కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చదవవలసిన గ్రంథం

చదవవలసిన గ్రంథం

చదవవలసిన గ్రంథం

“బైబిల్ని అంత గంభీరంగా తీసుకోనవసరంలేదు” అని యూనివర్సిటీ ప్రొఫెసరొకరు, నిర్మొహమాటంగా మాట్లాడే ఓ యౌవనస్త్రీతో అన్నాడు.

“మీరెప్పుడైనా బైబిల్ని చదివారా?” అని ఆమె ప్రశ్నించింది.

అందుకు కలవరపడినవాడై, ఆ ప్రొఫెసరు తాను చదవలేదని ఒప్పుకోవాల్సివచ్చింది.

“మీరెన్నడూ చదవని ఓ గ్రంథాన్ని గురించి అంత కచ్చితంగా మీరెలా చెప్పగలరు?”

ఆమె సహేతుకంగానే తర్కించింది. బైబిల్ని చదివి, ఆతర్వాత దాని గురించి ఓ అభిప్రాయాన్ని ఏర్పర్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు.

అరవై ఆరు పుస్తకాలతో రూపొందించబడిన బైబిలు “బహుశా మానవజాతి చరిత్రలో అత్యంత ప్రభావాన్ని చూపించిన పుస్తకాల సేకరణగా” వర్ణించబడింది.1 నిజానికి, ఇది ప్రపంచంలోని అతిగొప్ప కళా సాహిత్య సంగీతాలలో కొన్నింటిని ప్రభావితం చేసింది. ఇది న్యాయవ్యవస్థపై చెప్పుకోదగిన ముద్రనువేసింది. ఇది దాని సాహిత్య శైలినిబట్టి కొనియాడబడింది. మరి ఇది అనేకమంది విద్యావంతులచే ఉన్నతంగా గౌరవించబడింది. ఇది సమాజంలోని అన్నివర్గాలకు చెందిన ప్రజల జీవితాలపై విశేషంగా ఎనలేని ప్రభావాన్ని చూపించింది. ఇది దాని పాఠకుల్లో అనేకమంది ఎంతో యథార్థత కల్గివుండేలా వారిని ప్రేరేపించింది. కొంతమంది కేవలం దానిని చదవడం కోసమే తమ ప్రాణాల్ని అపాయంలో పడవేసుకోవడానికి కూడా తెగించారు.

అదే సమయంలో, బైబిలు విషయంలో సంశయాలు కూడా ఉన్నాయి. ఆ గ్రంథాన్ని వ్యక్తిగతంగా ఎన్నడూ చదవకపోయినా, దాని విషయంలో నిర్దిష్టమైన అభిప్రాయాల్ని ఏర్పర్చుకున్న ప్రజలూ ఉన్నారు. వాళ్లు దాని సాహిత్య విలువలనూ లేక చారిత్రక విలువలనూ గుర్తించినప్పటికీ, ఇలా ఆలోచించవచ్చు: వేలాది సంవత్సరాలక్రిందట రాయబడిన ఓ గ్రంథం, ఈ ఆధునిక ప్రపంచంలో ఎలా అన్వయించుకొనదగినదై ఉండగలదు? మనం “సమాచార యుగం”లో జీవిస్తున్నాం. వర్తమాన సంఘటనల్ని గూర్చిన, సాంకేతిక విషయాల్ని గూర్చిన తాజా సమాచారం మనకు అందుబాటులో ఉంది. ఇంచుమించు, ఆధునిక జీవితానికి సంబంధించిన సమస్యలన్నిటిపైనా “సమర్థవంతమైన” సలహా వెంటనే లభ్యమౌతోంది. ప్రస్తుత కాలానికి ఆచరణయోగ్యమైన సమాచారం బైబిల్లో నిజంగా ఉందా?

ఈ బ్రోషూర్‌, అలాంటి ప్రశ్నలకు జవాబివ్వడానికి ప్రయత్నిస్తోంది. మతపరమైన ఉద్దేశాల్నిగానీ లేక నమ్మకాల్నిగానీ మీపై రుద్దడానికి ఇది తయారుచేయబడలేదు కానీ, చారిత్రకంగా ప్రభావం చూపించిన గ్రంథమైన బైబిలు మీ పరిశీలనకు యోగ్యమైనదని చూపించేందుకే ఇది ఉద్దేశించబడింది. “బైబిలు బోధలతోనూ, వృత్తాంతాలతోనూ పరిచయంలేని విశ్వాసిగానీ లేక అవిశ్వాసిగానీ, మరెవరైనాగానీ అతడు సాంస్కృతికంగా నిరక్షరాస్యుడౌతాడు” అనేంత దృఢంగా పాశ్చాత్య సంస్కృతిలో బైబిలు నాటుకుపోయినట్లుగా కొంతమంది విద్యావేత్తలు గట్టిగా తలస్తున్నారని 1994లో ప్రచురించబడిన ఓ నివేదిక తెలియజేసింది.2

బహుశా, ఈ బ్రోషూర్‌లో ప్రచురించబడిన సమాచారాన్ని మీరు చదివిన తర్వాత ఒకవ్యక్తి మతసంబంధియైనా కాకపోయినా అతడు చదవవలసిన గ్రంథం బైబిలేనని మీరు అంగీకరిస్తారు.

[3వ పేజీలోని బాక్సు / చిత్రం]

“ఓ గ్రంథాన్ని చదవడం మూలంగా నాకు జ్ఞానోదయమైంది.—ఓ గ్రంథమా? అవును. అది ఓ సరళమైన ప్రాచీన గ్రంథం. ప్రకృతిలా నిర్మలమైనది, స్వచ్ఛమైనది . . . ఆ గ్రంథం పేరు చెప్పడం కష్టమేమీ కాదు, అదే బైబిలు.”—19వ శతాబ్దానికి చెందిన జర్మన్‌ రచయితయైన హెన్‌రిక్‌ హెయిన్‌.3