్రణాళిక ప్రకారం కాదు.

యేసు యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. ఎందుకంటే, “ప్రవక్త యెరూషలేము బయట చంపబడకూడదు” అని ఆయన అన్నాడు. (లూకా 13:33) మెస్సీయ యెరూషలేములో చనిపోతాడని ఏ ప్రవచనమూ చెప్పలేదు, మరి తాను అక్కడే చనిపోతానని యేసు ఎందుకు అన్నాడు? ఎందుకంటే, అది రాజధాని. అక్కడ 71 మంది సభ్యులతో కూడిన మహాసభ అనే ఉన్నత న్యాయస్థానం ఉంది. అబద్ధ ప్రవక్తలుగా ఆరోపించబడినవాళ్లను అక్కడ విచారిస్తారు. అంతేకాదు, జంతు బలుల్ని అర్పించేది కూడా యెరూషలేములోనే. కాబట్టి తాను యెరూషలేములో కాకుండా వేరే ప్రాంతంలో చంపబడకూడదని యేసు గ్రహించాడు.

యేసు ఇలా బాధపడ్డాడు: “యెరూషలేమా, యెరూషలేమా, నువ్వు ప్రవక్తల్ని చంపుతూ, నీ దగ్గరికి పంపబడినవాళ్లను రాళ్లతో కొడుతూ ఉన్నావు. కోడి తన పిల్లల్ని రెక్కల చాటున చేర్చుకున్నట్టు, నేను ఎన్నోసార్లు నీ పిల్లల్ని చేర్చుకోవాలని అనుకున్నాను! కానీ అది నీకు ఇష్టంలేదు. ఇదిగో! నీ ఇల్లు నీకే వదిలేయబడింది.” (లూకా 13:34, 35) యూదా జనాంగం దేవుని కుమారుణ్ణి తిరస్కరిస్తున్నందుకు తప్పకుండా పర్యవసానాలు అనుభవిస్తుంది!

యేసు యెరూషలేముకు వెళ్లే ముందు, పరిసయ్యుల నాయకుడైన ఒకతను యేసును భోజనానికి పిలిచాడు. అది విశ్రాంతి రోజు. అక్కడికి వచ్చిన మిగతా అతిథులు యేసును జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒంట్లో (ముఖ్యంగా కాళ్లలో, పాదాల్లో) నీరు వచ్చి బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పుడు యేసు పరిసయ్యుల్ని, ధర్మశాస్త్రంలో ఆరితేరినవాళ్లను ఇలా అడిగాడు: “విశ్రాంతి రోజున బాగుచేయడం సరైనదా, కాదా?”—లూకా 14:3.

ఎవ్వరూ జవాబివ్వలేదు. యేసు ఆ వ్యక్తిని బాగుచేసి, వాళ్లను ఇలా అడిగాడు: “మీ కుమారుడు గానీ, మీ ఎద్దు గానీ విశ్రాంతి రోజున బావిలో పడితే మీలో ఎవరైనా వెంటనే పైకి లాగకుండా ఉంటారా?” (లూకా 14:5) ఆ ప్రశ్నకు కూడా వాళ్ల దగ్గర జవాబు లేదు.