కంటెంట్‌కు వెళ్లు

విడుదలకు నడుపు దైవీక సత్యమార్గము

విడుదలకు నడుపు దైవీక సత్యమార్గము

విడుదలకు నడుపు దైవీక సత్యమార్గము

“అన్ని మార్గాలు దేవుని దగ్గరకే నడిపిస్తాయి” అనేది, అనేకుల సాధారణ అభిప్రాయం. మానవజాతి మతాలన్నీ దేవునికి అంగీకృతమేనని దీని భావము. ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ భగవద్గీత ఇలా చెబుతోంది: “ఓ అర్జునా! ఎవరు ఇతర దేవతలయెడల, భక్తిగలవారై శ్రద్ధతోగూడి వారి నారాధించుచున్నారో, వారున్ను నన్నే అవిధిపూర్వకముగ (క్రమముతప్పి) ఆరాధించుచున్న వారగుదురు.”—9:23.

1, 2. (ఎ) మతాన్ని గూర్చిన ఏ సాధారణ అభిప్రాయాన్ని పదే పదే అనేకులు వ్యక్తపరుస్తున్నారు? (బి) అయితే, ఇది ఏ ప్రశ్నలను ఉత్పన్నం చేస్తుంది?

2 ‘ఈనాడెన్ని మతసంబంధమైన మార్గాలున్నాయ్‌? మతసంబంధమైన ప్రజలు మతాన్ని ఎన్నుకోవడానికి ఇన్ని రకాలైన మతవిశ్వాసాలు ఎప్పుడూ ఉండేవా? ఉదాహరణకు, భూమిపై ఒక్క మానవుడు మాత్రమే ఉన్న కాలంలో మతసంబంధమైన మార్గాలెన్ని ఉండేవి?’ అని ఒక సహేతుకమైన వ్యక్తి ఆశ్చర్యపడవచ్చును.

3. మొదటి మతాన్ని ఎలా జాడ తీయగలము?

3 మతమనేది మన పూర్వికులనుండి చరిత్రమూలంగా మనకు అందజేయబడిందనే వాస్తవాన్ని ఒకడు కాదనలేడు. మతం చరిత్రతో విడదీయజాలనంతగా ముడివేయబడినందున, మనం చరిత్ర పుట్టుపూర్వోత్తరాల జాడను తీస్తే అది సహేతుకంగా మనల్ని మానవజాతి మొదటి పూర్వికుని దగ్గరికి, అలాగే మొదటి మత మార్గం దగ్గరికి నడిపిస్తుంది. అయితే, ఆ మొదటి మానవుడెవరు? అతని మతమేమిటి?

మొదటి స్త్రీ పురుషుల ఆరంభం

4. మానవ శరీర నిర్మాణాన్ని గూర్చిన బైబిలు సృష్టి వృత్తాంతంతో విజ్ఞానశాస్త్రమెలా అంగీకరిస్తుంది?

4 హిందూ గ్రంథాల ప్రకారం మొదటి మానవుడు మను; బైబిలు ప్రకారం ఆయన పేరు ఆదాము. (ఆదికాండము 5:1) అయితే మొదటి మానవుడెవరో తెలుపగల్గే ప్రమాణసిద్ధమైన, నమ్మదగిన మరియు తెలిసిన వాస్తవాలతో పొందికగల్గిన చరిత్ర ఏదైనా ఉన్నదా? ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలు ఈ ప్రశ్నకున్న సమాధానానికి అదనపు రుజువునిస్తున్నాయి. మన మానవ శరీరం నేల మంటి నుండి లభ్యమయ్యే 90 వివిధరకాల రసాయన మూలపదార్థముల సమ్మిళితమేనని వైద్యశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరిప్పుడు, నేల మంటితో మొదటి మానవుడు సృజించబడ్డాడని నిర్దిష్టంగా చెబుతున్న ప్రాచీన చరిత్ర ఏదైనా ఉంటే దాన్ని మీరు నమ్ముతారా? బైబిలు చెప్పే విషయాన్ని మీరెందుకు చదువకూడదు? ఆదికాండము 2:7 (NW) లో అదిలా తెల్పుతుంది: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణము ఆయెను.”

5, 6. (ఎ) బైబిల్లోని సృష్టి వృత్తాంతం ఎప్పుడు వ్రాయబడింది? (బి) అటుతరువాత వెలువడిన సృష్టికి సంబంధించిన హిందూ ఇతిహాసాలు ఎలా బైబిలుకు అనుగుణ్యంగా ఉన్నాయి?

5 హిందూ పండితుడైన యస్‌. రాధాకృష్ణన్‌ వ్రాసిన కాలవృత్తాంతం, క్రీ.పూ. 975న యెరూషలేమునందున్న రాజైన సొలొమోను గూర్చి చేసిన కాలనిర్ణయం, ప్రవక్తయైన మోషేను వెనుకటికి క్రీ.పూ. రెండవ సహస్రాబ్దపు మధ్య కాలంలో ఉంచుతుంది గనుక, మానవ ఆరంభాన్ని గూర్చిన ఈ ప్రాచీన చరిత్ర గుర్తింపదగినది. (1 రాజులు 6:1 పోల్చండి.) మరియు హిందూ స్వామియైన భరతి కృష్ణ “మోషే ధర్మశాస్త్రాన్ని” గూర్చి వ్రాస్తూ, ఆదికాండము ‘మోషే ధర్మశాస్త్రము’, లేక పెంటాట్యూక్‌లోని తొలి భాగమై ఉన్నందున, దానిని సమకూర్చినవానిగా మోషేను గుర్తించాడు. కచ్చితంగా చెప్పాలంటే, విశ్వసనీయమైన కాలవృత్తాంతం క్రీ.పూ. 1513న ఆదికాండము సమకూర్చబడిందని నిర్ణయిస్తుంది. ఆవిధంగా మొదటి మానవుని ఆరంభాన్ని గూర్చి 20వ శతాబ్దపు వైద్యశాస్త్రజ్ఞులు ఒప్పుకొనే అతి ప్రాచీన కాల వివరణ ఒకటి మనకు ఇక్కడ లభ్యమౌతుంది. ఇది ఇతిహాసక వ్యత్యాసాలు మరియు పౌరాణిక కథలులేని ఓ విశ్వసనీయమైన చరిత్ర!

6 ఇది ఒక హిందువుకు శ్రద్ధ కల్గిస్తుంది, ఎందుచేతనంటే, ఇటీవలి కాలంలో హిందూ పండితులు సంకలనం చేసిన, క్రీ.పూ. మొదటి సహస్రాబ్దపు ప్రథమార్థం నాటిదని ఊహించిన, ఋగ్వేదము, భూమికి ప్రతిరూపమైన పృథ్విని మానవుని తల్లిగా వర్ణించింది. మొదటి మానవుని దేహ నిర్మాణానికే మాతృకగా శతాబ్దాల తరబడి స్మృతిలోనున్న ఈ పుడమే, ఆ తర్వాత భూమాతగా ప్రసిద్ధి చెందింది. ఋగ్వేదము 1. 164. 33 పోల్చండి.

7, 8. (ఎ) మొదటి స్త్రీనిగూర్చిన విశ్వసనీయమైన బైబిలు సృష్టి వృత్తాంతం సాధ్యమేనా? (బి) ఋగ్వేదపు పారంపర్య సమాచారం ఎలా బైబిలు వృత్తాంతాన్ని ప్రతిబింబిస్తుంది?

7 మను సంతానోత్పత్తిని గూర్చిన ఋగ్వేదములోని వృత్తాంతానికి బైబిలు ఆధారమున్నట్లు కనబడుతుంది. ప్రాచీన హిందూ గ్రంథాలు, మొదటి మానవున్ని మను అని, అతనికి భార్య లేనందున తన ప్రక్కటెముకలలో (పర్సు) ఒకదాని నుండి సంతానోత్పత్తిని పొందాడని వర్ణించాయి. ఇటీవలి ఋగ్వేదములోని శ్లోకం మొదటి మానవుడైన మను కుమార్తెగా ఈ ప్రక్కటెముకయైన పర్సు రూపుదాల్చిందని, ఆమె ద్వారా అతనికి పిల్లలు—“ఒక కాన్పుకు ఇరవైమంది” చొప్పున కల్గారని వర్ణించింది! (ఋగ్వేదము 10. 86. 23) మొదటి స్త్రీ, మొదటి మానవుని ప్రక్కటెముకవల్ల కల్గిన దైవోత్పత్తియైనందున కాలక్రమేణ, పారంపర్యరీత్యా ఆమె అతని కుమార్తెగా పరిగణించబడింది.

8 వివేకవంతుడైన ఓ వ్యక్తి ఈ పారంపర్యాన్ని, బైబిల్లోని ఆదికాండము 2:21, 22 నందున్న తొలి చారిత్రాత్మక వృత్తాంతపు సమరూప జ్ఞాపికయేనని గమనిస్తాడు, అక్కడ ఇలా చదువబడుతోంది: “దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.” మొదటి స్త్రీ సృష్టికి సంబంధించిన సాధ్యమైనంత పరిపూర్ణ బైబిలు వృత్తాంతమిదే. ఆసక్తికరమైన విషయమేమంటే, పర్యస్థికను (ఎముకను కప్పివుండే ధాతువులతో కూడిన పొరను) ఉండనిచ్చినంత కాలం, తీసివేయబడిన ప్రక్కటెముక దానికదే పెరిగి, దానంతట అదే భర్తీ చేయబడుతుందని వైద్యులు వెల్లడిచేస్తున్నారు. యెహోవా దేవుడు ఇదే పద్ధతిని ఉపయోగించాడో లేదో బైబిలు మనకు తెల్పడంలేదు. అయినా, మానవుని సృష్టికర్తగా యెహోవా దేవునికి ఈ ప్రక్కటెముకల ప్రత్యేక గుణాన్ని గూర్చి నిశ్చయంగా తెలుసు. మొదటి మానవుని ప్రక్కటెముకను ఉపయోగించి, మొదటి స్త్రీ సృష్టింపబడడాన్ని గూర్చిన బైబిలు వృత్తాంతం సహేతుకంగా ఉంది మరియు అది కట్టుకథ కానే కాదు.

9. సృష్టిని గూర్చిన బైబిలు వృత్తాంతం ఓ హిందువుకి సూటియైన శ్రద్ధాసక్తిని ఎందుకు కల్గిస్తుంది?

9 మానవజాతి ఆది తలిదండ్రుల సృష్టినిగూర్చిన ప్రామాణికమైన బైబిలు వృత్తాంతం, సహజంగానే, తమ సంతానం యొక్క తర్వాతి తరాలకి అందజేయబడింది. కాలక్రమేణ, మానవుని ప్రథమ పూర్వికులను గూర్చిన ఈ జ్ఞాపికలు, అటుపిమ్మట చెదరిపోయిన మానవజాతిలోని జనసముదాయాలలో జనపదాలుగా రూపుదిద్దుకున్నాయి. ఆవిధంగా మను పర్సులను గూర్చిన ఋగ్వేదపు వివరణలు బైబిలునందలి ఆదికాండము యొక్క తొలి వృత్తాంతంపై ఆధారపడి ఉన్నాయి. గనుక, సృష్టి మరియు దాని సృష్టికర్తను గూర్చిన విశ్వసనీయమైన బైబిలు వృత్తాంతాన్ని, నిష్కపటియైన, వివేకవంతుడైన ఓ హిందువు పరిశీలించడం విద్యావిషయిక శ్రద్ధను మాత్రమే కల్గించదు; బదులుగా, అది అతనికి సూటియైన, క్రియాపూర్వకమైన శ్రద్ధను కల్గిస్తుంది.

తొలి మతము జాడను తెలిసికొనుట

10. (ఎ) మానవుని మొదటి మతాన్ని గూర్చి బైబిలేమి చెబుతుంది? (బి) ఎందుకది ఆచరణయోగ్యమైనది?

10 అయితే, ఈ విశ్వసనీయమైన చరిత్ర ఇతర విషయాల ఆరంభాన్ని గూర్చి ఏమని తెల్పుతుంది? ఉదాహరణకు, మతం, పాప మరణాల ఆరంభం సంగతేమిటి? ఆదికాండము 2:15-17 మరల చదవండి: “దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా—ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.” ఈ ఆజ్ఞకు విధేయత చూపడమే దైవభక్తికి నిదర్శనం గనుక, మొదటి మానవుని కోసం ఏర్పాటు చేయబడిన మతాన్ని గూర్చిన వాస్తవిక వివరణను ఈ వృత్తాంతం వివరిస్తుంది. కాబట్టి, దేవునికి విధేయతను చూపించే ఓ మార్గంగా ఉండేదే మొదటి మతము. నైతిక, ఆత్మీయార్థమందు మానవుని కొరకు మంచిచెడులను నిర్ణయించే మన సృష్టికర్త హక్కును అది గుర్తించింది. అది ఎంత సరళమైందో! అచ్చట దేవాలయాలుగాని, చర్చీలుగాని, గురువులుగాని, మిషనరీలుగాని, యాజకులుగాని (పురోహితులు), విగ్రహాలుగాని, ఆచారాలుగాని లేవు. అది మానవుని భౌతిక, మానసిక గ్రహణశక్తికి సాధ్యమైన మతమై ఉండేది. తత్వశాస్త్రంగాని, ఊహా సిద్ధాంతాలుగాని, సామాన్య మానవ సామర్థ్యానికి మించి అర్థం చేసుకోగల లేక పని చేయగల్గేవేవీ అక్కడలేవు. మానవుని మొదటి మతం వాస్తవమైంది, ఆచరణయోగ్యమైంది—తన అవసరాలను తీర్చుకొనే, తన ఉద్యానవన గృహాన్ని జ్ఞానయుక్తంగా తీర్చిదిద్దుకొనే ప్రతిదిన పనిని చేసుకుంటూ తన సృష్టికర్త ఎడల సరళమైన భక్తిని కల్గివుండే ఓ మార్గమే. కచ్చితంగా ఇది నమ్మశక్యమైనదే.

11. మానవుని మొదటి మతము అతన్ని ఎక్కడికి నడిపిస్తుంది?

11 మానవుని మొదటి గృహము భూపరదైసేనని ఆ వాస్తవిక చరిత్ర చెబుతోంది. మరియు అతని మొదటి మతం మరణానికి కాకుండా జీవానికి నడిపేది! మానవుని మొదటి మతం, తన పరిపూర్ణమైన మానవ భౌతిక శరీరంతో—దురాలోచన, పాపముల నుండి విడుదల పొందిన అలాగే కర్మ సిద్ధాంతంవంటి ప్రతికూల పర్యవసానములనుండి నిజంగా విడుదల పొందిన మానవ జీవితంతో అతన్ని నిత్య జీవానికి నడిపే మార్గమే. దేవుడు మానవుని ఎదుట భౌతికంగా శాశ్వత సంతృప్తికరమైన జీవిత ఎంపికను ఉంచాడు; అదే వినాశనానికి, మరణానికి విరుద్ధమైన జీవితము. మానవుడు, కడకు తన దేహాన్ని విడిచి మోక్షాన్ని లేక ముక్తిని పొందుతాడనే మాటేరాలేదు. మానవుని మొదటి మతం ప్రకారం, మరణమనేది ఓ విడుదల లేక ఓ విముక్తి కానేకాదు. బదులుగా, అదొక శిక్ష. అయినా దయచేసి గమనించండి, మానవుడు మరణించాలని, తన భౌతిక కాయాన్ని విడనాడి, భూపరదైసును పోగొట్టుకోవాలనేది దేవుని అభీష్టంకాదు. అయితే జరిగిన తప్పేమిటి?

మరణమెందుకు వచ్చింది?—అదేమిటి?

12, 13. (ఎ) మన మొదటి పూర్వికుడెందుకు మరణించాడు? (బి) తన విధిని మానవుడెందుకు ఎన్నుకోగలిగాడు?

12 మన మొదటి మానవ పూర్వికుడెందుకు మరణించాడు? అతడు తన స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేసినందుననే మరణించాడు. దేవుడు ప్రేమపూర్వకంగా మానవునికి స్వేచ్ఛా ఎంపికను అనుగ్రహించాడు. మనం ఇంతకు క్రితమే (10వ పేరాలో) చదివిన ఆదికాండము 2:17లో దేవుడు బయల్పర్చిన మాటలలో, ఈ విషయాన్ని గమనించగలము. మానవ పరిపూర్ణతను బట్టి మానవునికి స్వేచ్ఛాచిత్తం అవసరము. కాబట్టి మానవునికి ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం అనుగ్రహింపబడింది. నిషేధించబడిన పండును తినాలా, వద్దా? అనేదే ప్రశ్న. దేవుని ఎడల అవిధేయతయా లేక విధేయతయా? ఇలా తన విధిని తానే ఎన్నుకునే స్వతంత్రత మానవునికే విడిచిపెట్టబడింది. ఇది మానవుని వివేచనాశక్తి మరియు ప్రేమించే తన సామర్థ్యానికి తగినట్లుగానే ఇవ్వబడింది.

13 అవును, మానవునికిగల ప్రేమించే సామర్థ్యమే మానవునికి స్వేచ్ఛాచిత్తం ఉందని రుజువుచేస్తుంది. ఒకవేళ, “ప్రేమ” అదృష్టంకొద్ది లేక బలవంతంగా పొందితే అది ప్రేమే కాదు. ప్రేమ ఇష్టపూర్వకమైనదై ఉండాలి—నిజమైన ఆత్మాంగీకారము గలదై ఉండాలి—దేవుని ఎడల మానవునికిగల ప్రేమ నిజమైనది, వాస్తవమైనదిగా ఉండాలంటే, ప్రేమించాలనే అతని అభిలాష స్వేచ్ఛతోకూడినదై ఉండాలి. గనుకనే, మానవుని తొలి మత సంకల్పాన్ని గ్రహించేలా దేవుడు మానవునికి స్వేచ్ఛా నైతిక చిత్తాన్నిచ్చాడు. కాబట్టి మానవుడు తన పరలోక తండ్రి ఎడలగల కృతజ్ఞతనుబట్టి—తెలివైన ఎంపిక చేసికొని తన ప్రేమను చూపగల్గి ఉండేవాడు. ప్రేమను దాని ఫలమునుబట్టి మాత్రమే తెలిసికోగలం, స్వయం-సమృద్ధిగల దేవుని ఎడల ప్రేమ, మానవుడు ఆయనకు కనబర్చే విధేయతనుబట్టి మాత్రమే నిరూపించబడుతుంది. 1 యోహాను 5:3లో బైబిలిలా తెల్పుతుంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”

14. (ఎ) మొదటి మానవుని అవిధేయతా పర్యవసానాలేమిటి? (బి) ఇది అతని సంతానముపై ఎలా ప్రభావం చూపింది?

14 అయితే మన మొదటి పూర్వికుడు ఇష్టపూర్వకంగా అవిధేయతా మార్గాన్ని అనుసరించి, తనకుతానుగా విశ్వానికే దేవుడైనవానికి దూరమయ్యాడు. ఇప్పుడు మానవుడు దేవునిపైగాక తనపైతానే ఆధారపడ్డాడు. తత్ఫలితంగా అతడు తన మానవ పరిపూర్ణతను పోగొట్టుకున్నాడు, మరణం ఒక శిక్షగా మానవజాతిపై దాడిచేసింది. వంశానుగతమనే ప్రకృతి నియమం దానంతటదే అమలులోనికి వచ్చింది, మొదటి మానవుని సంతానం పాపముతో జన్మించింది, అలా దేవునికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మన మొదటి పూర్వికుడు తనకు తెలియపర్చబడిన మతం యొక్క ప్రథమమైన, సరళమైన ఆదేశాన్ని, అంటే, ప్రేమనుబట్టి దేవునికి విధేయతను చూపుటయనే ఆదేశాన్ని అగౌరవపర్చి, అవిధేయత చూపాడు. తత్ఫలితంగా, అతని సంతానం, తమ మహత్తైన వారసత్వాన్ని కోల్పోయారు. అందుచేత, ఋగ్వేద గ్రంథకర్తలతో సహా, మానవజాతియంతటికి పాపం, అపరాధ భావన సంప్రాప్తమైంది. వేదాల్లోని వరుణదేవున్ని సంబోధించి చెప్పబడిన శ్లోకంలో ఇలా ఉంది: “ఓ వరుణా, మానవులుగా మేము పరలోక దూతల ఎదుటచేసే ఏ పాపాన్నైనా, మా ఇష్టాన్నిబట్టి మీ ఆజ్ఞలను ఉల్లంఘించినపుడు ఆ దురితమునుబట్టి దేవా మమ్ములను శిక్షించకుము.”—ఋగ్వేదము 7. 89. 5. బైబిల్లోని రోమీయులు 5:12 పోల్చండి.

15, 16. (ఎ) మరణమంటే ఏమిటి? (బి) కాబట్టి, మరణాన్ని గూర్చిన ప్రసిద్ధిగాంచిన ఏ అభిప్రాయాలు నిజం కావు?

15 దేవుడు తెల్పినట్లే మొదటి మానవుడు తన తిరుగుబాటు కారణంగా తుదకు మరణించాడు. మన మొదటి పూర్వికునిపై మరణ దండన విధించే సమయంలో బయల్పర్చబడిన దైవసంభాషణ ఇలావుంది: “నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువని చెప్పెను.” (ఆదికాండము 3:19) ఇది మానవుని మరణాన్ని గూర్చి దేవుడిచ్చిన వర్ణన. ఆసక్తికరమైన విషయమేమంటే, మృతుల స్థితిని గూర్చిన వేద వర్ణనకు, బైబిల్లోని ఈ వచనమే ఆధారమన్నట్లు కనబడుతుంది. పైన చెప్పబడిన ఋగ్వేద శ్లోకంలోని ఒకటవ వచనం ఇలా తెల్పుతుంది: “వరుణ రాజా, ఇక నన్ను మట్టిగృహంలోనికి ప్రవేశింపనీయకుము: మహా ప్రభువా, కరుణించి నన్ను తప్పించుము.” (ఋగ్వేదము 7. 89. 1) ఈ వచనముపై ఋగ్వేదము యొక్క ఆ పుటలోని అథఃస్సూచి దానిని “మట్టి గృహము మరియు సమాధి” అని తెల్పుతూ “అథర్వణవేదము పంచమస్కంధం. 30. 14. చూడండి” అని అంటోంది. చనిపోయిన మానవ శవం సమాధికి వెళ్లడం, మంటికి మరల చేరడమంటే నిజంగా “మట్టి గృహములో” ప్రవేశించినట్లే!

16 కాబట్టి, మరణమనేది మనుష్యుని తాను వచ్చిన మంటికే మరల చేర్చుతుంది. మరణం, మానవుడు మరొకచోట జీవించడానికి వెళ్లే ద్వారం కాదు. మానవునికి, మరణమంటే జీవానికి వ్యతిరేకమైంది, అంటే ఉనికిలో లేకుండ పోవడమే. మరణం అనంతకాల సంసార బంధాన్ని లేక జన్మపునర్జన్మల చక్రాన్ని ఆరంభించేదికాదు. మరణం జీవానికి అంతము. నిశ్చయంగా, హిందూ సిద్ధాంతమైన సంసారం మరియు ఆత్మదేహాంతరము పొందుతుందనే దాని అనుబంధ బోధ, హిందూ గ్రంథాలన్నింటిలోకెల్లా అతి ప్రాచీనమైన ఋగ్వేదములో లేదు. ఆత్మ దేహాంతరము పొందుతుందనే హిందూ సిద్ధాంతం, ఉపనిషత్తులు సమకూర్చబడేంతవరకు పరిచయం చేయబడలేదు. హిందూ గ్రంథకర్తయైన ఎస్‌. ఎన్‌. దాస్‌గుప్త ప్రకారం ఈ సిద్ధాంతం క్రీ.పూ. 700-600 సంవత్సరాల మధ్య కాలంలో వచ్చింది. అంటే మోషే ఆదికాండములోని రెండవ అధ్యాయాన్ని వ్రాసిన తర్వాత 800-900 సంవత్సరాల మధ్య కాలంలో వచ్చింది.

17. మానవుని బావిజీవితం దేనిపై ఆధారపడివుంది?

17 దేవుని సంకల్పంలో మానవుని బావిజీవితం, అమర్త్యమైన ఆత్మపై ఆధారపడలేదు గాని, చనిపోయిన వ్యక్తిని గూర్చిన దేవుని జ్ఞాపకశక్తిపై ఆధారపడివుంది. ఈ దైవికసత్యానికి అనుగుణంగా దేవుడు “భూమిమీద అతనివంటి వాడెవడును లేడని” చెప్పిన, యోబు అనే ప్రాచీనకాల పితరుడు ఇలా అన్నాడు: “ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు; ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో (“షియోల్‌,” NW) నన్ను దాచినయెడల ఎంతో మేలు, నీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచిన యెడల ఎంతో మేలు, నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను! మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును. ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (ఇటాలిక్కులు మావి) (యోబు 1:8; 14:12-15, ఇది క్రీ.పూ. సుమారు 1500 సంవత్సరాలప్పుడు వ్రాయబడింది.) మానవున్ని దేవుడు యుక్తకాలమందు జ్ఞాపకం చేసుకునేంతవరకు అతడు మరణమనే నిద్రలో ఉండవలసిందే. ఆవిధంగా మానవజాతి యొక్క బావిజీవితం దేవుని నిశ్చయమైన జ్ఞాపకశక్తిమీద ఆధారపడి ఉంటుంది—గానీ, అమర్త్యమైన ఆత్మపై ఆధారపడి ఉండదు.

మానవ పూర్వికులకు భావినిరీక్షణ బయల్పర్చబడినది

18. దేవుడెందుకు మానవజాతిని పూర్తిగా విడిచిపెట్టలేదు?

18 అయితే, మొదటి మానవుడు దేవున్ని విడిచిపెట్టినప్పటికిని, దేవుడు మానవున్ని విడిచి పెట్టేడా? దేవుడు కనికరంతో తన న్యాయాన్ని సమతుల్యపరచాడని మానవజాతి మొదటి చారిత్రాత్మక వ్రాతలు బయల్పరుస్తున్నాయి. మానవజాతి పాప ప్రతిఫలాన్ని అనుభవించేందుకు దేవుడు న్యాయంగానే అనుమతించాడు. అయితే తనతో వారు సమాధానపడడానికి కనికరముతో ఆయనే ఏర్పాటును చేశాడు మరియు భూపరదైసు పునరుద్ధరణను గూర్చిన నిరీక్షణను వారికి అనుగ్రహించాడు. బైబిలు వాస్తవిక చరిత్ర ఇలా విశదపరుస్తుంది: “ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.” (ఇటాలిక్కులు మావి) (రోమా. 8:20, 21) మరి, మానవ చరిత్రను దీర్ఘకాల వ్యర్థ వృత్తాంతమనడం వాస్తవం కాదా? బైబిలు చెప్పే ఈ వ్యాఖ్యాన సత్యాన్ని మానవ చరిత్ర నిజంగా బలపరుస్తుంది. అయితే దేవుడు నిరీక్షణాధారాన్ని ఎలా ఏర్పాటు చేశాడు?

19. యావత్‌ మానవ నిరీక్షణలకు వాగ్దాన పునాది ఏది?

19 మనం తొలి చరిత్ర దగ్గరకు మరలా వెళ్తే, ఆదికాండము 3:15లో దేవుడు మానవజాతికి బయల్పర్చిన నిరీక్షణ ఈ మాటల్లోవుంది: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” ఈ వాగ్దాన పునాదిపైనే మానవజాతి నిరీక్షణలన్నీ ఆధారపడి ఉన్నాయి. నిజానికిది, యావత్‌ మానవజాతికి మన గొప్ప పూర్వికుడైనవాని వాగ్దానమే!

20. (ఎ) బైబిలులోని తొలి ప్రవచనమందు ఏ నాలుగు పాత్రలు ఇమిడివున్నాయి? (బి) మీ మహా పూర్వికునినుండి వచ్చిన ఈ వాగ్దానమెలా నెరవేరుతుంది?

20 మానవ చరిత్రయంతటిలోనూ మొదటిదైన ఈ పరిశుద్ధ ప్రవచనం నాలుగు ముఖ్యపాత్రల చుట్టూ పరిభ్రమిస్తుంది, అవి, (1) సర్పాకృతి వెనుకనున్న శత్రువు, (2) ఆ శత్రు సంతానం, (3) స్త్రీ, (4) ఆమె సంతానము. ఈ పాత్రలు సూచనార్థకంగా చెప్పబడినందువల్ల, ‘స్త్రీ సంతానము’ ఒక “పరిశుద్ధ మర్మము” అని బైబిలు తెల్పుతుంది. (కొలొస్సయులు 1:26 పోల్చండి.) అయిననూ, ఈ ప్రవచనం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో అతడు స్పష్టంగా, దేవుని సర్వాధిపత్యానికి మొదటి, ముఖ్య శత్రువు, తిరుగుబాటుదారుడు, అలాగే అతని మద్దతుదారులే అతని “సంతానము.” “స్త్రీ” దేవుని విశ్వసంస్థకు చిహ్నం, ఆ సంస్థ దేవుని సర్వాధిపత్యానికి భార్యవంటి నమ్మకత్వాన్ని, విధేయతను చూపుతుంది. (యెషయా 54:1, 5; గలతీయులు 4:26; ప్రకటన 12:1 పోల్చండి.) గనుక, తిరుగుబాటుచేసే ప్రముఖున్ని నలుగగొట్టి, దేవుని సర్వాధిపత్యాన్ని హెచ్చించి, దేవుని పరిపాలనకు మద్దతునిచ్చే సకల మానవుల గొప్ప విమోచనకర్తగా ఉండడానికి దేవుని కుమారునిగా, దేవుని విశ్వసంస్థలోని ఆత్మ ప్రాణులనుండి ఈ ‘స్త్రీ సంతానము’ తీసుకుని రాబడుతుంది. కాబట్టి, దుష్టశక్తులకు వ్యతిరేకంగా దేవుడు యుద్ధాన్ని ప్రకటించడం, దైవసర్వాధిపత్యం మరియు మంచితనం అనేవి విజయం సాధిస్తాయనే తుది ఫలితాన్ని ప్రవచించడమే మీ మహాపూర్వికుని నుండి వచ్చిన వాగ్దానము.

21, 22. (ఎ) ఈ బైబిలు వాగ్దానము హిందూ పారంపర్యమందెలా భద్రం చేయబడింది? (బి) ఈ హిందూ చిత్రపటం దేనిని సూచిస్తుంది?

21 హిందూమతం పరిణతి చెందుతున్న వేల సంవత్సరాల కాలమంతటిలోను బైబిలులోని ఈ వాగ్దాన పునాదిని గూర్చిన జ్ఞాపక స్మృతి సజీవంగానే ఉందనేది గుర్తించదగిన వాస్తవము. ‘స్త్రీ సంతానము,’ ‘సర్పము తలమీద’ కొడుతుందని బైబిల్లో వ్రాయబడిన ఈ దైవిక వాగ్దానం, మానవజాతి యొక్క మొదటి మానవ తలిదండ్రులకు బయల్పర్చబడింది, గనుక, ఈ వాగ్దానాన్నిగూర్చిన జాడను కొంతవరకు జనములలో కనుగొనవచ్చును. అది అలాగే కనబడుతుంది.

22 నేడు ఆధునిక హిందువులు సంతాన లక్ష్మి అనే దేవత చిత్రాన్ని పూజిస్తున్నారు. తల్లికుమారుల చిత్రం అంతకుమునుపే తెలుపబడిన “స్త్రీ”ని ఆమె ‘సంతానాన్ని’ గుర్తుకుతేగా, రక్షణ కోసం తల్లి పట్టుకున్న ఖడ్గం, డాలు, స్పష్టంగా శత్రువు నుండి వచ్చిన వైరాన్ని అంటే ముందుగనే ఉన్న ఒక ‘వైరాన్ని’ తెలియజేస్తున్నాయి. వేల సంవత్సరాలు గతించిపోయిన కారణంగా లక్ష్మి చిత్రపటం యొక్క అసలు భావార్థం బహుశ మారిపోయి ఉంటుంది, అయినా అది నిశ్చయంగా మానవుని భూసంబంధమైన ఆది తలిదండ్రులకు తొలుత బైబిలునందు ఇవ్వబడిన మానవజాతి యొక్క తొలి నిరీక్షణలను సూచిస్తుంది. హిందువులు బైబిలునందలి తొలి వాగ్దాన స్మృతిని, బహుశ దానిని గూర్చి తెలియకుండానే ఈ లక్ష్మిచిత్రపటంలో ఇముడ్చుకున్నారు.

23, 24. (ఎ) ఈ చిత్రపటం సహేతుకంగా ఎలా మాత్రమే వివరించబడగలదు? (బి) ఆదికాండము 3:15 యావత్‌ మానవజాతికి ఎటువంటి నిరీక్షణలను కల్గివుంది?

23 హిందూ మతానికి సంబంధించిన ఈ చిత్రాన్ని బైబిల్లోని మొదటి ప్రవచనంతో పోల్చి చూస్తే, ‘హిందూ చిత్రమా లేక బైబిలు లేఖనమా, ఈ రెంటిలో ఏది ముందు వచ్చింది?’ అని అడగడం యుక్తమే. బైబిలు లేఖనమే ముందు అని చరిత్రాధారాన్ని బట్టి నిశ్చయంగా సమాధానమివ్వాలి. ఈ ప్రవచనం, మానవుని మొదటి భూసంబంధమైన పితరుని జీవితకాల ప్రారంభదశలో చెప్పబడింది, పిదప దేవుని నియమిత కాలం వచ్చేవరకు తర్వాతి తరాల వారికి ఈ ప్రవచనము యొక్క వాస్తవిక గూఢార్థం మరుగు చేయబడింది. (కొలొస్సయులు 1:26) మరోవైపు చూస్తే, మత గ్రంథాల్లోను చిత్రపటాల్లోను వర్ణించబడిన ‘మాతృదేవత—మగశిశువు’ అనే తలంపు, మొదటి మానవునికి మునుపు మరియు అతడు స్వీకరించిన మొదటి ప్రవచనానికి మునుపు పుట్టలేదు!

24 బైబిలు లేకుండా, ఈ హిందూ చిత్రపటాన్ని గూర్చిన ఇతర వివరాలు నిరాధారమైన ఊహాగానాలుగా మాత్రమే మిగిలిపోతాయి. ఇష్టానుసారంగా ఇచ్చే వివరాలు వివేచనాశక్తిగల వ్యక్తిని నిజంగా తృప్తిపరచలేవు. కాబట్టి లక్ష్మియొక్క ఆధునిక చిత్రపటంలో వర్ణించబడిన హిందువుల బావి నిరీక్షణల మూలం బైబిల్లో మాత్రమే భద్రపర్చబడిన చరిత్రలో ఉంది. ఆవిధంగా, ఆదికాండము 3:15నందున్న ‘స్త్రీ సంతానాన్ని’ గూర్చిన బైబిలు ప్రవచనం, దేవుని సర్వాధికారానికే అంతిమ గెలుపని, మన భూమితో సహా విశ్వమంతటిలోనుండి యావత్‌ తిరుగుబాటు, దుష్టత్వం పూర్తిగా నిర్మూలించబడుతుందని, యథార్థపరులైన హిందువులకు నిరీక్షణనిస్తుంది. మరియు నిజమైన ‘స్త్రీ సంతానమంటే’ దేవుడు స్వయంగా నియమించిన విమోచకుడే. ఈ ప్రాముఖ్యమైన వివాదాంశాన్ని దేవుడే తన యుక్తకాలంలో తన మార్గం చొప్పున తీర్చవలసిన అవసరముంది గనుకనే ఇంతవరకు ఏ మానవుడు దానిని తీర్చలేక పోయాడు.

25. ఆదికాండము 3:15 యొక్క నిజమైన నెరవేర్పును మనమెలా తెలుసుకోగలం?

25 విశ్వ క్రమాన్ని పునరుద్ధరించాలనే ఈ దైవిక వాగ్దాన నిజమైన నెరవేర్పును కనుగొనేందుకు మానవ చరిత్రను గురించిన మన అన్వేషణను కొనసాగిస్తూనే ఉండాలి. గనుక మనం మనందరి పూర్వికులు అనగా మానవజాతి తొలి ప్రజల చారిత్రక వికాసాన్ని తెలిసికొనడం అవశ్యం. దేవుడు సృజించిన ఆది దంపతులకు పిల్లలున్నారు, క్రమేణ వారివల్ల మానవ కుటుంబం విస్తరించింది. వారు దేవునికి దూరస్థులవ్వడంతో హత్య, వ్యభిచారం మరియు మానవుని ప్రవర్తనా నియమాలు క్షీణించడం మొదలైంది.—ఆదికాండము 5:3-5; 4:8, 23.

అవతారాల ఆవిర్భావం

26-30. (ఎ) అవతారాలనే హిందూ సిద్ధాంతంపై బైబిలెలా వివరాలందిస్తుంది? (బి) కొన్ని హిందూ ఇతిహాసాలకు ఆధారాలు, బైబిలు వాస్తవ చరిత్రలో ఉన్నాయని ఎందుకు చెప్పవచ్చును?

26 అప్పుడు చరిత్రలో ఒక అసాధారణ సంఘటన—హిందూ పురాణాల్లో చోటు చేసుకున్న సంఘటన జరిగింది. బైబిలు ప్రామాణిక చరిత్ర ఇలా తెల్పుతుంది: “నరులు భూమిమీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి, వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. అప్పుడు యెహోవా—‘నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు, అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.’

27 “ఆ దినములలో నెఫీలులను వారు భూమిమీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.

28 “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను.”—ఆదికాండము 6:1-5.

29 అంటే అదృశ్య సామ్రాజ్యంలోనున్న దేవుని తెలివైన ఆత్మ కుమారులు, ఆకర్షణీయమైన మానవ స్త్రీల ఎడల అస్వాభావిక కోరికలు పెంచుకున్నారు, గనుకనే ఈ ‘దేవదూతలు . . . తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసస్థలమును విడిచి పెట్టిరి.’ (యూదా 6) దూతలైన ఈ దైవకుమారులే భూమిపై అవతారాలెత్తారు, లేక మానవావతారాలను దాల్చారు. వారు అందమైన స్త్రీలతోకూడి, మానవాతీత శక్తిగల సంకరజాతి సంతతిని కన్నారు. అవతారం అనే సంస్కృత పదానికి “దిగుట” అని, మరి విశేషంగా ఒక దైవము దివినుండి భువికి దిగుట అని అర్థం. తర్వాతి కాలంలో హిందూ అవతారాలను గూర్చిన సిద్ధాంతమందు చోటు చేసుకున్న ఈ వాస్తవిక సంఘటనలను బైబిలు చరిత్ర మనకిక్కడ తెల్పుతుంది.

30 ఈ వాస్తవిక బైబిలు వృత్తాంతం, పురాణములుగా ప్రసిద్ధిగాంచిన హిందూ వేదాంత గ్రంథాలపై కూడా వెలుగును ప్రసరింపజేస్తుంది. ఈ పురాణములు దేవతలు, రాక్షసులు, వారి శౌర్యకార్యాలు, వారి ప్రేమకలాపాలు, యుద్ధాలు మరియు అద్భుతక్రియలను గూర్చి వివరిస్తున్నాయి. బలమైన భౌతిక కాంక్షగల గంధర్వులనే ఓ దేవతల తరగతిని గూర్చి పురాణాలు వర్ణిస్తున్నాయి. గంధర్వులు వివాహబంధాలను కూడా కల్గివున్నారు మరియు వారు స్త్రీలను ప్రేమిస్తూ ఎల్లప్పుడూ స్త్రీలను గూర్చి తలస్తుండేవారని చెప్పబడింది. అప్సరసలనే వారు వారి భార్యలని, అప్సరసలు మోహినీలని, కామినీలని, మాతృత్వానురాగాలు లేనివారని హిందూమత గ్రంథాల్లో వర్ణించబడింది. అప్సరసలు కూడ ప్రియమైనదిగా ఎంచే భౌతిక కాంక్షను కల్గివున్నారు. హిందూ వేదాంతమందలి మరో వేల్పుల గుంపే గానకింకరులు, మరి ఒక హిందూ అధికారిక రచన ప్రకారం బలాఢ్యులైన సంకరజాతివారిగా గానకింకరులు చెప్పబడ్డారు. ఈ వృత్తాంతాలు, అవిధేయులగు దేవుని కుమారులను గూర్చి బైబిలు తెల్పే యథార్థ వృత్తాంతం ప్రకారంగానే ఉన్నాయి. ఆ దేవదూతలు ప్రేమకలాపాల్లో మునిగారు; వారు కూడ గొప్పకార్యాలను, సూచక క్రియలను చేయగల్గారు. మరి వారు భీకరులైన తమ సంకరజాతి సంతానం ద్వారా ఎన్నో శూరశౌర్యకార్యాలు చేయగల్గారు. అవిధేయులైన ఆ దేవదూతలు, రాక్షసులు భూమి మీద కనీసం 120 సంవత్సరాలు జీవించారు. బైబిలు తెల్పుతున్నట్లుగానే పేరు పొందిన అనేక శూరశౌర్యకార్యాలు చేయడానికి వారికి ఆ కాలం సరిపోయింది. కావున, అనేక ప్రాచీన ప్రజల మతపరమైన ఇతిహాసాలలో ఎంతో కొంత తేడాలతో ఈ సంఘటనలను గూర్చిన వివరాలు అందించబడ్డాయి.

31, 32. దేవుడెందుకు గొప్ప జలప్రవాహాన్ని రప్పించాడు?

31 అయితే, ఈ సంఘటనలు చెడుతనాన్ని విస్తరింపజేసిన కారణాన దేవుడు భూమ్మీదికి గొప్ప జలప్రవాహాన్ని లేక జలప్రళయాన్ని రప్పించవలసి వచ్చింది. వాస్తవిక చరిత్ర ఇలా తెలియజేస్తుంది: “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. దేవుడు నోవహుతో— . . . ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశనము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.”—ఆదికాండము 6:11-17.

32 “అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.”—ఆదికాండము 7:21.

33. ప్రస్తుత యుగం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది?

33 ఆ ప్రళయం లేక ప్రవాహాం సంభవించిన కారణంగా, భూమి ఇప్పుడు శుభ్రం చేయబడింది. దేవుడు నీతియెడల తన ప్రేమను ప్రదర్శించాడు మరియు ఆయన కొందరిని కాపాడినందున మానవజాతికి మరలా క్రొత్తదశ ఆరంభమైంది. మన ప్రస్తుత యుగం ఆరంభమైంది. అయినను, జలప్రళయాన్నుంచి తప్పించుకున్నవారి మనస్సుల్లో జలప్రళయానికి ముందున్న సంఘటనలు ఇంకా మెదులుతూనే ఉన్నందున అవి ఈనాడు అనేకులు నమ్ముతున్న మత విశ్వాసాలకు, దేవుళ్లను గూర్చిన నమ్మకాలకు నాంది పలికాయి.

దయ్యాలనెవరు సృజించారు?

34. ఆ అవతారాలకేమి సంభవించింది?

34జలప్రళయం భక్తిహీనులను జల సమాధి చేసినపుడు, తిరుగుబాటుదారులైన దేవదూతలు తమ దేహాలను విడిచి, మరల ఆత్మీయ లోకానికి వెళ్లారు మరియు వారు దేవుని నీతి పరిపాలన విషయంలో ఆయనకు మద్దతునివ్వడానికి కాదుగానీ, దేవుని ముఖ్య విరోధియైన దయ్యాల అధిపతి సేనలో చేరిపోవడానికే అలా వెళ్లారు. మొట్టమొదట, ప్రథమ స్త్రీ పురుషులు దేవుని సర్వాధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వారిని ప్రేరేపించిందీ ఈ మొదటి దయ్యమే మరియు ఆదికాండము 3:15నందలి గొప్ప ప్రవచనంలో సంబోధించబడినవాడూ ఇతడే. జీవన్మరణాల విషయంలో తప్పుడు తలంపులు కల్గించి, నయవంచనతో మానవ తిరుగుబాటు తెచ్చిందల్లా ఈ మొదటి దయ్యమే. అదెలా జరిగింది?

35. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు మన మొదటి మానవ పూర్వికులను మొదటి దయ్యమెలా పురికొల్పాడు?

35ఆదికాండము 3:1-5లోని వృత్తాంతాన్ని మరల మనం కలిసి పరిశీలిద్దాం: “దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో—‘ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?’ అని అడిగెను. అందుకు స్త్రీ— ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు—మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము—‘మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పెను.’”

36. సాతాను ఏమి కొనసాగించాడు, అతడెలా సర్వలోకాన్ని మోసగిస్తున్నాడు?

36 సర్పము ద్వారా మాట్లాడుచూ, దేవునికి విరుద్ధంగా చెప్పినందువల్ల, ఈ మొదటి అపవాది తనకుతానే అబద్ధికునిగాను అబద్ధమునకు జనకునిగాను మార్చుకున్నాడు. (యోహాను 8:44) దేవునికి ఎదురు తిరిగినందున ఇతడు సాతాను అని పిలువబడ్డానికి కారణమైంది, ఎందుకంటే సాతాను అను మాటకు “విరోధి” లేక “ఎదిరించువాడు” అని అర్థం. మానవజాతి నిత్యం జీవించడానికి దేవునికి లోబడనక్కర్లేదనే విషయాన్ని సాతాను ఎడతెగక వారికి చెబుతూ వచ్చాడు. అలా సాతాను జీవన్మరణాలను గూర్చి మానవుల్లో తప్పుడు భావాలను దొంగచాటుగా ప్రవేశపెట్టాడు. వాస్తవానికి, సాతాను సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడని బైబిలు చెబుతుంది. (ప్రకటన 12:9) ఈ తప్పుడు భావాలను ఆధారం చేసుకునే, నేడు మానవుల్లో అనేకులు జీవన్మరణాల విషయంలో తప్పుడు నమ్మకాలను కలిగివున్నారు. సహజంగా, వేల సంవత్సరాలుగా వస్తున్న ఆ అభిప్రాయాలే జీవన్మరణాలు మరియు మతం మొదలైన విషయాల్లో సాధారణ నమ్మకాలుగా, విశ్వాసాలుగా మారిపోయాయి.

37. పరిపూర్ణుడైన దేవదూత ఎలా అపవాది కాగలిగాడు?

37 అయితే పరిపూర్ణుడైన దేవదూత, ఒక అపవాదిగా లేక దయ్యంగా ఎలా మారగలడు? అని మీరడగవచ్చు. పరిపూర్ణుడైన మొదటి మానవుడు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసినట్లే ఇతడు చేశాడు. స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగపరచడం ద్వారానే అలా చేశాడు! మంచివాడెలా నేరస్థుడౌతాడు? ఒకడు దొంగతనం చేస్తే తన్నుతాను దొంగగా మార్చుకుంటాడు. అలాగే, నైతిక స్వేచ్ఛగల ఒక పరిపూర్ణుడు, మానవుడే గాని లేదా దేవదూతయే గాని తన స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేసుకొని, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగలడు. జలప్రళయం సంభవించడానికి మునుపున్న తరంలోని దేవుని పరిపూర్ణ కుమారులైన దేవదూతల విషయంలో ఇదే జరిగింది. తమ నివాసస్థలాన్ని విడిచిపెట్టడానికి వారు తమ స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించారు. అయితే ఇప్పుడు వారు జలప్రళయం లేక జలప్రవాహం కారణంగా, దేవుని అనుగ్రహపాత్రులు కాకపోయినను ఆత్మీయ ఉనికికే మరలా రావాల్సి వచ్చింది.

ఆర్యులు ఇండియాకు ఎలా వచ్చారు

38, 39. ఈ ప్రస్తుత యుగంలోనే, మానవజాతిపై తమ చెడుప్రబావాన్ని ప్రయోగించేందుకు మొదటి అవకాశం దయ్యాలకు ఎప్పుడు లభించింది?

38 జలప్రళయానంతరం, శుభ్రపర్చబడిన భూమ్మీద ఈ దయ్యాలు, సాతాను నాయకత్వం క్రింద మానవులపై తమ చెడు ప్రభావాన్ని చూపించడానికి ఉపక్రమించి, మానవజాతిని మరల ఆయన సర్వాధిపత్యం లేక పరిపాలనాధిపత్యం క్రిందికి తేవలెనని దేవుడు బయల్పరచిన సంకల్పం వృద్ధిచెందకుండా వ్యతిరేకిస్తూ వచ్చారు. (ఆదికాండము 3:15) ఏకకాలంలో యావత్‌ మానవజాతి ఒకే భాషను మాట్లాడుతున్న ఈ ప్రస్తుత యుగంలోనే వారు తమ మొదటి అవకాశాన్ని ఉపయోగించారు. ఈ చరిత్రను మీరే స్వయంగా ఆదికాండము 11:1-9లో చదువుకోవచ్చు:

39 “భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడవారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు—‘మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనిరి.

40. వారి తిరుగుబాటు పథకాలను సర్వశక్తిమంతుడైన దేవుడెలా వమ్ముచేశాడు?

40 “యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా—ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపనియైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదర గొట్టెను.”

41. (ఎ) ఈవిధంగా, బైబిలు ఏ చారిత్రాత్మక ప్రారంభాలను బయల్పపరుస్తుంది? (బి) బైబిలునందు మనమాసక్తిని ఎడతెగక కనబరచడానికి ఇదెందుకు యోగ్యమైవుంది?

41 కావున, సంస్కృతం, ప్రాకృతం, పాలి మరియు ద్రవిడ భాషలతో సహా ఇండో యూరోపియన్‌ భాషలన్నిటి మూలమును తెల్పే అతిప్రాచీన చారిత్రాత్మక వృత్తాంతమిదే. బాబెలునొద్ద దేవుడు జోక్యం చేసుకున్నందువల్లనే, పూర్వం జరిగిన గొప్ప వలసలలో కొన్ని ఆర్య వంశాలు మధ్యాసియాద్వారా ఇండియాకు, ఐరోపాకు చెదరిపోవడానికి కారణమైంది. ప్రస్తుత దేశాలకు, భాషలకు మూలం ఇవేనని ఆధునిక విజ్ఞానశాస్త్రం బలపరుస్తుంది. ఉదాహరణకు, ప్రాచ్య (తూర్పుదేశ) భాషా పండితుడైన సర్‌ హెన్రీ రాలిన్‌సన్‌ ఇలా పేర్కొన్నాడు: “మనం నానా భాషలయొక్క అంతర్గత రేఖా కూడలిద్వారాను, ప్రత్యేకంగా లేఖనాల్లోని వృత్తాంతము ద్వారా నడిపింపబడితే, అదెలాగైనా పలుభాషల కిరణాలు పలుప్రాంతాలకు ప్రాకిపోవడానికి ప్రారంభమైన షీనారు మైదానానికే నడిపిస్తాయి.” నిర్ద్వందంగా, మీ భాష, మీ దేశం ఏర్పడిన చారిత్రాత్మక ప్రారంభదశను బైబిలు తెల్పుతుంది మరియు మీరు శ్రద్ధతో, ధ్యాసతో పరిశీలించదగిన యోగ్యతను బైబిలు కల్గివుంది.

42. (ఎ) బాబెలునొద్ద దేవుడు జోక్యం చేసుకొన్న తరువాత జరిగిన మానవ పరిణామాలేమిటి? (బి) “మార్గాలన్నీ దేవుని దగ్గరకే నడుపుతాయని” అనేకులు ఎందుకు నమ్ముతున్నారు? (సి) నైతిక చట్టాన్ని కల్గివుండడమే దేవుని నుండి వచ్చిన ప్రత్యక్ష దైవిక ప్రకటనకి రుజువై ఉందా?

42 దైవికచిత్తాన్ని తిరస్కరించడాన్ని గూర్చిన మరో తిరస్కృతే బాబెలు గోపురపు అంతర్గాథ, మరి దేవుడు జోక్యం చేసుకున్నందున పరాజయం పాలైన మానవులు, పిదప భూదిగంతాల వరకు భాషాప్రాతిపదిక గుంపులుగా వలస పోవడానికి దోహదపడింది. కాబట్టి, విశ్వసనీయమైన చరిత్ర ఇలా చెబుతోంది: “వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమి మీద వ్యాపించెను.” (ఆదికాండము 10:32) దైవ సర్వాధిపత్యాన్నుండి మానవజాతి వైదొలగినందున, తమ స్వంత రాజ్యాధిపత్యాలను, యాజకత్వాలను (పౌరోహిత్యాలను) ఏర్పాటు చేసుకున్నారు. తత్ఫలితంగా వివిధ మతాలు, వాటివాటి నిర్దేశిత నమ్మకాలు, ఆచారాలు, మతకర్మలు, ఊహాపూరిత ఆలోచనలనే తలంపులతో అంటే బాబెలునుండి వచ్చిన తలంపులతో ప్రభావితమయ్యాయి. అయినా, సృజింపబడిన మన మొదటి తలిదండ్రులలో నాటబడిన దేవుడు అనుగ్రహించిన మనస్సాక్షి “మార్గాలన్నీ దేవుని దగ్గరకే నడుపు”తాయని అనేకులు విశ్వసించడానికి కారణమైన సమపోలికగల నైతిక చట్టాలను కల్గివుండడానికి నిస్సందేహంగా ప్రపంచమతాలను ప్రేరేపించింది. బైబిలు ఈ విషయాన్ని ఇలా వివరిస్తుంది: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.” (రోమీయులు 2:14, 15) అయితే, నైతిక చట్టాన్ని కల్గివుండడమే దైవిక ప్రకటనను కల్గివున్నట్లు కాదు. నాస్తిక సిద్ధాంతమైన సామ్యవాదం, కొన్ని మతాలు కల్గివున్న నైతిక చట్టాల్నే కల్గివుంది. అవును, ఈ క్రింది సమాచారం తెల్పుతున్నట్లు దైవిక ప్రకటనలో కేవలం నైతిక చట్టానికంటే ఎంతో ఎక్కువ ఉంది.

మానవులు దేవునితో సమాధానపడడానికి సిద్ధంచేయడం

43. దేవుడు మానవజాతిని మరచిపోలేదని చరిత్రయంతటిలోను ఆయనెలా చూపించాడు?

43 మానవులు దైవ చిత్తాన్ని విడిచిపెట్టినప్పటికీ, దేవుడు మానవజాతిని ఇంకనూ ఉనికిలో ఉండనిచ్చాడు. అందుకే బైబిలు మనకిలా అభయమిస్తుంది: “ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదు.”—అపొస్తలులకార్యములు 14:16, 17.

44. (ఎ) మానవులు తనతో సమాధానపడేందుకు దేవుడెలా ఉద్దేశించాడు? (బి) విమోచకుడైన ‘వాగ్దాన సంతానాన్ని’ తయారుచేయడానికి దేవుడు అబ్రాహాము సంతానాన్నే ఎందుకు ఎన్నుకున్నాడు?

44 మానవజాతి యొక్క ఇష్టపూర్వక మొండివైఖరిని మనస్సునందుంచుకొని, దేవునితో సమాధానకరమైన స్థితిలోనికి వారు ఇష్టపూర్వకముగా ఎలా రాగలరు? అని మనం అడుగుతాము. సకలజాతులూ ప్రయోజనం పొందేలాగున, తన ఉపకరణంగా ఉండేందుకు మానవ కుటుంబంనుండి ఓ చిన్న సమాజాన్ని దేవుడు ప్రేమపూర్వకంగా ఏర్పర్చుకున్నాడు. పాపాన్ని స్వతంత్రించుకొనిన వాడైనప్పటికిని, బయల్పరచబడిన దేవుని చిత్తానికి అచంచలమైన మద్దతునిచ్చిన మూలపురుషుడగు అబ్రాహాము సంతానాన్ని ఉపయోగించుకొనేందుకు సృష్టికర్త వారిని ఏర్పర్చుకున్నాడు. దేవుని చిత్తం చొప్పున అబ్రాహాము తన స్వకీయ కుమారుడగు ఇస్సాకును సహితం ఇష్టపూర్వకంగా బలివ్వడానికి సంసిద్ధతను వ్యక్తపరచినప్పుడు, “యెహోవా దూత . . . పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను—నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెను.”—ఆదికాండము 22:15-18.

45. (ఎ) యూదులు ఇతర మానవులకంటె ఎందుకు శ్రేష్ఠులుకారు? (బి) అలా నిర్మొహమాటంగా చెప్పడం బైబిలును గూర్చి ఏమి తెల్పుతుంది?

45 అందువల్ల, ఆదికాండము 3:15లోని విమోచకుడైన ‘వాగ్దాన-సంతానము’ గుర్తించదగిన రీతిగా అబ్రాహాము సంతతిలోనుండి ఉద్భవించాల్సి ఉంది. అయినా, అబ్రాహాము సంతానమైన—యూదులు—మానవజాతిలోని ఇతర జాతులకన్నా శ్రేష్ఠులైనందువల్ల ఎన్నుకోబడలేదు. దేవునికి ఆ జనాంగానికి మధ్యవర్తియైన మోషే, ద్వితీయోపదేశకాండము 9:6లో వ్రాయబడినట్లు, ఈ విషయాన్నిలా తెల్పాడు: “మీరు లోబడనొల్లనివారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను.” (నిర్మొహమాటమైన ఆ మాటలు నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన చారిత్రక వాస్తవాలను తెలియజేస్తున్నాయి!) అయితే దైవిక ఉపకరణంగా యూదా జనాంగాన్నే ఎందుకు ఎన్నుకోవాలి?

46. (ఎ) దేవుని ఎంపికకు మనమెందుకు ఆగ్రహం చెందకూడదో ఉదహరించండి. (బి) ఇశ్రాయేలీయులతో తాత్కాలికంగా వ్యవహరించడంలో దేవుని సంకల్పమేమిటి?

46 ఎందుకనగా, తన నమ్మకమైన కుమారుడగు ఇస్సాకు మరియు మనుమడైన యాకోబుద్వారా వారు అబ్రాహాము సంతానమై ఉన్నారు. ఇంతేగాక, మానవజాతి విమోచకుడు అవతారపురుషునిగా లేక దైవ-మానవునిగా కాదుగానీ, అబ్రాహాము సహజ వంశస్థుడై పరిపూర్ణ మానవునిగా మానవ లోకంలో జన్మించాల్సివుంది. పూర్వికులు విశ్వాసులైనందున దేవుడు ఏ జనాంగాన్ని ఏర్పరచుకున్నా ఇతర జనాంగాలు, తాము విడిచిపెట్టబడ్డామని ఆగ్రహం చెందవచ్చు. అయితే, దేవుని ఎంపికలోని నీతియుక్తమైన ఏర్పాటునందు నమ్మకముంచేవారెవరైనా అలా ఎన్నడూ తలంచరు. ఉదాహరణకు, ఒక రంగస్థలంపై ప్రదర్శింపబడే నాటకాన్ని చూడడానికి గొప్ప ప్రేక్షకుల గుంపు హాజరైనపుడు, రంగస్థలంపై వారు నటించనందున తాము విసర్జింపబడ్డామని భావించరు. అలాగే, దేవుని నియమాలను, కార్యాలను లోకానికి బోధించడానికి దేవుడు మానవులలోనుండి కొద్దిమందిని సజీవ దృష్టాంతంగా ఏర్పరచుకొన్నప్పుడు మిగతా మానవజాతిని ఆయన అలక్ష్యం చేయలేదు. దేవుని జ్ఞానయుక్తమైన, నీతియుక్తమైన చట్టాలకు విధేయులైనప్పుడుగానీ, అవిధేయులైనప్పుడుగానీ ఏమి సంభవిస్తుందో ఇశ్రాయేలీయుల చరిత్రే మానవులందరికి తెలియపరస్తుంది. అలా దేవుడు ఇశ్రాయేలీయులతోనే తాత్కాలికంగా వ్యవహరిస్తున్నప్పటికిని, సమస్త జనులను తర్వాతి కాలంలో ఆశీర్వదించే తన దీర్ఘకాల సంకల్పాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు.—ఆదికాండము 22:18.

మరైతే మీ భవిష్యత్తేమిటి?

47. (ఎ) మన పరిశోధన ఎందుకు బైబిలునందు దృఢనమ్మకాన్ని కల్గించాలి? (బి) బైబిలు మీకెలాంటి భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది, ఎటువంటి అభయంతో?

47 జీవం, పాపం, మరణం, మతాలను గూర్చిన వాస్తవిక ఆవిర్భావ జాడను కనుగొన్నాము. ఆధునిక విజ్ఞానశాస్త్రం, అలాగే, హిందూ సంప్రదాయం కూడ న్యాయసమ్మతంగానే బైబిలు విశ్వసనీయ చరిత్రను ధ్రువీకరించడాన్ని మనం పరిశీలించాం. దైవిక సత్యమార్గం ఎలా విడవబడిందో, పాపమరణాలనుండి నిజమైన విడుదలను గూర్చిన దివ్య వాగ్దానమెలా వచ్చిందో మనము గమనించాం. ఇది భవిష్యత్తును గూర్చి బైబిలు చెబుతున్న దానిపై నమ్మకాన్ని కల్గివుండేందుకు ఒకవ్యక్తిని నడిపిస్తుంది. దేవుడు మీ కొరకు బహుసంతోషకరమైన, శ్రేయస్కరమైన భవిష్యత్తును ఏర్పాటు చేస్తున్నాడనే దృఢనమ్మకాన్ని మీరు కల్గివుండగలరు. మానవజాతి కొరకైన దేవుని ఆది సంకల్పమంటే మనం పరదైసు భూమిలో మానవ పరిపూర్ణతతో జీవించాలనేదేనని మనం నేర్చుకున్నాము. ఆ దివ్యమైన పరదైసు ఇదే భూమిపై పునరుద్ధరింపబడుతుందని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెషయా 55:10, 11లో వ్రాయబడినట్లు వాస్తవిక బైబిలు చరిత్ర యొక్క దేవుడు ఇలా చెబుతున్నాడు: “ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును.”

48. నీతిమంతులు భూమ్మీద ఎంతకాలం, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తారు?

48 కాబట్టి పునరుద్ధరింపబడిన భూ పరదైసులో నివసించడమే మీ వ్యక్తిగత భవిష్య నిరీక్షణలు, సంక్షేమాలు అయివుండొచ్చు. మీ ప్రకృతిశరీరాన్ని సమస్త పాపాలనుండి, అపరిపూర్ణతలనుండి శుద్ధీకరించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు, ఆవిధంగా మీరు శరీరరీత్యా మానవ పరిపూర్ణతకు చేరుకుంటారు. కీర్తన 37:29లో బైబిలు ఇలా చెబుతుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” అలాగే యెషయా 33:24లో మనమిలా చదువుతాము: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.”

49. (ఎ) ఈ ఆశ్చర్యకరమైన వరాలను ఏర్పాటుచేస్తున్న దేవుడెవరు? (బి) యెహోవా ఎటువంటి దేవుడు?

49 అయితే మానవులకు అసాధ్యమైన ఈ వరాలను మీకు అనుగ్రహించే సంకల్పం కల్గియున్న ఆ దేవుడెవరు? మనమింతకు ముందే తెలిసికొన్న రీతిగా ఆయన పేరు యెహోవా. దాని భావం దేవుని ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వానికి అనుగుణంగానే ఉంది. యెహోవా అను నామమునకు అర్థము “తానే కర్త అవుతాడు” అనగా (ఆయన వాగ్దానములను లేక బయల్పరచబడిన ఆయన సంకల్పములను) నెరవేర్చువాడు. నిజమైన మరియు సజీవుడగు దేవుడు మాత్రమే న్యాయంగా, ప్రమాణసిద్ధంగా అట్టి నామాన్ని ధరించగలడు. యెహోవాను గూర్చి బైబిలిలా తెల్పుతోంది: “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును.”—కీర్తన 100:3, 5.

50. యెహోవా ఎందుకు పక్షపాతంగల దేవుడు కాదు?

50 యెహోవా దయాళుడు, కృపాసత్యసంపూర్ణుడు గనుకనే మీరు మీ కుటుంబము అలాంటి దివ్యమైన భవిష్యత్తును పొందే ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు ఓ వివేకశాలియైన వ్యక్తి ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతికాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.

51. ఈ ప్రాముఖ్యమైన అంశములను గూర్చి ఇంకనూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలను మీరెలా పొందగలరు?

51 అయితే, ఈ శ్రేష్ఠమైన వాగ్దానాలను మీరెప్పుడు అనుభవించగలరు? యావద్భూమిపై పరదైసు ఎలా పునరుద్ధరింపబడుతుంది? అలా అది పునరుద్ధరింపబడినప్పుడు మీరు సజీవంగావుంటారా? సమాధానాలకొరకు మీరు స్వయంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలును పరిశీలించి పఠించాలని మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాము. అలాగే మీ ప్రదేశములోనున్న యెహోవాసాక్షులను కలుసుకోండి, లేదా ఈ పుస్తక ప్రచురణ కర్తలకు వ్రాయండి. మీ సంపూర్ణ తృప్తిమేరకు అతి ప్రాముఖ్యమైన ఈ విషయాలను ఉచితంగా చర్చించే ఏర్పాటు చేయబడగలదు.

[అధ్యయన ప్రశ్నలు]

[Map on page 24]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

వలసలకు కారణమైన భాషల తారుమారు

బాబెలు

ఆఫ్రికా

ఇండియా

[5వ పేజీలోని చిత్రం]

మొదటి మానవుడు నేలమంటితో నిర్మించబడ్డాడు

[7వ పేజీలోని చిత్రం]

మొదటి స్త్రీ మానవుని ఓ ప్రక్కటెముకనుండి సృజించబడింది

[0వ పేజీలోని చిత్రం]

అనంతమైన మానవ జీవము తుదకు మోక్షాన్ని నివృత్తిచేస్తుంది

[21వ పేజీలోని చిత్రం]

ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం: దేవుని ఎడల అవిధేయతయా లేక విధేయతయా?

[24వ పేజీలోని చిత్రం]

అపరిపూర్ణ జీవితం

[25వ పేజీలోని చిత్రం]

వాగ్దాన సంతానం సర్పం తలను చితకగొట్టును

[31వ పేజీలోని చిత్రం]

ఇతిహాసాల్లో పేరుపొందిన సంకరజాతి రాక్షసులు

[30వ పేజీలో పూర్తిపేజీ చిత్రం ఉంది]