అపొస్తలుల కార్యాలు 13:1-52
13 అంతియొకయలోని సంఘంలో ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. వాళ్లు ఎవరంటే: బర్నబా, నలుపు* అనే పేరున్న సుమెయోను, కురేనేకు చెందిన లూకియ, పరిపాలకుడైన హేరోదుతో పాటు చదువుకున్న మనయేను, అలాగే సౌలు.
2 వాళ్లు యెహోవాను* సేవిస్తూ ఉపవాసం చేస్తుండగా దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్పాడు: “బర్నబాను, సౌలును నా కోసం ప్రత్యేకపర్చండి, ఒక పని కోసం నేను వాళ్లను ఎంచుకున్నాను.”
3 అప్పుడు వాళ్లు ఉపవాసం ఉండి, ప్రార్థించిన తర్వాత వాళ్లిద్దరి మీద చేతులు ఉంచి వాళ్లను పంపించారు.
4 కాబట్టి, పవిత్రశక్తి ద్వారా పంపబడిన ఈ ఇద్దరు సెలూకయకు వెళ్లారు. తర్వాత అక్కడి నుండి ఓడలో కుప్ర అనే ద్వీపానికి వెళ్లారు.
5 వాళ్లు ఆ ద్వీపంలోని సలమీ నగరానికి చేరుకున్నప్పుడు, అక్కడున్న యూదుల సభామందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. యోహాను* వాళ్లకు సహాయకుడిగా ఉన్నాడు.
6 వాళ్లు సలమీ నుండి బయల్దేరి ఆ ద్వీపానికి అవతలి వైపున ఉన్న పాఫు నగరం దగ్గరికి వచ్చారు. అక్కడ వాళ్లకు బర్‌యేసు అనే ఒక యూదుడు కలిశాడు. అతనొక మంత్రగాడు, అబద్ధ ప్రవక్త.
7 అతను సెర్గి పౌలు అనే స్థానిక అధిపతి* దగ్గర పనిచేసేవాడు. ఈ సెర్గి పౌలు తెలివైనవాడు. అతను దేవుని వాక్యాన్ని వినాలనే కోరికతో పౌలును, బర్నబాను తన దగ్గరకు పిలిపించుకున్నాడు.
8 అయితే ప్రభువును విశ్వసించకుండా అతన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎలుమ అనే ఆ మంత్రగాడు (నిజానికి, ఎలుమ అనే పేరుకు మంత్రగాడు అని అర్థం) వాళ్లను వ్యతిరేకించాడు.
9 అయితే పౌలు అని కూడా పిలువబడిన సౌలు పవిత్రశక్తితో నిండిపోయి, ఎలుమ వైపు సూటిగా చూస్తూ
10 ఇలా అన్నాడు: “అన్ని రకాల మోసంతో, చెడుతనంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్తమైన నీతికి విరోధీ, నువ్వు యెహోవా* సరైన మార్గాల్ని చెడగొట్టడం ఆపవా?
11 ఇదిగో! యెహోవా* చేయి నీకు వ్యతిరేకంగా ఉంది. నువ్వు గుడ్డివాడివై కొంతకాలం సూర్యకాంతిని చూడకుండా ఉంటావు.” వెంటనే అతని కళ్లు మసకబారాయి, వాటికి చీకటి కమ్ముకుంది. దాంతో అతను ఎవరైనా తనను చేయి పట్టుకొని నడిపిస్తారేమో అని వెతుకుతూ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు.
12 జరిగింది చూశాక ఆ అధిపతి విశ్వాసి అయ్యాడు, ఎందుకంటే అతను యెహోవా* బోధకు చాలా ఆశ్చర్యపోయాడు.
13 తర్వాత పౌలు, అతనితో ఉన్నవాళ్లు ఓడ ఎక్కి పాఫు నుండి బయల్దేరి పంఫూలియలో ఉన్న పెర్గేకు చేరుకున్నారు. అయితే యోహాను* వాళ్లను వదిలేసి యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయాడు.
14 అయితే వాళ్లు పెర్గే నుండి బయల్దేరి పిసిదియలో ఉన్న అంతియొకయకు వచ్చారు. వాళ్లు విశ్రాంతి రోజున సభామందిరానికి వెళ్లి కూర్చున్నారు.
15 అక్కడ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల పుస్తకాల్ని చదవడం పూర్తయిన తర్వాత సభామందిర అధికారులు వాళ్లను “సోదరులారా, ప్రజల్ని ప్రోత్సహించే మాట ఏదైనా మీ దగ్గరుంటే చెప్పండి” అని అడిగారు.
16 అప్పుడు పౌలు లేచి నిలబడి, తన చేతులతో సైగ చేస్తూ ఇలా అన్నాడు:
“ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడే ఇతర ప్రజలారా, వినండి.
17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకుల్ని ఎంచుకున్నాడు. వాళ్లు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు ఆయన వాళ్లను గొప్పచేసి, తన శక్తివంతమైన చేతితో వాళ్లను ఆ దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు.
18 దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో ఆయన వాళ్లను భరించాడు.
19 కనాను దేశంలో ఉన్న ఏడు జాతులవాళ్లను నాశనం చేశాక వాళ్ల దేశాన్ని ఇశ్రాయేలీయులకు వారసత్వంగా పంచి ఇచ్చాడు.
20 ఇదంతా దాదాపు 450 సంవత్సరాల కాలంలో జరిగింది.
“తర్వాత, సమూయేలు ప్రవక్త కాలం వరకు దేవుడు వాళ్లకు న్యాయాధిపతుల్ని ఇచ్చాడు.
21 అయితే ఆ తర్వాత ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని పట్టుబట్టారు. దాంతో దేవుడు కీషు కొడుకైన సౌలును వాళ్లకు రాజుగా ఇచ్చాడు. అతను బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అతను 40 సంవత్సరాలు వాళ్లను పరిపాలించాడు.
22 అతన్ని సింహాసనం నుండి తొలగించిన తర్వాత, దేవుడు వాళ్ల కోసం దావీదును రాజుగా ఎంచుకున్నాడు. దావీదు గురించి సాక్ష్యమిస్తూ దేవుడు ఇలా అన్నాడు: ‘యెష్షయి కొడుకు దావీదు నా హృదయాన్ని సంతోషపెట్టే వ్యక్తి. నేను కోరుకున్నవన్నీ అతను చేస్తాడు.’
23 దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, అతని వంశస్థుల్లో* నుండి ఇశ్రాయేలీయుల దగ్గరకు ఒక రక్షకుడిని పంపించాడు. ఆయనే యేసు.
24 ఆయన రాకముందు యోహాను, పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకోమని ఇశ్రాయేలు ప్రజలందరికీ బహిరంగంగా ప్రకటించాడు.
25 అయితే యోహాను తన పరిచర్యను ముగిస్తుండగా ఇలా అనేవాడు: ‘నేను ఎవరినని మీరనుకుంటున్నారో ఆ వ్యక్తిని నేను కాదు. అయితే ఇదిగో! నా తర్వాత ఒకాయన వస్తున్నాడు, ఆయన పాదాలకున్న చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాను.’
26 “సోదరులారా, అబ్రాహాము కుటుంబంలో పుట్టిన అతని వంశస్థులారా, దేవునికి భయపడే ఇతర ప్రజలారా, మన రక్షణ గురించిన ఈ సందేశాన్ని దేవుడు మన దగ్గరికి పంపించాడు.
27 యెరూషలేము నివాసులు, వాళ్ల పరిపాలకులు ఆయన్ని గుర్తుపట్టలేదు. అయితే వాళ్లు తాము తీర్చిన తీర్పు ద్వారా ప్రవక్తలు చెప్పిన మాటల్ని నెరవేర్చారు. ఆ మాటలే ప్రతీ విశ్రాంతి రోజున బయటికి చదవబడుతున్నాయి.
28 ఆయనకు మరణశిక్ష వేయడానికి ఏ కారణం దొరకకపోయినా, ఆయన్ని చంపించమని వాళ్లు పిలాతును పట్టుబట్టారు.
29 ఆయన గురించి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత, వాళ్లు ఆయన్ని కొయ్య* మీద నుండి కిందికి దించి సమాధిలో* పెట్టారు.
30 అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు.
31 తనతో కలిసి గలిలయ నుండి యెరూషలేముకు వచ్చినవాళ్లకు ఆయన చాలా రోజులపాటు కనిపించాడు. వీళ్లు ఇప్పుడు ఆయన గురించి ప్రజలకు సాక్ష్యమిస్తున్నారు.
32 “కాబట్టి దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానం గురించిన మంచివార్తను మేము మీకు ప్రకటిస్తున్నాం.
33 దేవుడు యేసును పునరుత్థానం చేయడం ద్వారా, వాళ్ల పిల్లలమైన మన ప్రయోజనం కోసం ఆ వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చాడు. ఎందుకంటే రెండో కీర్తనలో ఇలా ఉంది: ‘నువ్వు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.’
34 ఆయన శరీరం ఇక ఎప్పటికీ కుళ్లిపోకుండా ఉండేలా దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి పునరుత్థానం చేశాడు. ‘నేను దావీదుకు వాగ్దానం చేసిన ప్రేమను మీ మీద చూపిస్తాను, ఆ ప్రేమ నమ్మదగినది’ అని అన్నప్పుడు దేవుడు ఆ వాస్తవాన్ని ధృవీకరించాడు.
35 కాబట్టి ఇంకో కీర్తనలో కూడా ఇలా రాయబడింది: ‘నీకు నమ్మకంగా ఉన్న వ్యక్తి శరీరాన్ని నువ్వు కుళ్లిపోనియ్యవు.’
36 దావీదు తన జీవితకాలమంతా దేవుణ్ణి సేవించి,* మరణంలో నిద్రపోయాడు. అతన్ని వాళ్ల పూర్వీకులతో పాటు పాతిపెట్టారు, అతని శరీరం కుళ్లిపోయింది.
37 అయితే దేవుడు మళ్లీ బ్రతికించిన వ్యక్తి శరీరం కుళ్లిపోలేదు.
38 “కాబట్టి సోదరులారా ఈ విషయం మీకు తెలియాలి. అదేమిటంటే, ఈయన ద్వారా దేవుడు మీ పాపాల్ని క్షమిస్తాడని నేను మీకు ప్రకటిస్తున్నాను.
39 మోషే ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిమంతులుగా చేయలేకపోయింది. అయితే దేవుడు, విశ్వసించే ప్రతీ ఒక్కర్ని యేసు ద్వారా నీతిమంతులని తీర్పుతీరుస్తాడు.
40 కాబట్టి ప్రవక్తల పుస్తకాల్లో రాయబడిన ఈ విషయాలు మీ మీదికి రాకుండా జాగ్రత్తపడండి:
41 ‘తిరస్కరించే ప్రజలారా, మీరు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు, ఆ తర్వాత నాశనమౌతారు. ఎందుకంటే మీ రోజుల్లో నేను చేస్తున్న ఒక పనిని మీరు అస్సలు నమ్మరు. ఎవరైనా దాని గురించి వివరంగా చెప్పినా మీరు దాన్ని నమ్మరు.’”
42 పౌలు, బర్నబా బయటికి వెళ్తున్నప్పుడు, తర్వాతి విశ్రాంతి రోజున కూడా ఈ విషయాల గురించి మాట్లాడమని ప్రజలు వాళ్లను వేడుకున్నారు.
43 వాళ్లందరూ సభామందిరం నుండి వెళ్లిపోయిన తర్వాత చాలామంది యూదులు, యూదులుగా మారిన అన్యులు పౌలును, బర్నబాను అనుసరించారు. పౌలు, బర్నబా వాళ్లతో మాట్లాడుతూ దేవుని అపారదయను పొందుతూ ఉండమని వాళ్లను ప్రోత్సహించారు.
44 తర్వాతి విశ్రాంతి రోజున, దాదాపు ఆ నగరంలోని వాళ్లందరూ యెహోవా* వాక్యాన్ని వినడానికి వచ్చారు.
45 యూదులు వాళ్లందర్నీ చూసినప్పుడు అసూయతో నిండిపోయి, పౌలు చెప్పే విషయాల్ని వ్యతిరేకిస్తూ దూషించడం మొదలుపెట్టారు.
46 కాబట్టి పౌలు, బర్నబా వాళ్లతో ధైర్యంగా ఇలా అన్నారు: “దేవుని వాక్యం మొదట మీకు ప్రకటించబడడం తప్పనిసరి. అయితే మీరు దాన్ని నిరాకరిస్తున్నారు, పైగా శాశ్వత జీవితం పొందడానికి మీరు అర్హులని మీరు అనుకోవట్లేదు కాబట్టి ఇదిగో! మేము అన్యుల దగ్గరికి వెళ్తున్నాం.
47 ఎందుకంటే, ‘భూమ్మీదున్న సుదూర ప్రాంతాలకు రక్షణను తీసుకెళ్లడానికి నేను నిన్ను అన్యులకు వెలుగుగా నియమించాను’ అని యెహోవా* మాకు ఆజ్ఞాపించాడు.”
48 అన్యులు ఆ మాటలు విన్నప్పుడు సంతోషిస్తూ యెహోవా* వాక్యాన్ని మహిమపర్చడం మొదలుపెట్టారు. శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్నవాళ్లందరూ విశ్వాసులయ్యారు.
49 అంతేకాదు యెహోవా* వాక్యం ఆ చుట్టుపక్కలంతా ప్రకటించబడుతూ వచ్చింది.
50 అయితే యూదులు ఆ నగరంలో ఉన్న దైవభక్తిగల గొప్పింటి స్త్రీలను, ప్రముఖులైన పురుషుల్ని రెచ్చగొట్టారు. దాంతో వాళ్లు పౌలు బర్నబాల మీదికి హింస వచ్చేలా చేసి, వాళ్లను ఆ నగర పొలిమేరల అవతలికి వెళ్లగొట్టారు.
51 కాబట్టి ఆ ప్రజలకు హెచ్చరికగా ఉండడానికి, వాళ్లిద్దరు తమ పాదాలకు ఉన్న ధూళి దులిపేసుకొని ఈకొనియకు వెళ్లిపోయారు.
52 శిష్యులు పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడుతూ ఉన్నారు.
అధస్సూచీలు
^ అక్ష., “నీగెరు.”
^ పదకోశం చూడండి.
^ అంటే, మార్కు అనే పేరున్న యోహాను.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ అంటే, మార్కు అనే పేరున్న యోహాను.
^ అక్ష., “విత్తనం.”
^ లేదా “చెట్టు.”
^ లేదా “స్మారక సమాధిలో.”
^ లేదా “దేవుని ఇష్టాన్ని నెరవేర్చి.”
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.
^ పదకోశం చూడండి.