భాగం 4
ఈ అసమాన గ్రంథానికి మూలకర్త
అమెరికాలో 96 శాతం మంది తమకు దేవుని మీద నమ్మకముందని చెప్పుకొన్నా, యూరప్, ఆసియాల్లో అటువంటి ప్రజల శాతం చాలా తక్కువ. అయితే, దేవుడున్నాడని అత్యధికులు నమ్మని దేశాల్లో సహితం, ఏదో ఒక అజ్ఞాత శక్తివల్ల ఈ భౌతిక సృష్టి ఉనికిలోకి వచ్చిందని చాలామంది అంగీకరిస్తారు. 10,000 యెన్‌ల నోటుమీద తన చిత్రమున్న, జపానుదేశ ప్రఖ్యాత విద్యావేత్త యుకీచీ ఫుకుజావా ఒకసారిలా వ్రాశాడు: “ఆకాశం ఒకరిని ఎక్కువగాను మరొకరిని తక్కువగాను సృష్టించదు.” “ఆకాశం” అనే మాటనుపయోగిస్తూ యుకీచీ ఫుకుజావా మానవుల్ని ఉత్పన్నం చేసిందని తాను భావించిన ప్రకృతి సూత్రాన్ని సూచిస్తున్నాడు. నోబెల్ బహుమతి గ్రహీత కెనీచీ ఫూకూయీ వలెనే అనేకులు అలాంటి అదృశ్య “ఆకాశం” అనే తలంపును అంగీకరిస్తారు. ఈ విశ్వనిర్మాణం వెనుక గొప్ప ప్రణాళిక ఉన్నదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు—అది మతసంబంధ పదజాలంలో “దేవుడు” అనే పదంతో సమానం. కానీ దాన్ని ఆయన “ప్రకృతి విశిష్టత” అని పిలిచాడు.
2 నిరంతరముండే ఎదో ఒక శక్తి లేక ఎవరో ఒకరి వ్యక్తి ఈ విశ్వ గమనానికి కారణమయ్యారన్న విషయాన్ని అలాంటి మేధావులు నమ్మారు. ఎందుకు నమ్మినట్లు? దీని గురించి ఆలోచించండి: సూర్యుడి పరిమాణం ఎంత పెద్దదంటే, అందులో 10 లక్షల భూగ్రహాలు పడతాయి, అయినా పాలపుంత గ్యాలక్సీలో అది కేవలం నలుసువంటిదే. ఇక పాలపుంత గ్యాలక్సీ విషయానికొస్తే, అది విశ్వమందలి కోటానుకోట్ల గ్యాలక్సీల్లో కేవలం ఒకటి మాత్రమే. ఆ గ్యాలక్సీలన్నీ మహావేగంతో ఒకదాని నుండి మరొకటి దూరంగా జరిగిపోతున్నట్లు విజ్ఞానశాస్త్ర పరిశోధనలు సూచిస్తున్నాయి. విశ్వాన్ని గమనంలో పెట్టేందుకు, అపారమైన అధిక శక్తి అవసరమై ఉంటుంది. అలాంటి శక్తికి మూలం ఎవరు లేదా ఏమిటి? “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను?” అని బైబిలు ప్రశ్నిస్తోంది. “వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులుపెట్టి పిలుచువాడేగదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు” అని బైబిలే జవాబిస్తోంది. (యెషయా 40:25, 26) “అధికశక్తి”కి మూలమైన ఒకవ్యక్తి ఈ విశ్వాన్ని గమనంలో పెట్టాడని ఈ వచనం చూపిస్తోంది.
3 భూమ్మీది జీవాన్నిగూర్చి కూడా ఆలోచించండి. పరిణామ సిద్ధాంతవాదులు చెప్పే విధంగా జీవం దానంతటదే పుట్టుకొచ్చిందా? జీవరసాయన శాస్త్రజ్ఞుడు మైఖెల్ బీహీ ఇలా చెబుతున్నాడు: “జీవరసాయన చర్యలు ఎలా జరుగుతాయన్నది అర్థం చేసుకోవడంలో విజ్ఞానశాస్త్రం అమోఘమైన పురోగతి సాధించింది, కానీ పరమాణువుస్థాయిలోని జీవపదార్థ సంక్లిష్టత, వాటి ఆరంభాన్ని వివరించే ప్రయత్నాన్ని చచ్చుబడేలా చేసింది. . . . తగిన వివరణలు ఇప్పటికే వున్నాయని లేదా ఇప్పుడో అప్పుడో లభిస్తాయని అనేకమంది శాస్త్రజ్ఞులు మూర్ఖంగా ప్రకటిస్తున్నా, విజ్ఞానశాస్త్రంపై వెలువడే సాహిత్యాల్లో అలాంటి ప్రకటనలకు ఆధారం కన్పించడంలేదు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవ ప్రక్రియలను గురించిన డార్విన్‌వాద వివరణ ఎప్పటికీ అర్థరహితంగానే ఉంటుందని నమ్మేందుకు, [జీవకణ] నిర్మాణరీతిమీద ఆధారపడిన బలమైన ఆధారాలున్నాయి.”
4 ఎటువంటి మేధస్సు ప్రమేయం లేకుండానే మానవజీవనం ఉనికిలోకి వచ్చిందనే సిద్ధాంతంతో మీరు నిజంగా తృప్తిచెందివున్నారా? “విశ్వంలోనే అత్యంత సంక్లిష్టభరితమైనదని” కొందరు తలంచే మానవ మెదడును మనం పరిశీలించి, మనం ఏ తీర్మానానికి రాగలమో చూద్దాం. “అత్యంత అధునాతన న్యూరల్ నెట్‌వర్క్ కంప్యూటర్ యొక్క పని సామర్థ్యం, మామూలు ఈగకున్న సామర్థ్యంలో కేవలం పదివేలవ వంతుకు మాత్రమే సమానం” అని డా. రిచర్డ్ ఎమ్. రెస్టాక్ అంటున్నాడు. మానవ మెదడు మామూలు ఈగ మెదడుకంటే ఎంతో ఉన్నతమైనది. అది భాషలు నేర్చుకునే సామర్థ్యంతో ప్రోగ్రామ్ చేయబడింది. దానంతటదే బాగుచేసుకుంటుంది, ప్రోగ్రామ్‌లను తిరిగి వ్రాసుకుంటుంది, తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. కేవలం “మామూలు ఈగకున్న సామర్థ్యంలో కేవలం పదివేలవ వంతుకు మాత్రమే సమానం” అయిన శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్‌కు సహితం మేధావంతుడైన ఒక రూపకర్త ఉన్నాడనే విషయాన్ని మీరు అంగీకరిస్తారనడంలో సందేహం లేదు. అలాగైతే మరి మానవ మెదడు సంగతేమిటి? *
5 దాదాపు 3,000 సంవత్సరాల క్రితం, తమ స్వంత శరీరనిర్మాణ అద్భుతాల్ని మానవులు పూర్తిగా అర్థం చేసుకోని కాలంలో, మానవ శరీరనిర్మాణం గురించి ఓ బైబిలు రచయిత ధ్యానించి ఇలా వ్రాశాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” డిఎన్‌ఎ అణువుల గురించి ఏమాత్రం తెలియకున్నా, ఆయనిలా వ్రాశాడు: ‘నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను. . . . నా దినములన్నియు [“ఆ పిండము భాగములన్నీ,” NW] నీ గ్రంథములో లిఖితము లాయెను.’ (కీర్తన 139:14, 16) ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? “అధిక శక్తి” ద్వారా విశ్వంలోని సమస్తమును కలుగజేసింది ఎవరు?
6 బైబిలు మొట్టమొదటి వచనమే ఇలా చెబుతోంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” (ఆదికాండము 1:1) ఆ దేవుడే బైబిలు గ్రంథకర్త కూడా. అందులోని విషయాలు ఆయన ప్రేరణవల్లే వ్రాయబడ్డాయి. తనతో ఒక అర్థవంతమైన అనుబంధం ఏర్పరచుకోవడం సాధ్యమని ఆయన వెల్లడిపరచుకుంటున్నాడు.
^ యెహోవాసాక్షులు ప్రచురించిన మీ పట్ల శ్రద్ధ చూపించే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే పుస్తకంలోని 2 నుంచి 4 అధ్యాయాల్లో మరిన్ని వివరాలు మీరు చదివి తప్పక ఆనందిస్తారు.