కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 2

మీరు నిజంగా ‘దేవునికి సన్నిహితం’ కాగలరా?

మీరు నిజంగా ‘దేవునికి సన్నిహితం’ కాగలరా?

1, 2.(ఎ)అనేకులకు ఏది అవాస్తవిక తలంపుగా అనిపించవచ్చు, అయితే బైబిలు మనకు ఏమని హామీ ఇస్తోంది? (బి) అబ్రాహాముకు ఎలాంటి సన్నిహిత సంబంధం అనుగ్రహించబడింది, ఎందుకు?

 భూమ్యాకాశాల సృష్టికర్త, “ఈయన నా స్నేహితుడు” అని మీ గురించి చెబితే మీరెలా భావిస్తారు? చాలామందికి ఆ తలంపు అవాస్తవంగా అనిపించవచ్చు. ఏదేమైనా, అల్పుడైన మానవుడు యెహోవా దేవునితో ఎప్పటికైనా ఎలా స్నేహబంధం ఏర్పరచుకోగలడు? అయితే, మనం నిజంగానే దేవునికి సన్నిహితులం కాగలమని బైబిలు మనకు హామీ ఇస్తోంది.

2 అలాంటి సాన్నిహిత్యాన్ని అనుభవించిన వారిలో ప్రాచీనకాలపు అబ్రాహాము ఒకడు. ఆ పితరుణ్ణి యెహోవా “నా స్నేహితుడు” అని అన్నాడు. (యెషయా 41:8) అవును, అబ్రాహామును యెహోవా తన స్నేహితునిగా పరిగణించాడు. అబ్రాహాము ‘యెహోవాను నమ్మాడు’ కాబట్టే ఆయనకు ఆ సన్నిహిత సంబంధం అనుగ్రహించబడింది. (యాకోబు 2:23, NW) నేడు కూడా, ప్రేమతో తనను సేవించే ‘వారియందు ఆనందించే’ అవకాశాల కొరకు యెహోవా చూస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 10:15) ఆయన వాక్యమిలా ఉద్బోధిస్తోంది: ‘దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు.’ (యాకోబు 4:8, NW) ఈ మాటల్లో మనకు ఆహ్వానం, వాగ్దానం ఈ రెండూ కనబడుతున్నాయి.

3.యెహోవా మనకు ఎలాంటి ఆహ్వానాన్ని అందిస్తున్నాడు, దానికి ఏ వాగ్దానం ముడిపెట్టబడింది?

3 యెహోవా తనకు సన్నిహితమవమని మనలను ఆహ్వానిస్తున్నాడు. మనలను తన స్నేహితులుగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా, సుముఖంగా ఉన్నాడు. అదే సమయంలో, మనం ఆయనకు సన్నిహితమయ్యేందుకు చర్యలు తీసుకుంటే, తత్సమానమైన చర్య తానూ తీసుకుంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఆయన మనకు సన్నిహితమవుతాడు. ఆ విధంగా మనం నిజంగా అమూల్యమైన సంబంధంలోకి అంటే ‘యెహోవాతో స్నేహబంధంలోకి’ ప్రవేశిస్తాం. * (కీర్తన 25:14, NW) ‘స్నేహబంధం,’ ఒక ప్రత్యేక స్నేహితునితో జరిపే ఆంతరంగిక సంభాషణ అనే తలంపునిస్తుంది.

4.సన్నిహిత స్నేహితుణ్ణి మీరెలా వర్ణిస్తారు, యెహోవా తనకు సన్నిహితమయ్యే వారికి తాను సన్నిహిత స్నేహితుడనని ఎలా నిరూపించుకుంటాడు?

4 నమ్మకంగా మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకోగల సన్నిహిత స్నేహితుడు మీకున్నాడా? అలాంటి స్నేహితుడే మీ గురించి శ్రద్ధ తీసుకుంటాడు. ఆయనను మీరు నమ్ముతారు, ఎందుకంటే తాను యథార్థపరుడనని ఆయన నిరూపించుకొన్నాడు. మీ ఆనందానుభూతులు ఆయనతో పంచుకున్నప్పుడు అవి మరింత ప్రబలమౌతాయి. ఆయన సానుభూతితో విన్నప్పుడు మీ దుఃఖభారం తేలికవుతుంది. ఎవ్వరూ మిమ్మల్ని అర్థంచేసుకోనట్లు అనిపించినప్పుడు కూడా ఆయన అర్థంచేసుకుంటాడు. అదే ప్రకారం, మీరు దేవునికి సన్నిహితమైనప్పుడు, మిమ్మల్ని నిజంగా విలువైనవారిగా పరిగణించి, మీపై ప్రగాఢ శ్రద్ధ చూపుతూ, మిమ్మల్ని పూర్తిగా అర్థంచేసుకొనే ఒక ప్రత్యేక స్నేహితుడు మీకుంటాడు. (కీర్తన 103:14; 1 పేతురు 5:7) మీరు మీ అంతరంగ భావాల్లో సైతం ఆయనను నమ్ముతారు, ఎందుకంటే తనపట్ల యథార్థంగా ఉండేవారిపట్ల ఆయన యథార్థంగా ఉంటాడని మీకు తెలుసు. (కీర్తన 18:25) అయితే, దేవునితో ఈ సాన్నిహిత్యం కేవలం ఆయన సాధ్యపరచినందువల్లే మనకు అందుబాటులో ఉంది.

యెహోవా ఒక మార్గాన్ని తెరిచాడు

5.మనం యెహోవాకు సన్నిహితులు కావడాన్ని సాధ్యపరిచేందుకు ఆయన ఏమిచేశాడు?

5 పాపులమైన మనం దేవుని సహాయంలేకుండా ఆయనకు సన్నిహితంగా ఎన్నటికీ ఉండలేము. (కీర్తన 5:4) “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 5:8) అవును, యేసు “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము” ఇచ్చేలా యెహోవా ఏర్పాటుచేశాడు. (మత్తయి 20:28) ఆ విమోచన క్రయధన బలిపట్ల మనకున్న విశ్వాసమే మనం దేవునికి సన్నిహితం కావడాన్ని సాధ్యపరచింది. దేవుడే “మొదట మనలను ప్రేమించెను” కాబట్టి ఆయనతో స్నేహబంధంలోకి ప్రవేశించడానికి పునాదిని ఆయనే వేశాడు.—1 యోహాను 4:19.

6, 7.(ఎ)యెహోవా మరుగుపరచబడిన, తెలుసుకోలేని దేవుడు కాదని మనకెలా తెలుసు? (బి) యెహోవా ఏయే విధాలుగా తనను తాను బయలుపరచుకొన్నాడు?

6 యెహోవా మరో చర్యకూడా తీసుకున్నాడు: ఆయన తననుతానుగా మనకు బయలుపరచుకున్నాడు. ఏ స్నేహంలోనైనా, ఒక వ్యక్తిని నిజంగా తెలుసుకోవడంపై, ఆయన లక్షణాలను మార్గాలను విలువైనవిగా పరిగణించడంపై సాన్నిహిత్యం ఆధారపడివుంటుంది. అందువల్ల యెహోవా ఒకవేళ మరుగుపరచబడిన, మనం తెలుసుకోలేని దేవుడైనట్లయితే, మనమాయనకు ఎన్నటికీ సన్నిహితం కాలేము. అయితే, తననుతాను మరుగుపరచుకోవడానికి బదులు, మనమాయనను తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. (యెషయా 45:19) అంతేకాకుండా, లోక ప్రమాణాలకు సరితూగని వారని పరిగణించబడే మనతోసహా, తన గురించి ఆయన బయలుపరచుకొనే విషయం అందరికీ అందుబాటులో ఉంది.—మత్తయి 11:25.

యెహోవా తన సృష్టి కార్యాల ద్వారా, తన లిఖిత వాక్యం ద్వారా తనను తాను బయలుపరచుకొన్నాడు

7 యెహోవా తననుతాను మనకెలా బయలుపరచుకొన్నాడు? ఆయన సృష్టికార్యాలు ఆయన వ్యక్తిత్వ అంశాలను కొన్నింటిని అంటే ఆయన అపరిమిత శక్తిని, జ్ఞాన సుసంపన్నతను, అపారమైన ప్రేమను తెలియజేస్తున్నాయి. (రోమీయులు 1:20) అయితే యెహోవా తనను తాను బయలుపరచుకోవడం, తాను సృష్టించినవాటితోనే ఆగిపోలేదు. మహాగొప్ప సంభాషణాకర్తగా ఆయన తన వాక్యమైన బైబిల్లో లిఖితపూర్వకంగా తనను తాను బయలుపరచుకొన్నాడు.

“యెహోవా ప్రసన్నత”ను చూడడం

8.మనపట్ల యెహోవాకున్న ప్రేమకు బైబిలే ఒక రుజువని ఎందుకు చెప్పవచ్చు?

8 మనపట్ల యెహోవాకున్న ప్రేమకు బైబిలే ఒక రుజువు. తన వాక్యంలో ఆయన మనం గ్రహించగల పదాలతోనే తనను బయలుపరచుకొన్నాడు. అది ఆయన మనలను ప్రేమిస్తున్నాడనడానికే కాక మనమాయన గురించి తెలుసుకోవాలని, మనమాయనను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడనడానికి కూడా రుజువు. ఈ అమూల్యమైన పుస్తకంలో మనం చదివేది “యెహోవా ప్రసన్నత[ను]” చూసేలా చేసి ఆయనకు సన్నిహితంగా ఉండాలని కోరుకునేలా మనల్ని పురికొల్పుతుంది. (కీర్తన 90:17) యెహోవా తన వాక్యంలో తనను తాను బయలుపరచుకొన్న ప్రోత్సాహకరమైన విధానాల్లో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.

9.బైబిల్లో దేవుని లక్షణాలను గుర్తించే సూటైన వాక్యభాగాల్లో కొన్ని ఉదాహరణలు ఏవి?

9 దేవుని లక్షణాలను గుర్తించే సూటైన వాక్యభాగాలు లేఖనాల్లో అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని ఉదాహరణలను గమనించండి. “యెహోవా న్యాయమును ప్రేమించువాడు.” (కీర్తన 37:28) “దేవుడు మహాత్మ్యముగలవాడు.” (యోబు 37:23) ‘ఆయన యథార్థవంతుడు.’ (కీర్తన 18:25) “ఆయన మహా వివేకి.” (యోబు 9:4) ఆయన “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు.” (నిర్గమకాండము 34:6) “ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు.” (కీర్తన 86:5) ముందరి అధ్యాయంలో ప్రస్తావించినట్లుగా, ఆయనలో ఒక లక్షణం ప్రబలంగా కనబడుతుంది. అదేమిటంటే, “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:8) మనోహరమైన ఈ లక్షణాలను మీరు ధ్యానిస్తుండగా, సాటిలేని ఆ దేవునివైపు మీరు ఆకర్షింపబడడం లేదా?

యెహోవాకు సన్నిహితమవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది

10, 11.(ఎ)యెహోవా మనం తన వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా చూసేలా మనకు సహాయపడేందుకు, తన వాక్యంలో ఏమి పొందుపరిచాడు? (బి) దేవుని శక్తి క్రియాశీలత్వాన్ని దృశ్యీకరించుకోవడానికి బైబిలులోని ఏ ఉదాహరణ మనకు సహాయం చేస్తుంది?

10 యెహోవా తన లక్షణాలేమిటో మనకు చెప్పడంతోపాటు, ఆ లక్షణాలను తాను క్రియలలో ఎలా చూపించాడో తెలియజేసే నిర్దిష్టమైన ఉదాహరణలను కూడా ప్రేమతో తన వాక్యంలో పొందుపరచాడు. ఆయన వ్యక్తిత్వంలోని వివిధ ముఖరూపాలను మరింత స్పష్టంగా చూసేలా మనకు సహాయపడేందుకు అలాంటి వృత్తాంతాలు సుస్పష్టమైన మనోదృశ్యాలను అందజేస్తాయి. తత్ఫలితంగా అవి మనమాయనకు సన్నిహితమవడానికి సహాయం చేస్తాయి. ఒక ఉదాహరణ పరిశీలించండి.

11 దేవుని “బలాతిశయమును” గురించి చదవడం ఒక సంగతి. (యెషయా 40:26) అయితే ఆయన ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంగుండా నడిపించడం గురించి, ఆ పిమ్మట వారిని 40 సంవత్సరాలపాటు అరణ్యంలో పోషించడం గురించి చదవడం మరో సంగతి. ఎగసిపడుతున్న ఆ నీరు రెండుగా చీలిపోవడాన్ని మీరు దృశ్యీకరించుకోవచ్చు. ఘనీభవించిన నీరు ఇరుప్రక్కల బలమైన ప్రాకారాల్లా నిలిచి ఉండగా, ఆ జనాంగమంతా అంటే దాదాపు 30,00,000 మంది ఆరిన సముద్ర గర్భంగుండా నడిచివెళ్లడాన్ని మీరు చిత్రీకరించుకోవచ్చు. (నిర్గమకాండము 14:21;15:8) అరణ్యంలో దేవుని సంరక్షణా శ్రద్ధకు సంబంధించిన రుజువును మీరు చూడవచ్చు. బండ నుండి నీరు ప్రవహించింది. తెల్లని గింజలను పోలిన ఆహారం భూ ఉపరితలం మీదంతా కనబడింది. (నిర్గమకాండము 16:31; సంఖ్యాకాండము 20:11) యెహోవా తనకు శక్తి ఉందనే కాదు, తన ప్రజల పక్షాన దానిని ఉపయోగిస్తానని కూడా అక్కడ వెల్లడించాడు. ‘మనకు ఆశ్రయమును దుర్గమును, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడును’ అయిన శక్తిమంతుడైన దేవుని వద్దకు మన ప్రార్థనలు చేరుకుంటాయని తెలుసుకోవడం ప్రోత్సాహకరం కాదా?—కీర్తన 46:1.

12.యెహోవా మనం అర్థంచేసుకోగల పదాలతోనే ఆయనను “చూసేలా” మనకెలా సహాయం చేస్తున్నాడు?

12 ఆత్మ స్వరూపియైన యెహోవా, మనం ఆయనను తెలుసుకోవడానికి వీలుగా మరెన్నో చేశాడు. మానవులుగా మనకు దృశ్య పరిమితులున్న కారణంగా ఆత్మసంబంధ రాజ్యాన్ని చూడలేము. ఆత్మసంబంధ పదాలతో దేవుడు తన గురించి మనకు వర్ణించడమంటే పుట్టుగుడ్డి వానికి మీ కళ్ల రంగు, పుట్టుమచ్చలవంటి వాటి గురించి చెబుతూ మీ రూపాన్ని వర్ణించడానికి ప్రయత్నించినట్లుగా ఉంటుంది. బదులుగా, మనం అర్థంచేసుకోగల పదాలతో ఆయనను “చూసేలా” యెహోవా మనకు దయాపూర్వకంగా సహాయం చేస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన మనకు తెలిసిన వాటితో తనను పోల్చుకొంటూ రూపకాలంకారాలను, ఉపమాలంకారాలను ఉపయోగిస్తాడు. తనకు ఆయా మానవ అవయవాలు ఉన్నట్లుగా కూడా ఆయన తనను వర్ణించుకున్నాడు. *

13.యెషయా 40:11 ఎలాంటి మనోదృశ్యాన్ని కలుగజేస్తోంది, అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?

13 యెహోవా గురించి యెషయా 40:11​లో కనబడే ఈ వర్ణనను గమనించండి: “గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును.” ఇక్కడ యెహోవా “తన బాహువుతో” గొఱ్ఱెపిల్లలను ఎత్తుకొనే గొఱ్ఱెలకాపరితో పోల్చబడ్డాడు. నిస్సహాయులైన వారితోసహా తన ప్రజలను కాపాడే, బలపరిచే దేవుని సామర్థ్యాన్ని ఇది సూచిస్తోంది. ఆయన బలమైన బాహువుల్లో సురక్షితంగా ఉన్నామని మనం భావించవచ్చు, ఎందుకంటే మనమాయనపట్ల యథార్థంగా ఉంటే ఆయన మనలను ఎన్నడూ ఎడబాయడు. (రోమీయులు 8:38, 39) మహాగొప్ప కాపరి గొఱ్ఱెలను “తన రొమ్మున ఆనించుకొని” మోస్తాడు. ఈ మాటలు కొన్నిసార్లు గొఱ్ఱెలకాపరి అప్పుడే పుట్టిన గొఱ్ఱెపిల్లను తన పై వస్త్రపు మడతల్లో ఉంచుకొని మోయడాన్ని సూచిస్తున్నాయి. ఆ విధంగా, యెహోవా మనలను పోషిస్తూ, వాత్సల్యపూరిత శ్రద్ధతో చూసుకుంటాడని మనకు హామీ ఇవ్వబడుతోంది. అందువల్ల సహజంగానే మనమాయనకు సన్నిహితమవాలని కోరుకుంటాం.

‘కుమారుడు ఆయనను బయలుపరచ ఉద్దేశిస్తున్నాడు’

14.యేసు ద్వారానే యెహోవా తనను అత్యంత వివరంగా బయలుపరచుకొంటాడని ఎందుకు చెప్పవచ్చు?

14 యెహోవా తన వాక్యంలో తన ప్రియకుమారుడైన యేసు ద్వారా తనను అత్యంత వివరంగా బయలుపరచుకొంటున్నాడు. యేసుతప్ప మరెవ్వరూ దేవుని ఆలోచనను, భావాలను మరింత సన్నిహితంగా ప్రతిబింబించలేరు లేదా మరింత స్పష్టంగా ఆయనను గురించి వివరించలేరు. కారణమేమిటంటే, ఆత్మసంబంధ ఇతర ప్రాణులు, భౌతిక విశ్వం సృష్టింపబడక మునుపే ఆదిసంభూతుడైన ఆ కుమారుడు తన తండ్రితోపాటు ఉనికిలో ఉన్నాడు. (కొలొస్సయులు 1:15) యేసుకు యెహోవా అత్యంత సన్నిహితంగా తెలుసు. అందుకే ఆయనిలా చెప్పగలిగాడు: “కుమారు డెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడు.” (లూకా 10:22) యేసు భూమ్మీద మనిషిగా నివసించినప్పుడు, ప్రాముఖ్యమైన రెండు విధాలుగా తన తండ్రిని బయలుపరిచాడు.

15, 16.యేసు ఏ రెండు విధాలుగా తన తండ్రిని బయలుపరిచాడు?

15 మొదటిగా, తండ్రిని తెలుసుకోవడానికి యేసు బోధలు మనకు సహాయం చేస్తాయి. ఆయన మన హృదయాలను స్పృశించేలా యెహోవాను వర్ణించాడు. ఉదాహరణకు, పశ్చాత్తప్త పాపులను తిరిగి ఆహ్వానించే దేవుని కనికరాన్ని వివరిస్తూ, తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడంచూసి బహుగా చలించి పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొన్న క్షమాగుణంగల తండ్రితో యెహోవాను పోల్చాడు. (లూకా 15:11-24) యెహోవా సహృదయులను ప్రేమిస్తున్న కారణంగా వారిని ‘ఆకర్షించే’ దేవునిగా కూడా యేసు ఆయనను పోల్చాడు. (యోహాను 6:44) ఒక చిన్న పిచ్చుక నేలరాలడం కూడా దేవునికి తెలుసు. కాబట్టి, “భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు” అని యేసు వివరించాడు. (మత్తయి 10:29-30) అంత శ్రద్ధగల దేవుని వైపు మనం తప్పక ఆకర్షించబడతాము.

16 రెండవదిగా, యెహోవా ఎలాంటివాడో యేసు మాదిరి మనకు చూపిస్తుంది. యేసు తన తండ్రిని ఎంత పరిపూర్ణంగా ప్రతిబింబించాడంటే ఆయనిలా చెప్పగలిగాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:9) ఆ విధంగా సువార్తల్లో యేసును గురించి అంటే ఆయన కనబరచిన భావాలను, ఇతరులతో ఆయన వ్యవహరించిన విధానాన్ని గురించి చదివినప్పుడు ఆయన తండ్రి సజీవ చిత్రాన్ని చూస్తున్న భావనే మనకు కలుగుతుంది. యెహోవా తన లక్షణాలను ఇంతకంటే స్పష్టంగా వెల్లడిచేసి ఉండగలిగేవాడు కాదు. ఎందుకు?

17.యెహోవా తానెలాంటివాడో మనం అర్థంచేసుకోవడానికి ఏమి చేశాడో సోదాహరణంగా వివరించండి.

17 ఉదాహరణకు, దయను వివరించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకోండి. దానిని మీరు మాటల్లో నిర్వచించవచ్చు. అయితే నిజంగా దయాపూర్వకమైన పనిచేస్తున్న ఎవరినైనా చూపిస్తూ, “దయ చూపడానికి ఇది మాదిరి” అని చెప్పగలిగితే, “దయ” అనే మాటకు అర్థం పెరగడంతోపాటు అర్థంచేసుకోవడానికీ సులభమౌతుంది. యెహోవా తనెలాంటివాడో అర్థంచేసుకోవడానికి మనకు సహాయపడేందుకు అలాంటి పనే చేశాడు. మాటల్లో తన గురించి వర్ణించడంతోపాటు, ఆయన మనకు తన కుమారుని సజీవ మాదిరిని చేకూర్చాడు. యేసులో, దేవుని లక్షణాలు క్రియాత్మకంగా కనబడతాయి. యేసును వర్ణించే సువార్త వృత్తాంతాల ద్వారా నిజానికి యెహోవా ఇలా చెబుతున్నాడు: “నేను ఆ విధంగా ఉన్నాను.” భూమ్మీద నివసించిన యేసును ప్రేరేపిత లేఖనాలెలా వర్ణిస్తున్నాయి?

18.శక్తి, న్యాయము, జ్ఞానమనే లక్షణాలను యేసు ఎలా వ్యక్తపరిచాడు?

18 దేవుని నాలుగు ప్రధాన లక్షణాలు యేసులో రమణీయంగా వ్యక్తం చేయబడ్డాయి. వ్యాధి, ఆకలి, చివరకు మరణం మీద ఆయనకున్న అధికారంలో శక్తిని చూడవచ్చు. అయినాసరే, తమ అధికారాన్ని దుర్వినియోగపరిచే స్వార్థ మానవుల్లాగ తన పక్షాన లేదా ఇతరులను గాయపరిచే విధంగా ఆయనెన్నడూ ఆ అద్భుత శక్తిని ప్రయోగించలేదు. (మత్తయి 4:2-4) ఆయన న్యాయాన్ని ప్రేమించాడు. అన్యాయస్థులైన వ్యాపారులు ప్రజలను మోసగించడం చూసినప్పుడు ఆయన హృదయం నీతియుక్తమైన ఆగ్రహంతో నిండిపోయింది. (మత్తయి 21:12, 13) బీదలు, బడుగువర్గాల ప్రజలు తమ ప్రాణాలకు “విశ్రాంతి” పొందేలా సహాయంచేస్తూ, ఆయన వారితో నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. (మత్తయి 11:4, 5, 28-30) ‘సొలొమోనుకంటే గొప్పవాడైన’ యేసు బోధల్లో సాటిలేని జ్ఞానం ఉంది. (మత్తయి 12:42) అయితే యేసు ఎన్నడూ తన జ్ఞానాన్ని డంబంగా ప్రదర్శించలేదు. ఆయన బోధలు స్పష్టంగా, సరళంగా, ఆచరణాత్మకంగా ఉండడం వల్ల అవి సామాన్య ప్రజల హృదయాలను చేరాయి.

19, 20.(ఎ)యేసు ప్రేమకు ఏ విధంగా ఒక అసాధారణ మాదిరిగా ఉన్నాడు? (బి) యేసు మాదిరిని గురించి మనం చదువుతూ, ధ్యానిస్తుండగా మనమేమి జ్ఞాపకముంచుకోవాలి?

19 ప్రేమకు యేసు అసాధారణ మాదిరిగా ఉన్నాడు. ఆయన తన పరిచర్యంతటిలో, సహానుభూతి, కనికరాలతోపాటు అనేక ముఖరూపాల్లో ప్రేమను ప్రదర్శించాడు. ఇతరుల బాధలు చూసినప్పుడు ఆయన వారిపై జాలి చూపకుండా ఉండలేకపోయాడు. ఇతరుల అవసరాలపట్ల తనకున్న సానుభూతినిబట్టి ఆయన అనేకమార్లు కార్యోన్ముఖుడయ్యాడు. (మత్తయి 14:14) యేసు రోగులను బాగుచేశాడు, ఆకలిగొన్నవారికి ఆహారం పెట్టాడు, అయితే అంతకంటే మరెంతో ఆవశ్యకమైన రీతిలో ఆయన సానుభూతిని వ్యక్తపరిచాడు. మానవాళికి శాశ్వత ఆశీర్వాదాలుతెచ్చే దేవుని రాజ్యం గురించిన సత్యాన్ని తెలుసుకొని దానిని అంగీకరించి దాన్ని ప్రేమించడానికి ఆయన ఇతరులకు సహాయం చేశాడు. (మార్కు 6:34; లూకా 4:43) అన్నింటికంటే మిన్నగా, ఇతరుల పక్షాన తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అర్పించడం ద్వారా యేసు స్వయం త్యాగ ప్రేమను కనబరిచాడు.—యోహాను 15:13.

20 ఆప్యాయతానురాగాలు, ప్రగాఢ భావాలున్న ఈ మనిషివైపు అన్ని వయస్సుల, నేపథ్యాల ప్రజలు ఆకర్షించబడ్డారంటే దానికి ఆశ్చర్యపోవాలా? (మార్కు 10:13-16) అయితే, యేసు సజీవ మాదిరి గురించి మనం చదువుతూ, ధ్యానిస్తుండగా, ఈ కుమారునిలో మనమాయన తండ్రియొక్క స్పష్టమైన ప్రతిబింబాన్ని చూస్తున్నామని మనమెల్లప్పుడూ జ్ఞాపకముంచుకొందాం.—హెబ్రీయులు 1:3.

మనకు సహాయంచేసే అధ్యయన ఉపకరణం

21, 22.యెహోవాను వెదకడంలో ఏమి ఇమిడివుంది, ఈ ప్రయత్నంలో మనకు తోడ్పడే ఎలాంటి విషయాలు ఈ అధ్యయన ఉపకరణంలో ఉన్నాయి?

21 యెహోవా తన వాక్యంలో ఎంతో స్పష్టంగా తనను బయలుపరచుకోవడం ద్వారా, మనమాయనకు సన్నిహితం కావాలని తాను కోరుకొంటున్నాడనే విషయంలో ఎలాంటి సందేహానికీ తావివ్వడంలేదు. అదే సమయంలో తనతో ఆమోదయోగ్య సంబంధం కోసం వెదకాలని ఆయన మనలను బలవంతం చేయడం లేదు. యెహోవా “దొరుకు కాలమునందు” ఆయనను వెదకవలసిన బాధ్యత మనకుంది. (యెషయా 55:6) యెహోవాను వెదకడంలో బైబిల్లో బయలుపరచబడినట్లుగా ఆయన లక్షణాలను, మార్గాలను తెలుసుకోవడం ఇమిడివుంది. ఈ ప్రయత్నంలో మీకు సహాయపడేలా మీరిప్పుడు చదువుతున్న ఈ ఉపకరణం తీర్చిదిద్దబడింది.

22 ఈ పుస్తకం శక్తి, న్యాయము, జ్ఞానము, ప్రేమ అనే యెహోవా నాలుగు ప్రధాన లక్షణాలకు అనుగుణంగా నాలుగు భాగాలుగా విభజించబడినట్లు మీరు గమనిస్తారు. ప్రతి భాగం సంబంధిత లక్షణపు సారాంశంతో మొదలవుతుంది. దాని తర్వాత కొన్ని అధ్యాయాలు, యెహోవా ఆ లక్షణాన్ని వివిధ ముఖరూపాల్లో ఎలా కనబరుస్తాడో పరిశీలిస్తాయి. ప్రతి భాగంలో యేసు ఆ లక్షణాన్ని మాదిరికరంగా ఎలా చూపించాడో వివరించే ఒక అధ్యాయం, అలాగే మనం మన జీవితాల్లో దానినెలా ప్రతిఫలించవచ్చో పరిశీలించే మరో అధ్యాయం కూడా ఉంటాయి.

23, 24.(ఎ)“ధ్యానించడానికి ప్రశ్నలు” అనే ప్రత్యేక శీర్షిక గురించి వివరించండి. (బి) దేవునికి మరింత సన్నిహితమవడానికి ధ్యానమెలా మనకు సహాయం చేస్తుంది?

23 ఈ అధ్యాయం మొదలుకొని “ధ్యానించడానికి ప్రశ్నలు” అనే ప్రత్యేక శీర్షిక ఉంటుంది. ఉదాహరణకు, 24వ పేజీలోని బాక్సు చూడండి. లేఖనాలు, ప్రశ్నలు అధ్యాయపు పునఃసమీక్షగా రూపించబడలేదు. బదులుగా, విషయం యొక్క ఇతర ముఖ్యాంశాలను ధ్యానించడానికి మీకు సహాయం చేయడమే వాటి ఉద్దేశం. ఈ శీర్షికను మీరు ఫలవంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చు? ఉదహరించబడిన ప్రతీ లేఖనం తెరిచి వచనాలను జాగ్రత్తగా చదవండి. ఆ పిమ్మట, ఉదహరించబడిన ప్రతీ లేఖనంతోపాటు ఉన్న ప్రశ్నను పరిశీలించండి. జవాబులను ధ్యానించండి. మీరు కొంత పరిశోధన చేయవచ్చు. మిమ్మల్ని మీరిలా కొన్ని అదనపు ప్రశ్నలు వేసుకోండి: ‘ఈ సమాచారం యెహోవా గురించి నాకు ఏమి తెలుపుతోంది? ఇది నా జీవితాన్నెలా ప్రభావితం చేస్తుంది? ఇతరులకు సహాయపడేందుకు దీనిని నేనెలా ఉపయోగించుకోవచ్చు?’

24 అలాంటి ధ్యానం మనం యెహోవాకు మరింత సన్నిహితమవడానికి సహాయం చేయగలదు. అలా ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే బైబిలు, ధ్యానాన్ని హృదయంతో ముడిపెడుతోంది. (కీర్తన 19:14) దేవుని గురించి నేర్చుకున్న విషయాలను కృతజ్ఞతతో మనం ధ్యానించినప్పుడు, ఆ సమాచారం మన అలంకారార్థ హృదయానికి చేరి మన ఆలోచనను ప్రభావితంచేస్తూ, మనోభావాలను పురికొల్పి చివరకు చర్యగైకొనేలా మనల్ని చైతన్యపరుస్తుంది. దేవునిపట్ల మన ప్రేమ ప్రగాఢమవుతుంది, తిరిగి ఆ ప్రేమే మన ప్రియ స్నేహితునిగా ఆయనను సంతోషపరచడానికి కోరుకునేలా మనల్ని పురికొల్పుతుంది. (1 యోహాను 5:3) అలాంటి బంధంలోకి రావడానికి, మనం యెహోవా లక్షణాలను, మార్గాలను తప్పకుండా తెలుసుకోవాలి. అయితే, ఆయనకు సన్నిహితమవడానికి బలమైన కారణాన్నిచ్చే, దేవుని వ్యక్తిత్వపు ఒక అంశాన్ని అంటే ఆయన పరిశుద్ధతను మనం మొదట పరిశీలిద్దాం.

^ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ‘స్నేహబంధం’ అని అనువదించబడిన హీబ్రూ పదమే ఆమోసు 3:7 లో కూడా ఉపయోగించబడింది. ఆ వచనం, మహోన్నతుడైన యెహోవా తాను ఏమి చేయాలనుకుంటున్నాడో ముందుగానే తన సేవకులకు తెలియజేస్తూ తాను “సంకల్పించినదానిని” వారికి బయలుపరుస్తాడని చెబుతోంది.

^ ఉదాహరణకు బైబిలు దేవుని ముఖం, కన్నులు, చెవులు, నాసికారంధ్రాలు, నోరు, బాహువులు, పాదాల గురించి మాట్లాడుతుంది. (కీర్తన 18:15; 27:9; 44:3; యెషయా 60:13; మత్తయి 4:4; 1 పేతురు 3:12) యెహోవాను “ఆశ్రయదుర్గము” లేదా “కేడెము” అని పేర్కొనేవంటివాటి మాదిరిగానే, అలాంటి అలంకారార్థ వ్యక్తీకరణలను మనం అక్షరార్థంగా తీసుకోకూడదు.—ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 84:11.