కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 8

సంతృప్తికరమైన జీవితాన్ని మళ్ళీ పొందే మార్గం

సంతృప్తికరమైన జీవితాన్ని మళ్ళీ పొందే మార్గం

 దైవిక పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు మానవులు వ్యర్థమైన జీవన విధానంలో పడిపోయినా, దేవుడు వారిని ఏ నిరీక్షణా లేనివారిగా విడిచిపెట్టలేదు. బైబిలిలా వివరిస్తోంది: “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.” (రోమీయులు 8:20, 21) అవును, దేవుడు మొదటి మానవ దంపతుల సంతానానికి నిరీక్షణ దయచేశాడు. మానవులు వారసత్వంగా పొందిన పాపమరణాల నుండి స్వాతంత్ర్యం పొందుతారన్న నిశ్చయమైన నిరీక్షణ అది. వారు యెహోవా దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకునేలా పునఃస్థాపించబడగలరు.యెహోవా దేవునితో వారి సన్నిహిత సంబంధం పునరుద్ధరింపబడగలదు. కానీ ఎలా?

పాపమరణాల దాసత్వంనుండి స్వాతంత్ర్యం పొందేందుకు మానవజాతికి దేవుడు నిరీక్షణ దయచేశాడు

2 ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు, వారు తమ సంతానానికి ఈ భూమిపై నిరంతరం సంతృప్తికరమైన జీవితమనుభవించే భవిష్యత్‌ నిరీక్షణ లేకుండా చేశారు. తమకుతామే మంచి చెడ్డల్ని నిర్ణయించుకొనే అధికార స్వేచ్ఛ కోసం, వారు తమకు జన్మించబోయే కుటుంబాన్ని పాపమరణాల దాస్యానికి అమ్మివేశారు. ఆ కుటుంబంలో జన్మించినవారిని, క్రూరులైన రాజులు పరిపాలించే మారుమూల ద్వీపంలో ఖైదుచేయబడిన దాసులతో పోల్చవచ్చు. నిజమే, పాపమనే రాజుకు అప్పటికే దాసులుగా ఉన్న మానవజాతిపై, మరణం కూడా రాజుగా ఏలింది. (రోమీయులు 5:14, 21) వారిని రక్షించేవారు ఎవరూ లేనట్లే అనిపిస్తోంది. అవును మరి, వారిని దాసత్వంలోకి అమ్మివేసింది వారి పూర్వికుడే కదా! అప్పుడు, దయాగుణంగల ఒక వ్యక్తి, దాసత్వంలో ఉన్న వీరందరి విడుదల కొరకు కావల్సిన పూర్తి మూల్యం చెల్లించేందుకు తన కుమారుణ్ణి పంపించాడు.​—⁠కీర్తన 51:5; 146:4; రోమీయులు 8:2.

3 ఈ ఉపమానంలో దాసులను రక్షించిన వ్యక్తి యెహోవా దేవునికి సూచనగా ఉన్నాడు. వారు స్వాతంత్ర్యం పొందడానికి మూల్యం చెల్లించిన కుమారుడు యేసుక్రీస్తు. దేవుని అద్వితీయ కుమారునిగా ఆయనకు మానవపూర్వ ఉనికి ఉంది. (యోహాను 3:16) ఆయనే యెహోవా యొక్క మొట్టమొదటి సృష్టి, ఇక విశ్వంలోని మిగతా ప్రాణులన్నీ ఆయన ద్వారానే ఉనికిలోకి వచ్చాయి. (కొలొస్సయులు 1:15, 16) ఈ ఆత్మసంబంధమైన కుమారుని జీవాన్ని యెహోవా అద్భుతరీతిలో ఒక కన్యక గర్భానికి మార్చాడు. అలా చేయడం ద్వారా ఆ శిశువు పరిపూర్ణ మానవుడిగా జన్మించడం సాధ్యమైంది. దైవిక న్యాయం కోరే మూల్యం ఒక పరిపూర్ణ మానవుడి ప్రాణమే.​—⁠లూకా 1:26-31, 34, 35.

4 యేసు తన 30వ ఏట యొర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మమప్పుడు పరిశుద్ధాత్మ, అంటే దేవుని చురుకైన శక్తి ద్వారా ఆయన అభిషేకింపబడ్డాడు. ఆవిధంగా ఆయన క్రీస్తు అయ్యాడు, దీనికి “అభిషిక్తుడు” అని భావం. (లూకా 3:21, 22) యేసు ఈ భూమిపై మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ సంవత్సరాల కాలంలో ఆయన తన అనుచరులకు “దేవుని రాజ్యము” గురించి బోధించాడు. ఆ పరలోక ప్రభుత్వం క్రింద మానవజాతి యెహోవా దేవునితో సమాధానకరమైన సంబంధాన్ని తిరిగి పొందుతుంది. (లూకా 4:43; మత్తయి 4:17) మానవులు సంతోషకరమైన జీవితం గడపడానికిగల మార్గం యేసుకు తెలుసు, అందుకే ఆయన సంతోషాన్ని గూర్చిన నిర్దిష్టమైన మార్గదర్శకసూత్రాల్ని తన అనుచరులకిచ్చాడు. మీరు మీ బైబిలును మత్తయి 5-7 అధ్యాయాలకు తెరచి కొండమీద ప్రసంగంలోని ఆయన బోధలను ఎందుకు చదవకూడదు?

దాస్యాన్నుండి మిమ్మును విడిపించిన వ్యక్తిపట్ల మీరు లోతైన కృతజ్ఞతాభావం కలిగివుండరా?

5 ఆదాముకు భిన్నంగా, యేసు ప్రతి విషయంలో దేవునికి విధేయతచూపే జీవితం జీవించాడు. “ఆయన పాపము చేయలేదు.” (1 పేతురు 2:22; హెబ్రీయులు 7:26) వాస్తవానికి, ఈ భూమ్మీద నిరంతరం జీవించే హక్కువున్నా, ఆదాము పోగొట్టుకొన్నదాన్ని దేవునికి తిరిగి చెల్లించేందుకు ఆయన ‘తన ప్రాణం పెట్టాడు.’ హింసాకొయ్యపై యేసు తన పరిపూర్ణ మానవ జీవితాన్ని అర్పించాడు. (యోహాను 10:17; 19:17, 18, 28-30; రోమీయులు 5:19, 21; ఫిలిప్పీయులు 2:8) అలాచేసి, యేసు విమోచన క్రయధనాన్ని, అంటే మానవులను పాపమరణాల దాస్యాన్నుండి తిరిగి కొనేందుకు అవసరమైన మూల్యాన్ని చెల్లించాడు. (మత్తయి 20:28) బానిసజీవితం గడుపుతూ, కఠిన పరిస్థితులున్న కర్మాగారంలో చమటోడ్చి శ్రమిస్తున్నవారిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆ దాస్యాన్నుండి మిమ్మల్ని విడిపించడానికి ఏర్పాటు చేసిన వ్యక్తిపట్ల, మీ కొరకు స్వచ్ఛందంగా తన ప్రాణమర్పించిన వ్యక్తిపట్ల లోతైన కృతజ్ఞతాభావం మీరు కలిగివుండరా? ఈ విమోచన క్రయధన ఏర్పాటుద్వారా, దేవుని విశ్వకుటుంబానికి తిరిగి రావడానికి, పాపమరణాల దాసత్వంనుండి విముక్తులై నిజంగా సంతృప్తికరమైన జీవితం మీరు జీవించడానికి మార్గం తెరువబడింది.​—⁠2 కొరింథీయులు 5:14, 15.

6 యెహోవా చూపిన ఈ కృపను తెలుసుకొని దానిని గ్రహించడం మూలంగా, బైబిలులోని జ్ఞానవాక్కులను మీ స్వంత జీవితంలో అన్వయించుకునేందుకు మీకు మరింత కారణం ఉంటుంది. ఉదాహరణకు, పాటించడానికి అత్యంత కష్టంగా వుండే ఒక సూత్రాన్ని, అంటే ఇతరులు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు వారిని క్షమించే విషయమే తీసుకోండి. మనం రెండవ పాఠంలో పరిశీలించిన కొలొస్సయులు 3వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లోని మాటలు మీకు గుర్తున్నాయా? ఎవరైనా మీకు హాని తలపెట్టారని మీకనిపించినా మీరు వారిని క్షమించాలని ఆ వచనాలు మిమ్మల్ని ప్రోత్సహించాయి. అలా ఎందుకు చేయాలో వివరిస్తూ ఆ తర్వాతి వచనం ఇలా అంటోంది: ‘ప్రభువు [యెహోవా] మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.’ మానవజాతికొరకు యెహోవా, యేసుక్రీస్తు చేసిన దానిని మీరొకసారి హృదయంలోనికి తీసుకుంటే, ప్రత్యేకంగా ఇతరులు పశ్చాత్తాపపడి, మన్నించమని కోరినప్పుడు, వారు మీపట్ల ఎలాంటి తప్పులు చేసినా మీరు వారిని క్షమించేందుకు పురికొల్పబడతారు.