కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ గ్రంథం నమ్మదగినదేనా?

ఈ గ్రంథం నమ్మదగినదేనా?

ఈ గ్రంథం నమ్మదగినదేనా?

“ప్రామాణికతకు సంబంధించిన మరింత విశ్వసనీయమైన సూచనల్ని ఏ [లౌకిక] చరిత్రలో కన్నా బైబిలులోనే నేను ఎక్కువగా కనుగొన్నాను.”—ప్రసిద్ధిగాంచిన ఆంగ్ల శాస్త్రజ్ఞుడైన సర్‌ ఐసక్‌ న్యూటన్‌.1

ఈ గ్రంథం—బైబిలు—నమ్మదగినదేనా? నిజంగా జీవించిన ప్రజల్నీ, అసలు ఉనికిలోవున్న స్థలాల్నీ, మరి వాస్తవంగా జరిగిన సంఘటనల్నీ ఇది తెలియజేస్తోందా? అలాగైతే ఇది జాగ్రత్తగల, నిజాయితీపరులైన రచయితలచే రాయబడిందనడానికి రుజువులుండాలి. రుజువులు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ భూగర్భంలో దొరికాయి. మరిన్ని ఆ గ్రంథంలోనే ఉన్నాయి.

రుజువుల్ని వెలికితీయడం

బైబిలులో ప్రస్తావించబడిన ప్రదేశాల్లో నిక్షిప్తమైవున్న ప్రాచీన కళాఖండాల్ని కనుగొనడం బైబిలు యొక్క చారిత్రాత్మక భౌగోళిక కచ్చితత్వానికి మద్దతునిచ్చింది. పురావస్తుశాస్త్రవేత్తలు వెలికితీసిన రుజువుల్లో కేవలం కొన్నింటిని పరిశీలించండి.

ఇశ్రాయేలీయుల రాజైన, ధైర్యంగల యౌవన కాపరి అయిన దావీదు బైబిలు పాఠకులందరికీ సుపరిచితుడే. ఆయన పేరు బైబిలులో 1,138 సార్లు కన్పిస్తుంది. తరచూ ఆయన రాజవంశావళిని సూచిస్తున్న “దావీదు సంతతి” అనే పదబంధం 25 సార్లు కనబడుతుంది. (1 సమూయేలు 16:13; 20:16) అయితే, దావీదు అనే వ్యక్తి ఉండేవాడనడానికి ఇటీవలి కాలం వరకూ స్పష్టమైన రుజువు బైబిలులో తప్ప మరెక్కడా లభ్యం కాలేదు. దావీదు కేవలమొక కల్పిత వ్యక్తేనా?

ప్రొఫెసర్‌ అవ్‌రామ్‌ బీరాన్‌ ఆధ్వర్యాన పురావస్తు శాస్త్రజ్ఞుల ఒక బృందం, విస్మయాన్నికల్గించే ఒక విషయాన్ని 1993లో కనుగొంది. దానిని గురించి ఇశ్రాయేల్‌ అన్వేషణ పత్రికలో (ఆంగ్లం) నివేదించబడింది. ఇశ్రాయేలుకు ఉత్తర భాగంలోవున్న టెల్‌ దాన్‌ అని పిలువబడ్డ ప్రాచీన మట్టిదిబ్బవున్న ప్రాంతమందు నల్లని అగ్నిశిలను ఒకదాన్ని వాళ్లు వెలికితీశారు. “దావీదు సంతతి,” “ఇశ్రాయేలు రాజు” అనే పదాలు ఆ శిలపై చెక్కబడివున్నాయి.2 సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దంనాటిదిగా లెక్కించబడిన ఆ శిలాశాసనం, తూర్పు ప్రాంతాన జీవించిన ఇశ్రాయేలీయుల శత్రువులైన అరామీయులచే స్థాపించబడిన విజయచిహ్నంలో భాగమని చెప్పబడుతుంది. ఈ ప్రాచీన శిలాశాసనం ఎందుకంత విశేషమైనది?

ప్రొఫెసర్‌ బీరాన్‌, అతని సహోద్యోగియైన ప్రొఫెసర్‌ యోసఫ్‌ నవెహ్‌ల రిపోర్టు ఆధారంగా, బైబిలు సంబంధిత పురావస్తుశాస్త్ర పునఃసమీక్షలోని (ఆంగ్లం) ఓ శీర్షిక ఇలా తెలియజేసింది: “దావీదు అనే పేరును బైబిలులోగాక ఓ ప్రాచీన శిలాశాసనంపై కనుగొనడం ఇదే మొదటిసారి.”3 * ఈ శిలాశాసనం విషయంలో గమనించదగిన విషయం మరొకటి కూడావుంది. “దావీదు సంతతి” అనే పదబంధం ఒకే పదంగా రాయబడింది. భాషాశాస్త్ర నిపుణుడైన ప్రొఫెసర్‌ ఆన్‌సన్‌ రేనీ ఇలా వివరిస్తున్నాడు: “విశేషంగా ఆ పద సంయోజనం సుస్థాపితమైన సంజ్ఞావాచకమైతే పదవిభజన . . . తరచుగా జరగదు. ‘దావీదు సంతతి’ అనే పదబంధం, కచ్చితంగా సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్ద మధ్య భాగంలో అలాంటి రాజకీయ భౌగోళిక సంజ్ఞావాచకమై ఉంది.”5 కాబట్టి రాజైన దావీదు ఆయన సామ్రాజ్యం ప్రాచీన లోకంలో ప్రసిద్ధమైనవని స్పష్టమౌతుంది.

బైబిలులో ప్రస్తావించబడిన అష్షూరీయుల మహా పట్టణమైన నీనెవె నిజంగా ఉనికిలోవుందా? ఇటీవలి సంవత్సరాలవరకూ అంటే 19వ శతాబ్దపు తొలిభాగం వరకూ కొంతమంది బైబిలు విమర్శకులు అది ఉనికిలో ఉందనే విషయాన్ని నమ్మలేదు. కానీ 1849లో, సర్‌ ఆస్టన్‌ హెన్రీ లేయార్డ్‌ ప్రాచీన నీనెవెలో ఓ ప్రాంతమని రుజువైన కుయెన్‌జిక్‌ అనే ప్రదేశంవద్ద రాజైన సన్హెరీబు యొక్క రాజభవన శిథిలాల్ని వెలికితీశాడు. దానితో, ఆ విషయంపై విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. కానీ ఈ శిథిలాలు ఇంకా ఎన్నో విషయాల్ని బయల్పర్చాయి. దుర్భేద్యమైన నగరాన్ని వశపర్చుకోవడాన్నీ, విజేతయైన రాజు ఎదురుగుండా బంధీలను తీసుకుపోవడాన్నీ చూపిస్తున్న ఓ చిత్రం చెక్కుచెదరకుండావున్న ఒక గది గోడలపై ఉంది. చిత్రంలో రాజుకు పైభాగాన ఇలా చెక్కబడివుంది: “ప్రపంచానికి రాజైన, అష్షూరీయుల రాజగు సన్హెరీబు నిమెడు సింహాసనంపై ఆసీనుడై లాకీషు (లకిసు) నుండి (తెచ్చిన) దోపుడుసొమ్మును తనిఖీచేశాడు.”6

ఈ చిత్రాన్నీ, దానిపై చెక్కబడినరాతనూ బ్రిటీషు మ్యూజియంలో చూడవచ్చు. సన్హెరీబు యూదా పట్టణమైన లాకీషును వశపర్చుకోవడాన్ని గూర్చి 2 రాజులు 18:13, 14 వచనాల్లో రాయబడిన బైబిలు వృత్తాంతంతో ఇది ఏకీభవిస్తోంది. దొరికినదాని ప్రాముఖ్యతను గూర్చి వ్యాఖ్యానిస్తూ, లేయార్డ్‌ ఇలా రాశాడు: “[యూదా రాజైన] హిజ్కియాకూ సన్హెరీబుకూ మధ్య జరిగిన యుద్ధాలను గురించి, అవి జరుగుతున్న కాలంలోనే సన్హెరీబు వాటిని గురించి రాశాడు. బైబిలు వృత్తాంతాన్ని చిన్న చిన్న వివరాలతో సహా రూఢిపరుస్తున్న ఆ చరిత్ర, నీనెవెవున్న ప్రాంతంగా గుర్తించబడిన మట్టీ చెత్తాచెదారంగల దిబ్బ అట్టడుగున దొరుకుతుందని లేక దొరకవచ్చునని వాటిని కనుగొనక పూర్వం ఎవరు మాత్రం నమ్మివుండవచ్చు?”7

బైబిలు కచ్చితత్వాన్ని దృవీకరించే అనేకమైన ఇతర కళాకృతులు అంటే మట్టిపాత్రల్నీ, భవన శిథిలాల్నీ, మట్టి ఫలకాల్నీ, నాణాల్నీ, పత్రాల్నీ, స్మారక చిహ్నాల్నీ, శాసనాల్నీ పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికితీశారు. పురావస్తు శాస్త్రజ్ఞుల త్రవ్వకాల్లో అబ్రహాము జీవించిన పట్టణం అంటే మత వాణిజ్యాలకు కేంద్రస్థానమైన కల్దీయుల పట్టణమైన ఊరు బయటపడింది.8 (ఆదికాండము 11:27-31) దానియేలు 5వ అధ్యాయంలో వివరించబడిన ఓ సంఘటనను అంటే సా.శ.పూ. 539లో కోరెషు చేతిలో బబులోను కూలిపోవడాన్ని 19వ శతాబ్దంలో బయల్పడిన నబొనిడస్‌ వృత్తాంతం వర్ణిస్తోంది.9 ప్రాచీన థెస్సలొనీకయలో ధనుస్సాకారపు ప్రవేశద్వారంమీదవున్న (బ్రిటీష్‌ మ్యూజియంలో దీని అవశేషాలు భద్రపర్చబడి ఉన్నాయి) శిలాశాసంపై “పాలిటార్చెస్‌”గా వర్ణించబడిన పట్టణ అధికారుల పేర్లు ఉన్నాయి. ఈ పదం గ్రీకు ప్రామాణిక సాహిత్యాల్లో కనిపించదుగానీ దీన్ని బైబిలు రచయితయైన లూకా ఉపయోగించాడు.10 (అపొస్తలుల కార్యములు 17:6, అథఃసూచి, NW) ఆ విధంగా లూకా కచ్చితత్వం, మరితర వివరణల్లో ఎలా నిరూపించబడిందో అలాగే ఇందులో కూడా నిరూపించబడింది.—లూకా 1:4 పోల్చండి.

అయితే, పురావస్తు శాస్త్రజ్ఞులు ఒకరితో మరొకరు అన్ని వేళలా ఏకీభవించుకోనట్లుగానే వాళ్లు బైబిలుతో కూడా ఎల్లప్పుడూ ఏకీభవించకపోవచ్చు. అయినప్పటికీ, బైబిలు విశ్వసించదగిన గ్రంథమనడానికి బలమైన రుజువు దాని పుటలలోనే ఉంది.

నిష్పక్షపాతంగా అందజేయబడ్డాయి

నిజాయితీపరులైన చరిత్రకారులు కేవలం (లాకీషును సన్హెరీబు వశపర్చుకోవడాన్ని గూర్చిన శిలాశాసనం వంటి) విజయాల్నేగాక పరాజయాల్నీ, సాఫల్యాల్నేగాక వైఫల్యాల్నీ, మంచి గుణాల్నేగాక బలహీనతల్నీ నివేదిస్తారు. కొన్ని లౌకిక చరిత్రలు అలాంటి నిజాయితీని ప్రతిబింబిస్తాయి.

అష్షూరీయ చరిత్రకారుల్ని గురించి, డానియేల్‌ డి. లకన్‌బిల్‌ ఇలా వివరిస్తున్నాడు: “చారిత్రక వాస్తవికతతో మోసపూరితంగా వ్యవహరించమని రాజదర్పం అధికారికంగా అడగడం తరచూ స్పష్టమైన విషయమే.”11 అలాంటి ‘రాజదర్పాన్ని’ చూపిస్తున్న అష్షూరు రాజైన అష్షుర్నసిర్‌పల్‌ను గూర్చిన చారిత్రక వృత్తాంతాలు ఇలా డంబాలు చెప్పుకుంటున్నాయి: “నేనే రాజోచిత వైభవంగలవాన్ని, నేనే మహోన్నతున్ని, నేనే ఘనతవహించినవాన్ని, నేనే బలవంతున్ని, నేనే కీర్తిమంతున్ని, నేనే మహిమపర్చబడినవాన్ని, నేనే సర్వశ్రేష్ఠున్ని, నేనే శక్తిమంతున్ని, నేనే శౌర్యవంతున్ని, నేనే సింహానికున్నంత ధైర్యంగలవాన్ని, నేనే వీరున్ని!”12 అలాంటి చారిత్రక వృత్తాంతాల్లో మీరు చదివిన ప్రతీదానిని కచ్చితమైన చరిత్రగానే ఒప్పుకుంటారా?

దానికి భిన్నంగా, బైబిలు రచయితలు చక్కని నిష్పక్షపాతాన్ని కనబరిచారు. ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషే తన సహోదరుడైన అహరోను తప్పుల్నీ, తన సహోదరియైన మిర్యాము తప్పుల్నీ, తన అన్న కుమారులైన నాదాబు అబీహుల తప్పుల్నీ, తన ప్రజల తప్పుల్నీ, అలాగే తన స్వంత తప్పుల్నీ నిష్పక్షపాతంగా నివేదించాడు. (నిర్గమకాండము 14:11, 12; 32:1-6; లేవీయకాండము 10:1, 2; సంఖ్యాకాండము 12:1-3; 20:9-12; 27:12-14) రాజైన దావీదు చేసిన గంభీరమైన తప్పులు కప్పిపుచ్చబడలేదుగానీ అవి రాసి ఉంచబడ్డాయి—అదీ దావీదు ఇంకా రాజుగా పరిపాలిస్తుండగానే లిఖించబడ్డాయి. (2 సమూయేలు 11, 24 అధ్యాయాలు) అపొస్తలులు (మత్తయి కూడా వారిలో ఒకడు) తమ వ్యక్తిగత ప్రాముఖ్యత కోసం తమలో తాము ఎలా పోట్లాడుకున్నారో, యేసు బంధించబడిన రాత్రి ఆయన్ని వారెలా విడిచిపెట్టి పారిపోయారో తన పేరేవున్న గ్రంథానికి రచయితయైన మత్తయి చెబుతున్నాడు. (మత్తయి 20:20-24; 26:56) కొన్ని తొలి క్రైస్తవ సంఘాల్లోవున్న సమస్యల్ని క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని పత్రికల రచయితలు నిష్పక్షపాతంగా తెలియజేశారు. వాటిలో లైంగిక దుర్నీతీ, అభిప్రాయ భేదాలూ చేరివున్నాయి. ఆ సమస్యల్ని గురించి తెలియజేయడానికి వాళ్లు సంకోచించలేదు.—1 కొరింథీయులు 1:10-13; 5:1-13.

అలా నిష్కపటంగానూ బాహాటంగానూ నివేదించడం సత్యం ఎడల ఉన్న యథార్ధమైన శ్రద్ధను సూచిస్తుంది. బైబిలు రచయితలు తాము ప్రేమించిన వ్యక్తులను గూర్చిన, తమ ప్రజలను గూర్చిన, తమ్మును గూర్చిన ప్రతికూలమైన వాటిని నివేదించడానికి సుముఖతను చూపించారు గనుక వారి రచనల్ని విశ్వసించడానికి తగిన కారణం లేదంటారా?

వివరణల్లో కచ్చితత్వం

న్యాయ విచారణల్లో సాక్షి వాఙ్మూలం యొక్క నిష్పక్షపాత వైఖరి, తరచుగా చిన్న చిన్న వాస్తవాల ఆధారంగానే నిర్ధారించబడగలదు. చిన్న చిన్న వివరణల్లో పొందికవుండడం, వాఙ్మూలం కచ్చితమైనదనీ యథార్ధమైనదనీ రుజువుచేయవచ్చు. అయితే గంభీరమైన తేడాలు ఆ వాఙ్మూలం నమ్మశక్యంకానిదని రుజువుచేయవచ్చు. మరోవైపున, మరీ ఓ పద్ధతి ప్రకారంగావున్న వృత్తాంతం అంటే ప్రతీదీ ఎక్కడికక్కడ చక్కగా అతికినట్లుగావున్న వృత్తాంతం అబద్ధ వాఙ్మూలమనిని బయటపడవచ్చు కూడా.

ఈ విషయంలో బైబిలు రచయితల “వాఙ్మూలం” ఎక్కడ నిలుస్తుంది? బైబిలు రచయితలు గమనార్హమైన సంగతతను చూపించారు. మరీ చిన్న చిన్న వివరణల విషయంలో కూడా ఎంతో పొందిక కనబడుతుంది. అయితే, ఆ పొందిక లాలూచీ పడ్డారేమోననే సందేహాన్ని రేకెత్తించేలా కావాలని ఏర్పర్చింది కాదు. యాధృచ్చిక విషయాల్లో ప్రణాళికాబద్ధమైన లోపం స్పష్టంగావున్నా రచయితలు తమ రచనల్లో తరచూ అనుకోకుండానే ఏకీభవిస్తున్నారు. కొన్ని ఉదాహరణల్ని పరిశీలించండి.

బైబిలు రచయితయైన మత్తయి ఇలా రాశాడు: “యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూ[శాడు].” (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 8:14) మత్తయి ఇక్కడ ఆసక్తికరమైనదే అయినా అనవసరమైన వివరణను తెలియజేశాడు: పేతురు వివాహితుడు. ఈ అప్రధానమైన వాస్తవాన్ని అపొస్తలుడైన పౌలు బలపర్చాడు. ఆయనిలా రాశాడు: “తక్కిన అపొస్తలులవలెను . . . కేఫావలెను క్రైస్తవ భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు నాకు అధికారములేదా?” * (1 కొరింథీయులు 9:5, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) నిరాధార విమర్శల్ని తిప్పికొట్టేందుకు పౌలు తనతరఫున తానే వాదించుకుంటున్నాడని ఆ సందర్భం సూచిస్తోంది. (1 కొరింథీయులు 9:1-4) స్పష్టంగా, మత్తయి వృత్తాంతపు కచ్చితత్వాన్ని బలపర్చేందుకు, పేతురు వివాహితుడు అనే ఈ చిన్న వివరణను పౌలు ప్రవేశపెట్టలేదు గానీ యాధృచ్చికంగానే తెలియజేశాడు.

యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన శిష్యుల్లో ఒకరు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసున్ని కొట్టి వాని చెవిని తెగనరికాడని మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే సువార్త రచయితలు నల్గురూ నివేదించారు. అనవసరమన్నట్లుగా కనబడుతున్న ఓ వివరణను యోహాను సువార్త మాత్రమే ఇలా నివేదిస్తోంది: “ఆ దాసునిపేరు మల్కు.” (యోహాను 18: 10, 11, 26) యోహాను మాత్రమే ఆ వ్యక్తి పేరును ఎందుకు తెలియజేశాడు? మరే వృత్తాంతంలోనూ చెప్పబడని ఓ అప్రధానమైన వాస్తవాన్ని కొన్ని వచనాల తర్వాత ఆ వృత్తాంతం ఇలా తెలియజేస్తోంది: యోహాను “ప్రధానయాజకునికి నెళవైనవాడు.” ఆయన ప్రధానయాజకుని ఇంటివారికి కూడా నెళవైనవాడే; సేవకులకు ఆయనతో పరిచయంవుంది, మరి ఆయనకూ వారితో పరిచయంవుంది. (యోహాను 18:15, 16) కాబట్టి, ఆ గాయపడిన వ్యక్తి ఇతర సువార్త రచయితలకు అపరిచయస్థుడైనందున వాళ్లు అతని పేరును ప్రస్తావించకపోగా యోహాను మాత్రమే అతని పేరును ప్రస్తావించడం సహజమే.

కొన్నిసార్లు, ఒక వృత్తాంతంలో వివరణాత్మకమైన వివరణలు ఇవ్వకుండా విడిచిపెట్టబడినా యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్యానాల ద్వారా మరోచోట ఆ వివరణలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు, యూదుల సభ ఎదుట యేసు విచారణను గూర్చిన మత్తయి వృత్తాంతం, అక్కడ హాజరైన వారిలో కొంతమంది “ఆయనను అర చేతులతో కొట్టి—క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపు మనిరి” అని తెలియజేస్తోంది. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 26:67, 68) కొట్టినవాడు ఆయన ఎదుటనే ఉండగా, ఆయన్ని కొట్టినవాళ్లు “ప్రవచింపుమని” యేసును ఎందుకు అడిగారు? మత్తయి ఆ విషయాన్ని వివరించలేదు. కానీ విడిచిపెట్టబడిన ఆ వివరణను సువార్త రచయితల్లోని వేరే రచయితలు ఇద్దరు తెలియజేశారు: యేసును హింసించినవాళ్లు ఆయన్ని కొట్టడానికి ముందు ముసుగుతో ఆయన ముఖాన్ని కప్పేశారు. (మార్కు 14:65; లూకా 22:64) మత్తయి తాను ప్రతీ చిన్న వివరణనూ ఇస్తున్నానా లేదా అని పట్టించుకోకుండానే సమాచారాన్ని అందజేశాడు.

యేసు బోధను వినేందుకు ఓ పెద్ద గుంపు సమకూడిన సందర్భాన్నొకదాన్ని గూర్చి యోహాను సువార్త తెలియజేస్తోంది. ఆ వృత్తాంతం ప్రకారంగా, యేసు గుంపును గమనించి “ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను.” (ఇటాలిక్కులు మావి.) (యోహాను 6:5) శిష్యులందరూ అక్కడ ఉండగా, రొట్టెల్ని ఎక్కడ కొనవచ్చునని యేసు ఫిలిప్పునే ఎందుకు అడిగాడు? ఫిలిప్పునే అడగడానికిగల కారణాన్ని ఆ రచయిత చెప్పలేదు. అయితే, ఆ సంఘటన గలలీయ సముద్రానికి ఉత్తర తీరానవున్న బేత్సయిదా నగరానికి దరిదాపుల్లో జరిగిందని దానికి సమాంతర వృత్తాంతంలో లూకా తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త దాని ప్రారంభ భాగంలో “ఫిలిప్పు బేత్సయిదావాడు” అని తెలియజేస్తోంది. (యోహాను 1:44; లూకా 9:10) కాబట్టి యేసు అక్కడకు దగ్గరలోనే ఉన్న పట్టణానికి చెందిన వ్యక్తినే సహేతుకంగా అడిగాడు. ఈ వివరణల మధ్యనున్న పొందిక విశేషమైనది, అయినప్పటికీ అది స్పష్టంగా ఉద్దేశపూర్వకమైనది కాదు.

కొన్ని సందర్భాల్లో, నిర్దిష్టమైన వివరణల్ని విడిచిపెట్టడం బైబిలు రచయిత విశ్వసనీయతను పెంచడం మాత్రమే చేస్తోంది. ఉదాహరణకు, మొదటి రాజులు గ్రంథాన్ని రాసిన రచయిత ఇశ్రాయేలు దేశంలోని తీవ్రమైన క్షామాన్ని గూర్చి తెలియజేశాడు. అది, రాజు తన గుఱ్ఱాలూ కంచరగాడిదలూ ప్రాణాలతో నిలబడ్డానికి తగినంత నీటినీ గడ్డినీ కనుగొనలేనంత తీవ్రమైన క్షామం. (1 రాజులు 17:7; 18:5) కానీ, కర్మెలు పర్వతంపైన ఉన్న తన దగ్గరకు, బహుశా 1,000 చదరపు మీటర్ల వైశాల్యమున్న ఓ కందకాన్ని నింపేందుకు తగినంత నీటిని (బల్యర్పణకోసం ఉపయోగించేందుకు) తీసుకురావాలని ప్రవక్తయైన ఏలీయా ఆజ్ఞాపించాడని అదే వృత్తాంతం నివేదిస్తోంది. (1 రాజులు 18:33-35) క్షామం విలయతాండవం చేస్తుండగా, అన్ని నీళ్లు ఎక్కడనుండి వచ్చాయి? మొదటి రాజుల గ్రంథాన్ని రాసిన రచయిత దాన్ని వివరించేందుకు ఏ ప్రయత్నమూ చేయలేదు. అయితే, ఆ వివరణలో తర్వాత వచ్చిన యాధృచ్చిక ప్రస్తావన సూచిస్తున్నట్లుగా, మధ్యధరా సముద్ర తీరప్రాంతాన కర్మెలు పర్వతం ఉందని ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్న వాళ్లెవరికైనా తెలుస్తుంది. (1 రాజులు 18:43) అలా సముద్రపు నీళ్లు సుళువుగా లభ్యమౌతాయి. అలాగాక ఇది వాస్తవాల ముసుగులో కేవలం కల్పితాల్నే కల్గివున్న వివరణాత్మకమైన పుస్తకమైతే, దాని రచయిత కట్టుకథల్ని కల్పించగలిగే తెలివైన మోసగాడే అయితే, విషయాన్ని పొత్తుకుదరనట్టుగా ఎందుకలా విడిచిపెడతాడు?

కాబట్టి బైబిలు నమ్మదగినదేనా? నిజంగా జీవించిన ప్రజల్నీ, అసలు ఉనికిలోవున్న స్థలాల్నీ, వాస్తవంగా జరిగిన సంఘటనల్నీ బైబిలు తెలియజేస్తోందని ధృవపర్చేందుకు తగినన్ని కళాకృతుల్ని పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికితీశారు. అయితే, మరింత శక్తివంతమైన రుజువులు బైబిలులోనే ఉన్నాయి. నిష్పక్షపాతవైఖరిగల రచయితలు పచ్చి నిజాల్ని రాయడంలో ఎవ్వరినీ విడిచిపెట్టలేదు, చివరికి తమను తాము కూడా విడిచిపెట్టుకోలేదు. ఉద్దేశపూర్వకంకాని యాదృచ్ఛిక విషయాలతోపాటూ రచనల్లో అంతర్గతంగావున్న పొందిక సత్యం యొక్క దోషరహితమైన స్వభావాన్ని గూర్చిన ‘వాఙ్మూలాన్ని’ ఇస్తోంది. నిజానికి, అలాంటి “ప్రామాణికత యొక్క కచ్చితమైన గుర్తులు” ఉన్న బైబిలు నిశ్చయంగా మీరు నమ్మదగిన ఓ గ్రంథం.

[అధస్సూచి]

^ పేరా 8 దాన్ని కనుగొన్న తర్వాత, 1868లో కనుగొనబడిన మేషా స్థూపంపైనున్న (మోయాబైట్‌ శిలగా కూడా పిలువబడుతుంది) రాత వరుసలలో పాడైపోయిన ఒకవరుస క్రొత్తగా పునరుద్ధరించబడింది. ఆ పునరుద్ధరించబడిన వరుస కూడా “దావీదు సంతతి”ని గూర్చిన పదబంధాన్ని కల్గివున్నట్లు బయల్పరుస్తుందని ప్రొఫెసర్‌ లమెర్‌ నివేదించాడు.4

^ పేరా 21 “కేఫా” అనే పదం “పేతురు”కు సమానార్థకమైన సెమిటిక్‌ పదం.—యోహాను 1:42.

[15వ పేజీలోని చిత్రం]

టెల్‌ దాన్‌ అవశేషం

[16,17వ పేజీలోని చిత్రం]

2 రాజులు 18:13, 14 వచనాల్లో ప్రస్తావించబడిన, లాకీషు ముట్టడిని వర్ణిస్తున్న అష్షూరీయుల గోడమీది చిత్రం