కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 9

‘క్రీస్తు దేవుని శక్తిగా ఉన్నాడు’

‘క్రీస్తు దేవుని శక్తిగా ఉన్నాడు’

1-3.(ఎ)గలిలయ సముద్రంపై ఆ శిష్యులకు ఎలాంటి భయంకరమైన అనుభవం ఎదురైంది, యేసు ఏమిచేశాడు? (బి) “క్రీస్తు దేవుని శక్తి” అని సరిగా ఎందుకు పిలువబడ్డాడు?

 శిష్యులు భయకంపితులయ్యారు. వారు గలిలయ సముద్రంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా తుపాను చెలరేగింది. ఆ సముద్రంలో అలాంటి తుపాన్లు చెలరేగడం అంతకుముందు కూడా వారు చూసే ఉంటారనడంలో సందేహం లేదు, ఎంతైనా వారిలో కొందరు మంచి అనుభవమున్న జాలర్లు. * (మత్తయి 4:18, 19) అయితే ఇది “పెద్ద తుపాను,” ఇది చెలరేగిన వెంటనే సముద్రాన్ని అల్లకల్లోలం చేసింది. దోనె నడపడానికి వారు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు గానీ తుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. ఎగసిపడే అలలు “దోనెమీద” పడుతూ దానిని నింపడం మొదలుపెట్టాయి. అంత కల్లోలంలో కూడా, రోజంతా జనసమూహాలకు బోధించి అలసిపోయిన యేసు దోనె అమరమున గాఢంగా నిద్రపోతున్నాడు. తమ ప్రాణాలు పోతాయనే భయంతో ఆ శిష్యులు, “ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని” వేడుకుంటూ ఆయనను నిద్రలేపారు.—మార్కు 4:35-38; మత్తయి 8:23-25.

2 యేసు భయపడలేదు. పూర్తి నమ్మకంతో ఆయన ఆ గాలిని సముద్రాన్ని ఇలా గద్దించాడు: “నిశ్శబ్దమై ఊరకుండుము.” వెంటనే గాలి, సముద్రం ఆ మాటకు లోబడగా ఆ పెనుగాలి ఆగి, అలలు తగ్గిపోవడంతో పరిస్థితి “మిక్కిలి నిమ్మళమాయెను.” అప్పుడు శిష్యులకు చెప్పలేని భయం పట్టుకుంది. “ఈయన ఎవరో” అని వారు ఒకరితో ఒకరు గుసగుసలాడారు. నిజానికి అల్లరి పిల్లవాణ్ణి చక్కబెట్టినట్లు గాలిని, సముద్రాన్ని ఎలాంటి మనిషి గద్దించగలడు?—మార్కు 4:39-41; మత్తయి 8:26, 27.

3 కానీ యేసు సాధారణ మానవుడు కాడు. యెహోవా శక్తి అసాధారణ రీతుల్లో ఆయన పక్షాన, ఆయన ద్వారా ప్రదర్శించబడింది. అందుకే, ప్రేరేపిత అపొస్తలుడైన పౌలు “క్రీస్తు దేవుని శక్తి” అని సరిగానే గుర్తించాడు. (1 కొరింథీయులు 1:24) యేసు ద్వారా దేవుని శక్తి ఏయే విధాలుగా ప్రదర్శించబడింది? యేసు ఆ శక్తిని ఉపయోగించడం మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలదు?

దేవుని అద్వితీయకుమారుని శక్తి

4, 5.(ఎ)యెహోవా తన అద్వితీయకుమారునికి ఎలాంటి శక్తి, అధికారం అప్పగించాడు? (బి) తన తండ్రి సృష్టి సంకల్పాలను నెరవేర్చడానికి ఈ కుమారుడెలా సన్నద్ధుడయ్యాడు?

4 యేసుకు మానవపూర్వ ఉనికిలో ఉన్నప్పటి శక్తిని పరిశీలించండి. యేసు క్రీస్తుగా పేరుగాంచిన తన అద్వితీయకుమారుణ్ణి సృష్టించినప్పుడు యెహోవా తన సొంత “నిత్యశక్తి” ఉపయోగించాడు. (రోమీయులు 1:20; కొలొస్సయులు 1:15) ఆ తర్వాత, యెహోవా తన సృష్టి సంకల్పాలను నెరవేర్చే పనిని తన కుమారునికి అప్పగిస్తూ ఆయనకు అపారమైన శక్తిని, అధికారాన్ని కట్టబెట్టాడు. ఆ కుమారుని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్న దేదియు ఆయన లేకుండ కలుగలేదు.”—యోహాను 1:2, 3.

5 ఆ నియామక విస్తారతను మనం సంపూర్ణంగా గ్రహించలేము. కోట్లాది బలమైన దేవదూతలను, అనేక శతకోట్ల నక్షత్రవీధులున్న భౌతిక విశ్వాన్ని, విస్తారమైన వైవిధ్యభరిత జీవజాతులుగల ఈ భూమిని ఉనికిలోకి తేవడానికి ఎంత శక్తి కావాలో ఊహించండి. ఆ పనులు చేయడానికి ఈ విశ్వంలోనే అతి బలమైన శక్తి అంటే దేవుని పరిశుద్ధాత్మ ఆ అద్వితీయకుమారుని అధీనంలో ఉంది. మిగతావన్నీ సృష్టించేందుకు యెహోవా ఉపయోగించిన ఈ కుమారుడు ప్రధాన శిల్పిగా మిక్కిలి ఆనందించాడు.—సామెతలు 8:22-31.

6.భూమ్మీద ఆయన మరణ, పునరుత్థానాల తర్వాత యేసుకు ఎలాంటి శక్తి, అధికారం ఇవ్వబడ్డాయి?

6 ఈ అద్వితీయకుమారుడు ఇంకా ఎక్కువ శక్తి, అధికారం పొందడానికి వీలుందా? భూమ్మీద యేసు మరణ పునరుత్థానాల తర్వాత ఆయనిలా అన్నాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” (మత్తయి 28:18) అవును, విశ్వవ్యాప్తంగా అధికారంచేసే సామర్థ్యం, హక్కు యేసుకు అనుగ్రహించబడ్డాయి. తన తండ్రికి విరుద్ధంగా నిలబడే దృశ్యమైన, అదృశ్యమైన ‘సమస్త ఆధిపత్యమును, సమస్త అధికారమును, బలమును కొట్టివేసే’ అధికారం ‘రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా’ ఆయనకు ఇవ్వబడింది. (ప్రకటన 19:16; 1 కొరింథీయులు 15:24-26) యెహోవా దేవుడు తనను తప్ప, ఆయనకు “లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు.”—హెబ్రీయులు 2:8; 1 కొరింథీయులు 15:27.

7.యెహోవా తనకప్పగించిన శక్తిని యేసు ఎన్నడూ దుర్వినియోగం చేయడని మనమెందుకు నమ్మకంగా ఉండవచ్చు?

7 యేసు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడేమో అని మనం కలతచెందాలా? ఎంతమాత్రం అక్కర్లేదు. యేసు తన తండ్రిని నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు అయిష్టమైనదేది ఎన్నడూ చేయడు. (యోహాను 8:29; 14:31) యెహోవా తన సర్వశక్తిని ఎన్నడూ దుర్వినియోగం చేయడని యేసుకు బాగా తెలుసు. ‘తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచడానికి’ అవకాశాల కోసం యెహోవా అన్వేషిస్తాడని యేసు స్వయంగా గమనించాడు. (2 దినవృత్తాంతములు 16:9) నిజానికి, మానవాళిపట్ల తండ్రికున్నటువంటి ప్రేమే యేసుకు కూడా ఉంది, అందువల్ల యేసు తన శక్తిని అన్ని సందర్భాల్లో మేలుకోసమే ఉపయోగిస్తాడని మనం నమ్మవచ్చు. (యోహాను 13:1) ఈ విషయంలో యేసు మచ్చలేని చరిత్ర స్థాపించాడు. భూమ్మీద ఉన్నప్పుడు ఆయనకున్న శక్తిని, దానిని ఉపయోగించడానికి ఆయనెలా పురికొల్పబడ్డాడో మనం పరిశీలిద్దాం.

‘వాక్‌శక్తి గలవాడు’

8.అభిషేకించబడిన తర్వాత యేసు ఏమిచేయడానికి శక్తిపొందాడు, ఆయన తన శక్తినెలా ఉపయోగించాడు?

8 నజరేతులో బాలునిగా పెరుగుతున్నప్పుడు యేసు ఎలాంటి అద్భుతాలూ చేయలేదని స్పష్టమవుతోంది. అయితే సా.శ. 29లో దాదాపు 30 సంవత్సరాల వయస్సులో ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ పరిస్థితి మారింది. (లూకా 3:21-23) బైబిలు మనకిలా చెబుతోంది: ‘దేవుడాయనను పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.’ (అపొస్తలుల కార్యములు 10:38) “మేలు చేయుచు” అనే మాట యేసు తన శక్తిని సరిగా ఉపయోగించాడని సూచించడం లేదా? అభిషేకించబడిన తర్వాత ఆయన “క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.”—లూకా 24:19.

9-11.(ఎ)యేసు తన బోధనెక్కువగా ఏ ప్రాంతాల్లో చేశాడు, ఆయనెలాంటి సవాలునెదుర్కొన్నాడు? (బి) యేసు బోధనా విధానానికి జనసమూహాలు ఎందుకు ఆశ్చర్యపడ్డాయి?

9 యేసుకు ఎలాంటి వాక్‌శక్తి ఉంది? ఆయన తరచూ బహిరంగ ప్రదేశాల్లో అంటే సముద్రతీరాల్లో, కొండ ప్రాంతాల్లోనే కాక వీధుల్లో, సంత ప్రదేశాల్లో కూడా బోధించాడు. (మార్కు 6:53-56; లూకా 5:1-3; 13:26) ఆయన మాటలు నచ్చనివారు ఎలాంటి నిర్భందం లేకుండా వెళ్లిపోవచ్చు. ముద్రిత పుస్తకాలు వాడుకలోకి రాని ఆ కాలంలో, ప్రశంసచూపిన శ్రోతలు ఆయన మాటలు తమ మనస్సుల్లో హృదయాల్లో భద్రపరచుకోవాలి. కాబట్టి యేసు బోధ సంపూర్ణంగా ఆకట్టుకునేదిగా, స్పష్టంగా అర్థచేసుకొనేదిగా, సులభంగా గుర్తుపెట్టుకొనేదిగా ఉండాలి. అయితే అది యేసుకు ఒక సవాలు కానేకాదు. ఉదాహరణకు, ఆయన కొండమీద ఇచ్చిన ప్రసంగాన్ని పరిశీలించండి.

10 సా.శ. 31 తొలిభాగంలో ఒక రోజు ఉదయం గలిలయ సముద్రం దగ్గర ఒక కొండప్రక్కన ఒక జనసమూహం సమకూడింది. కొందరు 100 నుండి 110 కిలోమీటర్ల దూరంలోవున్న యెరూషలేము, యూదయలనుండి వచ్చారు. మరికొందరు ఉత్తరాన సముద్రతీర ప్రాంతాలైన తూరు, సీదోనులనుండి వచ్చారు. అనేకమంది రోగులు యేసును ముట్టుకుందామని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారినందరిని బాగుచేశాడు. వారిలో తీవ్ర అస్వస్థతతో బాధపడేవారెవరూ లేనప్పుడు ఆయన వారికి బోధించడం ఆరంభించాడు. (లూకా 6:17-19) ఆ తర్వాత ఆయన మాట్లాడ్డం ముగించిన తర్వాత, తాము విన్నదాన్నిబట్టి వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకు?

11 ఆ కొండమీది ప్రసంగం విన్న ఒక వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత ఇలా వ్రాశాడు: “జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన . . . అధికారముగలవానివలె వారికి బోధించెను.” (మత్తయి 7:28, 29) యేసు వారు గ్రహించగల శక్తితో మాట్లాడాడు. ఆయన దేవుని పక్షాన మాట్లాడి దేవుని వాక్యపు అధికారంతో తన బోధకు బలం చేకూర్చాడు. (యోహాను 7:16) యేసు పలికిన మాటలు స్పష్టంగా, ఆయన బోధనలు ఒప్పింపజేసేవిగా, ఆయన తర్కాలు తిరుగులేనివిగా ఉండేవి. ఆయన మాటలు వివాదాంశాలను సూటిగా ప్రస్తావించడమే కాకుండా శ్రోతల హృదయాలకూ చేరాయి. సంతోషమెలా కనుగొనాలో, ఎలా ప్రార్థించాలో, దేవుని రాజ్యాన్ని ఎలా వెదకాలో, సురక్షితమైన భవిష్యత్తుకెలా పునాది వేసుకోవాలో ఆయన వారికి బోధించాడు. (మత్తయి 5:3-7:27) ఆయన మాటలు నీతికొరకు, సత్యంకొరకు ఆకలిదప్పులు గలవారి హృదయాలను జాగృతం చేశాయి. అలాంటివారు ఆయనను అనుసరించేందుకు తమనుతాము “ఉపేక్షించుకొని” సర్వం విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. (మత్తయి 16:24; లూకా 5:10, 11) యేసు వాక్‌శక్తికి అదెంత గొప్ప సాక్ష్యమో గదా!

‘క్రియలో శక్తిగలవాడు’

12, 13.యేసు ఏ భావంలో ‘క్రియలో శక్తిగలవాడు,’ ఆయనచేసిన అద్భుతాల్లో ఎలాంటి వైవిధ్యముంది?

12 యేసు ‘క్రియలోను శక్తిగలవాడు.’ (లూకా 24:19) సువార్తలు ఆయన చేసిన 30కి పైగా అద్భుతాల గురించి తెలియజేస్తున్నాయి, వాటన్నింటిని ఆయన ‘యెహోవా శక్తితో’ చేశాడు. * (లూకా 5:17, NW) యేసుచేసిన అద్భుతాలు వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేశాయి. ఆయన చేసిన కేవలం రెండు అద్భుతాల్లో, అంటే “స్త్రీలును పిల్లలును గాక” 5,000 మంది పురుషులకు, ఆ తర్వాత 4,000 మంది పురుషులకు ఆహారం పెట్టిన సందర్భాల్లో బహుశా మొత్తం 20,000కంటే ఎక్కువమందిగా ఉన్న జనసమూహాలు ఉన్నాయి.—మత్తయి 14:13-21; 15:32-38.

‘యేసు సముద్రం మీద నడవడం వారు చూశారు’

13 యేసుచేసిన అద్భుతాల్లో గొప్ప వైవిధ్యముంది. ఆయనకు దయ్యాలపై అధికారం ఉంది, అందుకే ఆయన వాటిని సులభంగా వెళ్లగొట్టాడు. (లూకా 9:37-43) భౌతిక వస్తువులపై కూడా ఆయనకు అధికారం ఉంది, అందుకే ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. (యోహాను 2:1-11) తన శిష్యులకు ఆశ్చర్యం కలిగే విధంగా ఆయన గాలితో చెలరేగిన గలిలయ సముద్రము మీద నడిచాడు. (యోహాను 6:​18, 19) ఆయనకు వ్యాధులపై, శరీరావయవ సంబంధ రుగ్మతలపై, దీర్ఘవ్యాధులపై, ప్రాణాపాయం కలిగించే రోగాలపై ఆధిపత్యం ఉంది. (మార్కు 3:1-5; యోహాను 4:46-54) ఆయన అలాంటి స్వస్థతలు విభిన్నరీతుల్లో జరిగించాడు. కొందరు దూరంనుండే బాగుచేయబడగా, మరికొందరు స్వయంగా యేసు స్పర్శను చవిచూశారు. (మత్తయి 8:2, 3, 5-13) కొందరు వెంటనే బాగుపడగా, మరికొందరు క్రమేపి స్వస్థత పొందారు.—మార్కు 8:22-25; లూకా 8:43, 44.

14.మరణాన్ని నిర్వీర్యం చేయగల శక్తి తనకు ఉందని యేసు ఎలాంటి పరిస్థితుల్లో ప్రదర్శించాడు?

14 అసాధారణ రీతిలో, యేసుకు మరణాన్ని నిర్వీర్యంచేసే శక్తివుంది. నమోదు చేయబడిన మూడు సందర్భాల్లో, ఆయన మృతులను తిరిగి లేపాడు, 12 సంవత్సరాల బాలికను ఆమె తల్లిదండ్రులకు, ఒక విధవరాలి ఏకైక కుమారుణ్ణి అతని తల్లికి, తమ ప్రియ సోదరుణ్ణి అతని చెల్లెళ్లకు అప్పగించాడు. (లూకా 7:11-15; 8:49-56; యోహాను 11:38-44) ఏ పరిస్థితీ ఆయనకు అసాధ్యమైనది కాదు. ఆయన 12 సంవత్సరాల అమ్మాయిని చనిపోయిన కొద్దిసేపటికే తిరిగి లేపాడు. విధవరాలి కుమారుణ్ణి పాడెమీదే, అంటే అతడు చనిపోయిన రోజునే అతడిని పునరుత్థానం చేశాడు. లాజరు చనిపోయి నాలుగు దినములైన తర్వాత సమాధిలో నుండి ఆయనను తిరిగి లేపాడు.

ఇతరుల కష్టసుఖాలను గుర్తెరిగి నిస్వార్థంగా, బాధ్యతాయుతంగా శక్తిని ఉపయోగించడం

15, 16.యేసు తన శక్తిని ఉపయోగించడంలో నిస్వార్థపరుడనేందుకు ఎలాంటి రుజువులున్నాయి?

15 యేసుకున్న అధికారాన్ని అపరిపూర్ణ పరిపాలకుని చేతిలో పెడితే జరగగల దుర్వినియోగాన్ని మీరు ఊహించగలరా? కానీ యేసు పాపరహితుడు. (1 పేతురు 2:22) ఇతరులకు హాని కలిగించే విధంగా తమ శక్తిని ఉపయోగించేలా అపరిపూర్ణ మానవులను పురికొల్పే స్వార్థం, వాంఛ, పేరాశల మూలంగా తనకు మచ్చ పడేందుకు ఆయన అనుమతించలేదు.

16 యేసు నిస్వార్థంగా తన శక్తిని ఉపయోగించాడు, ఆయనెన్నడూ దానిని తన స్వలాభం కోసం ప్రయోగించలేదు. ఆకలితో ఉన్నప్పుడు ఆయన తనకోసం రాళ్లను రొట్టెలుగా మార్చుకోవడానికి నిరాకరించాడు. (మత్తయి 4:1-4) ఆయన నామమాత్రపు వస్తువులు ఆయన తన శక్తిని వస్తుదాయక లాభార్జనకు ఉపయోగించలేదని రుజువుచేస్తున్నాయి. (మత్తయి 8:20) ఆయనచేసిన శక్తిమంతమైన కార్యాలు నిస్వార్థ బుద్ధితోనే చేశాడనడానికి ఇంకా ఎక్కువ రుజువులున్నాయి. ఆయన అద్భుతాలు చేసినప్పుడు, ఆయన తన వైపు నుండి కొంత త్యాగంచేసి వాటిని చేశాడు. ఆయన రోగులను బాగుచేసినప్పుడు ఆయనలో నుండి శక్తి బయటకు పోయేది. అలా శక్తి లేదా ప్రభావం తనలోనుండి బయటకు పోవడం ఆయనకు తెలిసేది, ఒక్క స్వస్థత చేసినప్పుడు కూడా అలాగే జరిగేది. (మార్కు 5:25-34) అయినప్పటికీ, ఆయన గుంపులుగా ప్రజలు తనను ముట్టుకోవడానికి అనుమతించాడు, వారు స్వస్థతపొందారు. (లూకా 6:19) ఎంత నిస్వార్థ స్వభావమో కదా!

17.యేసు తాను తన శక్తిని ఉపయోగించడంలో బాధ్యతాయుతంగా ఉన్నానని ఎలా ప్రదర్శించాడు?

17 యేసు తన శక్తిని బాధ్యతాయుతంగా ఉపయోగించాడు. ఆయనెన్నడూ డంబముగా, ఉద్దేశరహితమైన రంగస్థల ప్రదర్శనా ఫక్కీలో అద్భుతకార్యాలు చేయలేదు. (మత్తయి 4:5-7) హేరోదు అనుచిత కుతూహలం తీర్చేందుకు యేసు సూచక క్రియలు చేయడానికి ఇష్టపడలేదు. (లూకా 23:8, 9) యేసు తన శక్తిని ప్రచారం చేసుకోవడానికి బదులు, తాను చేసిన స్వస్థతల గురించి ఎవరికీ చెప్పవద్దని స్వస్థత పొందిన వారికి తరచూ ఆదేశించాడు. (మార్కు 5:43; 7:36) సంచలనాత్మక నివేదికల ఆధారంగా ప్రజలు తన గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడాన్ని ఆయన ఇష్టపడలేదు.—మత్తయి 12:15-19.

18-20.(ఎ)యేసు తన శక్తిని ఉపయోగించిన విధానాన్ని ఏది ప్రభావితం చేసింది? (బి) ఒక చెవిటివాణ్ణి యేసు స్వస్థపరచిన విధానం గురించి మీరెలా భావిస్తున్నారు?

18 ఈ శక్తిమంతుడైన యేసు ఇతరుల బాధలపట్ల, అవసరాలపట్ల కొంచెంకూడా జాలిలేకుండా అధికారం చెలాయించే పాలకుల్లా ఎంతమాత్రం లేడు. యేసు ప్రజలపై శ్రద్ధచూపాడు. బాధపడేవారిని చూసినప్పుడు ఆయనెంతగా ప్రభావితుడయ్యేవాడంటే వారి బాధ తొలగించడానికి ఆయన ఎంతో పురికొల్పబడేవాడు. (మత్తయి 14:14) వారి భావాలను, అవసరాలను ఆయన జాగ్రత్తగా గమనించాడు, ఈ వాత్సల్యపూరిత శ్రద్ధ ఆయన తన శక్తిని ఉపయోగించిన విధానంపై ప్రభావం చూపింది. దీనికి ఒక చక్కని ఉదాహరణ మార్కు 7:​31-37​లో కనబడుతుంది.

19 ఈ సందర్భంలో, గొప్ప జనసమూహాలు యేసును కనుగొని అనేకమంది రోగులను ఆయనవద్దకు తీసుకురాగా ఆయన వారందరిని బాగుచేశాడు. (మత్తయి 15:29, 30) అయితే యేసు వారిలోనుండి ఒక వ్యక్తిని ప్రత్యేక శ్రద్ధ చూపేందుకు ఎన్నుకున్నాడు. అతడు చెవుడు, నోటి మాంద్యము గలవాడు. ఇతని తడబాటును లేదా కలవరాన్ని యేసు ప్రత్యేకంగా గమనించే ఉంటాడు. ఆలోచనాశీలతతో యేసు ఆ వ్యక్తిని ప్రక్కకు అంటే ఆ జనసమూహానికి దూరంగా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. యేసు తాను చేయబోయేది అతనికి సంజ్ఞలతో తెలియజేసి, ‘వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టాడు.’ * (మార్కు 7:33) ఆ తర్వాత, యేసు ఆకాశమువైపు కన్నులెత్తి ప్రార్థనాపూర్వకంగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఈ సంజ్ఞలు ఆ వ్యక్తికి, ‘నీకు నేను చేయబోయే కార్యం దేవుని శక్తివలన కలుగబోతోంది’ అని సూచించాయి. చివరకు యేసు ఇలా అన్నాడు: ‘తెరవబడుము.’ (మార్కు 7:34) దానితో ఆ వ్యక్తి వినికిడి పునరుద్ధరించబడి మామూలుగా మాట్లాడగలిగాడు.

20 యేసు బాధితులను స్వస్థపరిచేందుకు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించేటప్పుడు కూడా వారి భావాలపట్ల సానుభూతిగల శ్రద్ధ చూపించడం ఎంతగా మనస్సును తాకే విషయమో గదా! యెహోవా అంత శ్రద్ధచూపే, దయాళువైన పరిపాలకుని చేతిలో మెస్సీయ రాజ్యాన్ని ఉంచాడని తెలుసుకోవడం ఓదార్పుకరంగా లేదా?

రాబోయే సంగతుల ప్రవచనార్థక గుర్తు

21, 22.(ఎ)యేసు చేసిన అద్భుతాలు దేనిని ప్రవచనార్థకంగా సూచించాయి? (బి) యేసుకు ప్రకృతి శక్తులపై ఆధిపత్యం ఉంది కాబట్టి, ఆయన రాజ్య పరిపాలన క్రింద మనమెలాంటి వాటికోసం ఆశించవచ్చు?

21 యేసు భూమ్మీద జరిగించిన అద్భుతకార్యాలు ఆయన పరిపాలనా కాలంలో లభించే మరింత గొప్ప ఆశీర్వాదాలకు కేవలం ముంగుర్తులుగా ఉన్నాయి. దేవుని నూతనలోకంలో, యేసు మళ్ళీ ఒకసారి అద్భుతాలు చేస్తాడు అయితే అవి భూవ్యాప్తంగా చేస్తాడు. ఉత్కంఠభరితమైన భవిష్యత్‌ ఉత్తరాపేక్షల్లో కొన్నింటిని పరిశీలించండి.

22 భూ ఆవరణాన్ని యేసు పరిపూర్ణ సమతుల్యానికి పునరుద్ధరిస్తాడు. తుపానును నిమ్మళింపజేయడం ద్వారా ప్రకృతి శక్తులపై తనకున్న ఆధిపత్యాన్ని ఆయన ప్రదర్శించాడని గుర్తుతెచ్చుకోండి. కాబట్టి క్రీస్తు రాజ్య పరిపాలన క్రింద తుపానులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలవల్ల హాని జరుగుతుందని మానవజాతి అస్సలు భయపడనక్కర్లేదు. యేసు, భూమిని దానిమీది సమస్త జీవాన్ని సృష్టించేందుకు యెహోవా ఉపయోగించిన ప్రధానశిల్పి కాబట్టి ఆయన భూ నిర్మాణ రీతిని పూర్తిగా అర్థంచేసుకుంటాడు. దాని వనరులను సరిగా ఎలా ఉపయోగించాలో ఆయనకు తెలుసు. ఆయన పరిపాలన క్రింద, ఈ భూమంతా పరదైసుగా మారుతుంది.—లూకా 23:43.

23.రాజుగా యేసు మానవాళి అవసరాలెలా తీరుస్తాడు?

23 మానవాళి అవసరాల విషయమేమిటి? కేవలం కొంచెం ఆహారాన్ని ఉపయోగించి వేలాదిమందికి సమృద్ధిగా ఆహారమివ్వగలిగిన యేసు సామర్థ్యం, ఆయన పరిపాలన ఆకలినుండి విముక్తి తీసుకొస్తుందని మనకు హామీ ఇస్తోంది. అవును, అందరికీ సమానంగా లభించేంత సమృద్ధిగా ఆహారం ఉండడం ఆకలిని శాశ్వతంగా నిర్మూలిస్తుంది. (కీర్తన 72:16) రోగం, వ్యాధిపై ఆయనకున్న ఆధిపత్యం రోగులు, గ్రుడ్డివారు, చెవిటివారు, వికలాంగులు, కుంటివారు పూర్తిగా, శాశ్వతంగా స్వస్థపరచబడతారని మనకు చెబుతోంది. (యెషయా 33:24; 35:5, 6) తన తండ్రి జ్ఞాపకముంచుకోవడానికి ఇష్టపడే లక్షలాదిమందిని పునరుత్థానం చేసేందుకు ఆయనకున్న శక్తి పరలోక రాజుగా ఆయనకున్న అధికారంలో ఒక భాగమని మృతులను పునరుత్థానం చేసేందుకు ఆయనకున్న సామర్థ్యం మనకు హామీ ఇస్తోంది.—యోహాను 5:28, 29.

24.యేసు శక్తిని మనం ధ్యానిస్తుండగా, మనమేమి గుర్తుంచుకోవాలి, ఎందుకు?

24 యేసు శక్తిని మనం ధ్యానిస్తుండగా, ఈ కుమారుడు తన తండ్రిని పరిపూర్ణంగా అనుకరిస్తున్నాడని మనం గుర్తుంచుకుందాం. (యోహాను 14:9) యేసు తనకున్న శక్తిని ఉపయోగించడం, యెహోవా తన శక్తినెలా ఉపయోగిస్తాడో మనకు సవివరంగా తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఒకానొక కుష్ఠరోగిని యేసు వాత్సల్యపూరితంగా స్వస్థపరచిన విధానం గురించి ఆలోచించండి. కనికరంతో యేసు ఆ వ్యక్తిని ముట్టుకొని, “నాకిష్టమే” అన్నాడు. (మార్కు 1:40-42) ఇలాంటి వృత్తాంతాల ద్వారా నిజానికి, ‘ఈ విధంగా నేను నా శక్తిని ఉపయోగిస్తాను’ అని యెహోవాయే చెబుతున్నాడు. మన సర్వశక్తిగల దేవుడు తన శక్తిని అలా ప్రేమపూర్వకంగా ఉపయోగిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి మీరు కదలించబడడం లేదా?

^ గలిలయ సముద్రంలో ఆకస్మిక తుపానులు రావడం సర్వసాధారణం. అది సముద్ర మట్టానికి (దాదాపు 700 అడుగులు దిగువన) తక్కువ ఎత్తులోవున్న కారణంగా, ఆ పరిసర ప్రాంతాలకంటే అక్కడ గాలిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, అది వాతావరణంలో గందరగోళాలు సృష్టిస్తుంది. ఉత్తరానవున్న హెర్మోను పర్వతం మీదుగా యొర్దాను లోయ దిగువకు బలమైన గాలులు వీస్తాయి. ప్రశాంతంగావున్న సముద్రం అకస్మాత్తుగా మరుక్షణంలోనే తుపాను చెలరేగి కల్లోలభరితమవుతుంది.

^ వీటికితోడు, సువార్తలు కొన్నిసార్లు అనేక అద్భుతాలను కలిపి ఒకే సాధారణ వివరణలో చేర్చాయి. ఉదాహరణకు, ఒక సందర్భంలో ఆయనను చూసేందుకు “పట్టణమంతయు” కూడివచ్చినప్పుడు, ఆయన రోగాలతో పీడించబడుతున్న “అనేకులను” స్వస్థపరిచాడు.—మార్కు 1:32-34.

^ యూదులు, అన్యులు ఉమ్మివేయడాన్ని స్వస్థతకు ఆధారంగా లేదా సూచనగా అంగీకరించేవారు, స్వస్థతల్లో లాలాజల ఉపయోగం రబ్బూనీయ రచనల్లో నివేదించబడింది. ఆ వ్యక్తి స్వస్థపరచబడబోతున్నాడని కేవలం తెలియజేయడానికే యేసు ఉమ్మివేసి ఉంటాడు. ఏదేమైనా, లాలాజలాన్ని యేసు సహజ స్వస్థతా మూలికగా ఉపయోగించడం లేదు.