కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 1

తృప్తికరమైన జీవితం కేవలం పగటికలేనా?

తృప్తికరమైన జీవితం కేవలం పగటికలేనా?

 అభివృద్ధి చెందిన ఒక దేశంలో విలాసవంతమైన జీవితానికి కావల్సిన వస్తువులన్నీ సమకూర్చబడిన ఒక ఇల్లు సుఖసంతోషాలకు, సిరిసంపదలకు నిలయంగా ఉంటుందనిపించవచ్చు. కానీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే మీకేం కనిపిస్తుందనుకుంటున్నారు? ఇబ్బందికరమైన, విషాదంతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. యౌవనస్థులు తమ తల్లిదండ్రులకు “సరే” అనో “ఏమో” అనో నిర్లక్ష్యంగా జవాబిస్తున్నారు. తల్లి తన భర్త తనపై శ్రద్ధచూపాలని పరితపిస్తోంది. తండ్రి మాత్రం తన మానాన తనను ప్రశాంతంగా విడిచిపెడితే చాలని కోరుకుంటున్నాడు. ఈ దంపతులకు దూరంగా ఎక్కడో ఒంటరిగా జీవిస్తున్న వారి వృద్ధ తల్లిదండ్రులు, వీరిని కొన్ని నెలలనుండి చూడనందున తమ పిల్లలతో కలిసి సమయం గడపాలని తహతహలాడుతున్నారు. మరోవైపు, ఇలాంటి ఒత్తిళ్ళనే ఎదుర్కొంటున్న అనేక కుటుంబాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతున్నారు, నిజంగా సంతోషంగా ఉంటున్నారు. అదెలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోతున్నారా?

2 ప్రపంచంలో మరో దిక్కునున్న, ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలోని ఒక కుటుంబం గురించి ఆలోచించండి. ఆ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పూరిగుడిసెలో జీవిస్తున్నారు. మరో పూటకు భోజనం దొరుకుతుందో లేదో వారికి తెలియదు. ప్రపంచంలో ఆకలిని బీదరికాన్ని మనిషి తొలగించలేకపోయాడనడానికి విషాదకరమైన నిదర్శనమది. అయినా, బీదరికాన్ని సంతోషకరమైన స్ఫూర్తితో ఎదుర్కొంటున్న కుటుంబాలెన్నో ఈ లోకంలో ఉన్నాయి. అదెలా సాధ్యం?

3 సంపన్న దేశాల్లో సహితం ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థిక రంగం “గాలిబుడగ”లా పెరుగుతున్న పతాక స్థాయిలో జపాన్‌లోని ఒక కుటుంబం ఓ ఇల్లు కొనుక్కుంది. భవిష్యత్తులో జీతం పెరుగుతుందన్న ఆశతో వారు అధిక మొత్తంలో ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ “గాలిబుడగ” టప్పున పగిలిపోయినప్పుడు వారు ఆ సొమ్ము చెల్లించలేక, ఆ ఇంటిని తాము కొన్న ధరకంటే చాలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సివచ్చింది. వారిప్పుడు ఆ ఇంట్లో ఉండకపోయినా, దాని అప్పు మాత్రం ఇంకా తీరుస్తూనే ఉన్నారు. ఇది చాలదన్నట్లు క్రెడిట్‌ కార్డులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించినందుకు వచ్చిన బిల్లులను చెల్లించడానికి వారు నానాతంటాలు పడుతున్నారు. తండ్రి గుర్రప్పందాలు కాస్తుండడంవల్ల ఆ కుటుంబం మరిన్ని అప్పుల్లో కూరుకుపోయింది. కానీ, అనేక కుటుంబాలు సంతోషకరమైన ఫలితాలనిచ్చే సర్దుబాట్లు చేసుకున్నాయి. అదెలాగో తెలుసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా?

4 మీరు ఏ ప్రాంతంలో జీవించినా మానవ సంబంధాలనేవి జీవితాన్ని అసంతృప్తితో నింపుతూ ఎడతెగని చింతలకు కారణం కాగలవు. ఉద్యోగస్థలంలో మీపై లేనిపోనివి కల్పించి చెబుతుండవచ్చు. అక్కడ మీరు సాధించే విజయాలను చూసి ఓర్వలేనివారు మిమ్మల్ని అన్యాయంగా విమర్శిస్తుండవచ్చు. మీతో రోజూ కలిసి పనిచేసే వ్యక్తి అహంకార వ్యక్తిత్వం మీకు చిరాకు కలిగిస్తుండవచ్చు. పాఠశాలలో మీ పిల్లవాడు బెదిరింపులకు, వేధింపులకు, లేక నిర్లక్ష్యానికి గురికావచ్చు. మీరు భర్త లేకుండా ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్నట్లైతే మీ పరిస్థితి ముఖ్యంగా ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎన్ని కష్టాలను కలిగిస్తుందో మీకే తెలుసు. నేడు ఇలాంటి సమస్యలన్నీ అనేకమంది స్త్రీపురుషుల జీవితాల మీద మానసిక ఒత్తిడిని అధికం చేస్తున్నాయి.

5 ఈ మానసిక ఒత్తిడి ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే, అవి కొంతకాలానికి ప్రాణానికే ముప్పు వాటిల్లజేయవచ్చు, అదీ ఎలాంటి హెచ్చరిక లేకుండానే. అందుకే మామూలు మానసిక ఒత్తిడి మౌనహంతకి అని, తీవ్ర మానసిక ఒత్తిడి నెమ్మదిగా ప్రాణంతీసే హాలాహలం అని పిలువబడుతున్నాయి. “నేడు మానసిక ఒత్తిడి, దాని మూలంగా కలిగే వ్యాధులు దాదాపు ప్రపంచ నలుమూలల్లోని ఉద్యోగస్థుల మీద ప్రభావం చూపుతున్నాయి” అని మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ ఎల్‌. వెనీంగ అంటున్నాడు. మానసిక ఒత్తిడి సంబంధిత వ్యాధుల మూలంగా ప్రతి సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద 20 వేల కోట్ల డాలర్ల భారం పడుతున్నట్లు చెప్పబడింది. మానసిక ఒత్తిడి అమెరికా ఎగుమతి చేస్తున్న తాజా సరుకు అని పిలువబడింది, అలాగే “మానసిక ఒత్తిడి”కి సంబంధించిన పదాలు అనేక ప్రపంచ భాషల్లో వినబడుతున్నాయి. మీరు మానసిక ఒత్తిడికి గురై నిర్ణీత సమయానికి పని పూర్తి చేయలేకపోయినప్పుడు మీలో అపరాధ భావాలు తలెత్తవచ్చు. ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం సగటు వ్యక్తి రోజుకి రెండు గంటలు అపరాధభావాలతో బాధపడుతుంటాడు. అయినప్పటికీ, కొందరు మాత్రం ఈ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ తమ జీవితాలను విజయవంతం చేసుకుంటున్నారు.

6 ప్రతిరోజు ఎదురయ్యే ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ, సంతృప్తికరమైన జీవితాన్ని మీరెలా సాధించగలరు? కొందరు స్వయం-సహాయక పుస్తకాలను, నిపుణులు వ్రాసిన పుస్తకాలను సంప్రదిస్తుంటారు. అలాంటి పుస్తకాలు ఆధారపడదగినవేనా? 42 భాషల్లోకి అనువదించబడి దాదాపు 5 కోట్ల ప్రతులు అమ్ముడుపోయిన పిల్లల పెంపకం గురించిన ఒక పుస్తకాన్ని వ్రాసిన డా. బెంజమిన్‌ స్పాక్‌, “దృఢంగా ఉంటూ బుద్ధిచెప్పకపోవడమనేది నేడు అమెరికాలోని తల్లిదండ్రుల్లో ఉన్న సర్వసాధారణ సమస్య” అని ఒకసారి అన్నాడు. అందుకు నిందించాల్సింది నిపుణులనేనని అందులో తనూ ఉన్నాననీ అంగీకరిస్తూ ఆయనింకా ఇలా అన్నాడు: “అంతా తెలుసు అనే మా వైఖరి తల్లిదండ్రుల ఆత్మ విశ్వాసాన్ని ఎంతగా బలహీనపర్చిందో అది ప్రమాదస్థాయికి చేరేవరకూ మేము గ్రహించలేదు.” కాబట్టి మనమిలా ప్రశ్నించవచ్చు: ‘ఇప్పుడూ భవిష్యత్తులోనూ సంతృప్తికరంగా జీవించడానికి ఎవరి సలహాను నిరపాయంగా పాటించవచ్చు?’