కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 3

నమ్మదగిన మార్గనిర్దేశాన్నిచ్చే గ్రంథం

నమ్మదగిన మార్గనిర్దేశాన్నిచ్చే గ్రంథం

 “మానవ నాగరికతలు వారి జీవితానుభావాల సమ్మేళనమే బైబిలు, అది అసమానమైనది” అని చైనాలోని గ్వాంగ్‌జోలోనున్న ఛోంగ్‌ షాంగ్‌ విశ్వవిద్యాలయం ప్రచురించే ఒక పత్రిక చెబుతోంది. ప్రజలపై ఎంతో ప్రభావం చూపిన 18వ శతాబ్దపు తత్వవేత్త ఇమ్మానుయేల్‌ కాంట్‌ ఇలా చెప్పినట్లు ఒక పుస్తకంలో ఉంది: “ప్రజల గ్రంథంగా బైబిలు ఉనికిలో ఉండడమనేది, మానవజాతి ఎన్నడూ అనుభవించనంత గొప్ప ప్రయోజనకరమైన విషయం. దాన్ని చులకనచేయాలని ఎలాంటి ప్రయత్నం చేసినా అది మానవత్వానికి ద్రోహం చేసినట్టే.” ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ఇలా చెబుతోంది: “బైబిలు ప్రభావం కేవలం యూదులకు, క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాలేదు. . . . అదిప్పుడు నైతికపరంగా, మతపరంగా ఒక అమూల్యమైన నిధిగా దృష్టించబడుతోంది; భౌగోళిక ఐక్య నాగరికత ఏర్పడుతుందన్న ఆశ క్రమేణా పెరుగుతుండగా, అందులోని అంతులేని బోధలు ఇంకా ఇంకా విలువైనవిగా దృష్టించబడుతున్నాయి.”

2మీరు ఏ మతానికి చెందినవారైనా, అలాంటి పుస్తకం గురించి కాస్త తెలుసుకోవాలని మీకు ఆసక్తి కలగదా? 20వ శతాబ్దాంతానికల్లా బైబిలు పూర్తిగా లేదా కొంత భాగంగా 2,200 కంటే ఎక్కువ భాషల్లోకి అనువదించబడింది. దాదాపు ప్రజలందరూ తాము చదివి అర్థం చేసుకోగలిగే భాషలో దాని ప్రతిని పొందవచ్చు. మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికి వీలైన లోహపు అక్షరాలను తయారుచేసి, వాటిని పదాలుగా కూర్చి, వాటిపై సిరాపూసి వాటితో ముద్రించే మూవబుల్‌ టైప్‌ పద్ధతిని కనిపెట్టినప్పటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల ప్రతులు పంచబడినట్లు అంచనావేయబడింది.

3ఇప్పుడు, మీ దగ్గర బైబిలు ఉంటే దయచేసి దానిని తెరచి విషయసూచికను చూడండి. అక్కడ మీరు ఆదికాండముతో ప్రారంభమై ప్రకటనతో ముగిసే పుస్తకాల పేర్లను గమనిస్తారు. 40 మంది వ్యక్తులు వ్రాసిన 66 పుస్తకాలుగల బైబిలు నిజంగా ఒక గ్రంథాలయమే. 39 పుస్తకాలతో కూర్చబడిన మొదటి భాగాన్ని అనేకులు పాత నిబంధన అని పిలిచినా, అది ముఖ్యంగా హీబ్రూలో వ్రాయబడింది కాబట్టి దానిని హీబ్రూ లేఖనాలని పిలవడమే సముచితం. 27 పుస్తకాలుగల రెండవ భాగాన్ని అనేకులు క్రొత్త నిబంధన అని పిలిచినా అది ముఖ్యంగా క్రైస్తవ రచయితలచేత గ్రీకులో వ్రాయబడింది కాబట్టి దాన్ని క్రైస్తవ గ్రీకు లేఖనాలని పిలవడమే సముచితం. బైబిలు రచన సా.శ.పూ. 1513 నుండి సా.శ. 98 వరకు సాగింది, అంటే అది పూర్తికావడానికి 1,600 సంవత్సరాలు పట్టింది. రచయితలెన్నడూ ఒకర్నొకరు సంప్రదించుకోలేదు, కొన్ని పుస్తకాలైతే ఒకదానికొకటి వేల కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రాంతాల్లో ఒకే సమయంలో వ్రాయబడ్డాయి. అయినప్పటికీ బైబిలు అంతటా ఒకే మూలాంశం ఉంది, అది ఏకరూపత ఉన్న సంపూర్ణ గ్రంథం; బైబిల్లో పరస్పర విరుద్ధ బోధలు లేవు. ‘16 శతాబ్దాల కాలంలో జీవించిన 40 మంది, అంత ఉన్నతమైన స్థాయిలో పొందికగల గ్రంథాన్ని ఎలా వ్రాయగలిగారు?’ అని మనం ఆశ్చర్యపోకుండా ఉండలేము.

‘శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును [దేవుడు] పరచెను, శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను’

4బైబిలు వ్రాయడం 1,900 సంవత్సరాల పూర్వమే పూర్తి చేయబడినప్పటికీ, అందులోని విషయాలు ఆధునిక మానవుల్లో జిజ్ఞాసను కలిగిస్తాయి. ఉదాహరణకు, మీ బైబిలు తెరిచి యోబు 26:7 చూడండి. ఈ వచనం సా.శ.పూ. 15వ శతాబ్దంలో వ్రాయబడిందని గుర్తుంచుకోండి. అదిలా చెబుతుంది: ‘శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును [దేవుడు] పరచెను, శూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.’ (ఇటాలిక్కులు మావి.) తర్వాత, యెషయా పుస్తకం సా.శ.పూ. 8వ శతాబ్దంలో వ్రాయబడిందని గుర్తుపెట్టుకొని యెషయా 40:22 చూడండి. ఆ లేఖనం ఇలా చెబుతుంది: “ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు, దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు, ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాసస్థలముగా ఏర్పరచెను.” ఈ రెండు వర్ణనలను చదివినప్పుడు మీ మనసులో ఏమి మెదులుతుంది? గోళాకారంలోనున్న ఒక వస్తువు శూన్యంలో ‘వ్రేలాడుతున్న’ ఊహాచిత్రమే కదా! అలాంటి చిత్రాన్ని మీరు బహుశా ఆధునిక అంతరిక్షనౌకలు పంపిన ఫొటోల్లో చూసుండవచ్చు. ‘ఎంతోకాలం క్రితం జీవించిన మనుషులు, వైజ్ఞానికంగా ఖచ్చితమైన అలాంటి వివరాలను ఎలా వ్రాయగలిగారు?’ అని మనం ఆశ్చర్యపోతాము.

5బైబిలుకు సంబంధించిన మరో ప్రశ్నను మనం పరిశీలిద్దాం. బైబిలు చారిత్రకంగా ఖచ్చితమైనదేనా? బైబిలు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేని పౌరాణిక కథాసంపుటి మాత్రమేనని కొందరనుకుంటారు. ఉదాహరణకు, పేరుగాంచిన ఇశ్రాయేలు రాజైన దావీదు విషయమే తీసుకోండి. ఇటీవలి కాలాల వరకూ ఆయన ఉనికిని గురించిన సమాచారం కేవలం బైబిలులో మాత్రమే ఉండేది. ప్రముఖ చరిత్రకారులు ఆయన వాస్తవమైన వ్యక్తేనని అంగీకరించినా, ఆయన కేవలం యూదులు గట్టి ప్రచారం చేయడం మూలంగా పుట్టిన కల్పిత వ్యక్తేనని కొందరు సంశయవాదులు కొట్టిపారేయడానికి ప్రయత్నిస్తారు. మరి వాస్తవాలేమి చూపిస్తున్నాయి?

“దావీదు కుటుంబం” గురించి పేర్కొన్న శిలాఫలకం

61993లో ప్రాచీన ఇశ్రాయేలు పట్టణమైన దాను శిథిలాల్లో “దావీదు కుటుంబం” గురించి పేర్కొన్న ఒక శిలాఫలకం బయటపడింది. ఇది సా.శ.పూ. 9వ శతాబ్దానికి చెందిన ఓ స్మారకచిహ్నంలోని పగిలిపోయిన భాగం. ఇశ్రాయేలీయులపై వారి శత్రువులు పొందిన విజయానికి జ్ఞాపకార్థంగా అది చెక్కబడింది. అకస్మాత్తుగా, బైబిలేతర ప్రాచీన వ్రాతల్లో దావీదు పేరు కనబడింది! ఇదంత పెద్ద విశేషమా? ఈ శిలాఫలకాన్ని గురించి టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయపు ఇజ్రీల్‌ ఫింకల్‌స్టైన్‌ తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు: “దావీదు పేరుగల శిలాఫలకం వెలికితీయబడడంతో బైబిలు వ్యతిరేకవాదం ఒక్కసారిగా కుప్పకూలింది.” పాలస్తీనాలో దశాబ్దాలపాటు త్రవ్వకాలు సాగించిన పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ విలియమ్‌ ఎఫ్‌. ఆల్బ్రైట్‌ ఆసక్తికరంగా ఒకసారిలా అన్నాడు: “ఒకదాని తర్వాత మరొకటిగా ఆవిష్కరణలన్నీ అసంఖ్యాకమైన బైబిలు వివరాల ఖచ్చితత్వాన్ని రుజువుచేశాయి, చారిత్రక విషయాలకు బైబిలు ఒక మూలాధార గ్రంథంగా దాని విలువను గుర్తించేందుకు అవి దోహదం చేశాయి. ‘పురాణ కావ్యాలకు, పుక్కిటి పురాణాలకు భిన్నంగా ఈ ప్రాచీన గ్రంథం చారిత్రకంగా ఇంత ఖచ్చితంగా ఎలా ఉంది?’ అని మనం మళ్ళీ ఆశ్చర్యపోతాము. అయితే విషయం ఇంకా పూర్తికాలేదు.

అలెగ్జాండర్‌ దగ్రేట్‌ చిత్రం ఉన్న నాణెం

7బైబిలు ఒక ప్రవచన గ్రంథం కూడా. (2 పేతురు 1:20, 21) ‘ప్రవచనం’ అన్న మాట వినగానే, ప్రవక్తలమని ప్రకటించుకున్నవారు చేసిన నెరవేరని ప్రవచనాలు మీకు గుర్తుకురావచ్చు. కానీ మీరు ముందుగానే మనసులో ఎలాంటి అభిప్రాయాలూ ఏర్పరచుకోకుండా, మీ బైబిలును తెరచి దానియేలు 8వ అధ్యాయాన్ని చూడండి. అక్కడ దానియేలు రెండు కొమ్ములున్న ఒక పొట్టేలుకు, “ప్రసిద్ధమైన కొమ్ము” ఉన్న ఒక మేకపోతుకు మధ్య జరిగే పోరాటాన్ని గురించిన ఒక దర్శనాన్ని వర్ణిస్తున్నాడు. మేకపోతు గెలుస్తుంది, కానీ దాని పెద్ద కొమ్ము విరిగిపోతుంది. దాని స్థానంలోనే నాలుగు కొమ్ములు మొలుస్తాయి. ఈ దర్శన భావమేమిటి? దానియేలు వృత్తాంతమింకా ఇలా వివరిస్తోంది: “నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు; దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా; నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలముగలవారుగా ఉండరు.”​—దానియేలు 8:3-22.

“ఒకదాని తర్వాత మరొకటిగా ఆవిష్కరణలన్నీ అసంఖ్యాకమైన బైబిలు వివరాల ఖచ్చితత్వాన్ని రుజువుచేశాయి, చారిత్రక విషయాలకు బైబిలు ఒక మూలాధార గ్రంథంగా దాని విలువను గుర్తించేందుకు అవి దోహదం చేశాయి.”— ప్రొఫెసర్‌ విలియమ్‌ ఎఫ్‌. ఆల్బ్రైట్‌

8ఈ ప్రవచనం నెరవేరిందా? దానియేలు పుస్తకం వ్రాయడం దాదాపు సా.శ.పూ. 536లో పూర్తయ్యింది. ఆ తర్వాత 180 సంవత్సరాలకు, అంటే సా.శ.పూ. 356లో జన్మించిన మాసిదోనియా రాజు అలెగ్జాండర్‌ ద గ్రేట్‌, పర్షియా (పారసీకుల) సామ్రాజ్యాన్ని జయించాడు. “బొచ్చుగల ఆ మేకపోతు” కన్నుల మధ్యనున్న ఆ “పెద్ద కొమ్ము” అతడే. యూదుల చరిత్రకారుడు జోసీఫస్‌ చెప్పినదాని ప్రకారం, పర్షియాను జయించడానికి ముందు అలెగ్జాండరు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆయనకు దానియేలు పుస్తకం చూపించబడింది. తనకు చూపించబడిన దానియేలు ప్రవచనపు మాటలు, పర్షియాపై తాను జరుపుతున్న సైనిక దాడిని సూచిస్తున్నాయని అలెగ్జాండర్‌ నిర్ధారణకు వచ్చాడు. ఇంకా ఏం కావాలి? ప్రపంచ చరిత్ర గురించిన పాఠ్యపుస్తకాల్లో సా.శ. 323లో అలెగ్జాండరు మరణం తర్వాత ఆయన సామ్రాజ్యానికేమి జరిగిందో మీరే స్వయంగా చదవవచ్చు. నలుగురు సైనికాధికారులు ఆయన సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు, చివరికి సా.శ.పూ. 301కల్లా ఆ “పెద్ద కొమ్ము” స్థానంలో మొలిచిన ‘నాలుగు కొమ్ములు’ అంటే ఆ నలుగురు సైనికాధికారులు ఆ సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభాగించుకున్నారు. మరోసారి మనం ఆశ్చర్యంగా, ‘దాదాపు 200 సంవత్సరాల తర్వాత జరిగే దానిని అంత స్పష్టంగా, ఖచ్చితంగా ఏ పుస్తకమైనా ఎలా ముందే చెప్పగలదు?’ అని ఆశ్చర్యపోతామనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

9పై ప్రశ్నలకు బైబిలే సమాధానమిస్తుంది: “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, . . . ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16) “దైవావేశము” అని అనువదింపబడిన గ్రీకుమాటకు అక్షరార్థంగా “దేవుడే ఊపిరి పోశాడు” అని భావం. బైబిలు పుస్తకాల్లో మనమిప్పుడు కనుగొనే సమాచారాన్ని దేవుడు 40మంది రచయితల మనసుల్లోకి ‘ఊపిరిగా పోశాడు.’ మనం పరిశీలించిన విజ్ఞానశాస్త్ర, చారిత్రక, ప్రవచనార్థక అంశాల్లోని కొన్ని ఉదాహరణలే, కేవలం ఒకే విషయాన్ని నిష్కర్షగా సూచిస్తున్నాయి. సాటిలేని గ్రంథమైన ఈ బైబిలు మానవజ్ఞానంవల్ల కాదుగానీ దైవిక మూలంగా ఉత్పన్నమైనదే. అయినా నేడు అనేకమంది దాని గ్రంథకర్తయైన దేవుని ఉనికిని సంశయిస్తున్నారు. మీరు కూడానా?