కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ గ్రంథం విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తోందా?

ఈ గ్రంథం విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తోందా?

ఈ గ్రంథం విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తోందా?

మతం విజ్ఞానశాస్త్రాన్ని ఎల్లప్పుడూ తన మిత్రువుగా దృష్టించలేదు. గత శతాబ్దాల్లో కొంతమంది మతగురువులు, విజ్ఞానశాస్త్ర పరిశోధనలు తామిచ్చే బైబిలు భావాంతరీకరణకు అపాయాన్ని కల్గిస్తాయని తలంచినప్పుడు వాటిని నిరోధించారు. అయితే విజ్ఞానశాస్త్రం నిజంగా బైబిలుకు శత్రువేనా?

బైబిలు రచయితలు తమ కాలంనాటి ప్రసిద్ధిగాంచిన విజ్ఞానశాస్త్ర దృక్పథాల్ని గనుక ఆమోదించివుంటే అప్పుడు ఆ గ్రంథం విజ్ఞానశాస్త్రపరంగా తప్పులతడక అయ్యుండేది. కానీ ఆ రచయితలు విజ్ఞానశాస్త్రపరంకాని అలాంటి తప్పుడు అభిప్రాయాల్ని ప్రోత్సహించలేదు. దానికి భిన్నంగా, వాళ్లు కేవలం విజ్ఞానశాస్త్రపరంగా సరియైన వాటినేగాక ఆ కాలంలో అంగీకరించబడిన అభిప్రాయాలకు సూటిగా విరుద్ధమైన అనేక వ్యాఖ్యానాల్ని రాశారు.

భూమి ఆకారం ఏమిటి?

ఆ ప్రశ్న వేలాది సంవత్సరాలుగా మానవుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రాచీన కాలాల్లో, భూమి బల్లపరుపుగా ఉందనే సామాన్య అభిప్రాయం ఉండేది. ఉదాహరణకు, బబులోనీయులు విశ్వం ఒక పెట్టెయనీ లేక ఒక గదియనీ దాని నేల భూమియనీ విశ్వసించేవారు. ఇండియాలోని వేదాలనాటి పురోహితులు భూమి బల్లపరుపుగా ఉందనీ, దానికి ఒక వైపున మాత్రమే నివాసులు ఉన్నారనీ తలంచారు. ఆసియాలోని అనాగరికమైన ఓ తెగ భూమిని ఓ పెద్ద టీ ట్రేగా చిత్రీకరించింది.

సూర్యుడూ చంద్రుడూ గోళాకారంగా ఉన్నాయి గనుక భూమి కూడా గోళాకారంగానే ఉండాలి అని సా.శ.పూ. ఆరవ శతాబ్దంలోనే గ్రీకు తత్వవేత్తయైన పైథాగరస్‌ సిద్ధాంతీకరించాడు. అటు తర్వాత, (సా.శ.పూ. నాల్గవ శతాబ్దంనాటి వాడైన) అరిస్టాటిల్‌ భూమి గోళాకారంగా ఉండడం చంద్ర గ్రహణాల ద్వారా రుజువవుతుందని వివరిస్తూ, దానితో ఏకీభవించాడు. చంద్రునిపై పడిన భూమి ఛాయ వక్రాకృతిగా ఉంటుంది.

అయితే, భూమి బల్లపరుపుగా (దాని ఉపరితలంపై మాత్రమే నివాసులతో) ఉందనే సిద్ధాంతం పూర్తిగా కనుమరుగైపోలేదు. భిన్నధ్రువాల సిద్ధాంతాన్ని—భూమి గుండ్రంగా ఉందనే సహేతుకమైన అభిప్రాయాన్ని కొంతమంది అంగీకరించలేక పోయారు. * సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన క్రైస్తవమతవాదియైన లాక్టన్‌ట్యుస్‌ ఆ అభిప్రాయాన్ని అపహసించాడు. ఆయనిలా వాదించాడు: “తమ తలలకంటే ఎత్తైన అడుగులుగల మనుష్యులు ఉన్నారని నమ్మేంత బుద్ధిహీనుడెవడైనా ఉన్నాడా? . . . పంటలూ, వృక్షాలూ క్రిందకు అధోముఖంగా పెరుగుతాయా? వర్షాలూ, మంచూ, వడగండ్లూ ఊర్ధ్వముఖంగా పడతాయా?”2

భిన్నధ్రువాల సిద్ధాంతం కొంతమంది మతగురువులను సందిగ్ధావస్థలో పడేసింది. కుతలాంతరవాసులు గనుక ఉన్నట్లైతే, సముద్రం ప్రయాణించలేనంత విశాలంగా ఉండడాన్నిబట్టిగానీ లేక ప్రయాణించడం అసాధ్యమయ్యే ఉష్ణమండలాన్నిబట్టిగానీ వాళ్లకు జ్ఞాత మనుష్యులతో సంబంధాన్ని కల్గివుండడానికి ఏ విధమైన అవకాశమూ లేదని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. కాబట్టి ఏ కుతలాంతరవాసియైనా ఎక్కడనుండి వచ్చివుండవచ్చు? సందిగ్థంలో, కొంతమంది మతగురువులు, కుతలాంతరవాసులు ఎవ్వరూ లేరనీ లేక లాక్టన్‌ట్యుస్‌ వాదించినట్లు భూమి గోళాకారంగా ఉండడం కూడా అసాధ్యమేననీ విశ్వసించడానికి ఇష్టపడ్డారు.

అయినప్పటికీ, భూమి గోళాకారంగా ఉందనే సిద్ధాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది, చివరకు దాన్ని అనేకమంది అంగీకరించారు. అయితే, 20వ శతాబ్దంలో అంతరిక్షయుగం ఆరంభమవ్వడంతోనే మానవులు అంతరిక్షంలోకి బహు దూరం ప్రయాణించి భూమి గోళాకారంగా ఉందని ప్రత్యక్షంగా గమనించడంద్వారా రూఢిచేసుకోవడం సాధ్యమైంది. *

ఈ వివాదాంశంలో బైబిలు ఏ పక్షానవుంది? భూమి బహుశా గోళాకారంగా ఉండవచ్చని గ్రీకులు సిద్ధాంతీకరించడానికి అనేక శతాబ్దాల మునుపు, భూమి గోళాకారంగావుందని అంతరిక్షంనుండి మానవులు చూడడానికి వేలాది సంవత్సరాల మునుపు అంటే సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో భూమి బల్లపరుపుగా ఉందనే అభిప్రాయం ప్రాచుర్యంలో ఉన్నప్పుడు, హెబ్రీ ప్రవక్తయైన యెషయా సుస్పష్టంగా ఇలా తెలియజేశాడు: “భూ వృత్తానికి పైన నివసిస్తున్నవాడు ఒకడున్నాడు.” (యెషయా 40:22, NW) ఇక్కడ “వృత్తము” అని అనువదించబడిన చుగ్‌ అనే హెబ్రీ పదాన్ని “గోళము” అని కూడా భాషాంతరీకరించవచ్చు.3 మరితర బైబిలు అనువాదాలు “భూ గోళము” (డుయే వర్షన్‌) అనీ “భూ వర్తులము” అనీ చదవబడుతున్నాయి.—మఫత్‌. *

బైబిలు రచయితయైన యెషయా భూమిని గూర్చి ప్రాచుర్యంలోవున్న కల్పితాల్ని రాయలేదు. బదులుగా, విజ్ఞానశాస్త్ర పరిశోధనా పురోభివృద్ధుల మూలంగా తప్పు అని నిరూపించబడే ప్రమాదంలేని వ్యాఖ్యానాన్ని ఆయన రాశాడు.

భూమి దేనిమీద ఉంది?

ప్రాచీన కాలాల్లో, విశ్వవ్యవస్థను గూర్చిన ఇతర ప్రశ్నలు మనుష్యుల్ని కలవరపెట్టాయి: భూమి దేనిమీద ఆధారపడివుంది? సూర్య చంద్ర నక్షత్రాలకు ఆధారం ఏది? ఐసక్‌ న్యూటన్‌ రూపొందించి, 1687లో ప్రచురించిన విశ్వ గురుత్వాకర్షణ సూత్రం గురించి వారికి తెలియదు. నిజానికి, అంతరిక్షగ్రహాలు శూన్యంలో నిరాధారంగా వ్రేలాడుతున్నాయనే అభిప్రాయాన్ని వారు ఎరుగరు. ఆ విధంగా, దృశ్యమైన వస్తువులు లేక పదార్థాలు భూమినీ మరితర అంతరిక్ష గ్రహాల్నీ పైకెత్తి పట్టుకొని ఉన్నాయని వాళ్లిచ్చే వివరణలు సూచిస్తున్నాయి.

ఉదాహరణకు, భూమి చుట్టూ నీళ్లున్నాయని, అది ఆ నీళ్లలో తేలుతుందనే ఒక ప్రాచీన సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతం, బహుశా ఓ ద్వీపంపై జీవించిన ప్రజల్లో ఆవిర్భవించి ఉండొచ్చు. భూమికి ఒకపునాదిపై మరొక పునాది చొప్పున అనేక పునాదులు ఉన్నాయని హిందువులు తలంచారు. దాన్ని నాల్గు ఏనుగులు మోస్తున్నాయి. ఆ ఏనుగులు దీర్ఘకాయియైన కూర్మంమీద నిలబడ్డాయి, మరి ఆ కూర్మం అతిపెద్దదైన ఓ సర్పంపై నిలబడింది, చుట్టచుట్టుకున్న ఆ సర్పం విశ్వజలాలపై తేలుతున్నది. సా.శ.పూ. ఐదవ శతాబ్దానికి చెందిన గ్రీకు తత్వవేత్తయైన ఎమ్‌పెడొక్లస్‌ భూమి సుడిగాలిపై ఉందనీ, ఈ సుడిగాలే అంతరిక్ష గ్రహాలు కదలడానికి కారణమౌతోందనీ విశ్వసించాడు.

అరిస్టాటిల్‌ అభిప్రాయాలు ఎంతో ప్రభావాన్ని చూపించాయి. భూమి గోళాకారంగా ఉందని ఆయన సిద్ధాంతీకరించినా, అది శూన్యంలో వ్రేలాడుతుందనే విషయాన్ని త్రోసిపుచ్చాడు. ఆకాశాన్ని గురించి (ఆంగ్లం) అనే తన ప్రబంధంలో, భూమి నీళ్లపై ఉందనే సిద్ధాంతం తప్పు అని నిరూపించేటప్పుడు ఆయనిలా చెప్పాడు: “భూమి ఎలా గాలిలో వ్రేలాడుతూ ఉండలేదో అలాగే నీరూ గాలిలో వ్రేలాడుతూ ఉండలేవు. దానికి ఏదో ఒక ఆధారం కావాలి.”4 కాబట్టి, భూమి దేనిపై ‘ఆధారపడి’ ఉంది? సూర్య చంద్ర నక్షత్రాలు దృఢమైన పారదర్శక గోళాల ఉపరితలానికి అతికించబడి ఉన్నాయని అరిస్టాటిల్‌ బోధించాడు. భూమి మధ్యలో కదలకుండా ఉండగా, ఒక గోళంలో మరోగోళం ఉండి, ఈ గోళాలు ఒకదానిలో మరొకటి పరిభ్రమిస్తుండగా, వాటికి అతుక్కుని ఉన్న సూర్యుడూ, చంద్రుడూ, గ్రహాలూ ఆకాశంలో ఒకవైపు నుండి మరొక వైపుకు చలిస్తాయి.

అరిస్టాటిల్‌ వివరణ కారణసహితమైందిగా కనబడింది. అంతరిక్ష గ్రహాలు గనుక కదలకుండా దేనికో ఒకదానికి గట్టిగా అతికించబడకపోతే, అవి అంత ఎత్తున ఎలా ఉండగలవు? గౌరవనీయుడైన అరిస్టాటిల్‌ అభిప్రాయాలు, దాదాపు 2,000 సంవత్సరాల వరకూ వాస్తవాలుగానే అంగీకరించబడ్డాయి. ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారంగా, 16, 17 శతాబ్దాల్లో ఆయన బోధలు చర్చి దృష్టిలో “మత సిద్ధాంతపు హోదాకు ఎదిగాయి.”5

టెలిస్కోపు కనిపెట్టబడడంతో ఖగోళశాస్త్రజ్ఞులు అరిస్టాటిల్‌ సిద్ధాంతాన్ని ప్రశ్నించనారంభించారు. అయినప్పటికీ, గ్రహాలు గురుత్వాకర్షణశక్తి అనే అదృశ్యశక్తి మూలంగా తమతమ కక్ష్యల్లోనే పరిభ్రమిస్తూ శూన్యంలో వ్రేలాడుతున్నాయని సర్‌ ఐసక్‌ న్యూటన్‌ వివరించేంతవరకూ వారికి జవాబు దొరకలేదు. అది నమ్మదగని విషయంగా కన్పించింది. శూన్యాకాశం ఖాళీగానూ, బొత్తిగా పధార్థంలేనిదిగానూ ఉండగలదని న్యూటన్‌ సహపనివారిలో కొందరు విశ్వసించలేకపోయారు. *6

ఈ ప్రశ్న గురించి బైబిలు ఏమి చెబుతుంది? దాదాపు 3,500 సంవత్సరాల క్రిందట, భూమి “శూన్యముపై” వ్రేలాడుతోందని బైబిలు అసాధారణమైన స్పష్టతతో తెలియజేసింది. (యోబు 26:7) ఆదిమ హెబ్రీ భాషలో “శూన్యము” (బెలిమా) అని ఇక్కడ ఉపయోగించబడిన పదం, “ఏమీలేని” అనే అక్షరార్థ భావాన్నిస్తుంది.7కాంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌ “ఖాళీగావున్న అంతరిక్షముపై” అనే పదబంధాన్ని ఉపయోగిస్తోంది.

“ఖాళీగావున్న అంతరిక్షముపై” వ్రేలాడుతున్న గ్రహం అనే ఆలోచనకూ, ఆ కాలంలోని అనేకమంది ప్రజలు భూమిని చిత్రీకరించిన విధానానికీ ఏ విధంగానూ పొత్తుకుదరదు. కానీ, బైబిలు రచయిత తన కాలానికన్నా ఎంతో ముందుకుపోయి, విజ్ఞానశాస్త్రరీత్యా సరియైన విషయాన్ని నివేదించాడు.

బైబిలు, వైద్య శాస్త్రం —అవి ఏకీభవిస్తాయా?

ఆధునిక వైద్య శాస్త్రం రోగాల వ్యాప్తిని గూర్చీ, వాటిని నిరోధించడాన్ని గూర్చీ మనకు ఎంతో నేర్పింది. 19వ శతాబ్దంలోని వైద్య పురోభివృద్ధులు యాంటీ సెప్సిస్‌ అనే మెడికల్‌ ప్రాక్టీసును—అంటువ్యాధుల్ని తగ్గించేందుకు పారిశుద్ధ్యతను పాటించడాన్ని ప్రారంభించడానికి దారితీశాయి. దాని ఫలితం ఎంతో విశేషమైనది. అంటువ్యాధుల సంఖ్యా, అకాల మరణాల సంఖ్యా ఎంతగానో తగ్గిపోయింది.

అయితే, రోగమెలా వ్యాప్తిచెందుతుందో ప్రాచీనకాలంనాటి వైద్యులు పూర్తిగా అర్థంచేసుకోలేకపోయారు, అంతేగాక రోగాన్ని నిరోధించడంలో పారిశుద్ధ్యత యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్లు గ్రహించలేకపోయారు. ఆధునిక ప్రామాణికతలనుబట్టి చూస్తే వాళ్లు చేసిన మెడికల్‌ ప్రాక్టీసుల్లో అనేకం అనాగరికమైనవి అని అనిపించడంలో ఆశ్చర్యంలేదు.

సా.శ.పూ. 1550 నాటి ఐగుప్తీయుల వైద్య పరిజ్ఞాన సంకలనమైన ఎబెర్స్‌ పపైరస్‌, అందుబాటులోవున్న అత్యంత ప్రాచీన వైద్య గ్రంథాల్లో ఒకటి. ఈ గ్రంథంలో “మొసలికాటు దగ్గరనుండి కాలివేలి గోటి నొప్పి వరకూ” వివిధ బాధలకు సుమారు 700 రోగనివారణోపాయాలు ఇవ్వబడ్డాయి.8ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “ఈ వైద్యుల వైద్య పరిజ్ఞానం పూర్తిగా స్వానుభవమైనది, ఎక్కువ శాతం ఇంద్రజాల సంబంధమైనది, సంపూర్ణంగా అశాస్త్రీయమైనది.”9 ఆ రోగనివారణోపాయాల్లో అనేకం నిరర్ధకమైనవే, అయితే వాటిలో కొన్ని ఎంతో ప్రమాదకరమైనవి. గాయానికి చేసే చికిత్సల్లో ఒకటి, “మానవ మలమూ ఇతర పదార్థాల సమ్మేళనంతో చేయబడిన మిశ్రమాన్ని ఆ గాయంపై రాస్తూండాలని సిఫారసు చేసింది.”10

ఇంచుమించుగా బైబిల్లోని మొదటి పుస్తకాలు—వాటిలో మోషే ధర్మశాస్త్రం కూడా ఇమిడివుంది—రాయబడిన కాలంలోనే ఐగుప్తీయుల వైద్య నివారణోపాయాలకు సంబంధించిన ఈ గ్రంథం రాయబడింది. సా.శ.పూ. 1593లో జన్మించిన మోషే ఐగుప్తులో పెరిగాడు. (నిర్గమకాండము 2:1-10) ఫరో ఇంటివారిలో ఒకనిగా ఆయన ‘ఐగుప్తీయుల సకలవిధ్యలను అభ్యసించాడు.’ (అపొస్తలుల కార్యములు 7:22) ఐగుప్తులోని ‘వైద్యుల’తో ఆయనకు పరిచయముంది. (ఆదికాండము 50:1-3) వాళ్ల నిష్ప్రయోజనకరమైన లేక అపాయకరమైన మెడికల్‌ ప్రాక్టీసులు ఆయన రచనలను ప్రభావితం చేశాయా?

లేదు. దానికి భిన్నంగా, మోషే ధర్మశాస్త్రం వాళ్ల కాలంలోలేని పారిశుద్ధ్య నియమాల్ని చేర్చింది. ఉదాహరణకు, మలాన్ని గుడారానికి దూరంగా కప్పిపెట్టాలని సైనిక శిబిరాల్ని గూర్చిన ఒక చట్టం తెలియజేసింది. (ద్వితీయోపదేశకాండము 23:13) ఇది ఎంతో పురోభివృద్ధిదాయకమైన రోగనిరోధక చర్యయైవుంది. నీళ్లు కలుషితం కాకుండా ఉండేందుకు ఇది తోడ్పడింది. పారిశుద్ధ్య పరిస్థితులు దుర్భరంగావున్న దేశాల్లో ఇప్పటికీ లక్షలాదిమంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంటున్న ఈగల మూలంగా వచ్చే షైజెల్లా అనబడే విరేచనాల నుండీ మరితర అతిసార వ్యాధుల నుండీ అది వారిని కాపాడింది.

అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇశ్రాయేలీయుల్ని పరిరక్షించిన ఇతర పారిశుద్ధ్య కట్టడలు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అంటువ్యాధి ఉన్న వ్యక్తి లేక ఉందని అనుమానించబడిన వ్యక్తి వేరుగా ఉంచబడేవాడు. (లేవీయకాండము 13:1-5) దానికదే (బహుశా రోగమొచ్చి) చనిపోయిన ఓ జంతువును తాకిన వస్త్రాల్నిగానీ లేక పాత్రల్నిగానీ తిరిగి ఉపయోగించడానికి ముందు శుభ్రంగా ఉతకాలి లేక కడగాలి, అలాకాకపోతే వాటిని నాశనం చేయాలి. (లేవీయకాండము 11:27, 28, 32, 33) శవాన్ని ముట్టుకున్న వ్యక్తి ఎవరైనా సరే అతడు అపవిత్రుడు. అతడు పారిశుద్ధ్య పద్ధతిని పాటించాల్సిందే. ఇందులో తన వస్త్రాల్ని ఉతుక్కోవడం, స్నానం చేయడం చేరివున్నాయి. అపవిత్రంగా ఉండే ఏడు రోజుల కాలంలో, అతడు ఇతరుల్ని ముట్టుకోకూడదు.—సంఖ్యాకాండము 19:1-13.

ఆ కాలంలో చుట్టుప్రక్కలవున్న దేశాలలోని వైద్యులకులేని జ్ఞానాన్ని ఈ పారిశుద్ధ్య విధానం బయల్పరుస్తోంది. రోగాలు వ్యాపించే మార్గాల్ని గూర్చి వైద్య శాస్త్రం తెలుసుకోవడానికి వేలాది సంవత్సరాల మునుపే రోగాన్నుండి పరిరక్షించే సహేతుకమైన రోగ నిరోధక పద్ధతుల్ని బైబిలు సిఫారసు చేసింది. తన కాలంలోని ఇశ్రాయేలీయుల గురించి, వారు 70 లేక 80 సంవత్సరాల వయస్సు వరకు జీవిస్తారని మోషే చెప్పగలిగాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. *కీర్తన 90:10.

ఇప్పటివరకు ఉదాహరించబడిన బైబిల్లోని విషయాలు విజ్ఞానశాస్త్రపరంగా కచ్చితమైనవని మీరు అంగీకరించవచ్చు. కానీ విజ్ఞానశాస్త్రపరంగా రుజువుపర్చబడలేని ఇతర వ్యాఖ్యానాలు బైబిల్లో ఉన్నాయి. బైబిలు విజ్ఞానశాస్త్రానికి విరుద్ధంగా ఉందని దీని భావమా?

రుజువుపర్చబడలేని సమాచారాన్ని అంగీకరించడం

రుజువుపర్చబడలేని సమాచారం అసత్యం కానవసరంలేదు. తగినంత రుజువుల్ని కనుగొనేందుకూ, సమాచారాన్ని కచ్చితంగా తెలియజేసేందుకూ మానవునికున్న సామర్థ్యంచే విజ్ఞానశాస్త్ర రుజువులు పరిమితం చేయబడ్డాయి. కానీ ఏ విధమైన రుజువూ భద్రపర్చబడనందునా, ఆ రుజువు అస్పష్టమైనదైనందునా లేక కనుగొనలేకపోయినందునా, లేక నిర్వివాదమైన ముగింపుకు రావడానికి తగినంత విజ్ఞానశాస్త్రపరమైన సామర్థ్యాలూ, నిపుణతా లేనందునా కొన్ని సత్యాలను రుజువు చేయడం సాధ్యంకాదు. దేనిపైనా ఆధారపడని భౌతిక నిదర్శనాలు లోపించిన నిర్దిష్టమైన బైబిలు కథనాల విషయంలో పరిస్థితి ఇదేయై ఉండొచ్చా?

ఉదాహరణకు, ఆత్మ వ్యక్తులు నివసిస్తున్న అదృశ్య సామ్రాజ్యానికి సంబంధించిన బైబిలు లేఖనాల్ని విజ్ఞానశాస్త్రపరంగా రుజువు చేయలేకపోవొచ్చు—లేక తప్పుయని రుజువు చేయలేకపోవొచ్చు. బైబిల్లో ప్రస్తావించబడిన అద్భుత సంఘటనల విషయంలో కూడా ఇదే చెప్పవచ్చు. నోవహు కాలంలో జరిగిన భూగోళవ్యాప్త జలప్రళయాన్ని గూర్చి కొంతమంది ప్రజల్ని తృప్తిపర్చేందుకు కావాల్సిన స్పష్టమైన భూగర్భశాస్త్ర రుజువులు అందుబాటులో లేవు. (ఆదికాండము 7వ అధ్యాయము) అది సంభవించలేదనే ముగింపుకు మనం రావాలా? కాలాన్నిబట్టీ మార్పునుబట్టీ చారిత్రాత్మక సంఘటనలు మరుగునపడిపోవొచ్చు. వేలాది సంవత్సరాలుగా జరిగిన భౌగోళిక చర్య మూలంగా జలప్రళయం సంభవించిందనడానికిగల రుజువుల్లో అనేకం తుడిచిపెట్టుకు పోవడం సాధ్యంకాదంటారా?

నిజమే, అందుబాటులోవున్న భౌతిక సాక్ష్యాధారం ద్వారా రుజువుపర్చబడలేని లేక తప్పుయని రుజువుపర్చబడలేని వ్యాఖ్యానాలు బైబిల్లో ఉన్నాయి. కానీ అది మనల్ని ఆశ్చర్యపర్చాలా? బైబిలు విజ్ఞానశాస్త్ర పుస్తకంకాదు. అయితే, అది ఓ సత్యగ్రంథం. దాని రచయితలు యథార్థవంతులనీ, నిజాయితీపరులనీ అనడానికిగల బలమైన రుజువుల్ని మనమిప్పటికే పరిశీలించాం. మరి వాళ్లు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన విషయాల్ని ప్రస్తావించినప్పుడు, వారి మాటలు కచ్చితమైనవిగా ఉన్నాయి. కేవలం కట్టుకథలని రుజువుపర్చబడిన ప్రాచీనకాల “విజ్ఞానశాస్త్ర” సిద్ధాంతాలతో వాటికి ఏ సంబంధం లేదు. ఆ విధంగా, బైబిలు విజ్ఞానశాస్త్రానికి శత్రువుకాదు. బైబిలు చెబుతున్నదాన్ని నిష్కపటమైన మనస్సుతో సమగ్రంగా పరిశీలించడానికి తగినన్ని కారణాలు ఉన్నాయి.

[అధస్సూచి]

^ పేరా 7 భూగోళంపై ఒకదానికొకటి పూర్తిగా ఎదురుబొదురుగా ఉన్న ప్రదేశాలే . . . భిన్నధ్రువాలు. వాటి మధ్యనున్న సరళరేఖ భూమికి మధ్యగా పోతుంది. భిన్నధ్రువాలు అనే మాటకు గ్రీకులో పాదం నుండి పాదం అని అర్థం. భిన్నధ్రువాల్లో నిల్చున్న ఇద్దరు వ్యక్తులు వాళ్ల పాదాల అడుగుభాగం అంటుకున్నంత దగ్గరగా ఉంటారు.”1ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా.

^ పేరా 9 సాంకేతికభాషలో చెప్పాలంటే భూమి ఒత్తబడిన ఓ గోళమే; అది దాని ధ్రువాల దగ్గర స్వల్పంగా ఒత్తబడివుంది.

^ పేరా 10 అంతేగాకుండా, గోళాకారంగావున్న వస్తువు మాత్రమే ప్రతీ కోణంలోనుండీ వృత్తంగా కనబడుతుంది. సమతలంగావున్న డిస్క్‌ అతి తరచుగా వృత్తంగాగాక అండాకారంగా కనబడుతుంది.

^ పేరా 17 విశ్వ “సూప్‌” అనే ద్రవంతో విశ్వం నింపబడిందనే, ఆ ద్రవంలోని సుడిగుండాలు గ్రహాల్ని పరిభ్రమించేలా చేశాయనే అభిప్రాయం న్యూటన్‌ కాలంలో ప్రాచుర్యంలో ఉండేది.

^ పేరా 27 1900లో, అనేక యూరోపియన్‌ దేశాల్లోనూ, అమెరికాలోనూ సగటు జీవితాయుష్షు 50 ఏళ్లకన్నా తక్కువే ఉండేది. అప్పటినుండీ, రోగాల్ని నియంత్రించడంలో వైద్యశాస్త్రం సాధించిన పురోభివృద్ధినిబట్టేగాక మంచి పారిశుద్ధ్య పరిస్థితుల్నిబట్టీ, మంచి జీవన పరిస్థితుల్నిబట్టీ కూడా జీవితాయుష్షు గణనీయంగా పెరిగింది.

[21వ పేజీలోని బ్లర్బ్‌]

రుజువుపర్చబడలేని ఓ కథనం, అసత్యమైనదై ఉండాల్సిన అవసరమేమీలేదు

[18వ పేజీలోని బ్లర్బ్‌]

భూమి గోళాకారంగా ఉన్నట్టు మానవులు అంతరిక్షంలోనుండి చూడడానికి వేలాదిసంవత్సరాల మునుపే బైబిలు దానిని ‘భూ వృత్తం’ అని పిలిచింది

[20వ పేజీలోని బ్లర్బ్‌]

గ్రహాలు గురుత్వాకర్షణశక్తినిబట్టి తమతమ కక్ష్యల్లోనే ఉన్నాయని సర్‌ ఐసక్‌ న్యూటన్‌ వివరించాడు