కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సజీవ భాషల్ని “మాట్లాడే” గ్రంథం

సజీవ భాషల్ని “మాట్లాడే” గ్రంథం

సజీవ భాషల్ని “మాట్లాడే” గ్రంథం

ఏ భాషలో ఓ గ్రంథం రాయబడిందో ఆ భాషే గనుక వాడుకలో లేకుండాపోతే వాస్తవానికి ఆ గ్రంథం కూడా అలాగే వాడుకలో లేకుండాపోతుంది. బైబిలు ఏ భాషల్లో రాయబడిందో ఆ ప్రాచీన భాషలను నేడు కొంతమంది ప్రజలు మాత్రమే చదువగలరు. అయినా అది సజీవంగానేవుంది. అది మానవజాతి యొక్క సజీవ భాషలను “మాట్లాడడం నేర్చుకుంది” గనుకనే అది తప్పించుకొని నిలిచివుంది. దానికి ఇతర భాషలను మాట్లాడడం “నేర్పించిన” అనువాదకులు, అధిగమించడం కష్టమనిపించే ఆటంకాల్ని కొన్నిసార్లు ఎదుర్కున్నారు.

బైబిల్ని అనువదించడం—దానిలోవున్న 1,100 కన్నా ఎక్కువ అధ్యాయాల్నీ, 31,000 కన్నా ఎక్కువ వచనాల్నీ అనువదించడంఓ పెద్ద ఘనకార్యమే. అయినప్పటికీ, శతాబ్దాలుగా అంకితభావంగల అనువాదకులు ఆసక్తికరమైన ఈ కార్యాన్ని స్వచ్ఛందంగా చేపట్టారు. వారిలో అనేకమంది తమ పనినిబట్టి కష్టాల్ని అనుభవించడానికి, మరణించడానికి కూడా సుముఖత చూపించారు. మానవజాతి భాషల్లోనికి బైబిలు ఎలా అనువదించబడిందనే చరిత్ర, పట్టుదలా చాతుర్యాల అసమానమైన వృత్తాంతం. శక్తివంతమైన ఈ వృత్తాంతంలోని ఓ చిన్న భాగాన్ని పరిశీలిద్దాం.

అనువాదకులకు ఎదురైన సమస్యలు

లిపిలేని భాషల్లోనికి ఓ పుస్తకాన్ని మీరెలా అనువదిస్తారు? కచ్చితంగా అలాంటి సమస్యనే అనేకమంది బైబిలు అనువాదకులు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు, సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన ఉల్ఫలాస్‌ అనే వ్యక్తి, అప్పటి ఆధునిక భాషయైన లిపిలేని గాత్‌ భాషలోనికి బైబిల్ని అనువదించాలని సంకల్పించాడు. ఉల్ఫలాస్‌ 27 అక్షరాలుగల గాత్‌ అక్షరమాలను రూపొందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించాడు. ఆయన ఈ అక్షరమాలను ప్రధానంగా గ్రీకు, లాటిన్‌ భాషా అక్షరమాలల ఆధారంగా రూపొందించాడు. సా.శ. 381వ సంవత్సరానికి ముందే, ఆయన గాత్‌ భాషలోనికి దాదాపుగా బైబిలంతటినీ అనువదించడం పూర్తి చేశాడు.

తొమ్మిదవ శతాబ్దంలో పండితులుగానూ భాషాప్రవీణులుగానూ పేరుగాంచిన సిరిల్‌ (అసలు పేరు కాన్‌స్టన్‌టైన్‌), మెథోడియస్‌ అనే ఇద్దరు గ్రీకు సోదరులు, స్లావిక్‌ భాషను మాట్లాడే ప్రజల కోసం బైబిల్ని అనువదించాలని అనుకున్నారు. కానీ నేటి స్లావిక్‌ భాషకు అగ్రగామియైన ఆ స్లావొనిక్‌ భాషకు లిపిలేదు. కాబట్టి బైబిల్ని అనువదించడం కోసం ఆ ఇరువురు సోదరులూ ఓ అక్షరమాలను రూపొందించారు. ఆ విధంగా బైబిలు ఇప్పుడు స్లావిక్‌ భాషను మాట్లాడే ఎంతోమంది ప్రజలతో “మాట్లాడ”గల్గుతోంది.

16వ శతాబ్దంలో, విలియమ్‌ టిండేల్‌ మూల భాషల్లోనుండి ఆంగ్లంలోనికి బైబిల్ని అనువదించాలని ఉద్దేశించాడు, కానీ ఆయన చర్చినుండీ ప్రభుత్వంనుండీ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన టిండేల్‌ “నాగలి పట్టే బాలుడు” కూడా అర్థంచేసుకొనగల్గేలా అనువదించాలని అనుకున్నాడు.1 కానీ దీన్ని సాధించేందుకు ఆయన జర్మనీకి పారిపోవాల్సి వచ్చింది. ఆంగ్లభాషలోనికి ఆయన అనువదించిన “క్రొత్త నిబంధన” 1526లో అక్కడే ముద్రించబడింది. ఆ ప్రతులు దొంగచాటుగా ఇంగ్లాండ్‌లోనికి చేరవేయబడినప్పుడు, అధికారులు కోపోద్రేకులై వాటిని బహిరంగంగా తగులబెట్టనారంభించారు. అటు తర్వాత టిండేల్‌ మోసపూరితంగా అప్పగించబడ్డాడు. గొంతు పిసుకబడి, దేహం తగలబెట్టబడడానికి కొంచెం ముందు, ఆయన ఈ మాటల్ని బిగ్గరగా పలికాడు: “ప్రభువా, ఇంగ్లాండ్‌ రాజు కళ్లు తెరిపించు!”2

బైబిలు అనువాదం ఎడతెరిపిలేకుండా సాగింది; అనువాదకులు అనువదించకుండా ఏదీ ఆపలేకపోయింది. 1800 నాటికి, కనీసం బైబిల్లోని కొన్ని భాగాలైనా 68 భాషల్ని “మాట్లాడ్డం నేర్చుకున్నాయి.” అటు తర్వాత, బైబిలు సొసైటీలు ఏర్పడ్డంతో—విశేషంగా 1804లో బ్రిటీష్‌ అండ్‌ ఫారిన్‌ బైబిల్‌ సొసైటీ ఏర్పడ్డంతో—బైబిలు మరిన్ని క్రొత్త భాషల్ని త్వరితంగా “నేర్చుకుంది.” మిషనరీలుగా విదేశాలకు వెళ్లడానికి వందలాదిమంది యౌవనులు స్వచ్ఛందంగా సంసిద్ధులయ్యారు. వారిలో అనేకుల ప్రధానోద్దేశం బైబిల్ని అనువదించాలన్నదే.

ఆఫ్రికా భాషల్ని నేర్చుకోవడం

1800 నాటికి, ఆఫ్రికాలో దాదాపు ఓ డజను భాషలకు మాత్రమే లిపి ఉండేది. వాడుకలోవున్న వందలాది ఇతర భాషలు, ఎవరో ఒకరు అక్షరమాలల్ని రూపొందించేంత వరకూ వేచి ఉండాల్సి వచ్చింది. మిషనరీలు వచ్చి, పెద్ద బాలశిక్షల సహాయంగానీ లేక డిక్షనరీల సహాయంగానీ లేకుండానే భాషల్ని నేర్చుకున్నారు. తర్వాత వాళ్లు లిపి స్వరూపాన్ని తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడ్డారు, ఆ తర్వాత వాటిని ఎలా చదవాలో ప్రజలకు బోధించారు. ఏదో ఒకనాటికి ప్రజలు తమ స్వంత భాషలో బైబిల్ని చదవగల్గుతారనే ఉద్దేశంతోనే వాళ్లిలా చేశారు.3

స్కాట్లండ్‌కు చెందిన రాబర్ట్‌ మఫత్‌ అలాంటి మిషనరీల్లో ఒకరు. ఆయన 1821లో, తన 25వ ఏట, దక్షిణాఫ్రికాలో ట్స్వానా భాష మాట్లాడే ప్రజలమధ్య ప్రచారపు పనిని ప్రారంభించాడు. లిపిలేని వారి భాషను నేర్చుకునేందుకు, ఆయన ప్రజల్లో కలిసిపోయేవాడు. వాళ్లతోపాటు కలిసి జీవించేందుకు కొన్నిసార్లు మారుమూల ప్రాంతాల్లోనికి ప్రయాణిస్తూ ఉండేవాడు. “ప్రజలు దయామయులు, నేను మాట్లాడుతున్నప్పుడు దొర్లే తప్పులు అనేకులు విరగబడి నవ్వేలా చేశాయి. ఇతరులకు నవ్వుతెప్పించే రీతిలో నన్ను యథాతథంగా అనుకరించకుండా మాత్రం వారిలో ఏ ఒక్కరూ—పురుషుడైనా స్త్రీయైనా—ఒక పదాన్నిగానీ లేక ఒక వాక్యాన్నిగానీ ఎన్నడూ సరిదిద్దలేదు” అని తర్వాత ఆయన రాశాడు.4 మఫత్‌ పట్టుదలను విడువలేదు. చివరకు ఆయన భాషపై పట్టును సంపాదించి, దానికి లిపిని రూపొందించాడు.

1829లో అంటే ఎనిమిది సంవత్సరాలపాటు ట్స్వానావారి మధ్య పనిచేసిన తర్వాత, మఫత్‌ లూకా సువార్తను అనువదించడం పూర్తిచేశాడు. దాన్ని ముద్రించేందుకు, తీర ప్రాంతం వరకూ ఎద్దులబండిపై సుమారు 900 కిలోమీటర్లు ఆయన ప్రయాణించాడు, అటు తర్వాత కేప్‌ టౌన్‌కు వెళ్లేందుకు ఓడను ఎక్కాడు. అక్కడ ప్రభుత్వ ముద్రణాలయాన్ని ఉపయోగించుకునేందుకు గవర్నరు ఆయనకు అనుమతినిచ్చాడు. కానీ మఫత్‌ తానే టైప్‌సెట్‌ చేసుకుని ప్రింటింగ్‌ చేసుకోవాల్సి వచ్చింది. చివరకు 1830లో ఆ సువార్త ప్రచురించబడింది. మొట్టమొదటిసారిగా, ట్స్వానా ప్రజలు బైబిల్లోని ఓ భాగాన్ని తమ స్వంత భాషలో చదువుకోగలిగారు. మఫత్‌ 1857లో ట్స్వానా భాషలోనికి బైబిలంతటినీ అనువదించడం పూర్తిచేశాడు.

లూకా సువార్త మొట్టమొదటి సారిగా ట్స్వానా ప్రజలకు లభ్యమైనప్పుడు వాళ్ల ప్రతిస్పందనను మఫత్‌ అటు తర్వాత వర్ణించాడు. ఆయనిలా తెలియజేశాడు: “పరిశుద్ధ లూకా [సువార్త] ప్రతుల్ని తీసుకునేందుకు ప్రజలు వందలాది మైళ్ల దూరం నుండి రావడం నాకు తెలుసు. . . . వాళ్లు పరిశుద్ధ లూకా [సువార్త] ప్రతుల్ని తీసుకొని, వాటిని పట్టుకొని ఏడ్వడాన్నీ, వాటిని గుండెలకు హత్తుకోవడాన్నీ, కృతజ్ఞతా బాష్పాల్ని రాల్చడాన్నీ చూశాను. ‘మీరు మీ కన్నీళ్లతో మీ పుస్తకాల్ని పాడుచేసుకుంటారు’ అని నేను ఎంతోమందితో చెప్పేంతవరకూ వాళ్లలాగే చేశారు.”5

ఆ విధంగా మఫత్‌ వంటి అంకితభావంగల అనువాదకులు, అనేకమంది ఆఫ్రికన్లకు రాతపూర్వకంగా సంభాషణను సాగించే మొట్టమొదటి అవకాశాన్ని ఇచ్చారు. వీరిలో కొందరు మొదట్లో రాతపూర్వకమైన భాషావసరతను గుర్తించలేదు. అయితే, ఆఫ్రికా ప్రజలకు వాళ్ల స్వంత భాషలో మరింత విలువైన ఓ బహుమానాన్ని అంటే బైబిల్ని ఇస్తున్నామని అనువాదకులు తలంచారు. నేడు, బైబిలు పూర్తిగాగానీ లేక కొంత భాగంగాగానీ 600కన్నా ఎక్కువ ఆఫ్రికన్‌ భాషలను “మాట్లాడుతోంది.”

ఆసియా భాషల్ని నేర్చుకోవడం

వాడుక భాషలకు లిపిని తీర్చిదిద్దేందుకు ఆఫ్రికాలో అనువాదకులు పోరాటంసల్పగా, ప్రపంచానికి ఆవలివైపునవున్న ఇతర అనువాదకులు దానికి ఎంతో భిన్నంగావున్న ఆటంకాన్ని అంటే అప్పటికే సంక్లిష్టమైన లిఖిత అక్షరమాలలు ఉన్న భాషలలోనికి అనువదించే ఆటంకాన్ని ఎదుర్కొన్నారు. ఆసియా భాషల్లోకి బైబిల్ని అనువదించిన వాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిన ఆటంకమదే.

19వ శతాబ్దారంభంలో విలియమ్‌ కేరీ, జాషువా మార్ష్‌మన్‌ ఇండియాకు వెళ్లి, లిపిగల అనేకమైన భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించారు. ముద్రణాకర్తయైన విలియమ్‌ వార్డ్‌ సహాయంతో వాళ్లు దాదాపు 40 భాషల్లో బైబిల్లోని కొన్ని భాగాల్నైనా ఉత్పన్నం చేయగలిగారు.6 విలియమ్‌ కేరీ గురించి గ్రంథకర్తయైన జె. హెర్‌బర్ట్‌ కనె ఇలా వివరిస్తున్నాడు: “ఆయన చూడచక్కనైన సజావుగాసాగే వ్యావహారిక [బెంగాలీ భాషా] శైలిని రూపొందించాడు. అది ప్రాచీన గ్రాంథిక భాషా స్థానాన్ని ఆక్రమించింది. ఆ విధంగా దాన్ని ఆధునిక పాఠకులకు మరింత సులభంగా అర్థమయ్యేదిగానూ, ఆకర్షణీయమైనదిగానూ ఉండేలా చేశాడు.”7

అమెరికాలో పుట్టి పెరిగిన అడనిరమ్‌ జడ్సన్‌ బర్మాకు వెళ్లాడు. 1817లో ఆయన బర్మీస్‌ లోనికి బైబిల్ని అనువదించడం ఆరంభించాడు. బైబిల్ని అనువదించేందుకు అవసరమైనంతగా ప్రాచ్య భాషపై పట్టును సంపాదించడంలోగల సాధకబాధకాల్ని వర్ణిస్తూ, ఆయనిలా రాశాడు: ‘భూమికి ఆవలివైపునున్న ప్రజలు మాట్లాడే భాషను మనం నేర్చుకొనేటప్పుడు అంటే ఎవరి ఆలోచనా సరళులు మన ఆలోచనా సరళికి భిన్నంగావుంటాయో, ఎవరి వ్యక్తపర్చే భాషా సంకేతాలు మనకు బొత్తిగా పరిచయంలేనివిగానూ, అలాగే అక్షరాలూ, పదాలూ మనకు తారసపడిన ఏ భాషాక్షరాలతో పదాలతో అస్సలు పొంతనలేకుండానూ ఉంటాయో ఆ భాషను నేర్చుకున్నప్పుడు; మనకు ఏ డిక్షనరీగానీ లేక భాషాంతరీకరణవేత్తగానీ లేనప్పుడు, స్థానిక టీచరు మద్దతు మనకు అందుబాటులో ఉండడానికి ముందు ఆ భాషను ఎంతోకొంత అర్థంచేసుకోడం అవసరం—దానంతటి భావం తీవ్రమైన కృషే!8

జడ్సన్‌ విషయంలోనైతే, అలా 18 ఏళ్లు శ్రమ పడాల్సివచ్చింది. బర్మీస్‌ బైబిల్లోని ఆఖరి భాగం 1835లో ముద్రించబడింది. అయితే, ఆయన బర్మాలో ఉన్న కాలంలో ఎంతో బాధను అనుభవించాడు. ఆయన అనువాదపు పనిపై ఉండగా ఆయన గూఢాచారిపని చేస్తున్నాడని నిందించబడ్డాడు. అందునుబట్టి ఆయన దాదాపు రెండేళ్లు, దోమలతో నిండిన జైళ్లో గడపాల్సి వచ్చింది. ఆయన విడుదల చేయబడి ఎంతోకాలం గడవక ముందే, ఆయన భార్యా యౌవ్వనస్థురాలైన కూతురూ జ్వరం మూలంగా మరణించారు.

25 ఏళ్లవాడైన రాబర్ట్‌ మోరిసన్‌ 1807లో చైనాకు చేరుకున్నప్పుడు, సంక్లిష్టమైన లిపిగల భాషల్లో ఒకటైన చైనాభాషలోనికి బైబిల్ని అనువదించే మరీ క్లిష్టమైన కార్యాన్ని ఆయన చేపట్టాడు. ఆయనకు చైనాభాషలోవున్న పరిజ్ఞానం అంతంత మాత్రమే. రెండేళ్ల క్రిందటే దాన్ని ఆయన అధ్యయనం చేయడం మొదలెట్టాడు. చైనా దేశాన్ని ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఉంచాలనే చైనా చట్టంతో కూడా మోరిసన్‌ పోరాడాల్సివచ్చింది. చైనా ప్రజలు విదేశీయులకు తమ భాషను నేర్పించడం నిషేధించబడింది, అలాచేస్తే వాళ్లు మరణ శిక్షకు అర్హులౌతారు. ఓ విదేశీయుడు చైనా భాషలోనికి బైబిల్ని అనువదించడం అంటే మరణశిక్షకు తగిన నేరమే.

మోరిసన్‌ దృఢనిశ్చయంతోనే అయినా జాగ్రత్తగా భాషను త్వరత్వరగా నేర్చుకుంటూ దాన్ని ఎడతెగకుండా అధ్యయనం చేశాడు. రెండేళ్లలోనే ఆయన ఈస్ట్‌ ఇండియా కంపెనీలో అనువాదకునిగా ఉద్యోగాన్ని సంపాదించాడు. పగటిపూట కంపెనీ కోసం పనిచేసేవాడు, దొరికిపోతానేమో అనే నిరంతర భయంతో రహస్యంగా బైబిల్ని అనువదించసాగాడు. 1814లో అంటే ఆయన చైనాకు వచ్చి ఏడేళ్లు గడిచిన తర్వాత క్రైస్తవ గ్రీకు లేఖనాలను ముద్రణకు సిద్ధం చేశాడు.9 అటు తర్వాత ఐదేళ్లకు, విలియమ్‌ మిల్నె సహాయంతో, ఆయన హెబ్రీ లేఖనాల్ని అనువదించడం పూర్తి చేశాడు.

అదొక అపూర్వమైన ఘనకార్యం—ప్రపంచంలో ఏ ఇతర భాషలకన్నా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతున్న భాషలో బైబిలు ఇప్పుడు “మాట్లాడ”గలదు. సమర్థులైన అనువాదకుల మూలంగా ఆసియాలోని ఇతర భాషల్లోనికి అనువాదాలు జరిగాయి. నేడు బైబిల్లోని భాగాలు, ఆసియాలోని 500కు పైగానున్న భాషల్లో లభ్యమౌతున్నాయి.

తమకు తెలియని ప్రజలకోసం, కొన్ని సందర్భాల్లోనైతే లిపిలేని భాషల్ని మాట్లాడే ప్రజల కోసం ఓ గ్రంథాన్ని అనువదించేందుకూ టిండేల్‌, మఫత్‌, జడ్సన్‌, మోరిసన్‌ లాంటి వ్యక్తులు ఎందుకు సంవత్సరాల తరబడి కష్టపడ్డారు? వీళ్లలో కొంతమంది తమ ప్రాణాల్ని పణంగా పెట్టికూడా ఎందుకు అలా చేశారు? నిశ్చయంగా, ఘనత కోసమో ఆర్థికలబ్ది కోసమో మాత్రం కాదు. వాళ్లు బైబిలు దేవుని వాక్యమనీ మరి అది ప్రజలతో అంటే ప్రజలందరితోనూ వాళ్ల వాళ్ల స్వభాషలో “మాట్లాడాలనీ” నమ్మారు.

బైబిలు దేవుని వాక్యమని మీరు భావించినా భావించకపోయినా, అంకితభావంగల ఆ అనువాదకులు చూపించిన స్వయంత్యాగపూరితమైన స్ఫూర్తి నేటి లోకంలో బొత్తిగా అరుదైన విషయమని బహుశా మీరు ఒప్పుకుంటారు. అలాంటి నిస్వార్థాన్ని ప్రేరేపిస్తున్న ఓ గ్రంథం పరిశోధించదగినది కాదంటారా?

[12వ పేజీలోని చిత్రం]

(For fully formatted text, see publication)

1800 నుండీ బైబిల్లోని భాగాలు ముద్రించబడిన భాషల సంఖ్య

68 107 171 269 367 522 729 971 1,199 1,762 2,123

1800 1900 1995

[10వ పేజీలోని చిత్రం]

టిండేల్‌ బైబిల్ని అనువదించడం

[11వ పేజీలోని చిత్రం]

రాబర్ట్‌ మఫత్‌

[12వ పేజీలోని చిత్రం]]

అడనిరమ్‌ జడ్సన్‌

[13వ పేజీలోని చిత్రం]

రాబర్ట్‌ మోరిసన్‌