కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 12

“దేవునియందు అన్యాయము కలదా?”

“దేవునియందు అన్యాయము కలదా?”

1.అన్యాయపు సంఘటనలు చూసినప్పుడు మనమెలా ప్రభావితులం కావచ్చు?

 ఒక వృద్ధ విధవరాలు తన పొదుపుసొమ్ము విషయంలో దగా చేయబడింది. ఒక పసిబిడ్డను జాలిలేని తల్లి నిర్దాక్షిణ్యంగా వదిలేసింది. ఒక వ్యక్తి తాను చేయని నేరానికి జైలుపాలయ్యాడు. ఇలాంటి సంఘటనలకు మీరెలా ప్రతిస్పందిస్తారు? బహుశా ఈ సంఘటనల్లో ప్రతీదీ మీకు కలత కలిగించవచ్చు, అది అర్థంచేసుకోదగిన విషయమే. మానవులమైన మనకు ఏది తప్పు ఏది ఒప్పు అనే దాని గురించి బలమైన భావాలుంటాయి. అన్యాయం జరిగినప్పుడు, మనం రగిలిపోతాం. అన్యాయం జరిగిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించబడాలనీ, నేరస్థులు శిక్షించబడాలనీ మనం కోరుకుంటాం. అలా జరగనప్పుడు, ‘ఏమి జరుగుతోందో దేవుడు చూస్తున్నాడా? ఆయనెందుకు చర్య తీసుకోవడంలేదు?’ అని మనం ఆశ్చర్యపోతాం.

2.అన్యాయానికి హబక్కూకు ఎలా ప్రతిస్పందించాడు, దీనికి యెహోవా అతన్ని ఎందుకు తప్పుపట్టలేదు?

2 చరిత్రంతటిలో, యెహోవా నమ్మకస్థులైన సేవకులు ఇలాంటి ప్రశ్నలే అడిగారు. ఉదాహరణకు, హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి ఇలా ప్రార్థించాడు: “నీవు నేనిట్టి అన్యాయమును కాంచునట్లు చేయనేల? నీవు ఈ దుష్కార్యములను చూచి యెట్లు సహింతువు?” (హబక్కూకు 1:3, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) హబక్కూకు సూటిగా అలా విచారణ చేసినందుకు యెహోవా ఆయనను తప్పుపట్టలేదు, ఎందుకంటే మానవులకు న్యాయం గురించిన గ్రహింపు నిచ్చింది ఆయనే. అవును, యెహోవా న్యాయం గురించి తనకున్న ప్రగాఢమైన భావనలో కొంత మనకిచ్చి మనల్ని ఆశీర్వదించాడు.

యెహోవా అన్యాయాన్ని ద్వేషిస్తాడు

3.అన్యాయం గురించి యెహోవాకు మనకంటే ఎక్కువ తెలుసని ఎందుకు చెప్పవచ్చు?

3 అన్యాయం జరుగుతోందని యెహోవాకు తెలియదని కాదు. ఏమి జరుగుతోందో ఆయన చూస్తాడు. నోవహు కాలం గురించి బైబిలు మనకిలా చెబుతోంది: “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూ[సెను].” (ఆదికాండము 6:5-6) ఆ మాటల భావమేమిటో పరిశీలించండి. అన్యాయం గురించిన మన గ్రహింపు, మనం విన్న లేదా వ్యక్తిగతంగా ఎదుర్కొన్న కొన్ని సంఘటనలపై తరచూ ఆధారపడి ఉంటుంది. దానికి భిన్నంగా, యెహోవాకు భూవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయం గురించి తెలుసు. ఆయన సమస్తం చూస్తున్నాడు! అంతకంటే ఎక్కువగా, ఆయన హృదయ కోరికలను అంటే అన్యాయపు కృత్యాల వెనుకవున్న దిగజారిన ఆలోచనలను సైతం ఆయన పసిగట్టగలడు.—యిర్మీయా 17:10.

4, 5.(ఎ)అన్యాయానికి గురైనవారిపట్ల యెహోవా శ్రద్ధవహిస్తాడని బైబిలు ఎలా చూపిస్తోంది? (బి) స్వయంగా యెహోవాయే ఎలా అన్యాయపు ప్రభావానికి లోనయ్యాడు?

4 యెహోవా కేవలం అన్యాయాన్ని గమనించడం కంటే ఎక్కువే చేస్తాడు. అన్యాయానికి గురైన వారిపట్ల ఆయన శ్రద్ధ కూడా తీసుకుంటాడు. శత్రు జనాంగాలు తన ప్రజలతో క్రూరంగా వ్యవహరించినప్పుడు ‘తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు విని’ యెహోవా నొచ్చుకున్నాడు. (న్యాయాధిపతులు 2:18) కొందరు అన్యాయాన్ని చూసినకొద్దీ వారు మరింత కఠినంగా తయారుకావడం బహుశా మీరు గమనించే ఉంటారు. యెహోవా అలా కాదు! ఆయన గత 6,000 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో అన్యాయం జరగడాన్ని చూశాడు, అయినా దానిని ద్వేషించే విషయంలో ఆయన స్వభావంలో మార్పురాలేదు. బదులుగా, “కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులు,” “లేనివాటిని పలుకు అబద్ధసాక్షి,” ఆయనకు అసహ్యములని బైబిలు మనకు హామీయిస్తోంది.—సామెతలు 6:16-19.

5 ఇశ్రాయేలులోని అన్యాయస్థులైన నాయకులను యెహోవా తీవ్రంగా విమర్శించడం గురించి కూడా ఆలోచించండి. ‘న్యాయము ఎరిగియుండుట మీ ధర్మం కాదా?’ అని వారిని అడిగేందుకు ఆయన తన ప్రవక్తను ప్రేరేపించాడు. వారి అధికార దుర్వినియోగాన్ని స్పష్టంగా వివరించిన తర్వాత, ఆ భ్రష్ట మనుషులకు కలిగే పర్యవసానం గురించి యెహోవా ముందుగానే ఇలా చెప్పాడు: “వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును.” (మీకా 3:1-4) అన్యాయమంటే యెహోవాకు ఎంత అసహ్యమో కదా! ఎందుకంటే అన్యాయాన్ని మొట్టమొదట ఆయనే స్వయంగా అనుభవించాడు! వేలాది సంవత్సరాలుగా సాతాను అన్యాయంగా ఆయనను నిందిస్తున్నాడు. (సామెతలు 27:11) అంతేకాక, అతి ఘోరమైన అన్యాయపు కృత్యం, అంటే ‘ఏ పాపం చేయని’ తన కుమారుడు నేరస్థునిగా చంపబడడం యెహోవాపై ప్రభావం చూపింది. (1 పేతురు 2:22; యెషయా 53:9) కాబట్టి, అన్యాయం జరుగుతోందని యెహోవాకు తెలియదనీ కాదు, అన్యాయానికి గురవుతున్న వారి అవస్థపట్ల ఆయన ఉదాసీనంగానూ ఉండడు.

6.మనం అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎలా ప్రతిస్పందించవచ్చు, ఎందుకు?

6 అయినప్పటికీ, అన్యాయాన్ని మనం గమనించినప్పుడు లేదా మనమే అన్యాయానికి బలైనప్పుడు మనం సహజంగానే తీవ్రంగా ప్రతిస్పందిస్తాం. మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం, యెహోవాకు ప్రతీకగావుండే ప్రతీ దానికి అన్యాయం బద్ధవిరుద్ధంగా ఉంటుంది. (ఆదికాండము 1:27) అలాంటప్పుడు దేవుడు అన్యాయాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు?

దేవుని సర్వాధిపత్య వివాదం

7.యెహోవా సర్వాధిపత్యమెలా సవాలు చేయబడిందో వివరించండి.

7 ఈ ప్రశ్నకు సమాధానం విశ్వసర్వాధిపత్యంతో ముడిపడి ఉంది. మనం చూసినట్లుగా, ఈ భూమిని, దానిపై నివసించే సమస్తాన్ని పరిపాలించే హక్కు సృష్టికర్తకు ఉంది. (కీర్తన 24:1; ప్రకటన 4:10) అయితే మానవ చరిత్రారంభంలో, యెహోవా సర్వాధిపత్యం సవాలు చేయబడింది. అదెలా జరిగింది? తన పరదైసు గృహపు తోటలోని ఫలాని వృక్ష ఫలాలు తినవద్దని యెహోవా ఆదిపురుషుడైన ఆదాముకు ఆజ్ఞాపించాడు. ఒకవేళ అతను అవిధేయుడైతే? “నిశ్చయముగా చచ్చెదవని” దేవుడు అతనికి చెప్పాడు. (ఆదికాండము 2:​17) దేవుని ఆజ్ఞ ఆదాముకు గానీ అతని భార్య హవ్వకు గానీ ఎలాంటి కష్టము కలిగించలేదు. అయినాసరే, దేవుడు మరీ ఎక్కువగా హద్దులు పెడుతున్నాడని సాతాను హవ్వను ఒప్పించాడు. ఒకవేళ ఆమె ఆ వృక్ష ఫలం తింటే ఏమవుతుంది? హవ్వకు సాతాను సూటిగా ఇలా చెప్పాడు: ‘మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురు.’—ఆదికాండము 3:1-5.

8.(ఎ)హవ్వతో తాను మాట్లాడిన మాటల ద్వారా సాతాను ఏమి సూచించాడు? (బి) దేవుని సర్వాధిపత్యానికి సంబంధించి సాతాను దేనిని సవాలుచేశాడు?

8 యెహోవా కీలకమైన సమాచారం హవ్వకు తెలియకుండా దాచిపెట్టడమే కాక ఆయన ఆమెకు అబద్ధం చెప్పాడనే అర్థం వచ్చేలా సాతాను మాట్లాడాడు. దేవుడు సర్వాధిపతి అనే వాస్తవాన్ని ప్రశ్నించకుండా సాతాను జాగ్రత్తపడ్డాడు. అయితే అతడు ఆ సర్వాధిపత్యపు హక్కును, అర్హతను, నీతిని సవాలు చేశాడు. వేరేమాటల్లో చెప్పాలంటే, యెహోవా తన సర్వాధిపత్యాన్ని నీతియుక్తంగా, తన ప్రజల ప్రయోజనార్థం నిర్వహించడం లేదని అతడు వాదించాడు.

9.(ఎ)ఆదాము హవ్వల అవిధేయత మూలంగా వారికి కలిగిన ఫలితమేమిటి, అదెలాంటి అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలను లేవదీసింది? (బి) ఆ తిరుగుబాటుదారుల్ని యెహోవా వెంటనే ఎందుకు నాశనం చేయలేదు?

9 దాని ఫలితంగా, ఆ నిషేధిత వృక్ష ఫలాలు తినడం ద్వారా ఆదాము హవ్వలిద్దరూ యెహోవాకు అవిధేయులయ్యారు. దేవుడు ఆజ్ఞాపించినట్లే వారి అవిధేయత వారు మరణ శిక్ష అనుభవించేలా చేసింది. సాతాను చెప్పిన అబద్ధం అత్యంత ప్రాముఖ్యమైన కొన్ని ప్రశ్నలను లేవదీసింది. నిజానికి మానవాళిని పరిపాలించే హక్కు యెహోవాకు ఉందా లేక మానవుడే తననుతాను పరిపాలించుకోవాలా? యెహోవా తన సర్వాధిపత్యాన్ని సాధ్యమైనంత శ్రేష్ఠంగా నిర్వహిస్తున్నాడా? అక్కడే, అప్పటికప్పుడే తన శక్తిని ఉపయోగించి యెహోవా ఆ తిరుగుబాటుదారుల్ని నాశనం చేసి ఉండగలిగేవాడే. అయితే లేవదీయబడిన ప్రశ్నలు దేవుని శక్తికి కాదు ఆయన పరిపాలనకు సంబంధించినవి. కాబట్టి ఆదాము హవ్వలను, సాతానును తొలగించడం దేవుని పరిపాలన యొక్క న్యాయబద్ధతను నిరూపించదు. దానికి భిన్నంగా, అది దేవుని పరిపాలన గురించి మరిన్ని ప్రశ్నలను లేవదీసివుండేది. దేవుని నుండి స్వతంత్రంగా మానవులు తమను తాము జయప్రదంగా పరిపాలించుకోగలరా లేదా అనేది తీర్మానించడానికి మరింత సమయం ఇవ్వడమే ఏకైక మార్గం.

10.మానవ పరిపాలన గురించి చరిత్ర ఏమి వెల్లడిచేసింది?

10 కాల గమనం ఏమి నిరూపించింది? వేలాది సంవత్సరాలన్నింటిలో ప్రజలు నిరంకుశ, ప్రజాతంత్ర, సోషలిస్టు, కమ్యూనిస్టు ప్రభుత్వాలతోపాటు అనేకరకాల పరిపాలనలతో ప్రయోగం చేశారు. వాటన్నిటి ఫలితార్థం బైబిలు చెప్పిన ఈ మాటల్లో క్లుప్తంగా నిక్షిప్తమైవుంది: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” (ప్రసంగి 8:9) మంచి కారణంతోనే యిర్మీయా ప్రవక్త ఇలాచెప్పాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”—యిర్మీయా 10:23.

11.మానవజాతి కష్టాలు అనుభవించడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు?

11 మానవాళి స్వతంత్రత లేదా స్వీయ పరిపాలన కష్టాలు తెస్తుందని యెహోవాకు మొదటినుండే తెలుసు. మరి ఆయన ఈ అనివార్య పరిస్థితిని కొనసాగడానికి అనుమతించడం అన్యాయమా? ఎంతమాత్రం కాదు! ఉదాహరణకు, మీ పిల్లవానికి వచ్చిన ప్రాణాపాయకరమైన వ్యాధికి శస్త్రచికిత్స చేయవలసిన అవసరం ఏర్పడిందనుకోండి. పిల్లవాడికి శస్త్రచికిత్స కొంతమేర బాధ కలిగిస్తుందని మీకు తెలుసు, ఆ విషయం మీకు ఎంతో దుఃఖం కలిగిస్తుంది. అయితే అదే సమయంలో, ఆ శస్త్రచికిత్స పిల్లవాడి తర్వాతి జీవితంలో మంచి ఆరోగ్యం అనుభవించడానికి దోహదపడుతుందని కూడా మీకు తెలుసు. అదే ప్రకారంగా, మానవ పరిపాలనను అనుమతించడం దానితోపాటు కష్టాలను, బాధలను తీసుకొస్తుందని దేవునికి తెలుసు, పైగా దాని గురించి ఆయన ముందేచెప్పాడు. (ఆదికాండము 3:16-19) అయితే తిరుగుబాటు ఫలితంగా కలిగిన చెడుతనం చూసేందుకు యావత్‌ మానవాళిని అనుమతించినప్పుడే శాశ్వతమైన అర్థవంతమైన విముక్తి సాధ్యమవుతుందని కూడా ఆయనకు తెలుసు. ఈ విధంగా ఆ వివాదాంశం యుగయుగాలు నిలిచేలా శాశ్వతంగా పరిష్కరించబడడం సాధ్యమవుతుంది.

మానవుని యథార్థతా వివాదం

12.యోబు విషయంలో ఉదహరించబడినట్లుగా, మానవులపై సాతాను ఏ నింద మోపాడు?

12 ఈ విషయానికి సంబంధించి మరో అంశం కూడా ఉంది. దేవుని పరిపాలనా హక్కును, నీతిని సవాలు చేయడంలో సాతాను యెహోవా సర్వాధిపత్యం గురించి అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు, దేవుని సేవకుల యథార్థతపై కూడా అతడు అపవాదు వేశాడు. ఉదాహరణకు, నీతిమంతుడైన యోబు గురించి సాతాను యెహోవాతో ఏమన్నాడో గమనించండి: “నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.”—యోబు 1:10, 11.

13.యోబుపై తానువేసిన నిందల ద్వారా సాతాను ఏమి సూచిస్తున్నాడు, ఇది మానవులందరికీ ఎలా వర్తిస్తుంది?

13 యోబు తనను ఆరాధించేలా చేసేందుకు యెహోవా తన రక్షణ శక్తిని ఉపయోగిస్తున్నాడని సాతాను వాదించాడు. అది యోబు యథార్థత కేవలం కపటమని, ప్రతిఫలంగా తనకేమైనా లభించగలదనే ఉద్దేశంతోనే అతడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని సూచించింది. దేవుని దీవెనలు లభించకపోతే యోబు సైతం తన సృష్టికర్తను శపిస్తాడని సాతాను నొక్కి చెప్పాడు. యోబు అసాధారణ రీతిలో “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు” అని సాతానుకు తెలుసు. * కాబట్టి యోబు యథార్థతను సాతాను ధ్వంసం చేయగలిగితే మిగతా మానవాళి విషయంలో అతడు ఏమి చేయగలడని చెప్పవచ్చు? ఆ విధంగా సాతాను నిజానికి దేవుని సేవించాలని కోరుకునే వారందరి విశ్వాస్యతను ప్రశ్నిస్తున్నాడు. నిజానికి ఈ వివాదాన్ని మరింత ఎక్కువచేస్తూ సాతాను యెహోవాతో ఇలా అన్నాడు: ‘తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు [ఒక్క యోబు మాత్రమే కాదు] ఇచ్చును గదా.’—యోబు 1:8; 2:4.

14.మానవులపై సాతానుచేసిన నిందారోపణ విషయంలో చరిత్ర ఏమి చూపించింది?

14 యోబులాగే చాలామంది సాతాను వాదనకు భిన్నంగా పరీక్షల మధ్యనూ యెహోవాపట్ల విశ్వాస్యంగా నిలబడ్డారని చరిత్ర చూపింది. తమ యథార్థతా విధానం ద్వారా వారు యెహోవా హృదయాన్ని సంతోషింపజేశారు, కాగా ఇది మానవులకు కష్టాలొచ్చినప్పుడు దేవుణ్ణి సేవించడం మానేస్తారని గర్వంగా నిందించిన సాతానుకు యెహోవా జవాబిచ్చేలా చేసింది. (హెబ్రీయులు 11:4-38) అవును, యథార్థ హృదయులు దేవునికి వెన్నుచూపడానికి నిరాకరించారు. అత్యంత బాధాకరమైన పరిస్థితులవల్ల కలవరపడ్డప్పుడు కూడా, భరించడానికి తమకు శక్తినిమ్మని వారు యెహోవాపై మరింతగా ఆధారపడ్డారు.—2 కొరింథీయులు 4:7-10.

15.దేవుడు గతంలో చేసిన, భవిష్యత్తులో చేయబోయే తీర్పులకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావచ్చు?

15 అయితే యెహోవా న్యాయాన్ని అమలుచేయడంలో సర్వాధిపత్యం, మానవుని యథార్థతల వివాదాల కంటే ఇంకా ఎక్కువే ఇమిడివున్నాయి. ఆయావక్తులకు, యావత్‌ జనాంగాలకు సైతం సంబంధించిన యెహోవా తీర్పుల నివేదికను బైబిలు మనకు అందజేస్తోంది. భవిష్యత్తులో ఆయన తీర్చే తీర్పుల ప్రవచనాలు కూడా అందులో ఉన్నాయి. యెహోవా తన తీర్పులలో నీతిమంతునిగా ఉన్నాడనీ, ఉంటాడనీ మనమెందుకు నమ్మకంగా ఉండవచ్చు?

దేవుని న్యాయమెందుకు ఉన్నతమైనది

యెహోవా “దుష్టులతోకూడ నీతిమంతులను” ఎన్నటికీ “నాశనము” చేయడు

16, 17.నిజమైన న్యాయం విషయంలో మానవులకు పరిమిత దృక్కోణముందని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

16 యెహోవా గురించి నిజంగా ఇలా చెప్పవచ్చు: “ఆయన చర్యలన్నియు న్యాయములు.” (ద్వితీయోపదేశకాండము 32:4) మనలో ఎవరమైనా మన గురించి మనం అలా చెప్పుకోలేము ఎందుకంటే సరైనదేదో దాని విషయంలో మన గ్రహింపును, మన పరిమిత దృక్కోణం అస్పష్టం చేస్తుంది. ఉదాహరణకు, అబ్రాహాము విషయమే తీసుకోండి. సొదొమలో దుష్టత్వం విపరీతంగా ఉన్నా ఆయన దాని నాశనం విషయంలో యెహోవాను వేడుకున్నాడు. ఆయన యెహోవాను ఇలా అడిగాడు: “దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా?” (ఆదికాండము 18:23-33) చేయడనేదే దానికి జవాబు. ఎందుకంటే, నీతిమంతుడైన లోతు అతని కుమార్తెలు సురక్షితంగా సోయరు అనే ఊరికి చేరుకున్న తర్వాతే యెహోవా సొదొమపై ‘గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించాడు.’ (ఆదికాండము 19:22-24) దీనికి భిన్నంగా, నీనెవె ప్రజలపట్ల దేవుడు కనికరం చూపినప్పుడు యోనా ‘కోపగించుకున్నాడు.’ వారి నాశనాన్ని యోనా ముందే ప్రకటించాడు కాబట్టి, వారు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడినా, వారు నిర్మూలించబడడం చూసి అతడు సంతోషపడి ఉండేవాడు.—యోనా 3:10-4:1.

17 తన న్యాయాన్ని అమలు చేయడంలో కేవలం దుష్టులను నాశనం చేయడమే కాదు నీతిమంతులను రక్షించడం కూడా ఉందని యెహోవా అబ్రాహాముకు హామీ ఇచ్చాడు. మరోవైపున, యెహోవా కనికరం గలవాడని యోనా నేర్చుకోవలసి వచ్చింది. దుష్టులు తమ మార్గాన్ని మార్చుకుంటే, ఆయన ‘క్షమించడానికి సిద్ధంగా’ ఉన్నాడు. (కీర్తన 86:5) అభద్రతా భావంతో ఉండే కొంతమంది మానవుల్లా కేవలం తన శక్తి ప్రదర్శించడానికే అన్నట్టు యెహోవా తన ప్రతికూల తీర్పులను అమలు చేయడు లేదా తను బలహీనుడని దృష్టించబడతాననే భయంతో కనికరం చూపకుండా ఉండడు. ఆధారమున్న ప్రతీ సమయంలో కనికరం చూపడమే ఆయన విధానం.—యెషయా 55:7; యెహెజ్కేలు 18:23.

18.యెహోవా కేవలం మానసిక భావనను బట్టి చర్య తీసుకోడని బైబిలు నుండి చూపండి.

18 అలాగని, యెహోవా కేవలం మానసిక భావన మూలంగా తప్పు నిర్ణయం తీసుకోడు. తన ప్రజలు విగ్రహారాధనలో మునిగిపోయినప్పుడు, యెహోవా స్థిరంగా ఇలా ప్రకటించాడు: “నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను. నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, . . . నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను.” (యెహెజ్కేలు 7:3, 4) మానవులు తమ ప్రవర్తనలో మితిమీరినప్పుడు, తదనుగుణంగా యెహోవా తీర్పుతీరుస్తాడు. అయితే ఆయన తీర్పు బలమైన సాక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. అందుకే సొదొమ గొమొఱ్ఱాల గురించిన “మొర” గట్టిగా తన చెవులకు చేరినప్పుడు, యెహోవా ఇలా ప్రకటించాడు: “నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను.” (ఆదికాండము 18:20, 21) వాస్తవాలన్నీ వినకముందే త్వరపడి ఒక నిర్ణయానికొచ్చే అనేకమంది మానవుల్లా యెహోవా ఉండనందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! నిజంగా, “ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు” అని బైబిలు వర్ణిస్తున్నట్లుగానే యెహోవా ఉన్నాడు.—ద్వితీయోపదేశకాండము 32:4.

యెహోవా న్యాయం మీద నమ్మకముంచండి

19.యెహోవా న్యాయాన్ని అమలు చేయడానికి సంబంధించి తికమకపెట్టే ప్రశ్నలు మనకున్నప్పుడు మనమేమి చేయవచ్చు?

19 యెహోవా గతంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన ప్రతీ ప్రశ్నకు బైబిలు సమాధానం ఇవ్వడం లేదు; లేదా భవిష్యత్తులో యెహోవా ఆయా వ్యక్తులకు, ప్రజాగుంపులకు ఎలా తీర్పు తీరుస్తాడనే దాని గురించిన ప్రతీ వివరణను అది ఇవ్వడం లేదు. అలాంటి వివరాలు కనబడని బైబిలు వృత్తాంతాలను లేదా ప్రవచనాలనుబట్టి మనం తికమకపడ్డప్పుడు మీకా ప్రవక్త చూపిన విశ్వాస్యతనే మనమూ ప్రదర్శించవచ్చు. ఆయనిలా వ్రాశాడు: “రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును.”—మీకా 7:7.

20, 21.యెహోవా అన్ని సందర్భాల్లో సరైనదే చేస్తాడని మనమెందుకు నమ్మకంతో ఉండవచ్చు?

20 ప్రతీ పరిస్థితిలో యెహోవా సరైనదే చేస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు. మానవులు అన్యాయాలను పెడచెవినబెడుతున్నట్లు అనిపించినా యెహోవా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును.” (రోమీయులు 12:19) మనం వేచివుండే దృక్పథాన్ని చూపించినప్పుడు, “దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు” అని అపొస్తలుడైన పౌలు వ్యక్తంచేసిన స్థిర నమ్మకాన్నే మనమూ ప్రతిధ్వనిస్తాం.—రోమీయులు 9:14.

21 మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. (2 తిమోతి 3:1) అధర్మం, “అన్యాయ క్రియల” ఫలితంగా క్రూర కృత్యాలు అనేకం జరిగాయి. (ప్రసంగి 4:1) అయితే, యెహోవా మారలేదు. ఆయన ఇప్పటికీ అన్యాయాన్ని ద్వేషిస్తూనే, దానికి బలైన వారిపట్ల ప్రగాఢ శ్రద్ధ చూపిస్తున్నాడు. యెహోవాకు, ఆయన సర్వాధిపత్యానికి మనం విశ్వాస్యంగా నిలబడితే, తన రాజ్యపాలన క్రింద అన్యాయమంతటినీ ఆయన సరిదిద్దే నిర్ణయకాలం వరకు సహించడానికి అవసరమైన బలం ఆయన మనకిస్తాడు.—1 పేతురు 5:6, 7.

^ యోబు గురించి యెహోవా ఇలాచెప్పాడు: “భూమిమీద అతనివంటివాడెవడును లేడు.” (యోబు 1:8) యోబు బహుశా యోసేపు మరణం తర్వాత, మోషే ఇశ్రాయేలీయుల నియమిత నాయకునిగా రాకముందు కాలంలో జీవించి ఉంటాడు. అందువల్ల ఆ కాలంలో యోబువంటి యథార్థపరుడు ఇంకెవరూ లేరని చెప్పడానికి వీలుంది.