కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ గ్రంథమెలా తప్పించుకొని నిలిచింది?

ఈ గ్రంథమెలా తప్పించుకొని నిలిచింది?

ఈ గ్రంథమెలా తప్పించుకొని నిలిచింది?

ప్రాచీనకాలంనాటి గ్రంథాలకు అగ్ని, తేమ, బూజువంటి ప్రకృతిసిద్ధమయిన శత్రువులుండేవి. బైబిలు అలాంటి అపాయాలకు అతీతమైనదేమీకాదు. అది, ప్రపంచంలో అందరికీ సులభంగా లభ్యమయ్యే గ్రంథం అయ్యేందుకు కాల విధ్వంసాన్ని ఎలా తప్పించుకొని నిలిచిందనే రికార్డు ఇతర ప్రాచీన గ్రంథాలనుండి విశిష్టమైనదిగా ఉంది. ఆ రికార్డు విశేషమైన ఆసక్తి చూపించడానికి తగినదే.

బైబిలు రచయితలు తమ మాటల్ని శిలలపై చెక్కలేదు; లేక దృఢమైన మట్టి పలకలపై లిఖించ లేదు. వాళ్లు నశ్వరమైన వాటిపై అంటే (పపైరస్‌ అనే పేరుగల ఈజిప్షియన్‌ మొక్కనుండి చేయబడిన) పపైరస్‌పైనా, (జంతు చర్మాలనుండి చేయబడిన) పార్చమెన్ట్‌పైనా తమ మాటల్ని రాసినట్లు రుజువుల్నిబట్టి తెలుస్తోంది.

ఆ మూల రాతప్రతులు ఏమయ్యాయి? అవి ప్రాచీన ఇశ్రాయేలులో బహుశా ఎంతో కాలం క్రిందటే శిథిలమైపోయి ఉంటాయి. ఆస్కార్‌ పారట్‌ అనే పండితుడు ఇలా వివరిస్తున్నాడు: “రాతకు ఉపయోగించబడే ఈ రెండు పదార్థాలూ [పపైరస్‌, తోలు] తేమవల్లా, బూజువల్లా, వివిధ పురుగులవల్లా కలిగే ఒకే విధమైన అపాయంలో ఉన్నాయి. ఆరుబయటగానీ లేక తేమవున్న గదిలోగానీ ఉన్న కాగితమూ, దృఢంగావున్న తోలు సహితం ఎలా పాడైపోతాయనే విషయం దైనందిన జీవితానుభవమునుబట్టి మనకు బాగా తెలుసు.”1

మూల ప్రతులు ఇక ఉనికిలోలేనట్లైతే, మరి బైబిలు రచయితల మాటలు మన కాలంవరకూ ఎలా తప్పించుకొని నిలిచాయి?

నిశితపరిశీలనాపరులైన లేఖికులచే భద్రపర్చబడ్డాయి

మూల రాతప్రతులు రాయబడిన వెంటనే, చేతిరాత నకళ్లను తయారుచేయడం ఆరంభమైంది. లేఖనాలను నకలురాయడం ప్రాచీన ఇశ్రాయేలులో నిజానికో వృత్తిగా మారింది. (ఎజ్రా 7:6; కీర్తన 45:1) అయితే, ఆ నకళ్లు కూడా నశ్వరమైన పదార్థాలపైనే రాయబడ్డాయి. చివరకు వాటిని కూడా ఇతర చేతిరాత ప్రతులలోకి తిరగరాయాల్సి వచ్చేది. మూలప్రతులు గతించిపోగానే, ఈ నకళ్లు భవిష్యత్‌ చేతిరాత ప్రతులకు ఆధారమయ్యేవి. నకళ్లకు ప్రతినకళ్లు రాసే పద్ధతి శతాబ్దాల తరబడి కొనసాగింది. శతాబ్దాలుగా లేఖికులు చేసిన తప్పులు బైబిలు మూల పాఠాన్ని తీవ్రంగా మార్చేశాయా? మార్చలేదని లభ్యమౌతున్న రుజువులు చెబుతున్నాయి.

నకలురాయడాన్ని వృత్తిగాచేపట్టిన లేఖికులు ఎంతో అంకితభావంగలవారై ఉండేవారు. తాము నకలురాసే మాటల ఎడల వారికి అపారమైన గౌరవముండేది. వాళ్లు నిశితపరిశీలనా దృష్టిగలవారు కూడా. “లేఖికుడు” అని అనువదించబడిన హెబ్రీ పదం, సోఫెర్‌. ఇది లెక్కించడంతో, రాయడంతో సంబంధంవున్న పదం. లేఖికుల కచ్చితత్వాన్ని ఉదహరించేందుకు మసరెట్‌లను పరిశీలించండి. * వారిని గురించి, పండితుడైన థామస్‌ హార్ట్‌వల్‌ హొర్న్‌ ఇలా వివరిస్తున్నాడు: “వాళ్లు . . . పంచస్కంధంలో [బైబిల్లోని మొదటి ఐదుపుస్తకాలు] ఏది మధ్యాక్షరమో, ఆ పుస్తకాల్లో ప్రతీదాంట్లోనూ ఏది మధ్య (కర్త, కర్మ ఉన్న) వాక్యభాగమో, అలాగే హెబ్రీ లేఖనాలన్నింటిలో [హెబ్రీ] అక్షరమాలనందలి ఏ అక్షరం ఎన్నిసార్లు కన్పిస్తుందో లెక్కించేవారు.”3

ఆ విధంగా నైపుణ్యంగల లేఖికులు, క్రాస్‌ చెకింగ్‌ పద్ధతుల్ని అనేకం ఉపయోగించేవారు. బైబిలు మూలపాఠంలో నుండి ఒక్క అక్షరమైనా వదిలివేయబడకుండా జాగ్రత్త తీసుకునేందుకు, వాళ్లు నకలురాసే పదాల్ని మాత్రమేగాక అక్షరాల్ని కూడా లెక్కపెట్టేంత వరకూ వెళ్లారు. ఇందులో ఇమిడివున్న శ్రమతోకూడిన శ్రద్ధను పరిశీలించండి: వాళ్లు హెబ్రీ లేఖనాల్లో మొత్తం 8,15,140 అక్షరాల్ని లెక్కించినట్లు భోగట్టా!4 అలాంటి శ్రద్దతోకూడిన కృషి అత్యున్నతమైన కచ్చితత్వానికి హామీనిస్తుంది.

అయినప్పటికీ, లేఖికులు తప్పులుచేయని వారేమీకాదు. శతాబ్దాలతరబడి ప్రతినకళ్లుచేసుకుంటూ పోయినా, బైబిలు మూలపాఠం విశ్వసనీయమైన రూపంలో నిలిచివుందనడానికి రుజువేదైనావుందా?

విశ్వసించడానికి ఒక బలమైన ఆధారం

బైబిలు మనకాలం వరకూ యథాతథంగా అందించబడిందని విశ్వసించడానికి తగిన కారణమేవుంది. ఆ రుజువు, ఉనికిలోవున్న చేతిరాతప్రతుల్లో అంటే మొత్తంగాగానీ లేక కొన్ని భాగాలుగాగానీ లభ్యమౌతున్నాయని అంచనావేయబడిన 6,000 హెబ్రీ లేఖన ప్రతుల్లోనూ, దాదాపు 5,000 క్రైస్తవ గ్రీకు లేఖన ప్రతుల్లోనూ కనబడుతోంది. వీటిలో, 1947లో కనుగొనబడిన హెబ్రీ లేఖన చేతిరాతప్రతివుంది. లేఖనాల్ని ఎంత కచ్చితంగా నకలురాయడం జరిగిందనే విషయాన్ని అది ఉన్నతపరుస్తోంది. అది “ఆధునికకాలాల్లోని, చేతిరాతప్రతి యొక్క అతి గొప్ప ఆవిష్కరణ” అని పిలువబడింది.5

ఆ సంవత్సరపు తొలిభాగంలో, తన మందలను కాసుకుంటున్న యౌవనస్థుడైన ఓ బెడువిన్‌ కాపరి మృత సముద్రం దగ్గర ఓ గుహను కనుగొన్నాడు. అందులో అతడు అనేక మట్టికుండల్ని చూశాడు, వాటిలో అనేకం ఖాళీ కుండలే. అయితే, గట్టిగా కట్టివేయబడివున్న ఒక కుండలో, భద్రంగా బట్టతో చుట్టబడివున్న ఓ తోలు గ్రంథపుచుట్టను అతడు చూశాడు. అది బైబిలు పుస్తకమైన యెషయా గ్రంథమంతావున్న గ్రంథపుచుట్ట. పాతగిలిపోయినప్పటికీ, బహు భద్రంగానే ఉన్న ఈ చుట్టలో బాగుచేయబడిన ఛాయలు కనబడ్డాయి. తన చేతుల్లోవున్న ఈ ప్రాచీన గ్రంథపుచుట్ట చివరకు ప్రపంచ అవధానాన్ని ఆకట్టుకోబోతుందనే విషయాన్ని ఆ యౌవనకాపరి అప్పుడు గ్రహించనేలేదు.

ఈ విశిష్టమైన చేతిరాతప్రతిని గురించిన విశేషమేమిటి? 1947 నాటి వరకూ లభ్యమైన హెబ్రీ లేఖనాల పూర్తి చేతిరాతప్రతుల్లో అతి ప్రాచీనమైన చేతిరాతప్రతి సా.శ. పదవ శతాబ్దానికి చెందినది. కానీ ఈ గ్రంథపుచుట్ట సా.శ.పూ. * రెండవ శతాబ్దానికి చెందినదిగా లెక్కించబడింది అంటే దాని కన్నా వెయ్యి కంటే ఎక్కువ సంవత్సరాల పూర్వందన్నమాట. * ఈ గ్రంథపు చుట్టను అటుతర్వాత నకలురాయబడిన చేతిరాతప్రతులతో పోల్చిచూస్తే ఎలా ఉంటుందనేది తెల్సుకోడానికి పండితులు అత్యంతాసక్తిని కనుపర్చారు.

ఒక అధ్యయనంలో, మృతసముద్ర గ్రంథపుచుట్టలోని యెషయా 53వ అధ్యాయాన్ని, దానికి వెయ్యేళ్ల తర్వాత నకలురాయబడిన మసరిటెక్‌ మూలపాఠంతో పండితులు పోల్చిచూశారు. బైబిలు సామాన్య పరిచయం (ఆంగ్లం) అనే పుస్తకం ఆ అధ్యయన ఫలితాల్ని ఇలా వివరిస్తోంది: “యెషయా 53వ అధ్యాయంలోని 166 పదాల్లో 17 అక్షరాలు మాత్రమే సంశయించదగినవిగా ఉన్నాయి. వీటిలో పది అక్షరాలు భావాన్ని ప్రభావితంచేయని వర్ణదోషాలు మాత్రమే. మరి నాల్గు అక్షరాలైతే శైలిలో వచ్చిన సముచ్చయాలవంటి చిన్నచిన్న మార్పులే. మిగిలిన మూడు అక్షరాలతో ‘వెలుగు’ అనే పదం రూపొందుతుంది. అది 11వ వచనంలో చేర్చబడింది. మరి ఇది భావాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. . . . ఆ విధంగా, వెయ్యేళ్లుగా నకలు-ప్రతినకలు చేయబడుతూ వచ్చిన తర్వాత, 166 పదాలుగల ఒక అధ్యాయంలో ఒక్క పదం (మూడు అక్షరాలు) మాత్రమే సంశయించదగినదిగా ఉంది—మరి ఈ పదం గ్రంథంలోని ఆ భాగమందలి భావాన్ని చెప్పుకోదగినంతగా ఏమీ మార్చదు.”7

గ్రంథపుచుట్టలలో ఉన్న విషయాలను విశ్లేషిస్తూ వాటితో సంవత్సరాలతరబడి పనిచేసిన ప్రొఫెసర్‌ మిల్లర్‌ బర్రోస్‌ అదే విధమైన నిర్థారణకు వచ్చాడు: “యెషయా గ్రంథపుచుట్టకూ, మసరిటెక్‌ మూలపాఠాలకూ . . . మధ్యనున్న . . . అనేక తేడాల్ని నకలురాయడంలో దొర్లిన తప్పులుగానే వివరించవచ్చు. ఇవి మినహా మొత్తంమీద, మధ్యయుగంలో దొరికిన చేతిరాతప్రతుల్లో ఉన్న సమాచారంలో ఓ విశిష్టమైన పొందికవుంది. ఎంతో పాతదైన ఒక చేతిరాతప్రతిలో అలాంటి పొందిక ఉండడం, పారంపర్య మూలపాఠం యొక్క సామాన్య కచ్చితత్వానికి పునర్నిర్థారించే రుజువును ఇస్తోంది.”8

“పునర్నిర్థారించే రుజువు” క్రైస్తవ గ్రీకు లేఖనాల నకలు రాయడం విషయంలో కూడా ఇవ్వవచ్చు. ఉదాహరణకు, 19వ శతాబ్దంలో దొరికిన, సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన వెల్లమ్‌ చేతిరాతప్రతియైన సైనాయ్‌టికస్‌ కోడెక్స్‌, అటు తర్వాతి శతాబ్దాల్లో తయారుచేయబడిన క్రైస్తవ గ్రీకు లేఖన చేతిరాతప్రతుల కచ్చితత్వాన్ని ధృవపర్చడానికి సహాయపడింది. ఈజిప్టులోని ఫయూమ్‌ జిల్లాలో దొరికిన యోహాను సువార్త యొక్క పపైరస్‌ ముక్క సా.శ. రెండవ శతాబ్దపు ప్రథమార్థభాగానికి చెందినదని అంటే అది దాని అసలు ప్రతి రాయబడిన 50 ఏళ్ల తర్వాతదని లెక్కించబడింది. ఇది శతాబ్దాల తరబడి తేమలేని ఇసుకలో భద్రపర్చబడింది. ఈ ప్రతి అటు తర్వాత ఎంతో కాలానికి దొరికిన చేతిరాతప్రతులతో ఏకీభవిస్తోంది.9

ఆ విధంగా, నిజానికి లేఖికులు నకలు రాయడంలో ఎంతో నిర్దిష్టంగా ఉండేవారని సాక్ష్యాధారం ధృవపరుస్తోంది. అయినప్పటికీ, వాళ్లూ తప్పులు చేశారు. మృత సముద్రపు యెషయా గ్రంథపుచుట్టతోసహా ఏ చేతిరాతప్రతీ దోషరహితమైనది కాదు. అయితే, పండితులు అలాంటి తేడాల్ని అసలు-ప్రతితో పరిశీలించి సరిదిద్దగల్గారు.

లేఖికులు చేసిన తప్పుల్ని సరిదిద్దడం

సుదీర్ఘమైన సమాచారమున్న ఓ పత్రానికి చేతిరాత నకలు రాయమని 100 మంది వ్యక్తుల్ని అడిగారనుకుందాం. వారిలో కనీసం కొంతమంది లేఖికులైనా తప్పులు చేస్తారనడంలో సందేహమేమీలేదు. అయితే, వాళ్లంతా ఒకేవిధమైన తప్పుల్ని చేయరు. మీరు గనుక ఆ 100 నకలు ప్రతుల్నీ తీసుకొని చాలా జాగ్రత్తగా వాటిని ఒకదానితో మరొకటి పోల్చినట్లైతే, మీరు ఆ తప్పుల్ని పట్టుకొని ఆ అసలు పత్రంలోవున్న కచ్చితమైన సమాచారం ఏమై ఉంటుందో—ఆ అసలు పత్రాన్ని మీరు మునుపెన్నడూ చూడకపోయినప్పటికీ కూడా—నిర్ణయించగల్గుతారు.

అదే విధంగా, బైబిలు లేఖికులు అందరూ ఒకే విధమైన తప్పుల్ని చేయలేదు. తులనాత్మక విశ్లేషణ కొరకు ఇప్పుడు అక్షరార్థంగా వేలాది బైబిలు చేతిరాతప్రతులు అందుబాటులో ఉన్నందున మూలపాఠ్య పండితులు తప్పుల్ని పట్టుకొని, అసలు గ్రంథంలోని విషయాన్ని నిర్ధారించి, అవసరమైన సవరింపుల్ని రాసిపెట్టుకొనగల్గుతున్నారు. అలాంటి జాగ్రత్తతో కూడిన అధ్యయనం ఫలితంగా, మూలపాఠ్య పండితులు ఆదిమ భాషల్లో అసలు ప్రతుల్ని తయారుచేశారు. హెబ్రీ గ్రీకు భాషల మూలపాఠ్య గ్రంథాల మెరుగుపర్చబడిన ఈ ప్రతులు అతి సామాన్యంగా ఆమోదించబడిన పదాల్ని అసలు గ్రంథంలోని పదాలుగా తీసుకుంటాయి. ఇవి బహుశా కొన్ని చేతిరాతప్రతుల్లోవున్న తేడాల్నీ లేక ప్రత్యామ్నాయ సమాచారాన్నీ అధఃసూచీల్లో తరచుగా చేరుస్తాయి. బైబిలు అనువాదకులు ఆధునిక భాషల్లోకి బైబిల్ని అనువదించడానికి మూలపాఠ్య పండితులు మెరుగుపర్చిన ప్రతులనే ఉపయోగిస్తారు.

కాబట్టి మీరు ఒక ఆధునిక బైబిలు అనువాదాన్ని చదివినప్పుడు, దేని ఆధారంగా ఆ అనువాదం చేయబడిందో ఆ హెబ్రీ గ్రీకు పాఠ్య గ్రంథాలు, బైబిలు రచయితల అసలు పదాలకు విశేషమైన నమ్మకత్వంతో ప్రాతినిధ్యం వహిస్తున్నాయని విశ్వసించడానికి తగినన్ని కారణాలు ఉన్నాయి. * వేలాది సంవత్సరాలుగా చేతితో నకళ్లు ప్రతినకళ్లు రాయబడినా బైబిలు ఎలా తప్పించుకొని నిలబడిందనే దాన్ని గూర్చిన రికార్డు నిజంగా అసాధారణమైనది. అందుకే, బ్రిటీష్‌ మ్యూజియంలో ఎంతో కాలంనుండి క్యూరేటర్‌గావున్న సర్‌ ఫ్రెడ్‌రిక్‌ కెన్యన్‌ ఇలా చెప్పగలిగారు: “ప్రాథమికంగా బైబిలు మూలపాఠం కచ్చితమైనదని గట్టిగా చెప్పవచ్చు. . . . ఈ విధంగా ప్రపంచంలోని ఏ ఇతర ప్రాచీన గ్రంథం విషయంలోనూ చెప్పలేం.”10

[అధస్సూచీలు]

^ పేరా 8 మసరెట్‌లు (“పారంపర్య ప్రవీణులు” అని భావం), హెబ్రీ లేఖనాల లేఖికులు. వీళ్లు సా.శ. ఆరవ శతాబ్దానికీ పదవ శతాబ్దానికీ మధ్య కాలంలో జీవించారు. వాళ్లు ఉత్పన్నంచేసిన చేతిరాత ప్రతులు మసరెటిక్‌ మూలపాఠాలుగా పిలువబడేవి.2

^ పేరా 14 సా.శ.పూ. అంటే “సామాన్య శక పూర్వం” అని అర్థం. సా.శ. అంటే “సామాన్య శకము” అని అర్థం. ఇది తరచూ ఎ.డి. అని పిలువబడుతుంది. ఎ.డి. అంటే అన్నోడోమిని—“ప్రభువు సంవత్సరంలో” అని అర్థం.

^ పేరా 14 ఇమ్మానుయేల్‌ టోవ్‌ రాసిన హెబ్రీ బైబిలు మూలపాఠ విమర్శనం (ఆంగ్లం) ఇలా చెబుతోంది: “కార్బన్‌ 14 పరీక్ష సహాయంతో, 1QIsaa [మృత సముద్ర యెషయా గ్రంథపు చుట్ట] సా.శ.పూ. 202 నుండి 107 మధ్య కాలంనాటిదని (చేతిరాతల లిపిశాస్త్ర నిర్ధారిత తేదీ: సా.శ.పూ. 125-100) ఇప్పుడు లెక్కించబడింది . . . ప్రస్తావించబడిన చేతిరాతల లిపిశాస్త్ర నిర్ధారిత పద్ధతి సాపేక్షికంగా విశ్వసనీయమైన పద్ధతిగా నిరూపించబడింది. దాని ద్వారా, తేదీవున్న నాణెములూ శాసనాలూ వంటి వెలుపటి మూలాలతో అక్షరాల ఆకృతినీ, అమర్చబడినతీరునూ సరిపోల్చిచూడ్డం ఆధారంగా కచ్చితమైన తేదీని లెక్కించడం సాధ్యమౌతుంది. ఇది ఇటీవల సంవత్సరాల్లో మెరుగుపర్చబడింది.”6

^ పేరా 22 నిజమే, ఆయా అనువాదకులు హెబ్రీ గ్రీకు లేఖన మూల ప్రతులను నమ్మకంగా అనుసరించి ఉండొచ్చు లేక అనుసరించకపోయి ఉండొచ్చు.

[8వ పేజీలోని చిత్రం]

నిపుణులైన లేఖికులచే బైబిలు భద్రపర్చబడింది

[9వ పేజీలోని చిత్రం]

మృత సముద్ర యెషయా గ్రంథపుచుట్ట (పునరుద్ధరించబడిన ప్రతి చూపించబడింది) వేలాది సంవత్సరాల తర్వాత తయారుచేయబడిన మసరిటెక్‌ ప్రతితో పోల్చిచూస్తే దాదాపు అలాగే ఉంది