అపొస్తలుల కార్యాలు 12:1-25

  • యాకోబు చంపబడ్డాడు; పేతురు చెరసాలలో వేయబడ్డాడు (1-5)

  • పేతురు అద్భుత రీతిలో విడుదలయ్యాడు (6-19)

  • దేవదూత హేరోదును జబ్బుపడేలా చేయడం  (20-25)

12  సుమారు ఆ రోజుల్లోనే హేరోదు రాజు, సంఘంలోని కొంతమందిని హింసించడం మొదలుపెట్టాడు.  అతను యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు.  దానివల్ల యూదులు సంతోషించారని గ్రహించి అతను పేతురును కూడా బంధించమని తన సైనికులకు చెప్పాడు. (ఇది పులవని రొట్టెల పండుగ రోజుల్లో జరిగింది.)  సైనికులు అతన్ని పట్టుకొని చెరసాలలో వేశారు. నాలుగు గుంపుల సైనికులు వంతులవారీగా అతన్ని కాపలా కాశారు, ఒక్కో గుంపులో నలుగురు సైనికులు ఉన్నారు. పస్కా పండుగ తర్వాత పేతురును ప్రజల ముందుకు తీసుకురావాలని* హేరోదు అనుకున్నాడు.  కాబట్టి పేతురును చెరసాలలోనే ఉంచారు. సంఘం మాత్రం అతని కోసం పట్టుదలగా దేవునికి ప్రార్థిస్తూ ఉంది.  హేరోదు పేతురును బయటికి తీసుకురావాలనుకున్న రోజుకు ముందు రాత్రి, పేతురు రెండు సంకెళ్లతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. తలుపు ముందున్న కాపలావాళ్లు ఆ చెరసాలకు కాపలా కాస్తున్నారు.  అయితే ఇదిగో! యెహోవా* దూత అక్కడ నిలబడి ఉన్నాడు. దాంతో చెరసాల గదిలో వెలుగు ప్రకాశించింది. ఆ దూత పేతురు భుజాన్ని తట్టి లేపుతూ, “త్వరగా లే!” అన్నాడు. అప్పుడు అతని చేతులకున్న సంకెళ్లు ఊడిపోయాయి.  తర్వాత ఆ దూత అతనితో, “నీ నడుం కట్టుకొని చెప్పులు వేసుకో” అన్నాడు. అతను అలాగే చేశాడు. చివరిగా దూత అతనితో, “నీ పైవస్త్రం వేసుకొని నా వెంట రా” అన్నాడు.  పేతురు ఆ దూత వెనకే నడుస్తూ బయటికి వచ్చాడు. కానీ దేవదూత చేస్తున్నదంతా నిజమని అతనికి తెలియదు; తానొక దర్శనం చూస్తున్నానని అతను అనుకున్నాడు. 10  వాళ్లిద్దరు మొదటి కాపలాను, రెండో కాపలాను దాటి, నగరంలోకి దారితీసే చెరసాల ఇనుప ద్వారం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ ద్వారం దానంతటదే తెరుచుకుంది. వాళ్లు బయటికి వచ్చాక ఒక వీధి దాటారు. వెంటనే ఆ దేవదూత అతని దగ్గర నుండి వెళ్లిపోయాడు. 11  అప్పుడు పేతురు, ఏం జరుగుతుందో గ్రహించి ఇలా అనుకున్నాడు: “నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. యెహోవా* తన దూతను పంపించి హేరోదు చేతిలో నుండి నన్ను తప్పించాడు. నాకు ఎలాంటి కీడు జరుగుతుందని యూదులు అనుకున్నారో దానంతటి నుండి ఆయన నన్ను కాపాడాడు.” 12  అతను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక, యోహాను తల్లియైన మరియ ఇంటికి వెళ్లాడు; ఈ యోహానుకు మార్కు అనే పేరు కూడా ఉంది. చాలామంది శిష్యులు అక్కడ సమావేశమై ప్రార్థిస్తున్నారు. 13  అతను వాకిట్లో ఉన్న తలుపు తట్టినప్పుడు, తలుపు తీయడానికి రొదే అనే పనమ్మాయి వచ్చింది. 14  ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, ఆ సంతోషంలో తలుపు కూడా తీయకుండా పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లి, పేతురు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడని వాళ్లకు చెప్పింది. 15  వాళ్లు ఆమెతో, “నీకు పిచ్చి పట్టింది” అన్నారు. అయితే ఆమె మాత్రం పేతురు నిజంగానే వచ్చాడని బలంగా చెప్తూ ఉంది. అప్పుడు వాళ్లు, “అది అతని దేవదూత” అని చెప్పడం మొదలుపెట్టారు. 16  అయితే పేతురు తలుపు దగ్గరే నిలబడి తడుతూ ఉన్నాడు. వాళ్లు తలుపు తీసినప్పుడు, అతన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. 17  అయితే పేతురు, నిశ్శబ్దంగా ఉండమని వాళ్లకు సైగ చేసి, చెరసాల నుండి యెహోవా* తనను ఎలా బయటికి తీసుకొచ్చాడో వివరంగా చెప్పాడు. “ఈ విషయాల గురించి యాకోబుకు, మిగతా సోదరులకు చెప్పండి” అని వాళ్లతో అన్నాడు. తర్వాత అతను అక్కడ నుండి బయల్దేరి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. 18  అయితే తెల్లవారినప్పుడు, పేతురు ఎక్కడికి వెళ్లాడో తెలియక సైనికుల్లో కలకలం మొదలైంది. 19  హేరోదు పేతురు కోసం జాగ్రత్తగా అంతటా వెతికించాడు. పేతురు దొరకకపోయేసరికి అతను కాపలావాళ్లను విచారణ చేసి, వాళ్లను శిక్షించడానికి తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ కొంతకాలం ఉన్నాడు. 20  హేరోదు తూరు, సీదోను ప్రజల మీద చాలా కోపంగా ఉన్నాడు. కాబట్టి వాళ్లు ఒకే ఉద్దేశంతో హేరోదు దగ్గరికి వచ్చి, తమకు సహాయం చేసేలా బ్లాస్తు అనే వ్యక్తిని ఒప్పించారు. ఇతను హేరోదు ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. వాళ్లు హేరోదు పరిపాలించే ప్రాంతం నుండి ఆహారం కొనుక్కునేవాళ్లు కాబట్టి తాము రాజుతో శాంతి నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నామని రాజును వేడుకున్నారు. 21  ఒక ప్రత్యేకమైన రోజున, హేరోదు రాజవస్త్రాలు వేసుకొని న్యాయపీఠం మీద కూర్చొని ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రసంగించడం మొదలుపెట్టాడు. 22  అప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలు, “ఇది దేవుని స్వరమే కానీ మనిషి స్వరం కాదు!” అని అరవడం మొదలుపెట్టారు. 23  అతను దేవుణ్ణి మహిమపర్చలేదు కాబట్టి వెంటనే యెహోవా* దూత అతన్ని జబ్బుపడేలా చేశాడు. దాంతో అతను పురుగులు పడి చనిపోయాడు. 24  అయితే యెహోవా* వాక్యం వ్యాప్తి చెందుతూ వచ్చింది, చాలామంది విశ్వాసులయ్యారు. 25  బర్నబా, సౌలు యెరూషలేములో సహాయం చేసిన తర్వాత తిరిగి అంతియొకయకు వచ్చి, మార్కు అనే పేరు కూడా ఉన్న యోహానును తమతో పాటు తీసుకెళ్లారు.

అధస్సూచీలు

లేదా “విచారణ చేయడానికి తీసుకురావాలని.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.