భాగం 6
యెహోవా మనల్ని ఎందుకు సృష్టించాడు?
యెహోవా గురించి తెలుసుకుంటే మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అనేక ప్రయోజనాల్లో ఒకటిగా, వందలకోట్ల మందిని కలవరపరచే ‘నేనిక్కడ ఎందుకున్నాను?’ అనే ప్రశ్నకు జవాబు కనుగొంటారు. ఎప్పుడో ఒకప్పుడు మీరు దాని గురించి ఆలోచించే వుంటారు. తనకాలంలోని “భూరాజులందరికంటె” సిరిసంపదలుగల, జ్ఞానియైన ఒక రాజు, జీవితార్థాన్ని గురించిన ప్రశ్నను పరిశీలించాడు. (2 దినవృత్తాంతములు 9:22; ప్రసంగి 2:1-13) ఈ సొలొమోను రాజుకు ప్రబలమైన అధికారం, విస్తారమైన సంపద, అసమానమైన జ్ఞానం ఉన్నాయి. మరి ఆయన పరిశోధనా ఫలితం ఏమిటి? “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి 12:13) అధికశాతం ప్రజల అనుభవం కంటే సొలొమోనుకున్న అనుభవం అపారమైనది గనుక, ఆయన తేల్చిచెప్పిన విషయం కనీసం పరిశీలించి చూడ తగినదే.—ప్రసంగి 2:12.
2సొలొమోను సూచించిన దేవుని భయం, ఏదో అదృశ్య ఆత్మల గురించిన భీతి కాదు. బదులుగా, అది మీరు బహుగా ప్రేమించినవారిని అప్రీతిపరచకూడదనే ఆరోగ్యకరమైన భయం. మీరు ఒక వ్యక్తిని ప్రగాఢంగా ప్రేమిస్తున్నట్లయితే, అన్ని సందర్భాల్లోను ఆ వ్యక్తిని మీరు ప్రీతిపరచాలనుకుంటారు. అతనికి కోపం తెప్పించేదేదీ చేయరు. మీరు యెహోవాపై ప్రేమను పెంచుకొంటుండగా, ఆయనను గురించి కూడా అలాగే భావిస్తారు.
3మీరు బైబిలు చదవడం ద్వారా మన సృష్టికర్త ఇష్టాయిష్టాలేమిటో, భూమిని సృష్టించడంలో ఆయన సంకల్పమేమిటో తెలుసుకోగలరు. యెహోవా ఈ ‘భూమిని కలుగజేసి దాని సిద్ధపరచినవాడని’ మాత్రమేకాక ‘దానిని స్థిరపరచినవాడని’ కూడా బైబిలు వర్ణిస్తోంది. ‘నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు గాని, నివాసస్థలమగునట్లుగా దాని సృజించాడని’ కూడా అది చెబుతోంది. (యెషయా 45:18) యెహోవా, భూమిని మానవుల నివాసస్థలముగా ఉండేందుకు సిద్ధంచేశాడు, వారు దానినీ దానిలోని సమస్త ప్రాణకోటినీ చూసుకుంటూ ఉండాలి. (ఆదికాండము 1:28) కానీ, యెహోవా మానవులను సృష్టించడంలోని సంకల్పం కేవలం అదేనా—వారి పని కేవలం గృహ సంరక్షకులుగా ఉండడమేనా?
4 కాదు, దానికంటే ఎంతో ఉన్నతమైన ఒక సంకల్పముంది. మొదటి మానవుడైన ఆదాముకు యెహోవాతో ఓ అర్థవంతమైన సంబంధం ఉండేది. ఆదాము సృష్టికర్తతో నేరుగా సంభాషించగలిగేవాడు. ఆయన దేవుడు చెప్పేది వినగలిగేవాడు, అలాగే తన భావాలను వ్యక్తం చేయగలిగేవాడు. (ఆదికాండము 1:28-30; 3:8-13, 16-19; అపొస్తలుల కార్యములు 17:26-28) దీన్నిబట్టి చూస్తే ఆదాముకు, ఆయన భార్య హవ్వకు యెహోవాను బాగా తెలుసుకుంటూ, ఆయనతో ప్రగాఢమైన అనుబంధాన్ని పెంచుకొనే అత్యద్భుతమైన అవకాశం ఉండింది. యెహోవా “సంతోషంగల దేవుడు” కాబట్టి, ఆయనను తెలుసుకోవడం, ఆయనను అనుకరించడం ద్వారా వారు తమ జీవితాలను సంతృప్తికరంగా చేసుకోగలిగేవారు. (1 తిమోతి 1:11, NW) “సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు” దేవుడిగా యెహోవా, నిత్యం జీవించగలిగే చక్కని భవిష్యత్తుతో తొలి మానవుడ్ని ఏదెను తోట అనే పరదైసులో ఉంచాడు.—1 తిమోతి 6:17; ఆదికాండము 2:8, 9, 16, 17.
5నిత్యమా? నిత్యజీవమనే తలంపును మీరు ‘అసంభవం’ అంటూ కొట్టిపారేస్తుండవచ్చు. కానీ అది నిజంగా అసంభవమేనా? జీవకణాలు వృద్ధాప్యానికి ఎదిగేలా చేస్తున్నదేమిటో తమకిప్పుడు అర్థం అవుతున్నట్లు శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. క్రోమోజోముల చివర్లను కప్పివుంచే టెలోమెర్‌లని పిలువబడే జన్యు పదార్థం, జీవకణం విభాగింపబడిన ప్రతిసారి చిన్నగా అవుతుంది. జీవకణం 50 నుండి 100 సార్లు విభాగింపబడిన తర్వాత టెలోమెర్‌లు అరిగిపోతాయి, దాంతో అధికశాతం జీవకణాల విభజన ఆగిపోతుంది. అయితే, టెలోమెరేస్ అనే ఎంజైము సహాయంతో మానవ కణాలు నిరవధికంగా విభాగింపబడుతూనే ఉండవచ్చని ఇటీవలి వైజ్ఞానిక పరిశోధనలు సూచిస్తున్నాయి. అంటే దీనర్థం యెహోవా నిత్య జీవాన్ని ఈ ఎంజైము ద్వారానే సాధ్యం చేస్తాడని కాదు, కానీ ఇదొక విషయాన్ని మాత్రం సూచిస్తోంది: నిత్య జీవమనే తలంపు అసంభవం కాదు!
6అవును, మొదటి మానవ దంపతులు నిత్యం జీవించేందుకే సృష్టించబడ్డారని తెలిపే బైబిలు వృత్తాంతం నమ్మదగినదే. మానవులు యెహోవాతో తమ అనుబంధాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉండాల్సింది. వారు తమ పరలోకపు తండ్రితో బలమైన బంధాన్ని ఏర్పరచుకొంటూ, భూమిపై మానవులైన తమ విషయంలో ఆయన సంకల్పమేమిటో పూర్తిగా తెలుసుకుని దాన్ని నెరవేరుస్తూ ఉండాల్సింది. వారి జీవితాలు వెట్టిచాకిరిలా ఉండాల్సినవి మాత్రం కాదు. ఆదాము హవ్వలకు భూమిని సంతోషభరితులైన, పరిపూర్ణులైన సంతానంతో నింపే అత్యద్భుతమైన నిరీక్షణ ఉండేది. వారికి నిరంతరం చేయడానికి సంతృప్తికరమైన, అర్థవంతమైన పని ఉండేది. అది నిజంగా సంతృప్తికరమైన జీవితమై ఉండేది!—ఆదికాండము 1:28.