కంటెంట్‌కు వెళ్లు

లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు?

లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు?

లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు?

పై ప్రశ్నకు అనేకులు ఒక్క ముక్కలో సమాధానం చెబుతారు—దేవుడే అని. అయితే ప్రాముఖ్యంగా చూస్తే బైబిలులో ఎక్కడా కూడా యేసుక్రీస్తు గాని, ఆయన తండ్రిగానీ నిజంగా యీ లోకాన్ని పాలిస్తున్నట్లు చెప్పడంలేదు. బదులుగా, “ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును” అని యేసు అన్నాడు. ఇంకా పొడిగిస్తూ “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమియు లేదు.” అని ఆయన అన్నాడు.—యోహాను 12:31; 14:30; 16:11.

కాబట్టి యీ లోకాధికారి యేసుకు విరుద్ధంగా ఉన్నాడు. అతడెవరై ఉండవచ్చు?

లోక పరిస్థితులనుండి ఒక సూచన

సదుద్దేశులైన మానవులు ప్రయత్నాలెన్ని సలిపినా, చరిత్రంతటిలో లోకం విపరీతమైన బాధననుభవించింది. “‘భూమి మీద శాంతి’—దాదాపు అందరికీ అవసరమే. లోకంలోని ప్రజలందరు ‘పరస్పరం సద్భావనతో’ వెలగాలనికోరుకుంటారు. మరి ఇక్కడొచ్చే సమస్యేమిటి? ప్రజలకు ఇలాంటి సహజసిద్ధమైన కోరికలున్నా యుద్ధ భయమెందుకుంది?” అని దివంగత సంపాదక రచయిత, డేవిడ్‌ లారెన్స్‌ వలె అనేకమంది ఆలోచనాపరులును ఆశ్చర్యపోతున్నారు.

ఇక్కడ వైరుధ్యం ఉన్నట్లు కనిపిస్తోంది కదా? ప్రజలు సహజసిద్ధంగా శాంతియుత జీవనాన్ని ఇష్టపడినా, మామూలుగా వారు క్రూరత్వంతో ఒకరినొకరు ద్వేషించుకొని చంపుకుంటున్నారు. రాక్షసత్వంలోని విపరీత క్రూరత్వాన్ని పరిశీలించండి. మానవులు నిర్ధాక్షిణ్యంగా ఒకరినొకరు హింసించుకొని చంపుకోవడానికి, గాస్‌ చాంబర్లు, కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులు, జ్వాలా ప్రక్షేపణములు, నాపామ్‌బాంబులు, ఇతర భయంకర పద్ధతులను ఉపయోగించారు.

శాంతి సంతోషాలను కోరే మానవులు తామే యిలా పరస్పరంగా దురాగతాలకు పాల్పడగల సమర్థులని నీవు నమ్ముతావా? అలాంటి అసహ్యమైన కార్యాలకు లేక పాశనిక చర్యలకు పాల్పడు పరిస్థితులకు మనుష్యులను ఏ శక్తులు నడిపిస్తున్నాయి? ఏదో అదృశ్య, దుష్టశక్తి ప్రజలను యిలాంటి దౌర్జన్యపూరిత కార్యాలను చేయడానికి వారిని ప్రభావితం చేస్తున్నదేమోనని మీరెప్పుడన్నా అనుకున్నారా?

లోకపరిపాలకులు గుర్తించబడ్డారు

ఈ విషయాన్ని మీరు ఊహించనవసరం లేదు ఎందుకంటే, ఒక జ్ఞానవంతుడైన, అదృశ్య వ్యక్తి మనుష్యులను, దేశాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడని బైబిలు స్పష్టంగా చూపుతోంది. “లోకమంతయు దుష్టునియందున్నదని” ఆ గ్రంథం అంటోంది. అతడు “సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల” వాడని బైబిలు అతన్ని సూచిస్తోంది.—1 యోహాను 5:19; ప్రకటన 12:9.

ఒక సందర్భంలో యేసు “అపవాదిచేత శోధింప” బడినప్పుడు, లోకాధికారిగా సాతాను పాత్రను ఆయన ప్రశ్నించలేదు. ఏం జరిగిందన్న విషయాన్ని బైబిలు వివరిస్తోంది: “అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి—నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా యేసు వానితో—సాతానా, పొమ్ము” అని అన్నాడు.—మత్తయి 4:1, 8-10.

దీని గూర్చి ఆలోచించండి. సాతాను “లోకరాజ్యములన్నింటిని” యిస్తానని  సును శోధించాడు. మరి సాతానే ఈ రాజ్యాలకు అధికారి కాకపోతే అతని ప్రతిపాదన నిజమైన శోధన ఎలా అవుతుంది? అలా కాకపోయేది. ఇంకా గమనించండి, యేసు ఈ లోక రాజ్యాలన్నీ సాతానువి కావని ధిక్కరించలేదు. ఒకవేళ సాతానుకు ఆ శక్తి లేకపోయి ఉంటే ఆయన అలాగే చేసివుండేవాడు. కాబట్టి, అపవాదియైన సాతాను నిజంగా ఈ లోక అదృశ్య పరిపాలకుడే! వాస్తవానికి బైబిలు అతనిని “ఈ యుగ సంబంధమైన దేవత” అని అంటోంది. (2 కొరింథీయులు 4:4) అయినప్పటికీ, అంతటి దుష్టుడు ఈ స్థానంలోకి ఎలా వచ్చాడు?

సాతానుగా మారిన వ్యక్తి, ముందు దేవుడు సృష్టించిన దూతేగాని, తర్వాత దేవుని స్థానాన్ని చూసి ఈర్ష్యపడ్డాడు. దేవుని రాజ్యపరిపాలనా హక్కును సవాలుచేసాడు. అందుకు సర్పాన్ని తన వాణిగా ఉపయోగించి, మొదటి స్త్రీయైన హవ్వను మోసపర్చి, ఆమెను ఆమె భర్త, ఆదామును దేవునికి కాక తన ఆదేశాలకు లోబడేలా చేసుకున్నాడు. (ఆదికాండము 3:1-6; 2 కొరింథీయులు 11:3) ఆదాము హవ్వలకు పుట్టనున్న పిల్లలను సహితం అతడు దేవుని నుండి త్రిప్పివేయగలనని గొప్పగా చెప్పుకున్నాడు. కాబట్టి దేవుడు సాతాను చెప్పిందాన్ని నిరూపించడానికి కొంత వ్యవధినిచ్చాడు గానీ, సాతాను నెగ్గలేకపోయాడు.—యోబు 1:6-12; 2:1-10.

ప్రాముఖ్యంగా, ఈ లోక పరిపాలనలో సాతాను ఒక్కడే లేడు. దేవుని విరుద్ధ పోరాటంలో చేరటానికి కొంతమంది దూతలను ఒప్పించడంలో విజయాన్ని పొందాడు. వీరు దయ్యాలై, అతని ఆత్మీయ తోడుదొంగలయ్యారు. క్రైస్తవులను ఉద్బోధించేటప్పుడు వీళ్లను గూర్చి బైబిలు ఇలా అన్నది: “మీరు అపవాది తంత్రములను ఎదిరించుడి . . . ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గానీ . . . ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.”—ఎఫెసీయులు 6:11, 12.

దురాత్మలను ప్రతిఘటించండి

దేవుని ఆరాధన నుండి యావత్‌ మానవజాతి త్రిప్పివేయాలని ఈ అదృశ్య, దుష్ట లోకనాధులు నిశ్చయించుకున్నారు. చనిపోయినవారు స్మారకంలో ఉండరని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తున్ననూ, మరణాంతర జీవమున్నదనే అభిప్రాయాన్ని కల్గిస్తూ ఈ దురాత్మలు మానవులను మోసగిస్తున్నారు. (ఆదికాండము 2:17; 3:19; యెహెజ్కేలు 18:4; కీర్తన 146:3, 4; ప్రసంగి 9:5, 10) అలా ఒక దురాత్మ చనిపోయినవాని గొంతుతో, జీవించివున్న అతని చుట్టాలతోను లేక స్నేహితులతోను అటు మాంత్రికుల ద్వారాగాని ఆత్మమాధ్యమం నుండి లేక అదృశ్య స్థానంనుండి వచ్చే “స్వరం” ద్వారాగాని మాట్లాడవచ్చు. ఆ “స్వరం” చనిపోయినవారి స్వరంలా అనిపిస్తుంది కాని, వాస్తవానికది దయ్యం స్వరం!

కాబట్టి మీరెప్పుడైనా అలాంటి “స్వరం” వింటే, మోసపోకుండా జాగ్రత్తపడండి. అది చెప్పే ప్రతిదాన్ని తిరస్కరించి, “సాతానా, పొమ్ము” అని యేసు పల్కిన మాటలను మీరూ ఉచ్చరించండి. (మత్తయి 4:10; యాకోబు 4:7) మీరు దురాత్మలతో సంబంధం పెట్టుకొనేలా చేసేట్టు దురాత్మల ఉనికిని గూర్చిన మీ కుతూహలాన్ని అనుమతించవద్దు. దాన్నే అభిచారం అంటారు. అన్ని విధాలైన మంత్రతంత్రాల నుండి దూరంగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. “శకునముచెప్పు సోదెగానినైనను, మాంత్రికునినైనను, దయ్యములయొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు.” అని బైబిలు హెచ్చరిస్తోంది.—ద్వితీయోపదేశకాండము 18:10-12; గలతీయులు 5:19-21; ప్రకటన 21:8.

దయ్యాల ప్రభావంలోకి తెస్తుంది గనుక అవెంత ఆహ్లాదపరిచేవైనా, ఎంత ఉజ్జీవింపజేసేవైనా దాని అలవాట్లన్ని ప్రతిఘటించండి. ఈ అభ్యాసాలలో స్ఫటిక గోళం చూడడం, వీజా బోర్డులను వాడడం, ఇ.ఎస్‌.పి, హస్తసాముద్రికం, జ్యోతిశాస్త్రం, ఇమిడి ఉన్నాయి. దయ్యాలు, తమ నివాస ప్రాంతాలుగా ఏర్పరుచుకున్న ఇళ్లలో యీ అసాధారణ భౌతిక సంఘటనలను కల్గించి శబ్దాలను చేశాయి.

దీనికి తోడు దుష్టాత్మలు మానవులలోని పాపభూయిష్టమైన ఆసక్తినాధారంగా చేసుకొని, అవినీతి, అసహజ లైంగికత్వాన్ని చూపే టి.వీ కార్యక్రమాలను పుస్తకాలనూ సినీమాలనూ, వృద్ధి చేస్తున్నాయి. చెడుతలంపులను మనస్సులోంచి పెకలించి వేయకపోతే అవి చెరగని ముద్రను వేసి, తమలాగే మానవులను అవినీతి క్రియలు చేయడానికి నడిపిస్తాయని దయ్యాలకు తెలుసు.—ఆదికాండము 6:1, 2; 1 థెస్సలొనీకయులు 4:3-8; యూదా 6.

నిజమే, దుష్టాత్మలు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాయన్న అభిప్రాయాన్ని అనేకులు అవహేళన చేయవచ్చు. అయితే, “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు” అని బైబిలు అంటోంది కనుక వారి అపనమ్మకానికి ఆశ్చర్యపడనవసరం లేదు. (2 కొరింథీయులు 11:14) అతడు చాలా తెలివిగా చేసే మోసం వల్ల, తాను, తన దయ్యాలు ఉన్నవన్న విషయాన్ని ప్రజలకు తెలియనివ్వకుండా కన్నుగప్పాడు. కాని మీరు మోసపోకండి! అపవాది, వాని దయ్యాలు నిజంగానే ఉన్నాయి, వాటి నెప్పుడూ ప్రతిఘటిస్తూనే ఉండండి.—2 పేతురు 5:8, 9. 1 పేతురు 5:8, 9.

ఆహా! సాతాను అతని బృందం ఇక ఎన్నటికీ లేకుండపోయే కాలమాసన్నమైంది! “లోకమును [దాన్ని పాలించు దయ్యాలతోసహా] దాని ఆశయు గతించిపోవుచున్నవి” అని బైబిలు ఇలాంటి అభయమిస్తోంది: “దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.” (1 యోహాను 2:17) ఆ దుష్ట ప్రభావం తీసివేసినప్పుడు ఎంత హాయిగా ఉంటుంది! అందుకని దేవుని చిత్తంచేసే ప్రజలతో మనము కూడ దేవుని నీతియుక్త నూతన లోకంలో నిరంతర జీవితాన్ని, అనుభవిద్దాం.—కీర్తన 37:9-11, 29; 2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4.

ప్రత్యేకంగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి

[4వ పేజీలోని చిత్రం]

ఈ లోక రాజ్యాలు అతనివి కాకపోతే సాతాను వాటిని యేసుకు ఇవ్వజూపే వాడేనా?