కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 9

సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించండి—ఇప్పుడూ, ఎల్లప్పుడూ!

సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించండి—ఇప్పుడూ, ఎల్లప్పుడూ!

దేవునితో స్నేహం పెంపొందించుకొంటే మీరు సంతృప్తికరమైన జీవితం జీవించగలరు

 బైబిలు చరిత్రలో విశ్వాసపురుషునిగా ప్రఖ్యాతిగాంచిన అబ్రాహాము సంపన్న నగరమైన ఊరులో సుఖప్రదమైన జీవితాన్ని వదిలిపెట్టాడు. హారానులో కొంతకాలం నివసించిన తర్వాత, ఆయన తన శేషజీవితాన్ని, స్థిరనివాసంలేకుండా దేశసంచారిగా గుడారాల్లో నివసిస్తూ గడిపాడు. (ఆదికాండము 12:1-3; అపొస్తలుల కార్యములు 7:2-7; హెబ్రీయులు 11:8-10) అయినప్పటికీ, “అబ్రాహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవితం అతడు జీవించాడు” అని నమోదుచేయబడింది. (ఆదికాండము 25:8, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆయన జీవితాన్ని అంత సంతృప్తికరం చేసిందేమిటి? ఆయన కేవలం జీవితంలో సాధించిన ఘనకార్యాలనుబట్టి మరణశయ్యపై సంతృప్తితో ఉన్న వృద్ధుడు కాడు. దేవునియందు తనకుగల అసాధారణ విశ్వాసాన్ని బట్టి ఆయన ఆ తర్వాత “దేవుని స్నేహితుడని” పిలువబడ్డాడు. (యాకోబు 2:23; యెషయా 41:8) అబ్రాహాము జీవితాన్ని సంతృప్తికరం చేసింది ఆయన తన సృష్టికర్తతో పెంపొందించుకొన్న అర్థవంతమైన అనుబంధమే.

అబ్రాహాము జీవితంకంటే మీ జీవితం మరింత సంతృప్తికరంగా ఉండగలదా?

2 ఒకవేళ దేవునితో మీరు స్నేహాన్ని పెంపొందించుకున్నట్లయితే, 4,000 సంవత్సరాల క్రితం అబ్రాహాము మాదిరిగానే, మీరు కూడా నేడు అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు. మీరు విశ్వసృష్టికర్తకు స్నేహితుడు కావచ్చనే తలంపు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తవచ్చు, అయితే అది సాధ్యమే. ఎలా సాధ్యం? ఆయనను మీరు తెలుసుకొని, ప్రేమించే వారిగా ఉండాలి. (1 కొరింథీయులు 8:3; గలతీయులు 4:9) సృష్టికర్తతో అలాంటి అనుబంధం మీ జీవితాన్ని అర్థవంతంగా, సుసంపన్నంగా చేయగలదు.

3 యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిని అంగీకరించేందుకు ఇష్టపడేవారు సంతోషకరమైన జీవితం గడపడానికి అవసరమయ్యే నిర్దేశక సూత్రాల్ని యెహోవా దయచేశాడు. (యెషయా 48:17) ఏది మంచి ఏది చెడు అనేవి తానే స్వయంగా నిర్ణయించుకోవడం ద్వారా ఆదాము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేశాడని గుర్తుంచుకోండి. పాపమరణాల దాసత్వంనుండి విడుదల పొందే మార్గం సుగమం చేస్తూ, తన కుమారుని విమోచన క్రయధన బలి ద్వారా మానవ కుటుంబాన్ని యెహోవా కొన్నప్పటికీ, ప్రతివ్యక్తి తనంతట తానుగా విమోచన క్రయధనాన్ని అంగీకరించాలి, అలాగే మంచి చెడుల విషయంలో తన స్వంత ప్రమాణాలను స్థాపించుకోవడం మానివేయాలి. యేసు విమోచన క్రయధన బలిని అంగీకరించే వారికొరకు దేవుడు అందజేసే నియమాలకు, సూత్రాలకు మనం లోబడాలి.

“దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము”

4 బైబిలు అధ్యయనం కొనసాగిస్తూ, అందులోని సూత్రాల్ని అన్వయించుకొంటుండగా, మీరు నిస్సందేహంగా మంచిచెడుల విషయమై దేవుని ప్రమాణాల విలువను గ్రహిస్తారు. (కీర్తనలు 19:7-9) యెహోవా ప్రవక్తయైన మోషేలా మీరు దేవుని గూర్చి ఇలా చెప్పేందుకు కదిలింపబడతారు: “నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల, నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును.” (నిర్గమకాండము 33:13; కీర్తన 25:4) ఈ ‘అపాయకరమైన కాలములలో’ కలిగే సమస్యలను అధిగమించడానికి కావల్సిన మార్గదర్శక సూత్రాల్ని మీకు బైబిలు అందిస్తుంది. (2 తిమోతి 3:1) మీ కృతజ్ఞతా భావం పెరుగుతుంది, అది యెహోవాను మరియెక్కువ తెలుసుకోవడానికి, ఆయనతో మీ స్నేహాన్ని బలపరచుకోవడానికి సహాయపడుతుంది.

5 అబ్రాహాము “సుదీర్ఘ సంతృప్తికర జీవితం” జీవించి మరణించాడు, అయితే ఒక వ్యక్తికి మరణించాల్సిన పరిస్థితి ఉన్నంతవరకు, జీవితం ఎంత సుదీర్ఘంగా ఉన్నా అది చాలా చిన్నదిగానేవుంటుంది. మనమెంత వృద్ధులమైనా, ఇంకా జీవించాలనే కోరిక అంతరంగంలో మనందరికీ ఉంటుంది. ఎందుకంటే ‘[దేవుడు] శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.’ (ప్రసంగి 3:11) మనం శాశ్వతకాలం జీవించినా, యెహోవా సృష్టికార్యాలన్నింటి గురించిన లోతైన జ్ఞానం మనమెన్నటికీ పొందలేము. యెహోవా అద్భుతక్రియల్ని గమనించి, అధ్యయనంచేసి, ఆస్వాదించడానికి అంతమేవుండదు!​—⁠కీర్తనలు 19:1-4; 104:24; 139:14.

6 మనమీనాడు చూసే సమస్యలతోనే భూమి నిండియుంటే, నిరంతరం జీవించేందుకు మీరు ఆకర్షింపబడరు. అయితే, అది చింత కల్గించాల్సిన విషయం కాదు. బైబిలిలా వాగ్దానం చేస్తోంది: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) “క్రొత్త ఆకాశములు” అనే మాట దేవుని రాజ్యమైన క్రొత్త పరలోక ప్రభుత్వాన్ని సూచిస్తుంది, అది యావత్‌ భూమిపై పరిపాలిస్తుంది. “క్రొత్త భూమి” ఆ రాజ్య పరిపాలనకు లోబడే వారందరు కలిసి తయారయ్యే ఒక క్రొత్త మానవ సమాజమైయుంటుంది. దీనిని నిజం చేసేందుకు, యెహోవా త్వరలోనే “భూమిని నశింపజేయువారి”పై చర్య తీసుకుంటాడు.​—⁠ప్రకటన 11:18; 2 పేతురు 3:10.

7 ఎంత త్వరలో? ‘యుగసమాప్తికి సూచన’లో భాగంగా దేశాల మధ్య జరిగే యుద్ధాలు, ‘కరవులు, భూకంపములు,’ “తెగుళ్లు,” “అక్రమము విస్తరించుట” మొదలైన వాటిని గూర్చి యేసు చెప్పాడు. (మత్తయి 24:3-13; లూకా 21:10, 11; 2 తిమోతి 3:1-5) ఆ పిమ్మట ఆయనిలా ప్రవచించాడు: “మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.” (లూకా 21:31) నిజంగానే యెహోవా దుష్టులను నాశనంచేసే సమయం వేగంగా సమీపిస్తోంది. *

8 ఈ భూమిపైని దుష్టత్వాన్ని నిర్మూలించే సమయమైన “సర్వాధికారియైన దేవుని మహాదినము” తర్వాత, మన భూగోళం ఒక పరదైసుగా మారుతుంది. (ప్రకటన 16:14, 16; యెషయా 51:3) ఆ తర్వాత, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) మరి చనిపోయిన వారి విషయమేమిటి? యేసు ఇలా చెప్పాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) ప్రతి వ్యక్తి మీద శ్రద్ధగల యెహోవా, మరణనిద్రలో వున్నవారిని తిరిగి జీవానికి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ ద్వారా మానవులను క్లోన్‌ చేయడానికి శాస్త్రజ్ఞులు ప్రయత్నించవచ్చు. అయితే క్లోనింగ్‌ ప్రక్రియలు చేపట్టాల్సిన అవసరం సృష్టికర్తకు ఉండదు. విమోచింపబడగల ప్రతి మానవుణ్ణి తిరిగి జీవానికి తీసుకువచ్చేందుకు కావాల్సిన ప్రతి వివరాన్ని ఆయన గుర్తుంచుకునే సామర్థ్యం ఆయనకు ఉంది. అవును, చనిపోయిన మీ ప్రియమైనవారిని పరదైసు భూమిపై తిరిగి కలుసుకొనే భవిష్యత్‌ నిరీక్షణ మీకుంది!

9 పరదైసులో జీవితం ఎలావుంటుంది? ముక్తకంఠంతో తమ సృష్టికర్తను స్తుతించే సంతోషభరితమైన స్త్రీపురుషులతో ఈ భూమి నిండియుంటుంది. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24; 54:13) ఎవరూ ప్రమాదకరమైన మానసిక ఒత్తిడికి గురికారు, ఎవరికీ భావోద్రేక, మానసిక అనారోగ్యాలు రావు. అందరికి సమృద్ధిగా ఆహారముంటుంది, దేవుని సంకల్పానికనుగుణ్యంగా అర్థవంతమైన పనిలో వారు ఆనందిస్తారు. (కీర్తన 72:16; యెషయా 65:23) వారు జంతువులతో శాంతిగా వుంటారు, తోటి మానవులతో శాంతిగా జీవిస్తారు, అన్నింటికంటే మిన్నగా వారు “దేవునితో సమాధానము” కలిగివుంటారు.​—⁠రోమీయులు 5:1; కీర్తన 37:11; 72:7; యెషయా 11:6-9.

10 ఆ పరదైసులోవుండి సంపూర్ణ సంతృప్తిగల జీవితమనుభవించేందుకు మీరేమి చెయ్యాలి? యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) కాబట్టి దేవుడు మీనుండి ఏమి కోరుతున్నాడో నేర్చుకుంటూ, యెహోవా మరియు యేసుక్రీస్తులను గూర్చిన పరిజ్ఞానాన్ని పొందుతూ ముందుకు సాగండి. అప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి ప్రీతిపర్చగల్గుతారు, అది మీ జీవితాన్ని అత్యంత సంతృప్తిదాయకం చేస్తుంది.

^ యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 9వ అధ్యాయంలో ఈ ప్రవచనాన్ని గూర్చి మీరు మరియెక్కువ తెలుసుకోగలరు.