కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచంలో అత్యధికంగా పంచిపెట్టబడిన గ్రంథం

ప్రపంచంలో అత్యధికంగా పంచిపెట్టబడిన గ్రంథం

ప్రపంచంలో అత్యధికంగా పంచిపెట్టబడిన గ్రంథం

“చరిత్రలో అధిక సంఖ్యాకులచే చదవబడిన గ్రంథం బైబిలు. . . . ఏ ఇతర పుస్తకాలకన్నా బైబిలు ప్రతులే అధిక సంఖ్యలో పంచిపెట్టబడ్డాయి. ఏ ఇతర పుస్తకాలకన్నా బైబిలే అనేకసార్లు అనేక భాషల్లోకి అనువదించబడింది.”—“ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా.”1

కొన్ని విషయాల్లో, అనేక పుస్తకాలు ప్రజలను పోలి ఉంటాయి. అవి ఉనికిలోకి వచ్చి, ప్రజాదరణను పొంది—ఏవోకొన్ని ఉత్కృష్టమైన రచనలు తప్ప—పురాతనమైనవైపోయి, నిరాసక్తమైనవిగా తయారౌతాయి. వ్యవహారంలో లేకుండాపోయి, చదవబడకుండావుండి, తద్వారా నిరాసక్తమైనవైపోయిన అసంఖ్యాకమైన పుస్తకాలకు గ్రంథాలయాలు తరచూ సమాధుల్లా పనిచేస్తున్నాయి.

అయితే, సాహిత్య గ్రంథాల్లో సహితం బైబిలు అసాధారణమైనదిగావుంది. బైబిలును రాయడం 3,500 సంవత్సరాల క్రిందటే ఆరంభమైనా, ఇప్పటికీ అది సజీవంగానే ఉంది. ఇప్పటి వరకూ భూమిపై అధిక సంఖ్యలో పంచిపెట్టబడిన గ్రంథం ఇదే. * ప్రతీ సంవత్సరం, దాదాపు ఆరుకోట్ల పూర్తి బైబిలు ప్రతులుగానీ లేక బైబిల్లోని కొన్ని భాగాల ప్రతులుగానీ పంచిపెట్టబడుతున్నాయి. 1455వ సంవత్సరంలో, ముద్రణ కొరకు ఉపయోగించే టైప్‌ పేసుల్ని సులభంగా మార్చుకోడాన్కి వీలయ్యే విధంగా మార్చబడిన, జర్మన్‌ ఆవిష్కరణకర్తయైన యోహానస్‌ గూటెన్‌బర్గ్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మొదటి బైబిలు ప్రతి ముద్రించబడింది. అప్పటినుండీ 400 కోట్ల బైబిలు ప్రతులు (పూర్తి బైబిలుగానీ లేక దాన్లో కొన్ని భాగాలుగానీ) ముద్రించబడ్డాయని అంచనావేయబడింది. ఏ ఇతర పుస్తకమూ అంటే అది మతపరమైన పుస్తకమైనా కాకపోయినా, ఆ గణాంకాల దరిదాపులకు కూడా చేరుకోలేదు.

చరిత్రలో ఎంతో విస్తృతంగా అనువదించబడిన గ్రంథం కూడా బైబిలే. పూర్తి బైబిల్నిగానీ లేక దానిలోని కొన్ని భాగాల్నిగానీ 2,100 కన్నా ఎక్కువ భాషల్లోకీ మాండలికాల్లోకీ అనువదించడం జరిగింది. * మానవజాతిలోని 90 కన్నా ఎక్కువ శాతం మంది ప్రజలు, కనీసం బైబిల్లోని కొంత భాగాన్నైనా తమ స్వంత భాషలో చదువుకోవడానికి అవకాశమేర్పడింది.2 ఆ విధంగా, ఈ గ్రంథం అనేక దేశాల సరిహద్దుల్ని దాటి, జాతి వర్గ ప్రతిబంధకాలకు అతీతంగా నిలిచింది.

బైబిల్ని పరిశీలించేందుకు మిమ్మల్ని ఒప్పింపజేసే కారణాన్ని గణాంకవివరణలు మాత్రమే ఇవ్వలేకపోవచ్చు. అయినప్పటికీ, పంచిపెట్టబడిన ప్రతుల సంఖ్యలూ, అనువదించబడిన భాషల సంఖ్యలూ ప్రభావవంతంగా ఉన్నాయి, అవి విశ్వవ్యాప్త పరిధిలో బైబిలు పొందుతున్న ఆదరణను రుజువుచేస్తున్నాయి. మానవజాతి చరిత్రలో ఎక్కువగా విక్రయించబడే, అనేక భాషల్లోకి అనువదించబడిన గ్రంథం మీరు పరిశీలించదగినది.

[అధస్సూచీలు]

^ పేరా 4 మావో ట్సి-టుంగ్‌ గ్రంథాలనుండి ఉదాహృత భాగాలు (ఆంగ్లం) అనే, ఎర్రని అట్టగల చిన్నపుస్తకం యొక్క 80 కోట్ల ప్రతులు విక్రయించబడ్డాయని లేక పంచిపెట్టబడ్డాయని అంచనావేయబడింది. అతి విస్తృతంగా పంచిపెట్టబడిన ప్రచురణల్లో ఇది రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుందని తలంచబడుతుంది.

^ పేరా 5 అనువదించబడిన భాషల్ని గురించిన గణాంక వివరణలు యునైటెడ్‌ బైబిల్‌ సొసైటీస్‌ ప్రచురించిన లెక్కలపై ఆధారపడివున్నాయి.

[6వ పేజీలోని చిత్రం]

గూటెన్స్‌బర్గ్‌ బైబిలు పూర్తి గ్రంథం—ముద్రణ కొరకు ఉపయోగించే టైప్‌ పేసుల్ని సులభంగా మార్చుకోడాన్కి వీలయ్యే విధంగా మార్చబడిన ప్రింటింగ్‌ ప్రెస్‌ నుండి లాటిన్‌ భాషలో ముద్రించబడింది