కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చనిపోయిన వారికిగల నిశ్చయమైన నిరీక్షణ

చనిపోయిన వారికిగల నిశ్చయమైన నిరీక్షణ

ఇరవై ఐదు సంవత్సరాల యువతి ఇలా వ్రాసింది: “నన్ను పెంచుకున్న తల్లి 1981లో క్యాన్సర్‌తో మరణించింది. ఆమె మరణం నాకు, మా తమ్మునికి తీరని దుఃఖం మిగిల్చింది. అప్పుడు నాకు 17 సంవత్సరాలు, మా  తమ్మునికి 11 సంవత్సరాలు. ఆమె లేనిలోటును నేను తట్టుకోలేకపోయాను. ఆమె పరలోకానికి వెళ్ళిందని నాకు బోధించబడడంవల్ల, నేను కూడా ఆమె దగ్గరకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆమె నా ప్రాణ స్నేహితురాలు.”

మీ ప్రియమైన వారిని మీ నుండి దూరం చేసేంత శక్తి మరణానికి ఉండడం చాలా అన్యాయం అనిపిస్తుంది. అలా జరిగినప్పుడు, మీ ప్రియమైన వారితో మరెన్నడూ మాట్లాడలేరు, కలిసి నవ్వలేరు, వారిని హత్తుకోలేరు అనే ఆలోచనను తట్టుకోవడం చాలా కష్టమౌతుంది. మీ ప్రియమైనవారు పరలోకానికి వెళ్ళారని చెప్పినంత మాత్రాన ఆ బాధ తీరిపోదు.

అయితే బైబిలు ఎంతో విభిన్నమైన నిరీక్షణనిస్తోంది. మనం ఇంతకుముందు గమనించినట్లుగా, సమీప భవిష్యత్తులో, మరణించిన మీ ప్రియమైన వారిని ఏదో తెలియని పరలోకంలో కాదుగానీ, ఈ భూమిపైనే నీతి సమాధానములతో కూడిన పరిస్థితుల్లో మళ్లీ కలుసుకోవడం సాధ్యమేనని లేఖనాలు సూచిస్తున్నాయి. అప్పుడు మానవులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించే ఉత్తరాపేక్ష ఉంటుంది, వారిక ఎన్నడూ మరణించాల్సిన అవసరం ఉండదు. ‘అయితే అది అభూత కల్పనే!’ అని కొందరనవచ్చు.

ఇది నిశ్చయమైన నిరీక్షణ అని నమ్మడానికి ఏమి అవసరం? ఒక వాగ్దానాన్ని నమ్మడానికి, ఆ వాగ్దానం చేసిన వ్యక్తి దానిని నెరవేర్చగలడనీ, అందుకాయన ఇష్టపడుతున్నాడనీ మీకు విశ్వాసం కలగాలి. అయితే, మరణించినవారు తిరిగి జీవిస్తారని ఎవరు వాగ్దానం చేస్తున్నారు?

సా.శ. 31వ సంవత్సరం వసంతకాలంలో, యేసుక్రీస్తు ధైర్యంగా ఇలా వాగ్దానం చేశాడు: ‘తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆకాలమున సమాధులలో నున్న వారందరు యేసు శబ్దము విని పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు.’ (యోహాను 5:21, 28, 29) అవును, ప్రస్తుతం మరణించిన లక్షలాదిమంది మళ్ళీ ఇదే భూమిపై జీవిస్తారని, శాంతియుతమైన పరదైసు పరిస్థితుల్లో నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష వారికి ఉంటుందని యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. (లూకా 23:43; యోహాను 3:16; 17:3; అలాగే కీర్తన 37:29, మత్తయి 5:5 పోల్చండి.) యేసుక్రీస్తే ఈ వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన దాన్ని నెరవేర్చే ఇష్టంతో ఉన్నాడని మనం నమ్మవచ్చు. అయితే ఆయనకా సామర్థ్యముందా?

ఆ వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు గడవకముందే, యేసు తనకు పునరుత్థానం చేయగల సామర్థ్యముందని, అందుకు తాను ఇష్టపడుతున్నానని అద్భుతమైన రీతిలో చూపించాడు.

‘లాజరూ, బయటికి రమ్ము!’

అది నిజంగా హృదయాన్ని ఉప్పొంగజేసే దృశ్యం. లాజరుకు బాగా జబ్బుచేసింది. దానితో, ఆయన సహోదరీలైన మరియ, మార్త యొర్దానునదికి ఆవలవైపునున్న యేసుకు ఇలా వర్తమానం పంపించారు: “ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడు.” (యోహాను 11:3) యేసు లాజరును ప్రేమించాడని వాళ్లకు తెలుసు. అనారోగ్యంతో ఉన్న తన స్నేహితుడ్ని యేసు చూడాలనుకోడా? అయితే ఆశ్చర్యకరంగా, యేసు వెంటనే బేతనియకు వెళ్లడానికి బదులు, తానున్న చోటే మరో రెండు రోజులు ఉండిపోయాడు.—యోహాను 11:5, 6.

లాజరు అనారోగ్యంతో ఉన్నాడనే వార్త పంపబడిన కొద్దిసేపటికే ఆయన చనిపోయాడు. లాజరు ఎప్పుడు చనిపోయాడో యేసుకు తెలుసు, దాని గురించి ఏదో చేయాలని ఆయన ఉద్దేశించాడు. చివరకు యేసు బేతనియకు వచ్చేసరికి, ఆయన ప్రియ స్నేహితుడు చనిపోయి అప్పటికే నాలుగు రోజులైంది. (యోహాను 11:17, 39) చనిపోయి అన్ని రోజులైన తర్వాత కూడా యేసు ఆ వ్యక్తిని తిరిగి సజీవుణ్ణి చేయగలడా?

యేసు వస్తున్నాడని వినగానే, చురుకుగా ఉండే మార్త, ఆయనను కలుసుకోవడానికి పరుగెత్తింది. (లూకా 10:38-42 పోల్చండి.) ఆమె దుఃఖానికి చలించిపోయిన యేసు, “నీ సహోదరుడు మరలా లేచునని” ఆమెకు అభయమిచ్చాడు. భవిష్యత్తులో జరిగే పునరుత్థానంలో తన నమ్మకం ఉందని ఆమె చెప్పినప్పుడు, యేసు ఆమెతో స్పష్టంగా ఇలా అన్నాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.”—యోహాను 11:20-25.

యేసు సమాధి దగ్గరకు వచ్చి, దాని మీదున్న రాయిని తొలగించమని చెప్పాడు. ఆ తర్వాత, ఆయన బిగ్గరగా ప్రార్థించి ఇలా ఆజ్ఞాపించాడు: ‘లాజరూ, బయటికి రమ్ము!’—యోహాను 11:38-43.

అందరి కళ్ళూ సమాధిపైనే ఉన్నాయి. చీకటిలో నుండి నెమ్మదిగా ఒక ఆకారం బయటికి వచ్చింది. ఆయన కాళ్లకు చేతులకు ప్రేతవస్త్రాలు చుట్టబడివున్నాయి, ఆయన ముఖానికి రుమాలు కట్టివుంది. “అతని కట్లు విప్పిపోనియ్యుడి” అని యేసు ఆజ్ఞాపించాడు. ఆయనకు కట్టబడిన కట్లన్నీ విప్పబడ్డాయి. అవును, ఆయన నాలుగు రోజుల క్రితం చనిపోయిన లాజరే!—యోహాను 11:44.

ఇది నిజంగా జరిగిందా?

యోహాను వ్రాసిన సువార్తలో లాజరు లేపబడడం ఒక చారిత్రాత్మక వాస్తవంగా చెప్పబడింది. అది వట్టి కట్టుకథ అనుకోవడానికి వీల్లేకుండా, దాని వివరాలు చాలా స్పష్టంగా ఇవ్వబడ్డాయి. దాని చారిత్రకతను సందేహించడమంటే, బైబిల్లోని అద్భుతాలన్నిటితోపాటు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని కూడా సందేహించినట్లే అవుతుంది. యేసు పునరుత్థానాన్ని నిరాకరించడమంటే మొత్తం క్రైస్తవ విశ్వాసాన్నే నిరాకరించినట్లు అవుతుంది.—1 కొరింథీయులు 15:13-15.

వాస్తవానికి, మీరు దేవుని ఉనికిని అంగీకరిస్తే పునరుత్థానాన్ని నమ్మడం మీకొక సమస్యగా ఉండకూడదు. ఉదాహరణకు: ఒక వ్యక్తి తన వీలునామాను వీడియోటేప్‌ చేయగలడు, ఆయన చనిపోయిన తర్వాత, ఆయన తన ఆస్తిని ఏం చేయాలని వివరించాడో దాన్ని ఆయన బంధువులు, స్నేహితులు వింటూ ఆ వీడియోలో ఆయనను చూడగలుగుతారు. ఒక వంద సంవత్సరాల క్రితమైతే అలాంటిది ఊహకందని విషయం. ప్రస్తుతం ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు, వీడియో రికార్డింగ్‌ చేసే విజ్ఞానం అద్భుతంలాగ అనిపిస్తుందే తప్ప వారి అవగాహనకు అందదు. సృష్టికర్త నెలకొల్పిన వైజ్ఞానిక సూత్రాలను ఉపయోగించుకొని మానవులే అలాంటి దృశ్య, శ్రావ్య చిత్రాలను నిర్మించగలిగినప్పుడు, సృష్టికర్త అంతకంటే ఇంకా ఎక్కువ చేయలేడా? జీవాన్ని సృష్టించినవానికి దాన్ని పునఃసృష్టించే సామర్థ్యం కూడా ఉండడం సహేతుకం కాదా?

లాజరు అద్భుతంగా పునరుత్థానం చేయబడడం, యేసు మీద, పునరుత్థానం మీద విశ్వాసాన్ని అధికం చేసింది. (యోహాను 11:41, 42; 12:9-11, 17-19) అది, హృదయాన్ని ఉప్పొంగజేసే రీతిలో, పునరుత్థానం చేయాలని యెహోవాకూ ఆయన కుమారునికీ ఉన్న కోరికను, ఇష్టాన్ని కూడా వెల్లడిచేస్తోంది.

‘దేవునికి ఇష్టము కలుగును’

లాజరు మరణానికి యేసు స్పందించిన విధం దేవుని కుమారుని సున్నితమైన భావాలను బయలుపరుస్తోంది. ఆ సందర్భంలో ఆయనలో కలిగిన లోతైన భావాలు మరణించిన వారిని పునరుత్థానం చేయాలని ఆయనకున్న ప్రగాఢమైన కోరికను స్పష్టంగా సూచిస్తున్నాయి. మనమిలా చదువుతాం: “మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి—ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు—అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు—ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు—అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.”—యోహాను 11:32-36.

యేసు చూపించిన హృదయపూర్వక కనికరం, “మూలుగుచు,” “కలవరపడి,” “కన్నీళ్లు విడిచెను” అనే మూడు శబ్దాలతో ఇక్కడ సూచించబడింది. హృదయాన్ని స్పృశించే ఆ దృశ్యాన్ని వ్రాయడానికి మూలభాషలో ఉపయోగించబడిన పదాలు, యేసు తన ప్రియ స్నేహితుడైన లాజరు మరణాన్ని, లాజరు సహోదరి ఏడవడాన్ని చూసినప్పుడు ఎంతో చలించిపోయి కన్నీటితో ఆయన కళ్ళు నిండిపోయాయని సూచిస్తున్నాయి. *

గమనించదగిన విషయమేమిటంటే యేసు అంతకు ముందు మరో ఇద్దరిని బ్రతికించాడు. లాజరును కూడా సరిగ్గా అలాగే బ్రతికించాలని ఆయన ఉద్దేశించాడు. (యోహాను 11:11, 23, 25) అయినా, ఆయన ‘కన్నీళ్లు విడిచాడు.’ కాబట్టి మానవులను పునరుత్థానం చేయడమనేది యేసుకు కేవలం ఒక పనిలాంటిది కాదు. ఎందుకంటే ఆ సందర్భంలో ఆయన కనబరచిన కనికరమూ లోతైన భావాలూ మరణం వల్ల కలిగే దుష్పరిణామాలను తొలగించాలన్న ఆయన ప్రగాఢమైన కోరికను స్పష్టంగా సూచిస్తున్నాయి.

లాజరును పునరుత్థానం చేసేటప్పుడు యేసు కనబరచిన సున్నితమైన భావాలు మరణం వల్ల కలిగే దుష్పరిణామాలను తొలగించాలనే ఆయన ప్రగాఢ కోరికను ప్రతిబింబించాయి

యేసు ‘యెహోవా దేవుని తత్వముయొక్క మూర్తిమంతమైయున్నాడు’ కాబట్టి మనం మన పరలోకపు తండ్రి నుండి కూడా అంతకంటే తక్కువేమీ ఆశించము. (హెబ్రీయులు 1:3) పునరుత్థానం చేయడానికి యెహోవా దేవునికున్న సుముఖత గురించి నమ్మకమైన యోబు ఇలా చెప్పాడు: ‘మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.’ (యోబు 14:14, 15) ఇక్కడ, “నీకు ఇష్టము కలుగును” అని అనువదించబడిన మూలభాషాపదం దేవుని ప్రగాఢమైన ఆకాంక్షను, కోరికను సూచిస్తోంది. (ఆదికాండము 31:30; కీర్తన 84:2) కాబట్టి యెహోవా పునరుత్థానం చేయాలని ఎంతగానో ఎదురు చూస్తాడని తెలుస్తోంది.

మనం పునరుత్థాన వాగ్దానాన్ని నిజంగా నమ్మవచ్చా? నిస్సందేహంగా నమ్మవచ్చు, ఎందుకంటే యెహోవా దేవుడు, ఆయన కుమారుడు పునరుత్థానం చేయడానికి సుముఖంగా ఉన్నారు, వారు ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలరు కూడా. దీని వల్ల మీకేం ప్రయోజనం? చనిపోయిన మీ ప్రియమైన వారిని ఇదే భూమిపై ఈనాడున్న పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉండే పరిస్థితుల్లో మళ్ళీ కలుసుకునే నిరీక్షణ మీ ఎదుట ఉంది!

ఒక చక్కని ఉద్యానవనంలో మానవాళిని ఉనికిలోకి తెచ్చిన యెహోవా దేవుడు, ఇప్పుడు మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ఆధ్వర్యంలోని తన పరలోక రాజ్య పరిపాలన క్రింద ఈ భూమిపై పరదైసును పునఃస్థాపిస్తానని వాగ్దానం చేశాడు. (ఆదికాండము 2:7-9; మత్తయి 6:9; లూకా 23:42, 43) పునఃస్థాపించబడిన ఆ పరదైసులో, అనారోగ్యం, వ్యాధి లేకుండా నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష మానవాళి ఎదుట ఉంటుంది. (ప్రకటన 21:1-4; అలాగే యోబు 33:25; యెషయా 35:5-7ను పోల్చండి.) ద్వేషం, జాతివైషమ్యాలు, జాతి కలహాలు, ఆర్థిక అణచివేత కూడా ఇక ఉండవు. అలాంటి పరిశుభ్రపరచబడిన భూమిపైకి యేసుక్రీస్తు ద్వారా యెహోవా దేవుడు మరణించినవారిని పునరుత్థానం చేస్తాడు.

క్రీస్తు యేసు అర్పించిన విమోచనా క్రయధనంమీద ఆధారపడిన పునరుత్థానం ప్రజలందరికీ ఆనందాన్ని తెస్తుంది

ఈ భాగం ఆరంభంలో ఉదహరించిన క్రైస్తవ యువతికి ఇప్పుడున్న నిరీక్షణ అదే. ఆమె తల్లి చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత, బైబిలును జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి యెహోవాసాక్షులు ఆమెకు సహాయం చేశారు. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “పునరుత్థాన నిరీక్షణ గురించి తెలియగానే నేను ఏడ్చేశాను. నా తల్లిని నేను మళ్ళీ చూస్తానని తెలుసుకోవడం నిజంగా అద్భుతమైన విషయం.”

మరణించిన ప్రియమైనవారిని మళ్ళీ చూడాలని మీ హృదయం కూడా అలాగే ఆకాంక్షిస్తే నిశ్చయమైన ఈ నిరీక్షణ గురించి తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు సంతోషంగా మీకు సహాయం చేస్తారు. మీకు సమీపంలో ఉన్న రాజ్యమందిరంలో వారిని సంప్రదించవచ్చు, లేదా 32వ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీకు సమీపంగా ఉన్నదానికి వ్రాయండి.

^ “మూలుగుచు” అని అనువదించబడిన గ్రీకు పదం, బాధతో ఉండడాన్ని లేదా తీవ్రంగా చలించిపోవడాన్ని సూచించే క్రియాపదం (ఎమ్బ్రిమేయొమాయ్‌) నుండి వచ్చింది. ఒక బైబిలు విద్వాంసుడు ఇలా వ్రాస్తున్నాడు: “ఇక్కడ దీని భావమేమిటంటే యేసులో అలాంటి లోతైన భావోద్రేకం కలిగింది గనుకనే ఆయన హృదయంలో నుండి అప్రయత్నంగా ఒక మూలుగు ఉబికి వచ్చింది.” “కలవరపడి” అని అనువదించబడిన పదం, ఆందోళనను సూచించే గ్రీకు పదం (టెరాస్సో) నుండి వచ్చింది. ఒక నిఘంటుకారుని ప్రకారం, దాని భావం “ఒకరి అంతరంగంలో కలవరం సృష్టించడం, . . . గొప్ప దుఃఖముతో లేదా బాధతో ప్రభావితం చేయడం.” “కన్నీళ్లు విడిచెను,” అని అనువదించబడిన మాట గ్రీకు క్రియాపదం (డెక్రాయో) నుండి వచ్చింది, దానికి “కన్నీరు కార్చడం, నిశ్శబ్దంగా ఏడవడం” అని అర్థం.