కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 7

సంతృప్తికరమైన జీవితం—ఎందుకంత అసాధ్యంగా ఉంది?

సంతృప్తికరమైన జీవితం—ఎందుకంత అసాధ్యంగా ఉంది?

 తమ జీవితాలకు నిజమైన అర్థమేమిటో గ్రహించలేక అనేకమంది ఎందుకు పెనుగులాడుతుంటారు? “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.” (యోబు 14:1, 2) మానవజాతికిగల ఉజ్వలమైన భవిష్యత్‌ నిరీక్షణలను నాశనం చేసిన ఒక సంఘటన పరదైసులోని మొదటి మానవ దంపతులకు సంభవించింది.

2మానవ కుటుంబం నిజంగా సంతోషంగా వుండాలంటే, వారు దేవునితో మంచి సంబంధం కలిగియుండాలి, అదీ మనఃపూర్వకమైనదై ఉండాలి, బలవంతమైనది కాదు. (ద్వితీయోపదేశకాండము 30:15-20; యెహోషువ 24:15) ఎందుకంటే యెహోవా ప్రేమతో కూడిన, హృదయపూర్వక ఆరాధనను, విధేయతను కోరుతున్నాడు. (ద్వితీయోపదేశకాండము 6:5) కాబట్టి ఏదెను తోటలో, మొదటి మానవుడు తన హృదయపూర్వక యథార్థతను నిరూపించుకునే అవకాశమున్న ఒక హద్దును యెహోవా పెట్టాడు. ఆదాముతో దేవుడిలా అన్నాడు: ‘ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.’ (ఆదికాండము 2:16, 17) అది ఎంతో సులువైన పరీక్ష. తోటలోని వృక్షాలన్నింటిలో ఆదాము కేవలం ఒక్క వృక్ష ఫలం మాత్రమే తినకూడదని యెహోవా నిషేధించాడు. ఆ వృక్షం సర్వజ్ఞానియైన సృష్టికర్తకు మాత్రమే ఉన్న మంచిచెడ్డల్ని నిర్ణయించే హక్కును సూచిస్తుంది. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను మొదటి మానవుడు, యెహోవా తనకు ‘సాటియైన సహాయముగా’ ఇచ్చిన తన భార్యకు తెలియజేశాడు. (ఆదికాండము 2:18) కృతజ్ఞతాపూర్వకంగా ఆయన చిత్తానికి లోబడడం ద్వారా తమ సృష్టికర్త మరియు జీవదాత పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తూ, దేవుని పరిపాలన క్రింద జీవించడమనే ఈ ఏర్పాటును బట్టి వారిద్దరు సంతృప్తిచెందారు.

3అయితే ఒకరోజు, ఒక సర్పం హవ్వతో మాట్లాడుతూ “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అని అడిగింది. దానికి హవ్వ, తాము “చావకుండునట్లు” కేవలం “తోట మధ్యనున్న చెట్టు” అంటే మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మాత్రం తినకూడదని జవాబిచ్చింది.​—⁠ఆదికాండము 3:1-3.

4ఆ సర్పం ఎవరు? బైబిల్లోని ప్రకటన పుస్తకం ఆ ‘ఆది సర్పమును’ “సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు” గుర్తిస్తోంది. (ప్రకటన 12:9) మరి అపవాదియైన ఆ సాతానును దేవుడే సృష్టించాడా? లేదు, ఎందుకంటే యెహోవా కార్యములు పరిపూర్ణమైనవి, మరియు శ్రేష్ఠమైనవి. (ద్వితీయోపదేశకాండము 32:4) ఆత్మసంబంధమైన ఈ ప్రాణి తనంతటతానే, “కొండెములు చెప్పేవాడు” అనే అర్థంగల అపవాదిగా, “ఎదిరించేవాడు” అనే అర్థంగల సాతానుగా తయారయ్యాడు. అతడు “స్వకీయమైన దురాశచేత,” అంటే దేవుని స్థానంలో ఉండాలనే దురాశచేత “ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై” సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.​—⁠యాకోబు 1:14.

5అపవాదియైన సాతాను హవ్వతో ఇంకా ఇలా చెప్పాడు: ‘మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.’ (ఆదికాండము 3:4, 5) సాతాను మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినడం ఎంతో బాగుంటుందని భావించేలా చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ‘మీకు మేలైనది దేవుడు మీకు దక్కకుండా చేస్తున్నాడు. ఆ వృక్ష ఫలం తినేయండి, మీరు దేవునివలె అవుతారు, ఏది మంచి ఏది చెడు అన్నవి మీకై మీరే నిర్ణయించుకోగల్గుతారు’ అని అతను వాదించాడు. దేవుణ్ణి సేవించకుండా అనేకుల్ని దూరంగా ఉంచడానికి సాతాను నేడుకూడా అదే తర్కాన్ని ఉపయోగిస్తున్నాడు. ‘మీకిష్టమైంది మీరు చేసుకోండి, మీకు జీవాన్ని ప్రసాదించిన దేవునికి మీరు ఏమి ఋణపడివున్నారో దాని గురించి మరిచిపోండి’ అని అతడు చెబుతున్నాడు.​—⁠ప్రకటన 4:10, 11.

6అకస్మాత్తుగా వారికి ఆ వృక్ష ఫలం ఎంతో కోరదగినదిగా కనిపించింది, ఆశను చంపుకోవడం అసాధ్యంగా అయిపోయింది! హవ్వ ఆ ఫలం తీసుకొని తిని, తన భర్తకు కూడా ఇచ్చింది. దానివల్ల కలిగే పర్యవసానాలు పూర్తిగా తెలిసికూడా, ఆదాము తన భార్య మాట విని ఆ ఫలం తిన్నాడు. ఫలితం? ఆ స్త్రీకి యెహోవా ఈ శిక్ష విధించాడు: ‘నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలును.’ మరి ఆ నరుడికి? ‘నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.’ ఇప్పుడు ఆదాము హవ్వలు తమ సంతోషాన్ని సంతృప్తిని స్వయంగా వెదుక్కోవడానికి విడిచిపెట్టబడ్డారు. సంతృప్తికర జీవితం జీవించేందుకు, మానవులు దైవ సంకల్పానికి భిన్నంగా చేసే ప్రయత్నాలు విజయవంతమౌతాయా? ఉద్యానవనంలాంటి పరదైసును సాగుచేస్తూ దాన్ని భూదిగంతాలకు విస్తరింపజేసే ఆనందకరమైన పనికి బదులు, తమ సృష్టికర్తను మహిమపరిచే పనేదీ చేయక కేవలం సజీవంగా ఉండడానికే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడవలసివచ్చింది.​—⁠ఆదికాండము 3:6-19.

7 మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం తిన్న రోజే ఆ మొదటి దంపతులు దేవుని దృష్టిలో మరణించి, నెమ్మదిగా శరీరరీతిలో కూడా మరణించే స్థితికి దిగజారుతూపోయారు. చివరికి వారు మరణించినప్పుడు ఏం జరిగింది? చనిపోయినవారి స్థితిని గురించిన అంతర్దృష్టిని బైబిలు అందిస్తోంది. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభము కలుగదు.” (ప్రసంగి 9:5; కీర్తనలు 146:4) మరణాన్ని తప్పించుకొని సజీవంగా ఉండే “ఆత్మ” వంటిదేదీ ఉండదు. పాపానికి శిక్ష మరణమేగాని మండుతున్న నరకంలో నిత్యయాతన కాదు. అంతేకాకుండా, మరణం పరలోకమందు శాశ్వతానందానికీ దారితీయదు. *

8 కేకులు చేసే పాత్రకు ఒకచోట సొట్ట ఉన్నట్లైతే, దాంట్లో తయారుచేసే కేకులన్నింటిపైనా ఆ సొట్ట ఉన్నచోట దానిగుర్తు ఎలా ఏర్పడుతుందో, అదే విధంగా అపరిపూర్ణులైన స్త్రీపురుషులు అపరిపూర్ణులైన సంతానాన్నే కనగలరు. ఈ రీతిని బైబిలిలా వివరిస్తోంది: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ఆ విధంగా మనందరం పాపంలో జన్మించి వ్యర్థపరచబడ్డాము. ఆదాము సంతానానికి జీవితం కష్టాలమయమయ్యింది. అయితే బయటపడే మార్గమేదైనా వుందా?

^ చనిపోయినవాళ్ల స్థితి గురించి ఆసక్తికరమైన వివరాలను, యెహోవాసాక్షులు ప్రచురించిన మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే . . . అనే బ్రోషురులో తెలుసుకోవచ్చు. అది Watchtower Bible and Tract Society of New York, Inc.ప్రచురించింది.